శర్మ కాలక్షేపంకబుర్లు- బూచాడు!

బూచాడు!

ఈ బూచాడే మా జీవిక, జీవితం కూడా, బూచాడితో మేం పెరిగాం, మాతో బూచాడూ పెరిగాడు. ఇంట్లో చేతికందే దూరంలో మంచానికి తల దిక్కున దగ్గరుండేవాడు, ఎప్పుడూ మోగుతూనే ఉండేవాడు, నాకే! పాపం అన్నీ చెడువార్తలే చెప్పేవాడు, తప్పదు, వినేవాణ్ణి, దాని మీద చర్య తీసుకునేవాడిని. చర్య తీసుకోవలసినవాడిని కనక నాకే సమస్యలు చెప్పేవాడు. ”ఈ బూచాడు నాకెప్పుడూ చెడువార్తలే చెప్పేవాడండీ!” అంటే మిత్రులు ”అదేం” అన్నారు, ”ఉద్యోగం కదా! అదిపోయింది,ఇదిపోయింది, అక్కడ లారీ స్థంబాన్ని గుద్దింది, ఇక్కడ లైన్ తెగిపోయింది ఇవే కబుర్లు మరి 🙂 ” ఈ బూచాడు ఇంట్లో ఉంటే గొప్పా నాటి రోజుల్లో. కొత్తగా బూచాడు ఇంటికి వచ్చినపుడు ఇల్లాలేం అనలేదుగాని, ఆ తరవాత తరవాత కాలంలో ఎదో వార్తతో వెంఠనే వెళుతుండటంతో బూచాడు గుర్ మంటే చాలు, ”వెళ్ళండి,వెళ్ళండి ఆవిడ పిలుస్తోంది, వెళ్ళకపోతే కోపమొస్తుంది, వెళ్ళండి” అనేది 🙂 .

ఒకప్పుడు ఈ బూచాళ్ళ సంఖ్య చాలా తక్కువ.ఒక ఊరినుంచి మరో ఊరు మాటాడాలంటే కాల్ బుక్ చేయడం దానికోసం ఎదురుచూడ్డం ఇలా ఎన్నో అవస్థలు, సామాన్యులకైతే పబ్లిక్ ఫోన్ లే గతి, చాలాకాలం. స్వాతంత్ర్యం వచ్చాకానే కొద్దిగా ప్రైవేట్ ఫోన్ లు పెరిగాయి. కాకినాడలో పని చేస్తుండగా ఒక లైన్ ఇన్స్పెక్టర్ అప్పటికి డెభై సంవత్సరాల వయసువాడు, ”ఈ కాకినాడలో నేను లైన్ మన్ గా పనిచేసినపుడు 17 కనక్షన్లు, అన్నీ గవర్నమెంట్ కనక్షన్ లే. ఒక్కటిఅంటే ఒక్కటి దంటు సూర్యారావు గారిది షిప్పింగ్ కంపెనీ ఫోన్ ఉండేది. మరో సంగతి రాజమంద్రి కాకినాడకి లాంగ్ డిస్టెన్స్ పబ్లిక్ ఫోన్ గా ఉండేది. ఇక్కడి నుంచి ఒకటే లైన్ మద్రాస్ కి,మరొకటి విశాఖపట్నానికి ఉండేవంటూ చెబుతుండేవాడు.

నేను ఉద్యోగం లో చేరేనాటికి కాకినాడ,రాజమంద్రిలలో ఉన్న ఫోన్లు మూడు వందలు. 1960 లో నేను ఉద్యోగం చేరేనాటికి ఆపరేటర్లున్న ఎక్ఛేంజిలు రాజమంద్రి,సామర్లకోట,కాకినాడ,పిఠాపురం,తుని, మండపేట, అంబాజీ పేట, అమలాపురం తూగోజిలోనూ, పగోజిలో ఏలూరు,తాడేపల్లిగూడెం,నిడదవోలు,కొవ్వూరు,తణుకు,పాలకొల్లు,నరసాపురం,భీమవరం, మిగిన వూళ్ళన్నిటికి చిన్నా ఆటోమేటిక్ ఎక్ఛేంజీలు ఉండేవి. ఎక్కువగా ఊళ్ళన్నీ రైల్వే లైన్ పక్కనున్నవే!

నాటికాలంలో గోదావరి మీద రైలు వంతెన ఒకటే ఉండేది,రావులపాలెం వంతెన , రైల్ కం రోడ్ వంతెన తరవాతకాలంలో వచ్చినవే! అమలాపురానిగాను బొబ్బర్లంకకి లాంచీ గంటకొకటి, కొవ్వూరుకి లాంచీ ఇలా సాగిపోయేది జీవనం. తరవాత కాలంలో నెమ్మదిగా బూచాళ్ళ సంఖ్య పెరిగింది.

1960 లో ఆపరేటర్ గా చేరాను, అప్పుడీశాఖని తంతి-తపాలా శాఖ అనేవారు. నేను 1980 లో బూచాడు ఇంటికి వచ్చేస్థాయికి ఎదిగాను. ఆ రోజుల్లో ఎస్.టి.డి ఉన్నఊరంటే గొప్పా! తూగోజిలో రాజమంద్రి కి కాకినాడకి మాత్రమే ఉండేది, ఆ తరవాత ఎస్.టి.డి ఇచ్చిన మొదటి ఊరు మా ఊరే, అదీ నా హయాములోనే 1986 లో, సరిగా ముఫై ఏళ్ళకితం మాటా. ఎస్.టి.డి ఇచ్చినవెంటనే, మా ఊరునుంచి అమెరికా మాటాడిన మొదటి వ్యక్తి మా కంటి డాక్టర్ గారు, వారమ్మాయితో. అమ్మాయితో మాటాడిన తరవాత నన్ను పిలిచి అభినందించి,నేను మనవూరినుంచి అమ్మాయితో మాటాడగలుగుతాననుకో లేదు, ఇది కలా నిజమా? ఎలా సాధ్యం చేశారు? రాజమండ్రి,కాకినాడ తరవాత మన ఊరికే, నిజంగా ఇది విప్లవం అని వర్ణించారు,అభినందించారు నాడు.

మరో ఇరవై ఏళ్ళు వెనక్కి వెళితే మొదటి సారిగా అమెరికా మాటాడి అభినందనలు పొందేను. విదేశీ టెలిగ్రాం ని కేబుల్ అనేవారు. అప్పుడు ఒక డాక్టర్ గారే ఇక్కడినుంచి అమెరికా వలస పోయారు, అదే నాకు తెలిసిన విదేశీ వలస సంగతి. అప్పటి దాకా ఉత్తరాలపైన జరిగినది, చివరికొచ్చారు, వెళ్ళడానికి టిక్కట్లూ వగైరా బుక్ చేసుకోడమూ అయింది, ఏదో విషయం మాటాడాల్సి వస్తే ”శర్మగారు అమెరికా మాటాడటం కుదురుతుందా?” అడిగారు, ”ప్రయత్నిద్దాం, కాదనుకోడమేలా?” అని కాల్ బుక్ చేశా, దేశంలో కాల్ మాటాడించడం తెలుసుకాని విదేశం గురించి తెలియదు 🙂 డాక్టర్ గారినుంచి,వివరాలు తెలుసుకనక. అప్పటి రోజుల్లో వీటిని ఇంటర్ నేషనల్ కాల్ అనేవారం. దీనికి కావలసిన వివరాలు చాలా ఉండేవి, అవతలిఫోన్ నెంబర్ వగైరాలే కాక, ఎవరు మాటాడతారు? ఎంత సేపు మాటాడతారు? ఏ భాషలో మాటాడతారు? ఏ టైమ్ లో కాల్ కావాలి ఇలా వివరాలివ్వాలిసుండేది. ఈ కాల్ రావాలంటే బ్రహ్మ యజ్ఞం చేసినంత పనయ్యేది.

కాల్ తీసుకున్న తరవాత దీనిని ఇంటర్ నేషనల్ ఎక్ఛేంజికి బుక్ చేసేవాళ్ళం. ఇవి ఆరోజుల్లో దేశంలో నాలుగుండేవి. ఢిల్లీ,కోల్కతా,ముంబై, మద్రాసు. దక్షణ భారతదేశం వారంతా మద్రాసు గుండా మాటాడుకోవాలి. నిమిషానికి అరవై రూపాయల ఛార్జి అని గుర్తు. ఆ రోజుల్లో కేబుళ్ళు లేవు, రేడియో ఫ్రీక్వెనీ మీద మాటాడాలి. ఇటువక్క నుంచి ఒకటి, అటునుంచి మరొకటి ఫ్రేక్వెన్సీ ఉండేది. ఇక్కడి మాట అక్కడికి చేరడానికి సమయం పట్టేది. ఇప్పటికి ఇది ఉంటుంది, ఇంటర్ నేషనల్ కాల్స్ మాటాడే వారికి తెలుస్తుంది, దీన్నే ప్రోపగేషన్ డిలే అంటారు. ఇలా ప్రజలకి సేవ చేయడానికి ఎంతమంది రాత్రి పగలు అనక సేవ చేసేవాళ్ళమో! ఈ కాల్ మద్రాస్ ఇంటర్ నేషనల్ ఎక్స్ఛేంజి ఆపరేటర్ న్యూయార్క్ ఆపరేటర్ తో మాటాడితే అమెరికా నంబర్ డయల్ చేసింది. అప్పటికే అక్కడ ఎస్.టి.డి ఉంది. అక్కడి నంబర్ రింగ్ చేసి ఇలా ఇండియానుంచి ఫలానావారినుంచి కాల్ ఉంది ఫలానావారికి అని చెబితే సరేనన్నారు, ఇటు డాక్టర్ గారిని లైన్ లో పెట్టి మాటాడ మన్నాం. ఇప్పటిలా క్లియర్ గాలేదు, ఫ్రీక్వెన్సీ వాతావరణ పరిస్తితులు బాగోకపోతే అంతే సంగతులు, ఇద్దరూ మాటాడుకోడం కుదరలేదు.న్యూయార్క్ అమ్మాయేదో చెప్పిందాయనతో మద్రాస్ అమ్మాయేదో మాటాడింది. తల్లుల్లారా మీరు తప్పుకుని మానిటర్ చెయ్యండి,నేను మాటాడిస్తానని చెప్పి వాళ్ళని పక్కకి తప్పించి నేను ఇటూ అటూ వార్త అందించి మొత్తానికి పని జరిపించాను, సంధాన కర్తగా. అది నా మొదటి సారి అమెరికా ఫోన్ సంభాషణ, ఏభై ఏళ్ళకితం మాట.

ఆ రోజుల్లో రైళ్ళు నడవడానికిగాను బ్లాకు,కంట్రోలు అనే రెండు లైన్లు నిర్వహించేవాళ్ళం, రాత్రి పగలు భేదం లేక. ఇక గోజిలలో ధవళేశ్వరం ఆనకట్ట నుంచి నీరు విడుదల నిమిత్తం ఒకే తీగ మీద పని చేసే ఫోన్ ఉండేది ప్రతి లాకుకీ. ఇవి తూర్పు మెయిన్ కెనాల్ కి ధవళేశ్వరంలోనూ, పశ్చిమ మెయిన్ కెనాల్ కి శెట్టి పేటలోనూ రెండు ఎక్శ్ఛ్ంజీలుండేవి, వీటినీ నిర్వహించేవాళ్ళం.1996 లో తుఫాన్ కు ఈ లైన్లన్నీ చెడిపోయాయి, వాటిని మరి సరిచేయలేదు, ఆ వ్యవస్థ కనుమరుగైపోయింది. అలా కూలిపోయిన లైన్ లో నాకు ౧౮౬౦ సంవత్సరంలో ఇంగ్లండ్ లో తయారైన టెలిఫోన్ స్థంభం దొడ్డిపట్ల లైన్ లో కనపడింది, దానిని జాగ్రత్త పెట్టెను, ఎన్నెన్ని జ్ఞాపకాలు…

నేను చెప్పినది చాలా పెద్ద కతలో చిన్న ముక్క కూడా కాదు. నాటి రోజుల్లో ఇన్నిబాధలు పడేవాళ్ళం, మరి తరవాత కాలంలో ఈ బూచాడు టేబుల్ దిగివచ్చి చేస్తున్న వన్నె చిన్నెలు తరవాత చూదాం

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- బూచాడు!

 1. నమస్తే శర్మ గారు,
  సమాచార సాంకేతిక విప్లవం మన దేశగతినే మార్చేసింది. మా వూళ్ళో, అంటే ఖమ్మం జిల్లా మధిర లో 1990 నాటికి ఎస్టీడి వచ్చినట్టు గుర్తు, కానీ ఎక్కడ పడితే అక్కడ పీటీలు ఉండేవి కాదు. 1991 లో పీవీ గారు ప్రధాని అయ్యాక అసలైన సమచార విప్లవం ఫలితాలను చూసాం మేము. అప్పట్లో పీవీ రంగయ్యనాయుడు గారని ఒక రిటైరెడ్ ఐపీఎస్ ఖమ్మం ఎంపీ గా ఎన్నికయ్యారు. ఆయనకి పీవీ కాబినెట్ లో టెలికమ్యునికేషన్స్ స్వతంత్ర మంత్రిగా పదవొచ్చింది. ఎందుకో తెలీదు కానీ ఖమ్మం జిల్లాలో అన్ని పట్టణాలకంటే ఆయన మా మధిర మీద ఎక్కువ ద్రుష్టి పెట్టారు. ఆయన వల్లనే మధిర కి ఎలక్ట్రోనిక్ ఎక్స్ఛేంజ్, అప్పట్లో ఏకైక దిక్కైన దూరదర్శన్ రిలే స్టేషన్ వచ్చాయి. ఆయన మేలు మేము ఎప్పటికీ మర్చిపోలేము.

  అన్నట్టు ఆ రంగయ్యనాయుడు గారిది అమలాపురం అని గుర్తు.

  • Arun గారు,
   సమాచార వ్యవస్థలో వచ్చిన మార్పు నిజంగానే ఒక విప్లవం, మరే రంగంలోనూ ఇలా కనపడలేదనిపిస్తుంది, కాని పాడి విషయంలో కూడా ఇటువంటి విప్లవమే సాధించాం.

   ఆ కాలంలో ఉద్యోగం చేసిన మేము కూచుని తిండి తినలేదు, పడుకుని నిద్రపోలేదంటే…..అందరికంటే నేనో ఐదేళ్ళు ముందున్నా, అవకాశాలు అంది పుచ్చుకున్నా! రంగయ్య నాయుడుగారిది అమలాపురమే!

   మీరు చెప్పినమాట నిజం.సామాన్యులకి పి.టి లు ఇచ్చిన తరవాత బాగా చేరువయింది.

   బూచాడు రెండవ భాగం ”బూచాడమ్మా! బూచాడు” రాయడం అయింది, కొద్ది,కొద్ది మార్పుల కోసం, ప్రచురణ సమయం ( Waiting for the time slot 🙂 ) కోసం ఆగి ఉంది 🙂

   ధన్యవాదాలు.

 2. పాత జ్ఞాపకాల్ని తట్టి లేపినట్లయింది. వ్యాఖ్య కాస్త పెద్దదవుతుంది.
  1961 లో కొత్తపేటలో (తూగోజి) ఉంటున్నప్పుడు మా ఇంట్లో ఫోన్ ఉండేది (ఆహా, ITI వారి ఆ కాలపు ట్రేడ్‌మార్క్ ఉత్పత్తి అయిన దుక్కలాంటి నల్లరంగు ఫోనే 🙂). మరి ఆరోజుల్లో ఆ ఊరిలో ఆపరేటర్ ఎక్స్చేంజ్ ఉండేదా, ఆటోమాటిక్ ఎక్స్చేంజ్ ఉండేదా? ఏమో, మా కన్నా మీకే బాగా తెలిసుండాలి.
  ఇంటర్నేషనల్ కాల్స్ గురించి ప్రస్తావించారు కాబట్టి నా అనుభవం ఒకటి చెబుతాను. 1986 లో ఒక సమాచారం అర్జెంట్ గా మా పెద్దన్నయ్యకి తెలియజేయాల్సి వచ్చింది (అవునండి, ఆ రకం కబురే). మా అన్నగారు అప్పటి వెస్ట్ జర్మనీలో సైంటిస్ట్ గా ఉండేవారు. కాకినాడలో మా ఇంట్లో ఫోన్ లేదు. అందువల్ల హెడ్ పోస్టాఫిసుకి (అప్పటికింకా తం.త.శాఖే) వెళ్ళి కాల్ బుక్ చెయ్యాలని చెప్పి, ఎంత సేపట్లో వచ్చే అవకాశం ఉందని అడిగాం. ఆ ఉద్యోగి ఓ వారం పడుతుంది అన్నాడు ! ! ! ! 😧 మాకు ఆశ్చర్యంతో బాటు నవ్వూ వచ్చింది. ఓ పూట పడుతుందనో, పొద్దుటే బుక్ చేస్తే రాత్రి ఏ 10 గంటల వరకో వస్తుందనో అంటాడని ఆశించిన మాకు అతని సమాధానం అసలు అర్ధం కాలేదు (నాకు ఈనాటికీ అర్ధం కావడం లేదు). అతని అజ్ఞానమో, ఉద్యోగం ఉందని కలిగిన అహంకారమో, పబ్లిక్ పట్ల నిర్లక్ష్యమో బోధ పడలేదు. అప్పుడు నేనతన్ని ఒకటే అడిగాను – కాల్ ఎప్పుడు తగులుతుందో తెలియదు కాబట్టి ఆ వారం రోజులూ మమ్మల్ని ఇక్కడే మీ హాల్లోనే పడుకోమంటారా – అని. ఓ వెఱ్ఱి నవ్వు నవ్వాడని గుర్తు.
  ఇలా పనవ్వదని అర్ధమయి అప్పట్లో మద్రాసులో ఉంటున్న మా కజిన్ కి ట్రంక్ కాల్ చేసి పెద్ద నగరం కాబట్టి అక్కడి నుండి బుక్ చేస్తే ఏమన్నా త్వరగా వస్తుందా అని అడిగితే, వాళ్ళ నగరం నుంచి జర్మనీకి డైరెక్ట్ గా ఫోన్ చేసే సదుపాయమే మొదలయిందనీ, తను మా అన్నగారికి ఫోన్ చేసి చెబుతాననడంతో సమస్య తీరింది. ఆ విధంగా కబురంది మా అన్నగారు బయలుదేరి రాగలిగారు.
  సమాచారవ్యవస్ధ అటువంటి కాలం నుండి ఎంత దూరం వచ్చిందో కదా.

  • విన్నకోట నరసింహారావుగారు,
   1961 లోనే మీ ఇంట్లో ఫోన్ ఉందంటే మీరు సమాజంలో పెద్దవారుగానే లెక్క 🙂

   ఆ రోజుల్లో కొత్తపేటలో ఉన్నది, చిన్న ఆటో ఎక్స్ఛేంజి. ఆ ఫోన్ నుంచి మీరారోజుల్లో కోన సీమలో తప్పించి పై ఊరికి మాట్లాడడం అన్నది దుస్సాధ్యం, కారణం, అంబాజీపేట కు కలుపబడిన కొత్త పేట ఎక్స్ఛేంజి నుంచి కాల్ బుక్ చేస్తే, అంబాజీపేటలో ఆపరేటర్ కాల్ ఇవ్వాలంటే బయటి ప్రపంచంతో ఉన్న సావకాశం. ఒక్క లైన్ పాలకొల్లుకే. కట్టలుగా కాల్స్ ఉండేవి. అదీ నాటి పరిస్థితి.అప్పటి పరిస్థితి… ఉదాహరణ. కొత్తపేటనుంచి పాతిక కిలో మీటర్ల దూరంలో ఉన్న మండపేట మాటాడాలంటే కొత్తపేట నుంచి కాల్ అంబాజీ పేటకి బుక్ చేస్తే, ఆపరేటరు, పాలకొల్లు, విజయవాడ,రాజమంద్రి,మండపేటల కు లైన్ దొరకాలి, కొంతకాలం తరవాత పాలకొల్లు నుంచి నేరుగా రాజమంద్రికి లైన్ వచ్చింది. ఎన్ని కష్టాలు.

   1986 నాటికి తూగోజిలో కాకినాడ,రాజమంద్రిలలో మాత్రమే ఎస్.టి.డి ఉంది. మూడవది మా ఊరు. ఈ ఎస్.ట్.డి సామాన్యుల దగ్గరకి చేరలేదు. ఎస్.ట్.డి పి.టి లూ లేవు. ప్రత్యేక బిల్లు వ్యవస్థ లేక ప్రజలకు చేరువ కాలేదు. ఇక ఆ రోజునాటికి తంతి విభాగం, తపాలా విభాగం విడిపోయాయి. ఆ గుమాస్తాకి ఆ పి.టి బరువే అయింది. ఆ రోజు అతనిది అజ్ఞానం, మీది అమాయకత్వం. అతనిమాటే చివరిదనుకున్నారు. పోస్టాఫీస్ పి.టి లకు ఎస్.టి.డి ఇవ్వలేదు. మీరున్న పరిస్థితులలో మరో ఆలోచనా రాలేదు. మీ కజిన్ కి చెప్పేరు. ఆ రోజునాటికి మద్రాస్ నగరంలో ఎస్,టి.డి పి.టి లు ఇస్తున్నారు, వాటినుంచి మీ కజిన్ మాటలాడటం జరిగిందనమాట. ఇక కాల్ బుక్ చేస్తే రోజులన్నది నిజమే, కాని అప్పటి కప్పుడు కావాలని అడిగితే ఇచ్చేవారం, ఎంత సమయమన్నది చెప్పడం కష్టమే! ఈ గందరగోళమెందుకని మిమ్మల్ని భయపెట్టి పంపేసేడు, అదీ జరిగింది. ఒకప్పుడు రాజమంద్రి లాంగ్ డిస్టెన్స్ పి.టి దగ్గ కాల్ బుక్ చేసుకున్నవారు, పరుపులు,దిళ్ళు తెచ్చుకుని పడుకునేవారట, కాల్ కోసం. ఈ పరిస్థితి నేనెరగననుకోండి 🙂

   ఎస్.టి.డి ఉన్నవారెవరి ఫోన్ నుంచయినా మీరే నేరుగా మాటలాడి ఉండచ్చు, ఇబ్బంది బిల్లు దగ్గరే. నాటి కాలానికి వేరుగా ఈ కాల్స్ కి బిల్లు వచ్చేదికాదు. అన్ని కాల్స్ లోకల్ కాల్స్ లో కలిసిపోయేవి. మరి ఇన్ని కష్టాలు దాటుకుని కదండీ బయటి కొచ్చాం, ఏమంటారు?
   ధన్యవాదాలు.

   • చాలా వివరంగా చెప్పారు, ధన్యవాదాలు.
    కాల్ అర్జెంట్ గా ఇప్పటికిప్పుడు కావాలంటే అదనపు ఖర్చవుతుంది, సరేనంటే తప్పకుండా ప్రయత్నిద్దాం అనే సలహా ఆ 1986 ఉద్యోగి ఇచ్చుండచ్చు కానీ ఇవ్వలేదు. మీరన్నట్లు ఈ గందరగోళం ఎందుకనుకున్నాడేమో కూడా? ఆహా, ఆ రోజుల నాటికే మీ పరిచయం కలిగున్నట్లయితే ఎంత బాగుండేది 😒 .
    మీ టపా పేరులో “బడిపంతులు” సినిమా పాటలోని మాట భలే తగిలించారే! 🙂

   • విన్నకోట నరసింహారావుగారు,

    పెట్టలేకపోతే పెట్టే ఇల్లు చూపించమన్నారు పెద్దలు. అలా అతను ఉపకారం చేయలేకపోయినా పని అయేందుకు సూచన చేసి ఉండచ్చు, బద్ధకం… 🙂

    ఆ రోజుల్లో ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళకి ఇటువంటి విషయాలలో చాలా సాయం చేసేవాళ్ళం, చెప్పుకుంటూ పోతే స్వోత్కర్ష అనిపిస్తుందని చాలా అనుభవాలు చెప్పను. నన్ను తిట్టనివాడు వానకి తడవనివాడు లేడని సామెత, అలా మాచేత ఉపకారం పొంది మమ్మల్ని నిందించినవారూ ఉండేవారు 😦

    ఆ రోజుల్లో పరిచయం … 🙂

    మేమంతా కనపడని బూచాళ్ళమే కదండీ
    ధన్యవాదాలు.

  • వనజగారు,
   బహుకాల దర్శనం,కుశలమే కదా!

   మన దేశంలో, సమాచార వ్యవస్థలో వచ్చినంత విప్లవం మరి దేనిలోనూ రాలేదు. దీనిని మనం అంతా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. మా అదృష్టం మేము దానిలో పాలు పంచుకున్నాం. ఆ విప్లవాన్ని సాధించుకున్నాం. మార్పులన్నిటినీ చాలా దగ్గరగా చూసిన వాణ్ణి, అమలు చేసినవాణ్ణి.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s