శర్మ కాలక్షేపంకబుర్లు-ధప్పళం

ధప్పళం

భోజనపదార్ధాలని ఐదు రకాలుగా విడదీశారు, అవి భక్ష్య,భోజ్య,చోష్య,లేహ్య,పానీయాలన్నారు, ఇవే పంచ భక్ష్యాలంటే. మనవాడుక పంచభక్ష్య పరమన్నాలు. ఈ ఐదు ఆహారపదార్ధాలతో పరమాన్నం కూడా ఉంటే అది పూర్తి విందు 🙂 పప్పు ధప్పళాలన్నదే వాడుక మాట. పప్పు,ధప్పళాలెప్పుడమ్మా? అనడిగితే పెళ్ళెప్పుడని అర్ధం. ధప్పళాన్నే పులుసు అని అంటారు.

ధప్పళం అసలు సిసలు తెనిగు వంటకం. సాంబారు అరవలది, అవియల్ కూడా అనుకుంటా.

ధప్పళం రాచ్చిప్పలోనూ తయారు చేస్తారు చారులాగా, లేదా కళాయి ఉన్న ఇత్తడి గిన్నెలో తయారు చేస్తారు, నేటి కాలానికి అన్నిటికీ స్టీల్ గిన్నెలేకదా!

మొదటగా గిన్నెలో పల్చగా పిసికిన చింతపండు పులుసు పోస్తారు, తగిన ఉప్పు, పసుపు వేస్తారు. పులుసు కాచడానికి ముందు తయారు చేసేవి కూరల ముక్కలు, ఇవి సాధారణంగా వంకాయ,బెండకాయ, ముదురు బెండకాయలైతే ధప్పళం బాగుంటుంది,చిలకడదుంప, ఆనపకాయ, సూరే గుమ్మడికాయ, బూడిద గుమ్మడి కాయ. బూడిద గుమ్మడి పులుసులో వేసుకుంటే బలే రుచిగా ఉంటుంది, ఇది బూడిద పట్టని లేతకాయ ఐ ఉండాలి, ఇక ములక్కాడ సరే సరి . ఈ ముక్కల్ని పులుసులో వేసే ముందు వరి పిండి కలుపుతారు, ఒక బెల్లం ముక్క పడేస్తారు. వరిపిండి రెండు రకాలనుకున్నాం ఒకప్పుడు. కొట్టుపిండి అంటే నానబోసిన బియ్యాన్ని పిండి చేసుకున్నది,. విసురుపిండి అంటే పచ్చిబియ్యపు పిండి. ఈ పులుసులో కొట్టు పిండి వెయ్యాలి. అసలు పులుసుకి రుచి ఈ వరిపిండితోనే వస్తుంది, అదెంత వెయ్యాలనేది పులుసు పెట్టేవారి నైపుణ్యం మీద అధారపడి ఉంటుంది. వంట ప్రారంభంలోనే ఇలా తయారు చేసిన పులుసును సన్నటీ సెగ మీద కాచడం ప్రారంభిస్తారు. చివరగా పోపువేస్తారు, దానిలో ,మిర్చి,ఆవాలు,మెంతులు, జీలకర్ర,ఇంగువ వేస్తారు.ఈ పులుసు ఎంతసేపు మరిగితే అంత బాగుంటుంది. చారు వేడిగానూ, పులుసు కాగి చల్లారినవీ బాగుంటాయి.

పులుసుకీ జీవితానికీ సంబంధం, ఎంతకాగితే అంతబాగుండే పులుసులాగా భార్యా,భర్తల మధ్య ప్రేమ కాలంతో పాటుగా చిక్కబడాలి, అప్పుడే అది పులుసంత రుచిగానూ… ఉంటుంది.

ప్రకటనలు

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ధప్పళం

 1. ఇదే పద్దతిలో నిన్ననే ఇంట్లో చేసుకున్నాం. అమ్మ దీంట్లో కొంచం శెనగపిండి కూడా వేసింది. మా నాన్నగారి ప్రకారం ముద్దపప్పు కలుపుకుని దాంట్లో గుంట చేసి అందులో ఈ ధప్పళం పోసుకుని తినాలంట. విడిగా కూడా చాలా బావుంది.

  • Ravi Kiran జీ
   శనగ పిండి వేయడం కూడా ఉంది. అమ్మగారు చేసినది వాడుకలో ఉన్నదే! నాన్నగారైతే అసలు సిసలు భోజనం పద్ధతి చెప్పేసేరు.అలవాటు తప్పిపోయి సాంబారు పొడి వెనకపడిపోతున్నాం! అంతే 🙂
   ధప్పళం చాలా రుచిగా ఉంటుంది
   ధన్యవాదాలు.

 2. పులుసు మరీ పల్చగా కాకుండా కాస్త చిక్కదనం రావడానికి (టీవీ ఏంకరిణులు అన్నట్లు మరీ “దగ్గర పడేంత” కాదులెండి 🙂) బియ్యప్పిండి కొద్దిగా కలుపుతామని మా పెద్దవాళ్ళు అనేవాళ్ళు. బియ్యప్పిండికి binding agent లక్షణం ఉండడం కారణం.
  ఈ రోజుల్లో “పులుసు” అని ఎవరంటున్నారండి ! సాంబారు, రసం, చట్నీ, మాంగో పికిల్ (ఆవకాయ), కర్రీ, కర్డ్, ఘీ, పాపడ్, వైట్ రైస్, మిల్క్ కేక్ (పాలకోవా), కద్దూ-కా-హల్వా, కాజూ, ఇలైచీ …. మయం కదుటండీ ఈనాటి భాష. సర్వం టీవీ బిర్యానీ మాయ 🙁.

  • వంటల భాష భ్రష్టు పట్టడడం “పని లేక” డాక్టర్ గారు పేరు పెట్టిన “బొచ్చె భోజనాల” ప్రభావం (buffet / catering) కూడా అని నా అభిప్రాయం అని మనవి.

  • విన్నకోట నరసింహారావు గారు,
   మనదైన భాష మాటాడటం నామోషీ కదండి! బొచ్చ భోజనమనడమెందుకు? చిప్పకూడంటే సరిపోలా? 🙂

   బియ్యప్పిండి పులుసు చిక్కబడటానికి అంటారుగాని అదే రుచి తెచ్చేదీ
   ధన్యవాదాలు.

   • హ హ్హ, హ హ్హ. నిజమే కానీ “చిప్పకూడు” అంటే జనసామాన్య భాషలో జైలుతిండి అనే అర్ధం సంతరించుకుంది గదండీ 😀😀. అందుకని బాగోదేమో 🙂 ?

   • విన్నకోట నరసింహారావు గారు,
    ,
    జైల్ కూడు మేలండి. అక్కడ కూడు పెడతారని నమ్మకం,బుద్ధిగా లైన్ లో నిలబడి పెట్టింది తింటారు, చిప్ప కూడో,దొప్ప కూడో.

    కొన్ని కొన్ని చోట్ల ఈ భోజనాల దగ్గర అదే చిప్పకూటి కోసం తోపులాటలు, ఎగబడటం,దొరకదేమోనన్నట్టు, వీటిని చూస్తుంటే అసలక్కడికెందుకొచ్చామన్న సంగతీ మరచిపోతున్నాం కదూ!
    ధన్యవాదాలు.

 3. నేను కూడా ఒక సారి ఇంటికి దగ్గరి బంధువు వచ్చినప్పుడు ఆపిల్ పళ్ళు తెస్తే పుల్లగా ఉన్నాయి .తినలేక పులుసు లో వేస్తె ఒక రకం సువాసన తో బాగుందని అందరూ తిన్నారు .ఆఖర్న దీని పేరు ఆపిల్ దప్పళం అని చెప్పెను .ఆ మాట గుర్తు చేసుకున్నాను .ఇది19 75-76 లో జరిగింది —————–డా.సుమన్ లత

  • డా.సుమన్ లత గారు,

   సరిగా వండుకుంటే ధప్పళం బలే రుచిగా ఉంటుంది, అనుభవించాలిసిందే!

   మీరన్నట్టు కొద్ది కొద్ది ప్రయోగాలు చేస్తే ముక్కలలో, పుల్లగా ఉన్న ఆపిల్ వగైరా, ఇంకా బాగుంటుందండి,

   ధన్యవాదాలు.

 4. ధప్పళం గురించి చాలాసార్లు చదివానుగానీ ఆ పదార్థం కూరా, పులుసా అనేది తెలియదు. సవివరంగా తెలియజేశారు. బియ్యపు పిండి వేయటం కొత్తగా ఉంది. మంచి పోస్ట్ రాసినందుకు అభినందనలు.

  మీరు రాసే పోస్టులు ఇంగ్లీష్ భాషలో వచ్చే ‘for dummies’ సిరీస్ లాగా ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ కలిపి సంకలనం చేస్తే మంచి పుస్తకం అవుతుంది, తెలుగువారికి ఎంతో సేవ చేసినవారవుతారు శర్మగారూ! ఆ దిశగా పూనుకోవాలని మనవి.

  • sivasravanababuగారు,

   ధప్పళం అసలైన తెనుగువంట, మనమంతా సాంబార్ అని అరవల వంట వెనకబడిపోతున్నాం :). పెద్ద పెద్ద కార్యక్రమాలలో బూరెలు వండటం మామూలే. అందుకు శనగపప్పు ఉడకబెడతారు, ముందుగా. దాని మీద నీరు తేర్చి ధప్పళంలో పోస్తారు, అందుకే ఇటువంటి కార్యక్రమాలలో వడ్డించి ధప్పళం రుచిగా ఉంటుంది.

   ధప్పళానికి రుచి వరిపిండి వేయడం తోనూ, మరిగించడంతోనూ వస్తుంది.

   ” for dummies “తో పోల్చారు, అదేమో తెలియదు, వివరం చెబితే సంతసం.

   పుస్తకంగా వేయడం, ప్రయత్నాలు జరిగేయండి, ఒక టపా రాసేటంత అనుభవం మాత్రం కలిగిందండి, కోడలి కొడుకునేగాని, అత్తకొడుకుని కాలేకపోయాను గనక చొరవ చేయలేకపోయా! 🙂 దీనిపై ఒక టపా రాయాలండి

   ధన్యవాదాలు.

   • శర్మగారూ, ఈ కింది లింకులను పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది.
    http://www.dummies.com/
    https://en.wikipedia.org/wiki/For_Dummies

    ఒక విషయాన్ని మూలంనుంచి విడమరిచి చెప్పటం. మనకు తెలుగులోకూడా ‘వస్తు గుణదీపిక’ లాంటి పుస్తకాలు ఉన్నాయనుకుంటా.

    హార్డ్ కాపీగా కాకపోయినా సాఫ్ట్ కాపీ(ఈ బుక్)గానైనా ముద్రిస్తే ఎంతో మేలు చేసినవారవుతారండి.

   • sivasravanababu గారు,
    నాలుగైదు ప్రయత్నాలు జరిగాయి, ఇ బుక్ వేయడానికి,అచ్చు పుస్తకం వేయడానికీ కూడా. కాని పని జరగలేదు, కారణాలనేకం. నేనైతే ఆశ వదిలేసుకున్నా!

    మీరిచ్చిన లింక్ చూశా
    ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s