శర్మ కాలక్షేపంకబుర్లు-నాలుగాకులెక్కువ!

నాలుగాకులెక్కువ!

‘ఓసోస్! పోవోయ్!! నీకంటే నాలుగాకులెక్కువ చదువుకున్నవాడిని నాకు చెప్పొచ్చేవ్!’ అనిగాని ‘నీకంటే నాలుగాకులెక్కువ చదువుకున్నవాడోయ్’ అనిగాని అంటుంటారు, అది కూడా నీకంటే తెలివైనవాడు అని చెప్పడానికి. నిజమేకాని అసలీ ఆకుల ప్రసక్తేమీ? 🙂

నాటి రొజుల్లో చదువు అంటే వేదమే! అది నాలుక చివర ఉన్నదే!! రాసిపెట్టుకున్నది కాదు. వేదం అంటే దేవుడో అని అన్నదొకటే కాదు, మానవ జీవితంలో కావలసిన అన్నిటినీ వేదం చెప్పింది, పళ్ళుతోముకోవడం నుంచి తిట్లుదాకా, అంతరిక్షంలో గ్రహాలు వాటి దూరాలనుంచి ఆన్ని విజ్ఞానాల మూలాలూ. సరే అదిప్పుడెందుకుగాని, ఆకుల సంగతి కదా! మనం అనుకుంటున్నదీ!!!

వేదమేగాక తరవాత రోజుల్లో భాష,వ్యాకరణం, గణితం ఇలా చాలా విద్యలు, కావ్యాలు వగైరా ఇతరాలూ వచ్చాయి. వీటిని వేదంలా నోటి చివర నాలుక మీద ఉంచుకోవలసిన అవసరం లేదు, అందుకు అక్షరబద్ధం చేశారు. ఎలా? తాటియాకులను సరైయైన రూపంలో తయారుచేసి, వాటిని కరక్కాయ వగైరా నీళ్ళలో నానవేసి,పురుగు పట్టకుండా చేసి, పైనా కిందా ఒక చెక్కముక్క వేసి, ఆకులకి ఒక పక్క చిల్లువేసి అందులోంచి ఒక తాడువేసి బిగించి ఒక పుస్తకం తయారు చెసేవారు, ఆ తాటియాకులపై ఘంటం అనే ఇనుప పరికరంతో రాసేవారు. మనకి ఇప్పటికి వెయ్యి ఆపై బడిన సంవత్సరాల నాటి తాళపత్ర గ్రంధాలు దొరుకుతూనే ఉన్నాయి, శిధిలం కాకుండా.

కాగితం కనిపెట్టబడని కాలంలో ముద్రణ లేని కాలంలో కావ్యాలు మొదలు అన్నిటినీ ఒకరినుంచి మరొకరు ఎత్తి రాసుకోవలసి వచ్చేది.ఇలా రాయడంకూడా ఒక వృత్తిగా ఉండేది. వారే ”వ్రాయసగాళ్ళు”, కొంత మంది కవులు ఆశువుగా చెబుతుంటే కూడా ఉన్న వ్రాయసగాడు రాసి ఉంచేవాడు. భారతం ఇలాగే రాయబడిందట. వ్యాసుడు చెబుతుంటే వినాయకుడు రాసేడట. మళ్ళీ దీంట్లో షరతులు పోటీలూనూ. వినాయకుడన్నాడటా నేను రాసేటపుడు ఘంటం ఆగకుండా చెప్పాలన్నాడట. దానికి వ్యాసుడు నువ్వు రాసేది అర్ధం చేసుకునే రాయాలని షరతు పెట్టేడట, ఇలా మొత్తానికి భారతం రాశారిద్దరూ. తిక్కన గురునాథుడి గురించి కథ కూడా ఒకటుందిగాని పూర్తిగా తెలియదు.

ఆ రోజులలో ”కోశావాన్ ఆచార్య” అంటే గ్రంధాలున్నవాడే పండితుడు అన్నది చెల్లిపోయేది. చదువుకునేవారు ఈ తాటాకు గ్రంధాలలోని ఆకులనుంచి చదువుకునేవారు. నేటికాలం విద్యలాగా ఉండేదికాదు విద్య, ఒకరు ఒక కావ్యం మొదటిలో ఉంటే మరొకరు చివరలో ఉండచ్చు, అనగా కొన్ని ఆకులు ఒకరు ఎక్కువ మరికొందరు మరికొన్నితక్కువ ఆకులు చదువుకుని ఉండచ్చు, ఇలా ఎక్కువచదువుకున్నవాడు ఎక్కువ తెలివైనవాడని ఒక నమ్మకం, అందుకుగాను నీకంటే నాలుగాకులెక్కువే చదువుకున్నాడు అనేవారనమాట. అదీ నాలుగాకుల ఎక్కువ చదువుకోడం కత 🙂

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నాలుగాకులెక్కువ!

 1. //కాలు నిలుస్తుంది కాని కాల్ నిలువదు కదా..//
  తిక్కనగారు అనుకోకుండా “ఏమి చెప్పుదున్..” అనేసినా పద్యం కుదిరినట్టు “కాల్ నిలవద”ని భాషావేత్తలు అనడం సహజం. టెలికాం వారనడం అర్ధవంతం. _/\_ 🙂

 2. అనేక విషయాల్లో మీరు చాలామంది కన్నా నాలుగాకులెక్కువ చదువుకున్నవారే.

  తిక్కన-గురునాథుడి కథ మీరనుకుంటున్నదేమిటో తెలియదు గానీ మా చిన్నతనంలో అమలాపురంలో ఏడిద సత్యనారాయణ మాస్టారు చెప్పినదొకటి నాకు బాగా గుర్తుండిపోయింది. తిక్కన గారు చెబుతున్న ఓ భారత పద్యం చివరికొచ్చేసరికి ఎలా ముగిస్తే వాగుంటుందా అని ఆలోచిస్తున్నారట. కొంచెం సేపు వేచి చూసి, తర్వాత చెప్పండి అన్నాడట గురునాథుడు. “ఏమి చెప్పుదు గురునాథా” అన్నారట తిక్కన గారు శిష్యుడినుద్దేశ్యించి (ఏం చెప్పాలో తట్టట్లేదు గురునాథా అని ఆయన కవిహృదయం). వెంటనే గురునాథుడు తలొంచుకుని వ్రాసేస్తున్నాడట. అదేమిటయ్యా అది వ్రాసేస్తున్నాను అన్నారట తిక్కన గారు. చక్కగా సరిపోయింది కదా గురువర్యా, ఏమి చెప్పుదున్ + కురునాథా “ఏమి చెప్పుదు గురునాథా” అవుతుంది కదా అని సంబర పడుతూ బదులిచ్చాడట గురునాథుడు.

  • టైపోరాక్షసం.🙁
   …. వాగుంటుందా బదులు బాగుంటుందా అని చదువుకో ప్రార్ధన.

  • విన్నకోట నరసింహారావుగారు,

   అంతా గాలివాటు 🙂

   గురునాథుని పద్యం ఇదిగో! శ్యామలరావు గారొకప్పుడు చెప్పేరు,నేనే మరచిపోయా!

   “పలపలనిమూకలో కాల్ నిలువకగుఱ్ఱంబుడిగ్గి నీ కొడుకు గదా
   కలితభుజుండై యొక్కడు దొలగి చనియె నేమి చెప్పుదుం గురునాథా! !”

   “కాలు నిలుస్తుంది కాని కాల్ నిలువదు కదా, పక్కమాట మీదబడి సంధి చేసుకోవాలి చచ్చినట్లు!
   ఇదొక మంచి చమత్కారం!
   మరొక ఐతిహ్యం. తిక్కనగారు కుమ్మర గురునాథుడి గంటం ఆగకుండా చెబుతూనే ఉంటానని శపథం చేసి మొదలు పెట్టారట. ఈ పద్యంలో తొలగి చనియె అనటంతోనే నిజానికి పద్యంలో విషయమూ వాక్య,మూ కూడా పూర్తయ్యాయి! కాని పధ్యంలో ఇంకా ఇంకా కొన్ని గణాల భాగం మిగిలే ఉంది .
   అందుచేత ఆయన నిర్వేదంగా “ఏమి చెపుదుం గురునాథా!” అన్నారట, గుర్నాథుడు బుధ్ధిగా అదే వ్రాసాడు పద్యంలో.
   పద్యం సరిగ్గా కుదిరి పూర్తయ్యిందండీ గురువుగారూ, “ఏమి చెప్పుదున్ కురునాథా ” అని అతడు చెప్పటం జరిగింది. తిక్కనగారు అలా తన ప్రతినకు భంగం కలక్కుండా ఉండటంతో ఆశ్చర్యమూ ఆనందమూ పొందారట.
   ఇది మరొక మంచి చమత్కారం.”
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s