శర్మ కాలక్షేపంకబుర్లు-బూచాడమ్మా! బూచాడు!!

బూచాడమ్మా! బూచాడు!!

మొన్నటి టపాలో కొన్ని మార్పులు చూశాం కదా! విప్లవం మొదటి దశ చివర చెప్పుకుందాం.

1990 దశకంలో దేశంలో ప్రతి పల్లెటూరికి ఎస్.టి.డి ఇచ్చేశాం, అక్కడ ఒక నిలకడగా పనిచేసే ఎక్స్ఛేంజిలూ పెట్టేం. దీనితో పక్క ఊరికి మాటాడాలంటే గంటల తరబడి వేచి ఉండే రోజులుపోయాయి, ఆపరేటర్ అవసరమూ తీరిపోయింది. ఆ క్రమంలో మొదటిగా ట్రంక్ ఎక్ఛేంజి పాలకొల్లులో నా చేతులతో మూసేశాను, అవసరం లేక. అలా దేశం మొత్తం మీద ప్రతి పల్లెకీ ఎస్.టి.డి ఇచ్చి ట్రంక్ ఎక్స్ఛేంజిలు మూసేశాం, దేశం మొత్తం మీద ఎక్కడినుంచి ఎక్కడికైనా మనం డయల్ చేసుకుని మాటాడే వీలొచ్చేసింది. ఒకప్పుడు ప్రతి ఊరిలోనూ రాజాలా తిరిగే టెలిఫోన్ ఆపరేటర్లు కనుమరుగైపోయారు. నిజంగానే ఇది విప్లవం, కాదు పెను విప్లవం. నేను ఎరిగిన ఒకనాటి ఫోన్ కి మార్పొచ్చిన నాటి ఫోన్ కి తేడా చూస్తే నాకే విచిత్రం అనిపించింది. 1990-1995 ఇంతతో విప్లవం మొదటిదశ చివరికి చేరుకున్నట్లుంది. ఇప్పటిదాకా జరిగినది వేగమైన నడక ఈ తరవాతది పరుగే!….

బూచాడు టేబుల్ మీదనుంచి దిగాడు, చేతిలో ఇమిడిపోయాడు, జేబులోకెక్కాడు,సరాసరి మెడ మీదకే ఎక్కి కూచున్నాడు. కొందరు ముందుజేబులో, పక్క జేబులో,వెనక జేబులో స్థానమిచ్చారు. స్త్రీలు మాంగల్యాలు ఉంచుకున్నారో లేదోగాని మెడలో,సెల్ ఫోన్ ని మాత్రం తాడుతోనూ, బంగారపుగొలుసులతోనూ బంధించి మెడల్లో వేసుకున్నారు. మగాళ్ళేం తక్కువ తినలేదు, వారూ అంతే చేశారు.మొదటి రోజుల్లో బూచాడి పనులు కబుర్లు చెప్పడం, చిన్న చిన్న రాతలో (SMS) ఉన్న వార్తలని పంపడంగా ఉండేది. ఇలా బూచాడు మెళ్ళో వేసుకు తిరగడమో గొప్పా నాటి రోజుల్లో, అదే స్టేటస్ సింబల్.

బూచాడిని ఇలా ఉండనిస్తే ఎలా ఉండేదోగాని అదనపు బాధ్యతలు ఇవ్వడం మొదలెట్టేరు. సమయం తెలుసుకోవాలంటే వాచీ కేసి చూసుకునేవారు,ఒకప్పుడు, ఆ రోజుల్లో బూచాడి మొహం చూడ్డం మొదలెట్టడంతో వాచీల పరిశ్రమే పడకేసింది, ‘సూతోవాచా!’ అని మొదలయింది.

సరదాగా ఫోటో తీసుకోవాలంటే బూచాడాపని చేసిపెట్టడూ? అలాగే చిన్ని బూచాడు ఫోటో లు తీయడం మొదలెట్టేడు, అబ్బే వీడియోలైతే! అదీ కానిచ్చేశాడు, ఎంతా చిటికలో పనీ. ఆ తరవాతొచ్చింది ఉప్పెనే! టేబుల్ దగ్గరకెళ్ళి కూచుని, అబ్బో! అవస్థ పడాలా ఇంటర్నెట్టు కోసం, ఇదీ బూచాడికే ఇచ్చేస్తే! అమ్మయ్య!! ఇక్కడికి పూర్తయిందండి, అసలే కోతి, కల్లుతాగింది,నిప్పు తొక్కింది, దయ్యం పట్టిందన్నట్టు బూచాడికి వచ్చిన అదనపు బాధ్యతలతో మెడలోంచి చేతిలో కొచ్చి ఉండిపోయాడు. నిమిషానికోసారి బూచాడి మొహం చూడకపోతే! అమ్మో బతకడం కష్టం. మొగుడూ పెళ్ళాలు ఒకరిని ఒకరు విడిచి ఉంటున్నారో లేదోగాని రాత్రి పక్కలో సెల్ ఫోన్ లేకుండా మాత్రం నిద్ర పట్టటం లేదెవరికీనీ

ఇంతతో అయిపోతే చెప్పుకోడమెందుకూ! ఇప్పుడు మొదలయింది ఉప్పెనలకి ఉప్పెన సెల్ఫీ పిచ్చి. మనఫోటో ఎవరో తియ్యడం పాతకాలం మాటా. స్వోత్కర్ష,సం డబ్బా కొట్టుకోడం, స్వ.కు.మ….వగైరా వగైరా….మన ఫోటో మనం తీసుకోవడం, అదే సెల్ఫీ, ఆ తరవాత మరొకరితో కలసి….

img_1703

Courtesy: Sri Vinnakota Narasimha Rao 

నేడు ఇదిగో  ఇటువంటి ముచ్చటలూ కనపడుతున్నాయి.”ఇద్దరికి తాళి కట్టెయ్యి,తిక్క కుదురుతుందంటే” కట్టేస్తే ”ఇద్దరి మధ్యా ఇరుక్కుపోయి చస్తానేమో”నని వెర్రి మొహంతో చూస్తున్నాడు పెళ్ళి కొడుకు 🙂

img_1704

Courtesy: Sri Vinnakota Narasimha Rao 

ఎందరిలో ఉన్నా ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోమన్నారు, పెద్దలు. అసలిప్పుడు బూచాడుంటే పక్కనేం జరుగుతోందో తెలిసే సావాకాశమేదీ? పై చిత్రంలోని వారంతా పదిమందిలో ఒంటరిగా ఉండే యోగులు కదా! ఇవన్నీ బూచాడి అసలు పని కంటే కొసరౌ పనులతో వచ్చిన చిక్కు కదూ! 🙂

ఆ తరవాతవేం కాదుగాని, సామాజిక మాధ్యమాలు, అన్నిటినీ మింగేసిన ముఖపుస్తకం, ఇంకా మరిన్ని మాధ్యమాలూ,బ్లాగులూ. ఒకప్పుడు పక్క ఊరు మాటాడాలంటే ఇబ్బంది పడిన వారు ఎక్కడో ఉన్నవారితో చిటెకలో ఒక్క మీటనొక్కి మాటాడటం,ఎంత చిత్రం. ఉదయమే స్నానంచేసి పూజచేసుకుని తులసికోట దగ్గర కూచున్న అమ్మమ్మ గారు, ఒక్క మీటనొక్కి” నాన్నావినయ్! ఎక్కడున్నావయ్యా!” అంటే ”మమ్మీ! ఇప్పుడే డెట్రాయిట్ లో ప్లేన్ దిగేను, పని చూసుకుని న్యూయార్క్ వెళిపోతాను, అక్కడికెళ్ళేకా మాటాడతానేం!”  ”నాన్నా! రాత్రి పూట ప్రయాణాలూ” అంటే ”అలవాటేనమ్మా! ఉంటానూ!” మరో మీటనొక్కి ”అమ్మాయ్! లల్లీ ఆఫీసుకెళ్ళేవా?” ”అమ్మా! ఇప్పుడే నీ మనవణ్ణి స్కూల్ లో దింపి ఆఫీసుకొచ్చా, సిడ్నీ లో ఎండలప్పుడే మండిపోతున్నాయమ్మా! సాయంత్రం మాటాడతానూ!”   ”ఏమండోయ్! తూర్పున మీ అమ్మాయి, పడమట అబ్బాయి కులాసాగా ఉన్నారు” వార్త చేరేసింది శ్రీవారికి, లోపల నుంచి, ”అదే చేత్తో నీ ముద్దుల మనవడ్నీ పలకరించెయ్యలేకపోయావా?” మాట వినపడింది లోపల్నుంచి. ”వెర్రినాగన్న ఇప్పుడే పడుకుని ఉంటాడు రాత్రి రెండయిందేమో ఇప్పుడు వాడికి, మనం భోచేస్తుంటే పిలవడం అలవాటేగా వాడికీ!” ఎంత మార్పు! వార్త తెలుసుకోడానికి నెలలు, ఆ తరవాత వారాలు నుంచి,రోజులనుంచి చిటికెలోకి మార్చిన బూచాడు చేసే మాయ కదూ! అసలేం తెలియని అమ్మమ్మ గారు ఒక మీటనొక్కి ప్రపంచాన్ని ఐదు నిమిషాల్లో చుట్టేస్తే!

ఎక్కడో పల్లెలో మూల కూచుని ఉన్న నేను, నా భావం రాస్తే అది నా కంప్యూటర్ నుంచి ఎక్స్ఛేంజికి,తరవాత రాజమంద్రి,వరంగల్లు,బెంగుళూరు, ఆపై మద్రాస్ ద్వారా సింగపూర్, సిడ్నీ, ఆ పై లాస్ ఏంజిలీస్ లో ఉన్న ఒక భవనంలో ఉన్న వర్డ్ ప్రెస్ వారి కంప్యూటర్ లో ఒక మూలగదిలో, నామాట నలి,తొలి లేక ప్రచురింపబడితే, దానిని మరుక్షణం లో ప్రపంచంలో వారంతా చూసే సావకాశం, విప్లవాలకే విప్లవం. నా వయసువాళ్ళెంతమందికి కంప్యూటర్ గురించి తెలుసు? తెలిస్నవారెంత మంది దీని ముందు కూచుంటున్నారు? కూచున్నవారెంతమంది తమ భావం వ్యక్తం చేస్తున్నారు? భావం వ్యక్తం చేసినవారి భావం ఎంతమంది ఇతరుల హృదయాలకు హత్తుకునేలా చెప్పగలుగుతున్నారు? చెప్పినది అస్వాదించి ఎంతమంది ఆనందిస్తున్నారు? జీవిత పరమావధి? ”ఆనందం..” ఇది ఎంతమందిని చేరుతోందో! నిజంగా ఒకప్పుడు పక్క ఊరికి మాటాడటానికి తిప్పలు పడ్డ మేము ఈ రోజు ఈ ఆనంద స్థితికి చేరుకున్నామంటే, ఇదెవరి గొప్పతనం?

ఈమార్పులగురించిన ఒకమాట. ముఫైలోపువారు ‘ఇలా ఉండేవారా?’ అని ఆశ్చర్యపోయే మార్పు. ఏభయి లోపువారు ‘కష్టాలు పడ్డాం కదూ’ అనుకునే మార్పు. ఇక మా తరంవారు ‘ఇన్ని మార్పులు మరెవరు చూశారూ’ అన్న ఆనందం పొందినవారూ, ఇక మాలా అందులో ములిగి తేలినవారికి ఇదో ”ఆనందహేల!” ఇన్ని మార్పులూ జీవితం లో చూసిన తరం…

అబ్బో! ఎన్నివన్నె చిన్నెలు చూశానుగాదూ! ఇంకెన్ని చూడాలో!!

ఇంకెన్ని పున్నమిలు చూడనుంటిమో….. 🙂 బూచాడమ్మా! బూచాడూ!! బుల్లిపెట్టెలో ఉన్నాడూ!!!

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బూచాడమ్మా! బూచాడు!!

  1. 🙏 ఫొటోలు నా సౌజన్యం అన్నందుకు 🙏. నిజానికి నేనూ ఆన్‌లైన్‌లో చూసినవే 🙂.
    రోజులు మారాయి, పుస్తకం పోయి సెల్‌ఫోన్ “హస్తభూషణం” అయిపోయింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s