శర్మ కాలక్షేపంకబుర్లు-దుష్టులకు దూరంగా ఉండాలి.

దుష్టులకు దూరంగా ఉండాలి.

శకటం పంచహస్తేషు,దశహస్తేషు వాజినమ్
గజం సహస్ర హస్తేషు, దుష్టం దూరేణ వర్జయేత్

రథానికి ఐదు మూరల దూరంలోనూ, గుఱ్ఱానికి పది మూరల దూరంలోనూ, ఏనుగుకు వెయ్యి మూరల దూరంలోనూ,దుష్టునికి బహుదూరంలోనూ ఉండాలన్నారు.

తెనుగులో మూర,బార అని రెండు కొలతలున్నాయి. మూర అంటే చూపుడువేలు పక్కవేలు కొననుంచి మోచేతివరకూ ఉన్న దూరం, ఇది రెండు జానల పొడవుంటుంది, కొల్చుకు చూసుకున్నారా? సరిపోయిందా. ఇక బార అన్నది,రెండు చేతులూ పక్కలకి చాచితే, చాచిన రెండుచేతుల వేళ్ళ చివర మధ్య దూరం. సామాన్య మానవునికిది ఎనిమిది జానలుంటుంది. ఒక జాన తొమ్మిదంగుళాలు,ఎనిమిది జానలకి డెభ్భైరెండంగుళాలు అంటే ఆరడుగులు. మూరా, బారా లేదంటారు, అంటే తేడా చూపనివారని అర్ధం. బారలు చాపుకుంటూ వెళ్ళడం అంటే తిట్టుకుంటూ పోవడమని అర్ధం. వనవాసానికెళ్ళేటపుడు భీముడు చేతులు బారజాపుకుని వెళ్ళాడట, దాని అర్ధమేమని అడిగితే చెప్పినమాట, ‘ఈ చేతులతో కౌరవులను చంపి తీరతానని’ అట.

ఇలా మరో రెండు మాటలున్నాయి, ‘పడుగు’,’పేక’. బట్టనేసేందుకు మగ్గం మీద వేసే పొడుగుదారాలను ‘పడుగు’ అంటారు. వెడల్పుకు నేసే దారాలను ‘పేక’ అంటారు. నేత పూర్తైన వస్త్రానికి పొడుగును పొడుగనే అంటారు, వెడల్పును మాత్రం ‘నెఱవు’,’పన్నా’ అంటారు. ఇక నీటిలోతు కొలతకి ‘నిలువు’ అంటారు, అంటే ఒక మనిషి నీటిలో నేల మీద నిలిస్తే తలములిగే లోతు, సాధారణంగా ఆరడుగులని వాడుక, నాలుగు నిలువులలోతు అంటే ఇరవైనాలుగడుగుల లోతని అర్ధం, ‘నిలువు’ లోతు గొయ్యి అంటే ఆరడుగులలోతు గొయ్యని అర్ధం.ఇవన్నీ మనిషిని బట్టిన కొలతలే! దారి తప్పి చాలా దూరమొచ్చామా? మన్నించండి.

పై శ్లోకంలో కవి రథానికి ఐదు మూరలదూరంలో ఉండాలన్నారు, అంటే రథం వెనక ఉన్నపుడు మనల్ని మనం, రథం నుంచి రక్షించుకోడానికి ఆ మాత్రం దూరంలో అనగా ఐదు మూరల దూరంలో ఉంటే చాలు, రక్షించుకోవచ్చు. అలాగే గుఱ్ఱానికి పది మూరలన్నారు,గుఱ్ఱం గబుక్కున ఆగినా వెనక్కి తిరిగినా పది మూరల దూరంలో ఉంటే చాలు రక్షింప బడతాం. అదే ఏనుగైతే వెయ్యి మూరల దూరమన్నారు,ఏం? ఏందుకనీ? ఏనుగు భారీ జంతువు, ఏనుగు పరుగుపెడితే ఎవరూ అందుకోలేరు, అందుకు వెయ్యి మూరల దూరంలో కనక ఉంటే, ఏనుగు ముందుకు కదులుతున్నది వెనక్కి తిరిగి మనమీదకొస్తున్నా తప్పించుకోడానికి సావకాశముంటుంది. అన్నిటికీ దూరాలు చెప్పిన కవిగారు దుష్టునికి మాత్రం దూరం చెప్పలేదు సరికదా! బహు దూరంలో వదిలేయమన్నారు. నాటి రోజులలో దుష్టులు అనేవారు తెలిసి ఉండేవారేమో!ఎదురుగా కనపడేవారనుకుంటా, వారికి కనపడక బతికితే సమస్య లేనట్టే! ఇప్పుడు దుష్టులెవరో శిష్టులెవరో తెలుసుకోడం ఎలా? అసలు దుష్టులెవరూ?

తమ కార్యబు పరిత్యజించి పరార్ధ ప్రాపకుల్ సజ్జనుల్,
తమ కార్యంబు ఘటించుచున్ పరార్ధ ప్రాపకుల్ మధ్యముల్,
తమకై అన్య హితార్ధ ఘాతుకజనుల్ దైత్యుల్, వృధాన్యార్ధ భం
గము గావించెడి వారలెవ్వరో ఎరుంగన్ శక్యమే ఏరికిన్.

తమపని కంటే ఎదుటివారి పనిని ఆదరంగా చేసేవారు ఉత్తములు. తమపని చేసుకుంటూ ఇతరులకు సాయపడేవారు మధ్యములు, తమ పనికోసం ఇతరుల పని చెడగొట్టేవారు రాక్షసులు, ఊరకనే ఇతరుల పని చెడగొట్టేవారికి నేను పేరు పెట్టలేనన్నారు భర్తృహరి. ఇదిగో వారు వీరే అనుకుంటా దుష్టులంటే! వీరు నేటి కాలంలో కంటికి కనపడటం లేదు,సామాన్యుడి ధన,మానాలను ఒక్క క్లిక్ తో బహు దూరం నుంచి హరించేస్తున్నారు, వీరినుంచి రక్షించుకోడమెలా?

 

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-దుష్టులకు దూరంగా ఉండాలి.

 1. <" ఊరకనే ఇతరుల పని చెడగొట్టేవారికి నేను పేరు పెట్టలేనన్నారు భర్తృహరి. ఇదిగో వారు వీరే అనుకుంటా దుష్టులంటే! "
  ——————————–
  ఖలునకు నిలువెల్ల విషము అని కూడా పెద్దలు ఏనాడో చెప్పారు కదండి. దుష్టులకు దూరంగా ఉండడమే క్షేమకరం.
  మీరు వివరించిన కొలతల నిర్వచనాలు ఈ కాలం వారికి తెలిసుంటేనే ఆశ్చర్యం.

  • విన్నకోట నరసింహారావు గారు,
   నిజమే ఖలునకు నిలువెల్ల విషమనే అన్నారు. కనపడేవారి సంగతి తెలుసుకోవచ్చు, కనపడనివారి గురించే చింత 🙂
   చాలామందికి ఈ కొలతలు తెలియనివే ఐ ఉండచ్చు నేటి కాలంలో అనుకుని కొద్దిగా సంబంధం లేనిదైనా రాసేశాను 🙂
   ధన్యవాదాలు.

 2. ఎన్నో తెలియని విషయాలు చెప్తున్నారు తాత గారూ. పడుగు పేక అనే మాటలు పెళ్లి పుస్తకం లో ఒక పాట లో విన్నాను. వాటి అర్ధం ఇప్పటికి తెలిసింది.

  • చిరంజీవి స్వాతి
   నిత్యమూ మాటాడే మాటలే మరోభాషవి వాడుతున్నారు, ఇక తెనుగు మాటలెక్కడ తెలుస్తాయమ్మా! పడుగు,పేకలా కలిసిపోయారనీ అంటారు, అంటే సులభంగా విడదీయలేనంతగా కలిసిపోయారనే అర్ధం 🙂 కొలతలకి గురించిన మాటలు చాలా మందికి తెలియకపోవచ్చనే చెప్పేను.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s