శర్మ కాలక్షేపంకబుర్లు-అమ్మెట్టే రెండూ…..

అమ్మెట్టే రెండూ…..

”అమ్మెట్టే రెండూ పెడితేగాని పల్లకీ ఎక్కనందట”…. ఇదొక నానుడి చెబుతారు, మొండివాళ్ళ గురించి.. ఇదేంటో చూద్దాం…ఒక చిన్న కత చెప్పుకుందామా?

అనగనగా ఒక పల్లెటూరు ఆఊళ్ళో ఒకావిడ చిన్నపిల్ల ఐన కూతురుతో ఉంటోంది, భర్త ఉన్నాడో పోయాడో తెలియదు, ఒకతే పిల్లను ముద్దు చేస్తూ జీవిస్తోంది. చిన్న పిల్ల తెలివైనదీ,అందమైనదీ కూడా! కాని ఒకటే బాధ. చిన్నప్పటినుంచి పేచీ అలవాటయింది, గారం చేయడంతో. ఈ తిక్క పిల్లకి, ”తనకి తోచదు,ఎవరు చెప్పినా వినదు”. పిల్ల పెరిగి పెద్దదవుతోంది, తనతోనే తిక్కా పెరిగిందిగాని తగ్గలేదు. చిన్నప్పటినుంచీ ఈ పిల్ల తిక్క పెట్టినపుడల్లా తల్లి ఒక తొడపాయసం, దీన్నే పిక్కపాయసం అనీ అంటారు, బుగ్గపాయసం పెట్టడం అలవాటు చేసుకుంది. అలా బుగ్గపాయసం,తొడపాయసం పెట్టిన వెంటనే చెప్పిన పని చేయడం అలవాటయింది, పిల్లకీ. తండ్రి లేకపోవడం, పేచీకోరు పిల్ల అని పేరుపడటం తో పెళ్ళి కాలేదు. చాలా సంబంధాలు వచ్చినా ’తిక్కపిల్ల’ అని తెలియడంతో తిరిగిపోతున్నాయి. చివరికి ఒక సంబంధం కుదిరింది, పెళ్ళి అయింది, విడిదికి తీసుకెళ్ళేరు పల్లకీ మీద… ఆ తరవాత ఊరెరిగింపు కు తయారవని చెప్పింది అత్తగారు. ఊరెరిగింపుకుగాను అలంకారం చేసుకు కూచుంది, పెళ్ళికూతురు. లేచి వచ్చి పల్లకీ ఎక్కమని చెప్పేరు, పెళ్ళికూతురుతో వచ్చినవారు. పెళ్ళికూతురు కదలలేదు,మాటాడలేదు. ఆడపడుచు వచ్చి చెప్పినా కదలలేదు, ఎవరెవరో వచ్చి చెబుతున్నా మొండిగా కూచుందేగాని లేచి పల్లకీ ఎక్కలేదు. అత్తగారొచ్చి చెప్పింది పల్లకీ ఎక్కమని అప్పుడు నోరు తెరిచి చెప్పింది పెళ్ళికూతురు “అమ్మెట్టే రెండూ పెడితేగాని పల్లకీ ఎక్కను” అని. తల్లికి కబురు పెట్టేరు, తల్లిరాగానే చెప్పేరు ”మీ అమ్మాయి ఊరెరిగింపుకు బయలుదేరమంటే ’అమ్మెట్టే రెండూ పెడితేగాని పల్లకీ ఎక్కను’ అని,కూచుంది, ఆ రెండూ ఎవో పెట్టెయ్యండి’ అంది వియ్యపురాలు. ఇది విన్న తల్లి నిర్ఘాంతపోయింది. ’ఓసినీ మొహం తగలెయ్యా! పెళ్ళి చేసుకుంటేనైనా నీ తిక్క కుదురుతుందనుకున్నాను, మొండి తనం పెరిగిందిగాని తరగలేదే’ అని మనసులో అనుకుంటూ, కూతురుని పక్కగదిలోకి తీసుకుపోయింది. ’ఏంటబ్బా ఈ తల్లి ఉత్త చేతులతో వచ్చింది, కూతురికి ఏం పెడుతుందో’ చూడాలనే కుతూహలంతో వియ్యపురాలు, చప్పుడు చేయక వెనకనే వెళ్ళి గమనించింది. కూతుర్ని గదిలోకి తీసుకెళ్ళిన తల్లి కూతురికో తొడపాయసం,బుగ్గపాయసం పెట్టి ’బుద్ధిగా వెళ్ళి పల్లకీ ఎక్కు’ అని చెప్పడం చూసి నిర్ఘాంతపోయింది. ఆ తరవాత ఆ పెళ్ళి కూతురు నిరభ్యంతరంగా వెళ్ళి పల్లకీలో కూచుంది. ఆ తరవాతేం జరిగిందీ మీకే తెలుసు….. 🙂

వ్యక్తుల సమూహమే సమాజం. ప్రతి సమాజానికి, దానికి తగిన సంస్కృతి సంప్రదాయాలుంటాయి. అందరూ వాటిని ఆచరిస్తూ,ఒకరినొకరు గౌరవించుకుంటూ కాలం గడుపుతారు. అన్నీ సమాజాలలోనూ, ఉన్న ఆచారాలను ఎదిరించేవారూ ఉంటారు, కొంతమందికి ఇది సరదా, మరికొంతమందికి జీవిక 🙂 ఇలా సంఘాన్ని ఎదిరించేవారంతా తామేదో గొప్ప పనికి నాంది పలుకుతున్నామంటారు. ఇలా మాటిమాటికి సమాజాన్ని ఎదిరించేవారికి, కించ పరుస్తూ మాటాడేవారికి ఒకరెవరో చెబుతారు, ఇది సభ్యతకాదు అని. అబ్బే అసలు ఎదిరించడమే ధ్యేయంగా ఉన్నవారికీ మాట నచ్చదు, మరొకరు మరొకరు చెబుతారు. వీరి బుద్ధి మారదుగాని మరికొంచం పదునెక్కిపోతారు. చివరగా కనపడినవారు ప్రతివారూ చెబుతారు, మీకిది సభ్యత కాదూ అని, అసలు వినరు, అలా కొనసాగుతూనే ఉంటారు, ఎవరూ పట్టించుకోక వదిలేస్తారు. ఎప్పుడో చెప్పవలసినవారు,చెప్పవలసిన రీతిలో చెప్పగా బుర్ర తిరుగుతుంది, కాని ఉపయోగంలేదు. అసలు కీలకమంతా “వీరికి తోచదు,మరొకరు చెబితే వినరు” కదా! అమ్మెట్టే రెండూ పెట్టినా పల్లకీ ఎక్కనివారు, ఇంక ఇప్పుడు వీరినేమంటారు?

లిఖేత సుఖతాసు తైలమపి యత్నతఃపీడయన్
పిబేఛ్ఛ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్ధితః
కదాచిదపి పర్యటన్ శశివిషాణమాసాదయే
న్నతు ప్రతినివిష్టమూర్ఖజనచిత్తమారాదయేత్….భర్తృహరి

తివిరి ఇసుమునతైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చు
జేరి మూర్ఖుని మనసు రంజింపరాదు……..లక్ష్మణ కవి.

కష్టం మీదనయినా ఇసుకనుంచి నూనెను పిండచ్చు,ఎండమావిలో నీళ్ళు తాగచ్చు, వెతికి వెతికి కుందేటి కొమ్మునూ తెచ్చుకోవచ్చు కాని మూర్ఖుని మనసును రంజింపచేయలేము
నేటి కాలంలో ఇలా ఉండదమే గొప్పనుకుంటున్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s