శర్మ కాలక్షేపంకబుర్లు-అస్తారుపతంగా…

అస్తారుపతంగా…

అస్తారుపతంగా డంపుల్లోనూ, నేల మాళిగల్లోనూ, నీటి టేంకుల్లోనూ,ఇంటిలోపలి గదుల్లో బంకర్లు నిర్మించుకుని బస్తాలలో, ఆఖరికి పాకీ దొడ్లలోనూ ఎక్కడెక్కడో దాచుకున్న ఐదువందల,వెయ్యి రూపాయల నోట్లను మోడీ గారు ఒక్క కలంపోటుతో రద్దు చేసేస్తే….ఏమిచేతురా లింగా… అని తత్త్వాలు పాడుకోవాలో..అక్కౌంట్లలో జమచేసుకోవాలో……వెనకనుయ్యి,ముందు గొయ్యి లాగా తయారైన పరిస్థితిలో, నిన్ను విడిసి ఉండలేనయా అని పాడుకోక తప్పటం లేదు, కలిగినవారికి.

”మోడీ గారు కొడతాను కొడతానంటున్నాడంటే ఊక పుచ్చుకుని జల్లెడ అడ్డం పెట్టి కొడతామనుకున్నాం గాని ఇలా మైండ్ బ్లాక్ అయ్యేలా కొడతాడనుకోలేదు బాబోయ్!”  కొందరి వేదన. నల్ల ధనమంతా నోట్లలోనే ఉందా? అమ్మో ఎన్ని రూపాలు దీనికి 🙂 బంగారం,వెండి, ప్లాటినం నగలు, వజ్రాలు, ఆస్థులు,భవనాలు కొన్నే రూపాలు సుమా! ఇక విదేశాల్లో దాచుకున్నవి దీనికి అదనం…. పోనీ వీటిని సొమ్ము చేసుకుందామంటే… అదోచిక్కూ…ఇలా ఎక్కడికక్కడ కాళ్ళకి బంధాలేసేసి ఇబ్బందులెట్టే ప్రభుత్వం! ఏంటి బాబూ దారీ…..మరిదారేదీ…… గోదారే…..బుద్ధిగా ఒప్పేసుకుంటే……డంపుల్లో కోట్లో…అమ్మో…ఏం పాలుపోటంలేదు శివా! శివ!! శివా!!! సరే

అదేదో ఉన్నవారి సమస్య మరి, సామాన్యుడిని లైన్లో నుంచోబెట్టి కాయితాలు కొన్నేనా మార్చించుకుందామంటే నాలుగువేలే ఇస్తారు,రోజుకి, అలా మార్చి తెచ్చి ఇచ్చినందుకు ఎంతమందిని పెట్టగలరు? మార్చి తెచ్చి ఇచ్చినందుకు కొంత కూలి ఎంత? వాళ్ళ అక్కౌంట్లలో వేస్తేరోజు కూలీవి నీకెక్కడనుంచొచ్చిందింత సొమ్మని నిలదీస్తే… కూలీకి ఎక్కువగా జనాలు దొరికేలా లేరు, ”కూలికి విషం తాగరు” కదా! ఇప్పుడు ౫౦౦ నోటుకిగాను నాలుగువందలేభై వ్యాపారం మొదలెట్టేశారు. ”సామాన్యులు ఇబ్బంది పడతారన్నా” ఇల్లాలితో, దానికి ఇల్లాలు ”సామాన్యులకి కొన్ని రోజులు ఇబ్బందులుంటాయి, బిడ్డ పుట్టేటప్పుడు తల్లి నొప్పులుకి తట్టుకోలేదూ…తప్పదు మరి….మా బాగా జరిగింది… ఏం చేసుకుంటారు ఈ నోట్లు, మీదేసుకుని తగలేసుకోడానికి కూడా పనికిరావు, బుఱ్ఱ తిరిగేలా కొట్టేడు మోడిగారు, కొడితే ఇలా కొట్టాలి, మైడు బ్లాంకవ్వాలి. మా బాగుంది, నాకు నచ్చింది మోడీగారి పని. దొంగకి కన్నంలో తెలు కుడితే ఎలా ఉంటుంది,కొంతమంది పని అలాగే ఉంది. ఈ రోజునుంచి లైన్ లో నుంచుని నాలుగువేలు మార్చినందుకు వెయ్యి రూపాయల కూలి తెలుసా? సామాన్యుడికేం 🙂 ”..అంటూ వెళిపోయిందండి. ఆవిడ వరసచూస్తే నాకే భయమేసిందనుకోండి……అది సరేగాని, అసలీ అస్తారు పదమేంటని అనుమాన మొచ్చిందా ఎప్పుడేనా?… ఆయ్! నాకొచ్చిందండీ!.. 🙂

’అస్తారుపదం’, ’అస్తారుపతం’, అనే పదానికి నిఘంటువులో అర్ధం దొరకలేదు. వాడుకంలో మాత్రం అస్తారుపదంగా పెంచేమమ్మా, ఇలా వాడకం ఉంది…అంటే అల్లారుముద్దుగా పెంచేమని అర్ధం. ”అల్లారుముద్దు” (అల్ల+ఆరు+ముద్దు) అంటే గారాబంగా పెంచినట్టు అర్ధం, ‘అల్లారు బెల్లం’ అంటే వేడి వేడి బెల్లమని అర్ధం. అవునండి వీరంతా ”ఎత్తుచేతివారి” బిడ్డలు బాబోయ్! ఏంటీ వేళ ఇలా ఐపోయారంటారా! ఎత్తుచేతివారిబిడ్డంటే…..కలిగినవారి బిడ్డని అర్ధం… ఈ పదాలన్నీ వాడుకలో ఉన్నాయిగాని నిఘంటువులకే ఎక్కలేదు నేటికీ…ఇంతకీ అస్తారుపదం అంటే చెబుదురూ అంటారా!!

అస్తారుపదంకాదు ఇది హస్తార్పితం, వాడుకలో అస్తారుపదం గా మారిపోయింది, అంటే చేతికి అర్పించినట్టు, అంకితమిచ్చినట్టు, అనగా చేతితోనే పట్టుకుని తిరిగినట్టు,గారాబం చేసినట్టు. అయ్యో! ఇలా అస్తారుపదంగా పెంచిన/పోగేసిన నోట్లు చిత్తుకాయితాలా? ఏమి సేతురా లింగా ఏమీ సేతు? చాలామందికి తోచడం లేదు, ఏం చెయ్యాలో 😦

 

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అస్తారుపతంగా…

 1. ‘డంపుల్లోనూ, నేల మాళిగల్లోనూ, నీటి టేంకుల్లోనూ,ఇంటిలోపలి గదుల్లో బంకర్లు’ – ఒకతరానికి కాదు పది తరాలకి సమకూర్చుకుంటున్నారు. అయినా ఆశ చావట్లేదు.

  • చంద్రిక గారు,
   విదేశీ ఉగ్రవాదులు,స్వదేశీ తీవ్రవాదులు వారి అనుచరుల నడ్డి విరిగింది, స్వదేశీ బకాసురులకూ అనుకోని దెబ్బే! కొన్ని రాజకీయ పార్తీలూ విలవిలలాడుతున్నాయట.
   నల్ల కుబేరులకి వెనకనుయ్యి,ముందుగొయ్యిలాగే ఉంది, ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తున్నవారూ ఉన్నారు.

   సామాన్యుడికి మొన్నటి అసౌకర్యం నిన్న లేదు, నిన్నటిది నేడు ఉండదు, బేంకులు రాత్రి ఉదయం ఎనిమిదినుంచి రాత్రి ఏడు దాకా పనిచేశాయి, సిబ్బంది భోజనాలు కూడా చేయలేదు, చాలా చోట్ల, వారిని అభినందించాల్సిందే!

   సామాన్యుని అసౌకర్యం గురించి అరుస్తున్నవారిది మొసలికన్నేరే!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s