ఎంగిలి చేత్తో……
దానం చేయాలని ప్రముఖంగా చెబుతుంది, సనాతన ధర్మం..’పెట్టందే పుట్టదు’ అనీ అంటుంది. ’చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంతా’ అంటారు. ’పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్దీ బిడ్డలూ’ అనీ అంటుంది లోకం. ఇలా దానం యొక్క గొప్పతనాన్ని చెబుతారు. దానం చేసినవారిలో ప్రముఖులనీ చెబుతారు. దధీచి తన వెన్నెముకనే దానం చేశారు, ఇంద్రుని వజ్రాయుధం కోసం. బలి చక్రవర్తి మూడడుగుల నేల కావాలంటే దానం చేసి పాతాళానికెళ్ళేరు, శిబి చక్రవర్తి తన తొడ మాంసం కోసి పావురాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేశారు, సరిపోకపోతే తానే సమర్పించుకోడానికి సిద్ధమయ్యారు. నేటి కాలానికీ ప్రపంచంలో కలిగినవారు తమ సొత్తులో కొంత లేక అంతా దానం చేస్తూనే ఉన్నారు, సమాజ హితం కోసం.
ఎవరికైనా కావలసింది పిడికెడు మెతుకులు బతికున్నపుడు,చస్తే తగలబెట్టడానికో పూడ్చి పెట్టడానికో కావలసిన చోటు ఆరడుగుల నేల. ఎవరూ పోయేటపుడు కూడా ఏం పట్టుకుపోరు. అన్ని మతాలూ దానం చేయమనే చెబుతాయి. అపాత్రులకు దానం చేయకూడదు. దానంతీసుకునేవారు మనకంటే తక్కువవారనుకోవడం చాలా తప్పు, వారు, మనం దానం చేయడానికి వీలు కల్పించినందుకు సంతసించాలి. కలిగినంతలో దానం చేయాలి, శక్తికి మించి దానం చేయకూడదు. కలిగినవారు దానం చేయకపోవడం తప్పు, కలగనివారు శక్తికి మించి దానం చేయడం తప్పు. దానం ఏ రూపంలోనైనా ఉండచ్చు, ఒక్క ధనమిస్తేనే దానం కాదు. దశదానాలంటారు. అన్నిటిలోనూ గొప్పదైనది అన్నదానం వెంటనే ఫలితమిచ్చి ప్రాణాన్ని నిలుపుతుంది, ఆ తరవాతది విద్యాదానం. చెప్పుకుంటూపోతే చాలా ఉంది 🙂
ఇచ్చెదనని పల్కి యీకున్న నరకంబుద్రోవ నీవును సమర్థుడవె దేవ!
యేదానమున నాశ మేతెంచు నదియును దానంబు గాదండ్రు తత్త్వవిదులు
దానంబు యజ్ఞంబు తపము కర్మంబులు దా విత్తవంతుడై తలపవలయు
దనయింటగల సర్వధనమెల్ల నైదుభాగములుగా విభజించి కామమునకు
నర్ధమునకు ధర్మయశముల కాశ్రిత
బృందములకు సమత బెట్టునట్టి
పురుషుడిందు బూర్ణుడై మోదించు
దన్నుమాని చేత తగవుగాదు…..భా.౮-౫౭౯
రాజా నీవు సమర్థుడవే! ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం నరకానికి కారణం.ఏ దానంతో సర్వమూ నాశనం సంభవిస్తుందో అది దానం కాదన్నారయ్యా పెద్దలు. దానము,యజ్ఞము,తపము మొదలైన కర్మలు సొమ్ములున్నవాళ్ళే చెయ్యాలి,వాళ్ళే తలపెట్టాలి. తన ఇంట ఉన్న సర్వ ధనాన్నీ ఐదు భాగాలు చేసి కామానికి,అర్ధానికి,ధర్మానికి,యశస్సుకి, తనని ఆశ్రయించుకున్నవారికి సమానంగా పంచి పెట్టాలి. ఇలా చేసినవాడు పూర్ణచంద్రునిలా వెలుగొందుతాడని, తనకు మాలిన ధర్మం పనికిరాదనీ…. చెబుతారు శుక్రాచార్యులు.
శుక్రాచార్యులవారు మొత్తం విషయాన్ని చాలా క్లుప్తంగా చెప్పేసేరు. తనకుమాలిన ధర్మం పనికిరాదూ అన్నారు. తన దగ్గరున్న సర్వధనాలనూ ఐదు భాగాలుగా చేయమనీ చేసినవాటిని ఆయా విభాగాలకు ఖర్చుపెట్టమనీ చెప్పేరు. మేము ఐదు భాగాలుగా చేసి సంపదని పంచిపెడతాం అని చెబుతున్న మతాలవారికి ఆ విషయం శుక్రాచాయులవారినుంచి అనగా వేదం నుంచి, సనాత ధర్మంద్వారా వచ్చినదేగా! మా మతంలోవే మీ మతంలోనూ ఉన్నాయనేవారు ఎక్కడనుంచి తెచ్చుకున్నట్టూ? మా నుంచి మీరు తీసుకున్నారంటున్న మేధావులకి ఎవరినుంచి ఎవరు తీసుకున్నారో తెలియదనుకోవాలా?
ఎంగిలిచేత్తో కాకిని తోలడం, అదిలించడం ఏమని కదా సందేహం 🙂
ఒకరు ధనవంతుడు, కాని పరమలోభి. ఎవరికి ఎప్పుడూ ఏమీ ఇవ్వడం తెలియనివాడు. ’ఇచ్చుటలో ఉన్నహాయి మరి ఎచ్చటనూ లేదని’ తెలియనివాడు, తెలిసినా ఆచరించలేనివాడు. ఇతనొకరోజు భోజనం చేస్తున్నాడు. కాకి ముట్టినది, కుక్క ముట్టినది మానవుల వినియోగానికి పనికిరాదంటారు. ఒక కాకి మెతుకులకోసం లోపలికి చొచ్చుకు వస్తోంది. సాధారణంగా కాకిని అదిలించడానికి హాష్ అని నోటితో చెబుతూ చేతిని విదిలిస్తాం. కాని ఇతను నోటితోగాని చేత్తోగాని కాకిని విదిలించటం లేదు, కారణం నోటితో విదిలిస్తే నోటిలో మెతుకులు నేల మీద పడచ్చు, చేత్తో విదిలిస్తే, భోజనం చేస్తున్నాడుగనక, చేతిని కొన్ని మెతుకులుంటాయి, అవి కింద రాలచ్చు, ఇలా నేల రాలిన మెతుకుల్ని కాకి తినచ్చు,దాని ఆకలి తీరచ్చు. అమ్మో! కాకికి అలా రెండు మెతుకులు కూడా విదలచడానికి ఇష్ట పడని వాడితడు…… అదిగో! అంత పరమలోభులుంటారని చెప్పడానికే ఎంగిలి చేత్తో కూడా కాకిని కొట్టనివాడని అంటారు…
ఈ టపా ఎప్పుడో రాసి ఉంచినది, టపా వేద్దామని చూస్తే నిన్నటిదాకా ఎంగిలిచేత్తో కాకిని కూడా కొట్టనివాళ్ళు, పెద్దనోట్ల రద్దుతో,ఇలా వీధులు కట్టి విస్తళ్ళేస్తున్నారు. నేడు చేస్తున్న పనులు చూసి ఆశ్చర్యమే కలుగుతోంది.వాటిలో కొన్ని…
౧.తమదగ్గర పని చేస్తున్నవారికి సంవత్సరం జీతం అడ్వాన్సు లిచ్చినవారు.
౨.పనివారికి సంవత్సరం జీతం బోనస్ ఇచ్చినవారు.
౩.కార్తీక మాసం పేరు చెప్పి, తమగ్రామాలలో వన సంతర్పణలేర్పాటు చేసి, తమ కులంలో ఉన్నవారికి మనిషికింత,కుటుంబానికింత అని ఇచ్చినవారు.
౪.ఆడవారి అక్కౌంట్లలో ౨.౫ లక్షలేసి సంవత్సరం తరవాత ౨ లక్షలిచ్చేలా కాగితాలు రాయించుకున్నవారు.
౫.వడ్డీలేని అప్పిచ్చి ఉన్న బేంక్ అప్పుల్ని తీర్పిస్తున్నవారు( Gold loans especially). కొంతమంది తెలియక ఇలా అప్పులు తీరుస్తున్నారు, ఆ తరవాత ఇంత సొమ్ము ఒక్కసారిగా ఎక్కడిదని ఇన్కంటేక్స్ వారడిగితే సమాధానం చెప్పలేక ఇబ్బందిపడాల్సి వస్తుందన్న సంగతి తెలియక.
౬.వీధి చివరి గుడి హుండీలో కూడా పెద్ద నోట్లు వేస్తున్నవారు.
౭.నిన్నటిదాకా కరంట్ బిల్లులు కూడా కట్టనివారు సంవత్సరానికి ముందు బిల్లు కడుతున్నవారు,
ఇలా రకరకాలుగా దాతృత్వాన్ని పెంచుకుంటున్నవారు కనపడుతున్నారు.