శర్మ కాలక్షేపంకబుర్లు- సిరివెన్నెల

మిత్రుడు సిరివెన్నెల గురించి మరో మిత్రులు విజయ సారధి పరిచయం, మీకోసం..చదవండి

sirivennelaseetharamasastry-kavithvapaathaalu

20 May 2015
Hyderabad

సినిమా పాటల రచనల ద్వారా .. కేవలం సినిమా పాటల రచనల ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఒక మహోన్నత స్థానాన్ని (legendary status) సంపాదించుకున్న వ్యక్తులెవరైనా వున్నారంటే నా దృష్టి లో అది కేవలం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మాత్రమే… ఆయన జీవితం లో అరవై వసంతాలు నిండిన ఈ శుభ సందర్భంలో నా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అందిస్తూ చంద్రునికో నూలు పోగు అన్నట్టుగా.. సిరివెన్నెల గారి కో చిన్న బ్లాగు…

ఇంతకు మునుపెప్పుడో ఆయన రాసిన పాటలు పాఠాలు గా వల్లిస్తూ కృష్ణం వందే జగద్గురం టైటిల్ సాంగ్ గురించి జరుగుతున్నది జగన్నాటకం, చిరునవ్వు పాఠాలు శీర్షిక న చిరునవ్వు మీద పాటలు, అరణ్య పాఠాలు శీర్షికన సంఘ వ్యతిరేక శక్తుల తాండవాల పాటల గురించి చర్చించుకున్నాం….

ఈ వ్యాసం లో ఇప్పుడు నేను ఎప్పటినుంచో ప్రస్తావిద్దామనుకున్నఅంశాన్ని పొందు పరుస్తాను. సినిమా పాట అనేది ఎక్కువగా భారతీయ చలన చిత్ర పరిశ్రమ కే సంబంధించిన విషయం.. హాలీవుడ్ చిత్రాల్లో అప్పుడప్పుడు పాటలున్నప్పటికి ఆ సినిమాల్ని ‘Musicals’ పరిగనణిస్తారు… అంతే కాకుండా… మ్యూజిక్ ఇండస్ట్రీ చిత్ర పరిశ్రమ కి సమాంతరం గా పని చేస్తుంది. అందుకే సినీ గేయ రచయిత అనే వృత్తి కేవలం భారతీయ ( మరి కొన్ని ఆసియా ఖండం లోని దేశాలు) చిత్ర పరిశ్రమలకి సంభందించిన విషయం. అటువంటి చోట ముఖ్యం గా పాటల్ని సినిమా లో అంతర్భాగంగా మాత్రమే చొప్పించే చోట ఎంతోమంది సినిమా కవులు వచ్చినా చాలా మంది తమ రచనా పటిమని, సాహిత్యావలోకాన్ని, ప్రజ్ఞాపాటవాల్ని పలు విధాలుగా ప్రదర్శించు కొని పేరు ప్రఖ్యాతులు గడించినా సినిమా పాటలన్నా, సినీ గేయ రచయితలన్నా సాహిత్యాభిమానుల్లో చాలా వరకు చులకన భావమే కనబడుతుంది. అటువుంటి వృత్తిని చేపట్టికూడా ఉన్నతమైన ప్రమాణాలతో , తన ఉనికిని, విలువల్ని కాపు కాసుకుంటూ తన సిద్ధాంతాల్ని, నమ్మకాల్ని కాపాడుకుంటూ తెలుగు సాహిత్య చరిత్ర లో కేవలం తన సినిమా పాటల రచనల ద్వారానే తారాస్థాయి కి చేరుకొని ఒక సుస్థిరమైన స్థానం సంపాదించడం ఏమంత సామాన్య విషయం కాదు. అందుకే గురువు గారు ఒక ట్రెండ్ సెట్టర్ మాత్రమే కాదు.. ముందుతరాల కవులకు మార్గ దర్శకులు కూడా..

తన పాటల్లో ఒకవైపు తనదైన భావం పలికిస్తూనే మరో వైపు సినిమా సన్నివేశానికి సరిగ్గా సరిపోయే భావాన్ని ఇవ్వగలగడం నిజంగా ఆయనకి వెన్నతో పెట్టిన విద్య, భగవంతుడు ప్రసాదించిన ఒక అరుదైన వరం. అదేమిటో ఆయన రాసిన ఎన్నో పాటలు సినిమా సంగీతం, దృశ్యం లేకపోయినా కూడా విన్న ప్రతివారికి తమ గురించే రాసిన పాటల్లా అనిపిస్తాయి. కాని అదే సినిమా లో ఆ పాట లేకపోతే ఆ సినిమా సన్నివేశం మాత్రం తన పటుత్వం కోల్పోయి పేలవంగా మారుతుందదనిపిస్తుంది ఎన్నో చిత్రాల్లో చిత్రీకరించబడిన ఆయన పాటలు వింటే. అలా తను నమ్మిన మానవీయతా విలువలకి, సిద్ధాంతాలకి చలన చిత్ర పరిశ్రమ ఎన్నో లక్ష్మణ రేఖలు గీసినా గాని రామాయణంలో సీతలా మాయలేడి కోసం రామ లక్ష్మణులిద్దరినీ బయటకు పంపి, మాయా రావణుడిని నమ్మి భిక్ష వెయ్యడం కోసం గీత దాటి పరుగులు తియ్యకుండా తనకున్న పరిధి లోనే ఎంతో స్థలాభావం ఉన్నప్పటికీ.. సీతారామ శాస్త్రి గారు మాత్రం తన సిరివెన్నెల భావకిరణాల ఇంద్ర జాలం తో అతి చాకచక్యంగా ఆ బంగారు లేడినే తన వైపుకి గీత దాటించుకున్న ఘనత చేజిక్కుంచుకుని సినిమారంగం లో ఒక మహోన్నతమైన స్థితికి ఎదగ గలిగారు….

సినిమాల కోసం ఎవరైనా ఏమైనా రచించే ముందర, ఏదైనా పని చేసే ముందర తద్వారా ప్రాముఖ్యత పొందాలంటే .. జనాలకి ఏది నచ్చుతుంది అని ఆలోచించి… దానిమీదే దృష్టి కేంద్రీకరించి.. ఏది రాస్తే , ఏది చేస్తే ప్రేక్షకులని చేరి… వారి మెప్పుసంపాదించి కీర్తి , కాంత, కనకాలను వెనకేసుకోవచ్చో అదే రాయడానికి, అదే చెయ్యడానికి ఇష్టపడతారు… కాని శాస్త్రి గారు అందుకు భిన్నంగా తన తండ్రి గారి ద్వారా సముపార్జితమైన వసుదైక కుటుంబ తత్వాన్ని.. మానవీయతా విలువలని … సామాజిక భాధ్యతల్ని.. మనిషి తత్వాన్ని వెనకేసుకుని వాటినే ఆస్తులుగా భావిస్తూ.. మొట్ట మొదటి చిత్రం తోనే అనన్యమైన పేరు తెచ్చుకున్నా, ఆయన ఏది రాస్తే దాన్నే సినిమాల్లో పాటలుగా పెట్టుకునే అవకాశాలు కోకొల్లలుగా వచ్చినా .. తనకై తాను నియంత్రించుకున్న కట్టుబాట్లకి.. విలువలకి.. నిబద్ధతకి ఏ మాత్రం తలొగ్గకుండా తన జీవిత షష్టిపూర్తిలో చలన చిత్ర ప్రస్థానంలో అర్ధ షష్టి పూర్తి కూడా చేసుకోగాలిగారంటే…దాని వెనుక ఆయన కఠోర దీక్ష, కృషి, కష్టం, వ్యాపారాత్మక యుగం (Commercial Age) లో ఉండే ఎన్నో ఆటుపోట్లు.. మరెన్నో ఒడిదుడుకులు తట్టుకుని నెగ్గుకు వచ్చిన విధానం… బహు ప్రశంసనీయం… ఈ సహజ లక్షణం గురువుగార్ని సినీ కవుల జాబితాలో చాలా పై అంతస్తులో నిలబెడుతుంది.

ఇప్పటికి మూడు వేల పైచిలుకు పాటలు రచించినా.. ఒకే భావాన్ని పదే పదే రాయాల్సి వచ్చినా.. భక్తి పాటలు, ముక్తి పాటలు, వ్యక్తి పాటలు, శక్తి పాటలు, రక్తి పాటలు, విరక్తి పాటలు, లాలి పాటలు, జాలి పాటలు..ఆలి పాటలు, ప్రేమ పాటలు, డ్రామా పాటలు, తల్లి పాటలు, చెల్లి పాటలు,మమకారం పాటలు, వెటకారం పాటలు, హాస్యం పాటలు, లాస్యం పాటలు, పల్లె పాటలు, జోల పాటలు, గోల పాటలు, స్నేహం పాటలు, మోహం పాటలు, డబ్బు పాటలు, క్లబ్బు పాటలు, ఫక్తు కమర్షియల్ పాటలు.. ఐటెం సాంగ్స్.. హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్… హిందీ, ఇంగ్లీష్ వర్డ్స్ తో తెలుగు సాంగ్స్, కామెడీ సాంగ్స్ ….. ఆఖరికి బూతుపాటల సన్నివేశాలు ఇచ్చినా గురువు గారు తన నిబద్ధత వీడకుండా అటు నిర్మాతల్ని, దర్సకుల్ని, హీరోలని, సంగీత దర్శకులని మెప్పిస్తూనే ఇటు శ్రోతలని, ప్రేక్షకులని కూడా మెప్పిస్తూ వారి హృదయాల్లో తన చోటుని సుస్థిరం చేసుకుంటూ మరో పై మెట్టుకు చేరారే తప్ప ఏనాడు క్రిందకి దిగజారి పాట రాయలేదు సరికదా.. ఆఖరికి సర్దుకుపోయి కూడా పాట రాసిన సందర్భాలు నాకు తెలిసినంత వరకూ లేవు. అందుకే శాస్త్రీయ సంగీతానికి ఎంత పవిత్రత ఉంటుందో శాస్త్రి గారి గీతాలకి అంత పవిత్రత చేకూరింది. తొడ మీద మచ్చ గురించి పాట రాయాల్సి వస్తే… ఆ పాటలో శ్రీదేవి, వాణి, పశుపతి రాణి అని త్రిమూర్తుల శ్రీమతులకు చోటిస్తూ పాట రాసారు… , భంచిక భంచిక చెయ్యి బాగా అని ఒక పచ్చి బూతు పదజాలం తో మొదలెట్టి పాట రాయమంటే.. తన పదమాయా జాలం తో ఒక యోగా థీమ్ సాంగ్ రాసారు… అల్లరచిల్లరగా అమ్మాయిని ఆటపట్టించే పాట లో ప్రతి వినాయక చవితి నాడు తప్పనిసరిగా వినిపించే జనసాముహిక భక్తి భజన గీతాన్ని రాయగలిగారు. క్లబ్ సాంగ్ రాయాలంటే యువతను మేల్కొలిపే పాటలు రాసారు.. మహాత్మా గాంధీ గురించి పాట రాయవలసి వస్తే.. ఒక పక్క గాంధీ ని కీర్తిస్తూనే మరో పక్క ప్రతి మనిషి లోను మహాత్ముడున్నాడన్న సంగతి నొక్కి వక్కాణించారు. అంతే కాదు మెగా స్టార్ కి ఇంద్ర లాంటి ఫ్యాక్చన్ బ్యాక్ డ్రాప్ చిత్రం లో ఇంట్రడక్షన్ సాంగ్ గా ‘ కాశీ నగరం స్తుతి తో చిరకాలం నిలిచిపోయే ‘చిరంజీవి’ పాటని రాసి మెప్పించగలిగారు. అంతెందుకు.. ఈ మధ్యనే వచ్చిన ఎవడు సినిమా ఆడియో విడుదలైన 6 నెలల వరకు సినిమా రిలీజ్ అవకపోయినా.. ఆయన ఆ సినిమా కి రాసిన ఒకే ఒక పాట ‘ నీ జతగా నేనుండాలి’ ప్రేమికుల హృదయాల్లో ఇప్పటికీ చాలా ఫ్రెష్ (fresh)గా ఉండి గుర్తుంది .. అంతే కాదు అందులో రాసిన చరణాలు ఆ పాట విన్నవారేవరికైనా ఎప్పటికీ గుర్తుండి పోతాయి. కేవలం ఆయన అభిమానులకే కాదు… తెలుగు సాహిత్యాన్ని అభిమానించి ఆస్వాదించే ఎవరికైనా సరే . ఒక్క మాట లో చెప్పాలంటే.. సిరివెన్నెల పాటలకి ఎక్స్పైరీ డేట్ (Expiry Date) , షెల్ఫ్ లైఫ్ (Shelf Life) ఉండవు … ఉంటే అది ఖచ్చితం గా సిరివెన్నెల పాట కానే కాదు.

అసలు ఆయన రాసిన ఎన్నో పాటలు గత మూడు దశాబ్దాలు గా ఎందరికో కావ్యగ్రంధాల పంధాల గాను, వ్యక్తిత్వ వికాస పుస్తకాల పేజీల గాను, సంగీత పోటీలలో పాల్గొనే వారికి అవసరమైన ఆయుధాల గాను.. నిరాశా నిస్పృహలతో జీవితంపై ఆశ కోల్పోయిన వారికి ఔషధాల గాను ఎందుకు , ఎలా మారాయా అని ఆలోచించి బుర్ర పాడు చేసుకునే కన్నా’ “నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా.. నీ చిక్కులు నీవే ఎవ్వరో విడిపించరు గా” ..” అనే ఫిలాసఫీ (philosophy) ని తాను నమ్ముతూ ప్రభోదించే గురువు గారు.. తన పాటలన్నీ తనకి బిడ్డలనీ చెబుతూ అన్న ఈ మాటలు వింటే మీకే అర్ధమవుతుంది.. ఆ పాటలు రాయడానికి ఆయన ఎంత ప్రసవ వేదన అనుభవిస్తారో…..

“పాట అనేది, ముఖ్యంగా సినిమా పాట అనేది, కాగితపు పొత్తిళ్ళలో, కలం ప్రసవించిన నాడున్న రూపంతోనే అక్షరాలా అలాగే అత్తింటికి వెళ్ళదు, పుట్టింతర్వాత , దర్సక నిర్మాతల ఫౌరహిత్యంతొ, బారసాల జరుపుకుని ఓకే! అని నామకరణం పొందుతుంది, అటుపైన మ్యూజిక్ డైరెక్టర్ పెట్టే బాణీ వేసుకుని ఈడేరుతుంది , ఆ తర్వాత రికార్డింగ్ థియేటర్లో గౌరీ పూజ చేసుకుని ఆర్కెస్ట్రా మేళతాళాల్ని, కోరస్ చెలికత్తెల్నీ వెంటపెట్టుకుని, గాయనీగాయకుల స్వరాలు సింగారించుకుని కెమెరా సాక్షిగా వెండితెర మంటపాన వధువు గా ఒదుగుతుంది ”

సినిమా పాటల్లో రానురానూ భాష పట్ల, సంస్కృతి పట్ల, మానవ విలువల పట్ల, సామాజిక కట్టుబాట్ల పట్ల విలువలు నశించి పోతున్నాయని భావించే, కళా వికాసం పట్ల గౌరవం వున్న ప్రతి ఒక్కరూ, అవన్నీ అంతరించి పోతున్నాయే అని బాధపడే కన్నా తమ వంతు భాద్యత గా కొంచెం కష్టపడైనా సరే ఏమి చెయ్యవచ్చో , ఏమి సాధించవచ్చో, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సినీ గీతరచనా మజిలీ నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు. తెలుగు సినిమా ప్రేక్షకుల అదృష్టవశాత్తు May 20, 1955 వ సంవత్సరం లో మధ్యప్రదేశ్ లో “ఉదయించిన ఈ వెన్నల రేడు” , ఆ ప్రక్కనే వున్న తెలుగుగడ్డకి చేరుకొని మరో ముప్పై ఒక్క సంవత్సరాల తరువాత అంటే May 20 , 1986 నాడు ‘సిరి’వెన్నెల రేడు గా రూపాంతరం చెంది, అప్పటినుంచి తెలుగు సినిమా గీతాల వైతరిణి లో కొట్టుకు పోతున్న సంగీత సాహిత్య సరస్వతిని మునిగిపోకుండా కాపాడాలన్న ఏకైక అకాంక్షతో, అహర్నిశలు ఆ సాహిత్య సరస్వతిని మునిగిపోనీకుండా కాపాడటమే కాక తన జాగృత తతుల సహాయం తో వినీల గగనం లో విహంగంగా ఎగరేయ గలిగారు..

‘సినిమాలో పాట అనేది ఒక మ్యూజికల్ రిలీఫ్ అని, అంతకుమించి ఎక్కువ చోటు గౌరవమూ కోరకూడదు కాబట్టి ఆ పాట కథని, పాత్రల్నీ ఆధారం చేసుకుని ఉంటుంది కాబట్టీ , భాషలోనూ, భావంలోనూ ఆ పరిమితుల్ని అతిక్రమించి, ఒక సినిమా ’కవి’ తన సొంత భావాలు చొప్పించకూడదని’ అంటూనే… ఒక కవి గా, మామూలు భాష కి సరిపోనంత, సున్నితమైన , లోతెనౖ , విశాలమైన భావాలు వ్యక్తం అవుతాయో ఆ పద్ధతి లో ఉంటేనే తనకి , తన పాటకి, తగిన గౌరవం లభిస్తుందని సినిమా పరిధుల్ని అస్సలు అతిక్రమించకుండా, చలన చిత్ర పాత్రల ఔచిత్యాన్ని ఏ మాత్రం భంగపరచకుండా, తన పాట కి తద్వారా సినిమా పాటకి సాహితీలోక పౌరసత్వాన్ని కూడా అందుకునే అవకాశాన్ని కలిగించారు గురువు గారు. నాకు తెలిసి చాలా చిత్రాల్లో అద్భుతమైన సన్నివేశాలు సిరివెన్నల పాటల వల్ల పుట్టాయి, అంతే కాదు కొన్ని సినిమాలు ఆయన పాటల ఇన్స్పిరేషన్ తో తీయ బడ్డాయి. రామ్ గోపాల్ వర్మ ‘గాయం’ సురాజ్యమవలేని పాట విని, కృష్ణ వంశీ ‘చక్రం’ జగమంత కుటుంబం నాది పాట కోసమని నిర్మించారంటే గురువు గారి పాట పవర్ (power) ఎంతో తెలుస్తుంది.

‘నా ఉచ్చ్వాసం కవనం.. నా నిశ్వాసం గానం’ అంటూ కళాతపస్వి కాశీనాధుని విశ్వనాథ్ గారి ఆశీస్సులతొ సినీ కవిగా ‘సిరివెన్నెల’ నామధేయుడై తన ఇంద్ర-చంద్ర జాలాన్ని ఏళ్ళ తరబడి అలుపుసొలుపులు లేకుండా నిత్య నూతనత్వం తో ప్రకాశింప చేస్తూ ఉండటం.. నిజంగా ఈ ఆధునిక యాంత్రిక జీవనంలో జీవిస్తున్న తెలుగు సాహితీ ప్రియుల పూర్వజన్మ సుకృతం. తనదైన ఒక విభిన్నరీతి, ప్రత్యేకమైన ముద్ర వున్న గేయరచనల వెనుక గల ముఖ్యమైన కారణాన్ని , తన తెలుగు సినిమా పాటల ప్రస్థానం గురించి విశదీకరిస్తూ ఆయన ప్రచురించిన ‘సిరివెన్నెల తరంగాలు’ లో గురువు గారు ఈ విధంగా అన్నారు……

” క్రమక్రమంగా తెలుగు పలుకుబడి, తెలుగులోని తేనెతేటల తియ్యదనం, చిక్కిపోతున్న ఈ రోజుల్లో, కంప్యూటర్, ఇంటర్నెట్ ఇత్యాది హిరణ్యాక్షుల చేతుల్లో, భూగొళం చాపచుట్టలా చుట్టుకుపోతూ , గ్లోబలైజ్ద్ అయిపోతూ ఉండడం వల్ల కాస్త ఓపిగ్గా, తీరిగ్గా కూచుని చదివే అలవాటు,నిలబడి ’మాట్లాడు కునే’ సరదా, అన్నీ పోయి పరుగులు పెడుతున్న కాలంలో, పుస్తకాలు, సభలు, చర్చలు, సమాలొచనలు అన్నీ అవుటాఫ్ ఫేషన్ అయిపోతున్న నాగరికతలో, ఇంకా ప్రజలందర్నీ ఆకట్టుకోగలుగుతున్న ఈ చలనచిత్ర వేదిక ద్వారా అయినా భాష, భావం ఆలొచన స్పందన లాంటి విలువల్ని కాపుకాసే ప్రయత్నం ఎందుకు చెయ్యకూ డదు? ఇలాంటి నా కలవరం అంతా పెకిౖ వెళ్ళబోసుకోవడానికి నాకు దొరికిన సువర్ణావకాశం, సినిమాల్లోపాటలు రాయగలిగే పని దొరకడం. ఏ కవికి అయినా సినీ కవి కాగలగడం గొప్ప అదృష్టం అని నేను భావిస్తాను. ఎందుకంటే, బైట కవిగా ఉంటే ఎప్పుడో ఏదో స్పందన కలిగి రాసేందుకు ప్రేరణనిస్తుంది. సినీ కవిగా ఉంటే, స్పందన కలిగేదాకా ఎదురు చూసే వీల్లేదు. స్పందన కలిగించుకోవడమే. ప్రతి పాటా ఒక సవాల్. ఇన్నిరకాలుగా ప్రేరేపించి, ఇన్ని రకాలుగా వ్యక్తీకరించమని నిరంతరం వెంట తరిమే అవకాశం ఇక్కడ , ఈ పనిలో తప్ప బెటౖ దొరకదు. అలా రాయవలసి వచ్చిన ప్రతిపాటని, నా అభిరుచికి తెరలు వెయ్యకుండా , అలాగని సినిమా పాట పరిధిని దాటకుండా, రాయడానికి ప్రయత్నిస్తున్నాను.”

అంత అంతర్మదనంతో తన భావాల్ని చలనచిత్ర గీతాల్లో పొందుపరచటం వల్లనే కాబోలు… ఆయన రాసిన ప్రతి పాట సినిమా పాటలకున్న పరిధిలో వున్నా.. శ్రోతల హృదయాల్లో మాత్రం అవధులు దాటి ప్రవహిస్తుంది…. ప్రముఖ తమిళ సినీ గేయ రచయిత వైరముత్తు గారు ఎక్కడో అన్నారు ‘ సినిమా పాటల కవిగానే నోబెల్ ప్రైజ్ పొందడం నా ఆశయం’ అని. గురువుగారి పాటలు కనక ఒక వేళ స్వీడిష్ భాష లో రాయబడి ఉన్నట్టయితే నా ఉద్దేశం ప్రకారం ఎప్పుడో నోబెల్ ప్రైజ్ వచ్చి ఉండేదేమో. అదే ఏ బెంగాలీ భాషలోనో కవితలల్లి ఉంటే… రవీంద్రనాథ టాగూర్ స్థాయికి ఎంతో కాలం ముందరే చేరుకునే వారేమో.. అందుకే ‘2012 Maa Music Awards’ సన్మాన సభలో దర్శకుడు త్రివిక్రమ్ గారు అన్నట్టుగా ఆయన తెలుగు సినీ గేయ రచయితగా ఉండటం ఆయన దురదృష్టం అయితే.. మన తెలుగు ప్రజల అదృష్టం అని నమ్మాలనిపిస్తుంది. అంత యూనివర్సల్ రీచ్ (universal reach) ఆయన ప్రతీ పాటలో ప్రస్ఫుటిస్తుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. అలాగే సినిమా సన్నివేశాలని, సంగీతాన్ని మినహాయించినా కూడా ఆయన సాహిత్యం లో వున్న మాధుర్యం , ప్రాపంచిక ఆపాద్యత , సార్వజనీయత, ప్రతి మనిషి ని కదిపి కుదిపించగల హృదయస్పందన ఒకటే అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

ఆయన పైన చెప్పిన విధం గానే ఆ సినిమా పాటల పరిధి లోనే తన నిబద్ధత నిలబెట్టుకుంటూనే మహా కావ్యాలందించారు.. ఈ మధ్యనే విడుదలైన ‘ముకుంద’ చిత్రానికి రాసిన ఒక పాటలో ‘పక్క పక్కనే అక్షరాలను నిలిపి ఉంచినా.. అర్ధమున్న ఓ పదము కానిదే ఫలితముండునా’ అని ఆయన ఎందుకన్నారో నాకు తెలియదు కాని.. పక్కపక్కనే అర్ధములేని పదాల సమాహారాల ప్రవాహంలో కొట్టుమిట్టాడుతున్న తెలుగు సినిమా పాట ఇంకా ఆయువు పూర్తి కాకుండా ప్రాణంతో ఊపిరి తీసుకుంటోందంటే.. దానికి ముఖ్య కారణం నాకు సంబంధించినంత వరకు గురువు గారి కలం నుంచి గత ముప్పై సంవత్సరాలుగా జాలువారుతున్నఆణిముత్యాలే.. ఆయన షష్టి పూర్తి సందర్భంగా నాకు బాగా ఇష్టమైన ఒక అరవై అద్భుతమైన పాటల లిస్టు తయారు చేద్దామనుకుంటే.. అది కాస్తా ఆరువందల పాటల జాబితా అయి కూర్చుంది… అందుకే ఆ ప్రహసనానికి స్వస్తి చెప్పి.. ఎప్పుడూ రాస్తున్న విధం గానే.. ఈ ఆర్టికల్ లో ఆయన రాసిన ‘Poetic Masterpiece’ పాటల్ని ‘కవిత్వ పాఠాలు’ శీర్షికతో ఎంచుకోవడం జరిగింది. అంతే కాదు మొట్ట మొదటి సారి గా కేవలం తెలుగు లోనే ఈ వ్యాసం పూర్తిగా రాయాలని ఉపక్రమించాను.. కాబట్టి పాఠకులు తప్పులేమైనా ఉంటే క్షమించవలసింది గా మనవి.

పైన ఉపోద్ఘాతం లో నేను మీకు చెప్పిన ఆయన చెప్పిన మాటలే సినిమా అవసరాన్నిబట్టి పాటలుగా ఎలా రూపం చెందాయో ఎంత అందం సంతరించుకున్నాయో చూడండి. ఇవన్నీ నాకు చాలా చాలా ఇష్టమయిన పాటలు.. అనే కన్నా ప్రతిపాట ప్రపంచం లోని ఏ భాషా సాహితీకారుల ‘పోయెట్రీ ( Poetry )’ కైనా తీసిపోదని నా గట్టి నమ్మకం అంటాను. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పాట ఒక నాకు ఒక పాఠం , అయినా ‘కవిత్వ పాఠాలు’ వ్యాసం ఈ పాటలకే పరిమితం చేయడానికి కారణం.. ఈ పాటలన్నీ జాగ్రత్తగా గమనిస్తే మీకే అర్ధమవుతుంది.

” ఆఫ్ట్రాల్ సినిమా పాటలు… ఓ అయిదారు నిమిషాల పాటు ఇలా విని, అలా చూసి, ఓహో అనో, ఓర్నాయనో అనో ఒక్క ముక్క లో ఇష్టాయిష్టాలు తేల్చేసుకుని ఒదిలించెసుకోవలసిన ఈ లలిత గీతాల్లో ఏవంత నిగూఢ రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయట?” అని తనకి తానే శ్రోతల తరపున ప్రశ్న వేసుకుని బదులుగా తాను పాటలు రాయడానికి పాటించే సూత్రాలు, వెలువరించే భావాలు, నిగూఢ రహస్యాలు కాకపోయినా, నాకెందుకో తను రాసిన ఈ పాటల్లోనే అవన్నీ నిక్షిప్త పరిచారనిపిస్తుంది. ప్రతిపాట లోనూ ఆ పాట సన్నివేశానికి పాత్ర ఔచిత్యానికి లేసి మాత్రం భంగం కలిగించకుండా తాను ఎటువంటి పాటలు రాయాలో, రాస్తారో, రాయాలని అనుకుంటారో, రాయగలరో.. ఈ పాటల్లోనే ప్రజలకి సూటిగా చెప్పారని నేను భావిస్తాను. అది కేవలం కాకతాళియమో లేక యాద్రుచ్చికమో కాదని, గురువు గారి అంతరంగంలో నిక్షిప్తమైన మనోభావాలకి అచ్చమైన, స్వచ్చమైన ప్రతిబింబాలని నేను పూర్తిగా నమ్ముతాను. పాడుతా తీయగా అనే చిత్రానికి రాసిన ఒక పాట పల్లవి లో గురువు గారు “ పాట నాకు నేస్తం.. పాటే గా నా సమస్తం.. పాట నాకు ప్రాణం.. ప్రతి పాటా నా ప్రయాణం… జపించాను స్వరవేదమే… తపించేటి ఎదరాగమై.. వరించాను స్వరస్నేహమే… తరిస్తాను జయగీతమై ..” అని చెప్పారు. నిజమే అంత ఉద్వేగం తో పాటలు రాస్తే అవి కవిత్వ పాఠాలు కాక మరేమవుతాయి? నేను ఈ ‘కవిత్వ పాఠాలు‘ శేర్షిక తో ఎంపిక చేసిన ఈ క్రింది పాటలు చూసి , చదివి, వింటే మీరు కూడా కాదనరని నా ప్రగాఢ విశ్వాసం.

1. ఓంకార వాక్యం – శివ శ్లోకం
చిత్రం : సంకీర్తన
సంగీతం: ఇళయరాజా
గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

ఓంకార నాదం ఉరగపుంగవ భూషితాంగం..
వ్యాఘ్రాజినాంబర ధరం జటిలం త్రినేత్రం..
పాశాంకుశధరం అభయకరప్రదం శూలపాణిం …
కైలాసభూధరపతిం.. ప్రణతోస్మి నిత్యం .. ప్రణతోస్మి నిత్యం… ప్రణతోస్మి నిత్యం…

విశ్వనాధాష్టకంలో శ్లోకం ఇలా ఉంటుంది :

భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం..
వ్యాఘ్రాజినాంబర ధరం జటిలం త్రినేత్రం..
పాశాంకుశభయ వరప్రద శూలపాణిం …
వారాణసి పురపతిం భాజ విశ్వనాథం…

సిరివెన్నెల చిత్రం విడుదలైన ఒకటిన్నర సంవత్సరాల తరువాత సంకీర్తన చిత్రం కోసం గురువు గారు రాసిన ఈ శ్లోకం పైన చెప్పినట్టు విశ్వనాధాష్టకంలో ఒక శ్లోకంలా ఉంటుంది. కాశీ విశ్వనాధుని పూజించే విధంగా పైకి కనబడినా.. గురువు గారు “ఓంకార వాక్యం.. ఉరగ పుంగవ భూషి తాంగం..” అనే పదాలు చొప్పించి రాయడం లో తనకి సినీ జన్మ ప్రసాదించిన కళాతపస్వి శ్రీ కె. విశ్వనాథ్ గారిని స్తుతిస్తున్నట్టు అనిపిస్తుంది. ఉరగ అంటే పాము, పుంగవ అంటే శ్రేష్టమైనది , కాబట్టి నాగారాజుని ఆభరణంగా ధరించినట్టు. అంటే తన మొదటి పాట ఓంకారం మీద రాయగాలిగేల వాక్యాన్నిచ్చిన శంకరాభరణం లాంటి సినిమా తీసిన ఘనత వహించిన అని అర్ధం వస్తుంది…. అభయకరప్రదం అనే పదాన్ని తనకి అభయాన్నిచ్చిన అనే అర్ధం వచ్చేలాగా , కైలాస భూధరపతిం అంటే… కాశీనాధుడని (కైలాసభూ ) , విశ్వనాధుడని (ధరపతిం) , అంటే కాశీనాధుని విశ్వనాథ్ అని కూడా అర్ధం కూడా వస్తుంది.. శ్లోకంలో.. చివర ప్రణతోస్మి నిత్యం అని మార్చి రాసి, ఆయనకి కృతజ్ఞత చూపిస్తూ ప్రతిరోజు స్మరిం చుకుంటానని ఎంతో పవిత్రం గా చెప్పారనిపిస్తుంది నాకు.

2. రామాయణసారం
చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూడము రారండి
సంగీతం : ఎం. ఎం. కీరవాణి.
గానం: సునీత

శ్రీ సీతారాముల కళ్యాణం చూడము రారండి చిత్రం కోసం, రామాయణ సారాంశాన్ని కేవలం ఐదు సాధారణ వాక్యాలలో అసాధారణంగా చెప్పారు గురువు గారు. ఆ పురాణ గాధ నుంచి కథని, పాత్రలని గుర్తుంచుకునే కన్నా వాటి ద్వారా చాటిన మానవ విలువలు, ధర్మాలు గుర్తించాల్సిన అవసరముందని భావించి, కథ గురించి గానీ , రాముడు , సీత , లక్షణుడు, హనుమంతుడు, రావణాసురుడు పేర్లు గానీ ప్రస్తావించకుండా ఆయా పురాణవ్యక్తుల ద్వారా ఆయన గుర్తించిన, మనం గుర్తించాల్సిన సామాజిక విలువల్ని, బాధ్యతల్ని గుర్తుచేస్తూ ఎంతో అద్భుతంగా రచించిన ఈ పద్యకవిత్వం నాకే కాదు, నాకు తెలిసన చాలా మందికి చాలా చాలా ఇష్టం…

కొడుకుగ , అన్నగ, భర్తగ, రాజుగ బాధ్యతలెరిగిన పురుషుని చరితం…
అగ్ని సైతమూ సిరశొంచె సద్గుణ తేజానికి సాక్ష్యం చూపిన సాధ్వీ కథనం…
భక్తి శ్రద్ధలతో ధర్మానికి అంకితమయ్యే సేవా భావం…
బంటుని సైతం భగవంతునిగా పెంచిన సుందరకావ్యం..
జగమును శాసించే ఘనులైనా అహమును గెలువని వారైతే పతనం తప్పదనే గుణపాఠం …
ఇదే ఇదే రామాయణ సారం… భారతసంస్కృతికిది ఆధారం…

3. విధాత తలపున
చిత్రం : సిరివెన్నెల
సంగీతం: కె.వి. మహదేవన్
గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం & పి. సుశీల

శాస్త్రి గారు రాసిన ఈ మొట్టమొదటి సినిమా పాట గురించి ఇప్పటికే ఎంతోమంది ఎన్నో విధాలుగా వర్ణించారు. ఇప్పటికి సగటున ప్రతి మూడేళ్లకి తన సినీ జీవితం లో ఒక నంది పురస్కారం చొప్పున గత ముప్పై ఏళ్ళలో పది నంది అవార్డులు అందుకున్న శాస్త్రి గారికి తన ఈ మొట్టమొదటి పాటే నంది పురస్కారం తెచ్చిపెట్టడం ఒక విశేషమయితే… పేరుమోసిన వేణునాద విద్వాంసుడు పండిట్ శ్రీ హరిప్రసాద్ చౌరాసియా అందించిన గొప్ప రాగానికి కె. విశ్వనాథ్ గారు పాట సాహిత్యం వింటే అంత గొప్పగాను అనిపించాలి అనే ఛాలెంజ్ ఇస్తే.. గురువు గారు ఆ వేణునాదాన్ని మరిపించే రీతిలో ప్రపంచ ఉద్భావనగా భావించే ఓంకార ప్రణవనాదం తో ప్రారంభమయిందనే వేద ప్రమాణాన్ని ముఖ్య ఉద్దేశం గా తీసుకుని ఒక అద్భుతమైన గీతం రాయడం మరో విశేషం. అంతే కాదు ఆ పాట ద్వారా తను పాటలు రాయడం అనే ప్రక్రియని ఎలా తీసుకుంటారో అన్న విషయాన్ని పాటలో చాలా చోట్ల చెప్పారు.. ప్రాణం నిలుపుకోడానికి తనకి ఊపిరి తీసుకోవడం ఎంత అవసరమో, పాట కూడా అంతే అవసరమని ‘నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం’ అన్న వాక్యం ద్వారా , తన పాట లన్నీ ఉన్నత ప్రమాణాల తో జీవితవిలువలు కిలిగి ఉంటాయని “సరసస్వర సురఝరి గమనమౌ సామవేద సారమిది, నే పాడిన జీవన గీతం” అన్న పదాల వాడకం ద్వారా తెలియ జేశారు. ఇంక ‘విరించినై విరచించితిని విపంచినై వినిపించితి ఈ గీతం’ అన్న పదజాలాని తను పాటల సృష్టి కర్త గా (విరించి) సరస్వతి దేవి (విపంచి అంటే వీణ , అంటే సరస్వతి దేవికి గుర్తు) తన ప్రతి గీతంలో వినిపిస్తుందని చెప్పారని నాకనిపిస్తుంది.

4. ప్రకృతి కాంతకు
చిత్రం: సిరివెన్నెల
సంగీతం: కె.వి. మహదేవన్
గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

ప్రకృతికాంతలో ఉన్న హోయలకి తన పదాలు కలిపితే లయబద్దమైన పాటకి అంకురార్పణ జరుగుతుందని, ఈ పాట పల్లవి లో ‘ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో.. పదము కదిపితే ఎన్నెన్ని లయలో..’ అని పల్లవి ప్రారంభించి ప్రకృతిని తన ఎదలో నిండి సిరిమువ్వల సవ్వడి తో నాట్యం చెయ్యమని ఆహ్వానిస్తూ కీర్తించారు ఈ మాటల అల్లిక ద్వారా. ” సిరివెన్నెల నిండిన ఎదపై .. సిరిమువ్వల సవ్వడి నీవై.. నర్తించగ రావేలా.. నిను నే కీర్తించే వేళ’ .

5. నీతోనే ఆగేనా
చిత్రం: రుద్రవీణ
సంగీతం: ఇళయరాజా
గానం: కె.జె. ఏసుదాస్.

రుద్రవీణ చిత్రం కోసం , తన తండ్రి ఇక బిళ హరి రాగం పాడవీల్లేని స్థితి కి చేరుకుంటే.. తను వారసుడి గా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తానని , ఏ ఆటంకాలు ఆ విధి నిర్వహణ ఆపలేవని చెప్పే సన్నివేశానికి ఈ పాట ద్వారా ప్రాణం పోస్తూనే…. తన సినీ గేయ రచనా ప్రస్థానంలో ఎన్ని అవరోధాలున్నా , ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎన్ని మార్పులు వచ్చినా తను మాత్రం తెలుగు పాట గౌరవాన్ని, మర్యాదని, సాంప్రదాయాన్ని కాపాడుతానని ” నీతోనే ఆగేనా నా సంగీతం.. బిళ హరీ అని పిలవకుంటే.. స్వరవిలాసం మార్చుకుంటే ఆగిపోదు గానజ్యోతి ‘ అని చాటి చెప్పారు.

6. ఆనతినీయరా హరా
చిత్రం: స్వాతికిరణం
సంగీతం: కె.వి. మహదేవన్
గానం : వాణీ జయరాం

ఒక మహా సంగీత విద్వాంసుడ్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఒక చిన్ని బుడతడి తాపత్రయం, తద్వారా ఆయన్ని చేరుకొని సేవచేసుకుంటూ ఆయన సన్నిధి లో తన కళను మరింత సాన పెట్టాలని కోరుకునే ఈ చిత్ర సన్నివేశాన్ని తనకిష్టమైన దైవం శివుడ్ని స్తుతించి శివుడాజ్ఞ లేనిదే చీమ కుట్టదన్నట్టుగా .. భగవంతుడి ఆన లేనిదే తాను రచించలేనని.. ఆ సరస్వతి కృప ఉండదని తను ఆ సదాశివుని సర్వదా రుణపడి ఉంటానని అర్ధం వచ్చేలా ఒక గొప్ప పాట రాసారు. తనని తాను సిరివెన్నెల చిత్రంలో విరించిగా సంభోదించుకున్న గురువు గారు.. ‘ నీ యాన లేనిదే రచింప జాలునా వేదాలవాణి తో విరించి విశ్వ నాటకం ‘ అని ఈ పాటలో రాసుకున్నారు..
‘పప పపమ నినిపమగస గగ’ అనే సరిగమలకి ‘ రక్షాధర శిక్షా దీక్షాదక్ష..’ అంటూ పదాలు పండించి.. దానికి కొనసాగింపుగా అతిక్లిష్ట మైన ‘క్ష’ అక్షరాన్ని అవలీలగా ‘ విరూపాక్షా నీ కృపా వీక్షణ నుపేక్ష చేయక పరీక్ష చేయక రక్ష రక్ష అను ప్రార్ధన వినరా’ అంటే.. ఏ దేవుడు పొంగిపోడు? వరాలివ్వడు? స్వాతికిరణం చిత్రం కోసం గురువు గారు రాసిన ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం.. వాణీ జయరాం గారు అద్భుతం గా ఆలపించారు..

7. వేవేల వర్ణాలా
చిత్రం: సంకీర్తన
సంగీతం: ఇళయరాజా
గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం & ఎస్. జానకి

సంకీర్తన కోసం రాసిన ఈ పాట లో గురువుగారు ‘ వేవేల వర్ణాల ఈ నేల కావ్యానా .. అలలు శిలలు తెలిపే కథలు పలికే నాలో గీతాలై’ అనే పల్లవి తో రాయడం వెనుక విషయాన్ని గమనిస్తే.. ప్రకృతి నలువైపులా వున్నా ఎన్నో అందాలు తన పాటలకి స్ఫూర్తి అని చెప్పినట్టనిపిస్తుంది… మనం జాగ్రత్తగా గమనిస్తే..గురువు గారి చాలా పాటల్లో అలలు , కెరటాలు, శిలలు ఉలులు అనే పదాలు వివిధ రకాల అర్ధాలతో తారసపడుతూ వుంటాయి కూడా. ఈ పాట చరణంలో ప్రకృతి ఇచ్చే స్ఫూర్తి ఎలా వుంటుందో తెలుపుతూ రాసిన ఈ కింది వాక్యాల భావం నాకెంతో అద్భుతం గా తోస్తుంది.
వాన వేలి తోటి నేల వీణ మీటే నీలినింగి పాటే ఈ చేలట….
కాళిదాసు లాంటి ఈ తోట రాసుకున్న కమ్మనైన కవితలే ఈ పూలట…
ప్రతి కదలిక లో నాట్యమే కాదా…. ప్రతి ఋతువు ఒక చిత్రం కాదా… ఎదకే కనులుంటీ…

8. ఏ రాగముంది
చిత్రం: మనసులో మాట
సంగీతం: కె.వి. మహదేవన్
గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

మనసులో మాట చిత్రం కోసం ఒక ఊపిరి బిగపట్టి గుక్క తిప్పుకోకుండా సుమారు రెండున్నర నిమిషాల పాటు ఆలపించే ఈ ‘Breathless Song’ విన్న వాళ్లెవరైనా SP బాల సుబ్రహ్మణ్యం గారికి శిరసు వంచి పాదాభివందం చేస్తారు.. గురువు గారికి ఈ పాట ద్వారా ఒక అరుదైన సువర్ణావకాశం దొరికింది. సినిమాలో పాత్రల్ని, సన్నివేశాలని దృష్టిలో పెట్టుకునే అవసరం గాని , భాషా భావాలనే పరిమితులు గాని రెండూ దృష్టి లో పెట్టుకోవాల్సిన నియమం లేక పోవడం.. ఇంక చెప్పేదేముంది… ఒక్క మాటలో చెప్పాలంటే గురువు గారు విజ్రంభించారు . సంగీతాన్నిభావంగా పెట్టుకుని, మన చుట్టూ ఉండే ప్రకృతి లోని రంగులు, ఋతువులు, అలలు, మేఘాలు,గాలీ, ఆకాశం వగైరాలన్నింటిలో సంగీత నాదముందనీ అది విననని చెవుల్లో సీసం పోసుకుని కూర్చున్న వాడి హృదయాన్ని తెరిచే ‘తాళం’ గాని, పిలిచే రాగం గాని ఉండదని ఒక అద్భుతమైన ‘POEM’ కి జన్మనిచ్చారు. ఒక పాట రాయడానికైనా, వినడానికైనా పృకృతి ని మించిన ‘inspiration’ లేనే లేదన్న విషయాన్ని అత్యద్భుతంగా వివరించారు. నా దృష్టి లో ఈ ఒక్క పాట చాలు గురువు గారికి జాతీయ పురస్కారాలు కాదు.. అంతర్జాతీయ పురస్కారాలు తెచ్చి పెట్టడానికి.. కాని… !!!

9. మనసే మీటనా
చిత్రం: తోక లేని పిట్ట
సంగీతం: ధర్మవరపు సుబ్రహ్మణ్యం
గానం: కె. ఎస్. చిత్ర

చాలామందికి తెలియదు కీ.శే. శ్రీ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఒక చిత్రానికి సంగీతం సమకూర్చారని.. కాని ఇది నిజం.. ప్రముఖ సినీ రచయిత శ్రీ కోన వెంకట్ గారు 1997 లో నిర్మించిన ‘తోక లేని పిట్ట’ చిత్రానికి ఆయన ట్యూన్ ( ట్యూన్) కి సీతారామ శాస్త్రి గారు ఒక గొప్ప ‘తెలుగు’ పాట రాసారు… పల్లవి ద్వారా గురువు గారు తను రాసే పాటల ద్వారా ఏమి కోరుకుంటారో , ఈ గీతం ద్వారా వ్యక్తపరిచారు… పల్లవి లో ‘మనసేమీటనా.. చెలిమే చాటనా… తొలి చినుకంటి తెలుగింటి పాటతో…’ అని మొదలెట్టి చరణాల్లో ‘తేటి నడకలకి.. సెలయేటి పరుగులకి.. తన పలుకిచ్చి పులకించు పాటతో… జానపదములకి, నెరజాణ జావళి కి తన లయనిచ్చి నడిపించు ఆటతో.. ‘ శ్రోతల మనసు మీట గలనని రాసుకున్నారు.

10. హాయి హాయి వెన్నెలమ్మ
చిత్రం: తారకరాముడు
సంగీతం: కోటి
గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

నాకు చాలా చాలా ఇష్టమైన ఈ పాట నిజంగా గురువు గారు పాటలో చెప్పినట్టు గా ఒక చల్లని లేపనంలా పని చేసి ఎంత బాధలో వున్నవారికైనా ఒక తల్లి లాలిపాటలా జోల పాడి నిద్రపుచ్చుతుంది. పాట పల్లవి లో గురువు గారు ఈ పాట ఉద్దేశం అదే అని సూటిగా చెప్పారు కూడా..

హాయి హాయి వెన్నెలమ్మ హాయి… హాయి హాయి.. హాయి.. హాయి..
తీయతీయనైన పాట పాదనీయి… బాధ పోయీ రానీ హాయి…
చురుకుమనే మంటకు మందును పూయమనీ..
చిటికెలలో కలతను మాయం చేయమనీ..
చలువ కురిపించనీ.. ఇలా.. ఇలా.. ఈ నా పాటనీ…

ఎంత గొప్ప భావం ఇది.. తన పాటతో వైద్యం చేస్తాననడం … నిజం గా గురువు గారికే అది సాధ్యపడింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు… ఇక్కడ మరో విషయం చెప్పాలి, ఆయన రాసిన ఎప్పుడు ఒప్పుకోవద్దురా అనే పాట , మనసు కాస్త కలత పడితే పాట.. కొంతమందిని ఆత్మహత్య చేసుకోకుండా ఆపి వారి జీవితాల్ని తీర్చి దిద్దింది అని విన్నాను. అది నిజమే కావచ్చు కూడా.

11. నా పాట పంచామృతం
చిత్రం: అల్లరి మొగుడు
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

ఈ పాట గురువు గారికి సరస్వతీ పుత్రుడు అనే ముద్ర వెయ్యడానికి పూర్తి గా సరిపోతుంది… పల్లవి లో ‘ నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం’ అన్నారు.. నిజమని ఒప్పుకోక తప్పదు. చరణం లో… ‘శారద స్వరముల సంచారానికి చరణము లందించనా’ .. అని ఒక అద్భుతమైన చరణాన్ని అందించారు.. నాకు తెలిసి సరస్వతి దేవి కి పర్యాయ పదం గా విధిసతి అన్న మాట గురువుగారు తప్ప సినిమా పాటలో ఎవ్వరూ వాడలేదు.

గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా…
పదము వెళ్లి విరిసి రాగా విధిసతి పాదపీఠి కాగా..
శ్రుతిలయలు మంగళ హారతులై… స్వరసరళి స్వాగత గీతికలై..
ప్రతిక్షణం సుమార్చనం.. సరస్వతీ సమర్పణం…
గగనము గెలువగా గమకగతులు సాగ.. పశువుల శిశువుల ఫణుల సిరసులూగ..
నా పాట పంచామృతం… నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం….

12. ఏ శ్వాసలో చేరితే
చిత్రం: నేనున్నాను
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
గానం: కె . ఎస్. చిత్ర

ఈ పాట చిత్ర సన్నివేశం ప్రకారం హీరోయిన్ కోసం రాసినప్పటికీ.. నాకెందుకో గురువు గారు.. వెదురు లాంటి తనకి చిత్రపరిశ్రమ లోని పరిధులు, ఆటంకాలు , ఒడిదుడుకులు లాంటి గాయాలున్నా.. సినిమాలకి పాటలు రాసే సువర్ణావకాశం కల్పించినందుకు ఆయన గీతాల్ని ఆ కృష్ణుడి పద సన్నిధికి అంకితం చేస్తున్నారేమో అనిపిస్తుంది. ‘ తనువును నిలువుగా తొలిచిన గాయములే తన జన్మకీ.. తరగని వరముల సిరులని తలచినదా.. కృష్ణా నిన్ను చేరింది. అష్టాక్షరిగా మారంది ఇలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది …’ అని అన్నా , ‘నువ్వే నడుపు పాదమిది.. నువ్వే మీటు నాదమిది నివాళిగా నా మది నివేదించు నిమిషమిది..’ అన్నా , పాట ముగింపుగా.. “నీ పాదముల వ్రాలు కుసుమాంజలీ.. ఈ గీతాంజలీ..” అన్న లైన్లు విన్నప్పుడల్లా ఎందుకో నాకు అదే భావం గోచరిస్తుంది.

13. జగమంత కుటుంబం
చిత్రం: చక్రం
సంగీతం: చక్రి
గానం : శ్రీ

తన ఇరవై రెండేళ్ళ వయసులోనే.. 1997 వ సంవత్సరంలో… తాను కవిత్వం రాస్తున్నాని కూడా అనుకోకుండా , రవి కాంచనిది కవి కాంచును అని ఎందుకంటారో అనే కాంసెప్ట్ (concept) తో రాసుకున్న తన రచనా వ్యాసంగం లోని ఈ పాట తరువాత ఇరవై అయిదు సంవత్సరాలకి చక్రం సినిమా లో చోటు చేసుకుంది. కృష్ణవంశీ ఆ చిత్రాన్ని కేవలం ఆ పాట కోసం తీసారంటే, ఆ పాట తనని ఎంత ప్రాభావితం చేసిందో మనకర్ధమవుతుంది. నిజానికి ఈ పాట లో, విన్నవారెవరికైనా అది తమకోసమే రాసారేమో అనుకునేంత వేదాంతం నిక్షిప్తమయివుంటుంది. సూర్యుడు సౌర కుటుంబం తన సొంతమైనప్పటికీ ఒంటరిగా ఎల్లప్పుడూ జ్వలిస్తూ ఉంటాడు.. అలాగే కవి ప్రపంచం లో వున్నప్రాణకోటికి ప్రతీకగా నిలబడి ప్రపంచంలో దాగివున్న ప్రతి విషయాన్ని, భావాన్ని తన హృదయంతో నిరంతరం అనుభవిస్తూ తన అంతరంగాన్ని మదిస్తూ ఉంటాడు. ఈ పాట లో రవికి కవికి వున్నపోలికలు, తేడాలు అత్యద్భుతం గా వర్ణిస్తూ.. తను రాసే ప్రతి పాటని తన పాప గా గాలిపల్లకిలో ప్రపంచంలోకి పంపుతూ కొద్దిసేపు బాధ పడ్డప్పటికీ.. సూర్యుడు తన కిరణాలు ఒకదాని వెంట మరొకటి ఎలా ప్రసరిస్తాడో అలాగే కవి గా తన మనో భావాన్ని పాటపాప లా జన్మనిస్తూ ఉంటానని , పాటని అత్తారింటికి పంపడం లో క్షణిక విచారం అమావాస్య నాటి చంద్రకళ లా తాత్కాలికమని తిరిగి సూర్యుడిలా జగమంత కుటుంబం కోసం ఒంటరి ఏకాకి గా తన విధి నిర్వర్తిస్తాననే తాత్విక చింతన అతి చిన్న వయసులోనే అబ్బిన మహా జ్ఞాని గురువు గారు. కృష్ణవంశీ గారన్నట్టు… శాపవశాత్తు మనిషి జన్మనెత్తిన ఋషి ‘ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు’.

14. అహో ఒక మనసుకి
చిత్రం : అల్లరి ప్రియుడు
సంగీతం : ఎం. ఎం. కీరవాణి
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం & కె . ఎస్. చిత్ర

మనసు మీద ‘మనసు కవి’ ఆత్రేయ గారు రాసినన్నిసినిమా పాటలు మరెవరు రాయ లేదంటారు. కాని మనసు ముఖ్యాంశం గా తీసుకుని గురువు గారు కూడా ఎన్నో పాటలు రాసారు. అందులో ఎక్కువ శాతం ఆత్రేయ గారి మనసు పాటలకి ఏ మాత్రం తీసి పోవని నా అభిప్రాయం అల్లరి ప్రియుడు చిత్రానికి రాసిన ఈ పాట ఆయన మనసు మీద మొట్ట మొదట రాసిన అటువంటి ఒక గొప్ప పాట అనుకుంటాను. మనసున్న మంచి మనిషిగా ఆ గొప్ప లక్షణాలన్నీ పాట లో పొందు పరచాలనే తాపత్రయం తో మంచి మనసున్న వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా పాడే పాట సన్నివేశానికి మనసుకి వున్న ఎన్నో గొప్ప లక్షణాలని వర్ణిస్తూ రాసిన ఈ పాట లో మొదటి చరణం లోని మనసుని పలువిధాలుగా నిర్వచించే ఈ వాక్యాలు ఆయన కవి హృదయానికి అద్దం పట్టే రీతి లొ వుంటాయి…

మాటా పలుకు తెలియనిది.. మాటున వుండే మూగమది..
కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది…
రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది …
శ్రుతిలయలెరుగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది
ఋతువుల రంగులు మార్చేది కల్పన కలిగిన మది భావం
బతుకును పాటగ మలిచేది మనసున కదిలిన మృదునాదం…

ఆయన జన్మదినం నాడు ఈ పాటని తప్పనిసరిగా గుర్తు చేసుకోవాల్సిన పాట గా పరిగణించి ఈ ‘Poetic Masterpices List’ లో చేర్చాను.

అంత అద్భుతమైన మనసున్న మనిషి నాకు ఎంతో వాత్సల్యంతో ఆయన గుండెల్లో ఓ తమ్ముడి స్థానం ఇచ్చి అన్నయ్య అని పిలిచుకునే భాగ్యం ప్రసాదించినందుకు ఆయనకీ, ఆ భగవంతుడికీ సర్వదా కృతజ్ఞుణ్ణి.

by Vijay Saradhi Jeedigunta

vijay jeedigunta
About Vijay Jeedigunta: Vijay Saradhi Jeedigunta is a great fan of Cinema and Cricket and follows them as passoinately as any other Indian in spite of living in US for last 18 years. He Lived in Hyderabad,Graduated from Osmania in Electrical Engg and worked for Allwyn and Dr. Reddy’s Labs before moving to USA in 1994. Before going to US he worked on some Doordarshan Documentaries and won the best TV Reviewer award for his Eenadu column called ‘Cinnithera Chidvilasam’. He also had small stints as All India Radio’s Official Statistician for Reliance Cup and some ODIs and Test matches. He was also a frequent contributor to Deccan Chronicle and dreamcricket.com in their weekly sports page. Currently employed with Accenture as Sr. Manager at Atlanta,GA. His earlier contributions to idlebrain.com linking cricket and cinema can be accessed by clicking on the url http://idlebrain.com/cricketandcinema/index.html .

To know more about him you can visit his profile on facebook http://www.facebook.com/vjeedigunta and you can also follow him on twitter account vjeedigunta .

You can send all your inquiries and suggestions to vjeedigunta@gmail.com

th_sirivennelaseetharamasastry-kavithvapaathaalu1 th_sirivennelaseetharamasastry-kavithvapaathaalu2 th_sirivennelaseetharamasastry-kavithvapaathaalu3 th_sirivennelaseetharamasastry-kavithvapaathaalu4 th_sirivennelaseetharamasastry-kavithvapaathaalu5 th_sirivennelaseetharamasastry-kavithvapaathaalu6 th_sirivennelaseetharamasastry-kavithvapaathaalu7 th_sirivennelaseetharamasastry-kavithvapaathaalu8 th_sirivennelaseetharamasastry-kavithvapaathaalu9 th_sirivennelaseetharamasastry-kavithvapaathaalu10 th_sirivennelaseetharamasastry-kavithvapaathaalu11 th_sirivennelaseetharamasastry-kavithvapaathaalu12 th_sirivennelaseetharamasastry-kavithvapaathaalu13 th_sirivennelaseetharamasastry-kavithvapaathaalu14

http://www.idlebrain.com/news/today/sirivennelaseetharamasastry-kavithvapaathaalu.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s