స్థాలీ పులాక న్యాయం
స్థాలీ అనగా వంటపాత్ర పులాకం అనగా వంట, పాత్ర వంట న్యాయమేంటనికదా అనుమానం.. 🙂
పూర్వకాలంలో అన్నం వండుకునేవారు, ఇప్పుడు వండుకోటం లేదా అనకండి, కుక్కర్లో పారేసి మూడు కూతలొచ్చాకా, కూతలు లెక్కెట్టుకుని దించుకోడమే కదా! మరి అన్నం వండుకోడమెలా అయింది 🙂 అన్నం ఉడికిందో లేదో చూడడం కుదరదే! అన్నం వండుకోడం ఇదివరకోసారి చెప్పేను, మళ్ళీ చెబుతున్నా సందర్భం, తప్పదు కనక, చర్విత చర్వణమే ఐనా.
బియ్యం కడిగి వాడేసుకోవాలి అంటే నీళ్ళు పూర్తిగాపోయేలా చేసుకోవాలి. దానికి ’బియ్యం కడుగు బుట్ట’లని వెదురుబుట్టలు ఉండేవి, ఇత్తడి బుట్టలూ వాడేవారు. ఈ బుట్టలో బియ్యం కడిగి వదిలేస్తే బుట్టకి ఉన్న చిల్లులలోంచి నీళ్ళు కారిపోతాయి, దీన్నే ’వాడెయ్యడం’ అంటారు. నిజానైకది ’ఓడయ్యడం’ అనుకుంటా. కొంత సేపొదిలేస్తే బియ్యం ఆరిపోతాయి కూడా. బియ్యం కడిగేటపుడే ’ఎసరు’ అని గిన్నె నిండా నీళ్ళు పొయ్యి మీద పెడతారు,ఇత్తడి గిన్నెతో కాని కుండతోగాని. ఇప్పుడు కుండతో వండుకోటం లేదనుకోండీ! ఈ ఎసరు నీళ్ళు బాగా ’గుద్దుకోవా’లంటారు, అంటే ’కళపెళా’ కాగాలి, అంటే నీళ్ళు బాగా తెర్లేటట్టుగా కాగాలి. అప్పుడు ఈ బియ్యం అందులో పోస్తే అన్నం ఉడుకుతుంది, కొత్త బియ్యపన్నం తొందరగానూ, పాత బియ్యపన్నం ఆలస్యంగానూ ఉడుకుతాయి. ఉడికింది లేనిది తెలియాలంటే అంతా పట్టుకు చూడడం కుదురుతుందా? గిన్నెలోంచి ఒక్క మెతుకు తీసుకుని చేత్తో నొక్కి చూస్తారు. మెత్తగా ఉంటే ఉడికినట్టే. పూర్తిగా ఉడకక దింపేసుకుంటే ’ననువాయి’ ఐందంటారు అంటే సగమే ఉడికిందని అర్ధం. అన్నం ఉడికిందనుకున్న తరవాత దానిని దింపి ’గంజి’వారుస్తారు. గంజి చిక్కబడిపోయి, అనగా సరిగా నీళ్ళు ఎక్కువ పోసుకోకపోతే, గంజి పూర్తిగా వారదు అప్పుడు, గంజివార్చిన గిన్నె పైన నిప్పులు పోస్తారు, ఇప్పుడు పలావు దబరా మీద నిప్పులు పోస్తారు చూడండి, అలాగనమాట. ’అత్తెసరు’ అనేది మరో రకంగా అన్నం వండుకోడం. బియ్యం వండుకునే గిన్నెలోనే తీసుకుని కడిగి నీళ్ళు పారబోసుకున్న తరవాత, ఈ కడిగిన నీళ్ళకీ పేరుందండి, అదే ’కడుగు’ అంటారు. కడుగు మందు సుమా! విష పదార్ధం కడుపులోకి పోతే దానిని కక్కించాలంటే కడుగు తాగిస్తే వాంతి ఐపోతుంది. ఇదో సౌందర్య సాధనం కూడానట, దారి తప్పిపోతున్నా! కడుగు పారబోసిన తరవాత బియ్యం ఉన్న గిన్నెలో నీళ్ళు పోయాలి. అవి ఎన్నుండాలి? బియ్యం మీద చేతి వేళ్ళు నిలబెడితే మధ్య వేలు రెండవ కణుపుదాకా నీళ్ళుండేలా చూసుకుని నిప్పులు సరి చూసి వదిలేస్తే అన్నం ఉడికిపోతుంది, దీన్నే అత్తెసరు అంటాం. ఇప్పుడు కుక్కర్లో వండుకునేది అత్తెసరే. గంజివార్చుకునే ముందు ఒక్క మెతుకుని పట్టుకుని అన్నం మొత్తం ఉడికిందో లేదో ఎలా తెలుసుకుంటున్నామో అలాగే ఒక పుస్తకాన్ని, ఒక మనిషిని అంచనా వేయడానికి కొంత చదవడం, కొద్ది సేపు మాటాడటం సరిపోతాయంటారు, దీనినే స్థాలీ పులాక న్యాయం అంటారు.
పెళ్ళిలో స్థాలీపాకం అని ఒక కార్యక్రమం ఉంటుంది గమనించారా? గుర్తుందా? ఈ స్థాలీ పాకంలో పెళ్ళి కూతురుచేత అన్నం వండిస్తారు. ఎప్పుడూ భార్య భర్తకి ఎడమవైపే ఉంటుంది,ఎందుకూ? ఇప్పుడు కాదు లెండి, మరోసారి చెప్పుకుందాం. ఇదిగో ఈ సమయంలో మాత్రం ఎడమవైపునుంచి లేచి కుడి వైపుకొచ్చి అన్నం అత్తెసరు పెడుతుంది. ఆ అన్నాన్ని పెళ్ళికొడుకు అగ్నికి ఆహుతులిస్తాడు. ఎడమ వైపునుంచి కుడికి రావడం కూడా చిత్రంగానే ఉంటుంది, గమనించారా? పెళ్ళి మొత్తం గంటలో ఐపోతుంటే స్థాలీ పాకమొకటా 🙂