నోట్లో నోరెట్టడం
కిందివాటిలో చాలా మాటలని అందరూ ఉపయోగిస్తుంటారు. ఈ మధ్య కాలంలో కొంతమంది వాడటం లేదేమో కూడా.కొన్ని నిఘంటువులకు ఎక్కనివీ,కొన్ని ఎక్కినవీ,పూర్వకవి ప్రయోగాలున్నవీ కూడా ఉన్నాయి, సాధారణంగా అన్నీ మరో అర్ధాన్ని సూచించేవే.వీటినే అన్యాపదేశాలంటారట.
నోరుచేసుకోవడం, నోరుపారేసుకోవడం అంటే తిట్టడం అని వాడుక
నోట్లో నోరెట్టడం ఈ ప్రయోగం సినిమాల్లో కూడా వచ్చింది అంటే మాటాడటం.
నోరు సంబాళించుకోడం అంటే జాగ్రత్తగా మాటాడటం.
నోరు జారడం అంటే తప్పుగామాట్లాడటం
నోటివట్టం తొందరపాటంటుగా మాట్లాడటం
నోట్లో నాలిక లేకపోవడం అంటే మెతకగా ఉండటం, కరుకైన సమాధానమివ్వకపోవడం.
నోటికి చేతికి ఎంగిలి లేకపోవడం అంటే బాగా దగ్గర చుట్టరికం.
నోటి దురద తీర్చుకోవడం అంటే లేని మాటలు,అపనిందలు వేయడం.
నోరూవాయీ లేకపోవడం, నోరు అంటే నోరే 🙂 వాయి అంటే కూడా నోరనే అర్ధం. వాయి అనే శబ్దం అరవం నుంచి వచ్చినది, వాయి ముడు అంటే నోరు ముయ్యి అని అర్ధం, చిన్నప్పుడు మా పక్కింటి అరవక్క నేర్పిన ఒక్కటే మాట అరవంలో 🙂
నోటితో లేదనేది చేత్తో లేదనడం, అర్ధి వచ్చి అడిగితే లేదని నోటితో చెప్పేబదులు కొద్దిగా ఇచ్చి కాదనడం.
నోరాడించడం అంటే తినడం.
నోట్లో వేసుకోవడం అంటే సాధించడం.
నోరుకట్టుకోవడం, డబ్బు ఖర్చుకు వెరచి తినడం మానేయడం.
కాలెత్తడం,కొంగుపరచడం……వ్యభిచారం
గుండెల్లో పెట్టుకోవడం, గుండె మెలకువలోనూ,నిద్రలోనూ కొట్టుకుంటూనే ఉంటుంది, మన ప్రమేయం లేక, అలాగే నా ప్రమేయం లేకనే గుర్తుండేలా చేసుకుంటాననడం.
బుర్రరామకీర్తన పాడించడం అంటే కొట్టి ఏడిపించడం.
బుర్రలో గుంజు లేకపోవడం అంటే తెలివి తక్కువ అని.
నాలిక మడతేయడం అంటే ఒక మాట మాటాడి వెంటనే వ్యతిరేకంగా మాటాడటం.
పళ్ళుకొరకడం అంటే కోపగించడం.
చెయి చేసుకోవడం అంటే కొట్టడం.
చెయివాటుతనం అంటే దొంగతనం.
పేరాడించడం అంటే ఇతరుల గురించి చెడు ప్రచారం చేయడం.
పదచలనం,కాలు కదపడం అంటే ప్రయాణం చేయడం.
కాలూ చెయ్యీ కూడదీసుకోవడం అంటే ఉన్న కష్ట పరిస్థితి నుంచి తేరుకోవడం.
చీరచిక్కడం అంటే గర్భిణీ కావడం. నెలతకు చీరచిక్కె అని పోతనామాత్యుని ప్రయోగం. నెల తప్పడం అని కూడా అంటారు.
లాకేత్వం ద కి కొమ్ము అంటే ’లేదు’ లేదు అని చెప్పడానికి ఒప్పుకోరు అందుకుగాను లాకేత్వం అని ఊరుకుంటారు. మరీ ఇబ్బంది పెడితే లాకేత్వం దకి కొమ్ము అంటారు.
నిండుకోవడం, కావలసినదేదో ఐపోవడం, లేదనక నిండుకుందంటారు. పుస్తెలతాడును తెగిందనరు, పెరిగిపోయిందంటారు.
కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం అంటే స్వార్ధంతో వ్యవహరించే వారని అర్ధం.
కన్నునిండడం అంటే సంతృప్తి చెందడం.
చేతికి నోటికి సరిపోవడం అంటే సంపాదించుకుంటున్నది తినడానికి సరిపోతోందనీ, నిలవకి సావకాశం లేదనీ అర్ధం