శర్మ కాలక్షేపంకబుర్లు-ఒకటో తారీకు జీతం-ఆ తుత్తే వేరు :)

ఒకటో తారీకు జీతం-ఆ తుత్తే వేరు 🙂

ఒకప్పుడు ఒకటో తారీకు, జీతాలరోజంటే పెద్ద హడావుడి. లైన్లో నుంచుని రూపాయి బిళ్ళ చేతిలో పట్టుకుని వెళ్ళి సంతకంపెట్టి జీతం తీసుకోడం నుంచి, జీతాలిచ్చేదాకా ఎదిగాను 🙂 ఒకప్పుడు మాకు జీతం మనీ ఆర్డరొచ్చేది. పోస్ట్ మన్ ఎక్కడుంటే అక్కడకొచ్చి ఇచ్చిపోయేవాడు. ”నీకోసం ఎంత తిరిగేనయ్యా! ఎక్కడా దొరకవే జీతం తీసుకోవా?” అనేవాడు మా పోస్ట్ మన్ బ్రహ్మానందం. ఆ తరవాత కాలంలో సూపర్వైజరీ కేడర్ లోకొచ్చినా జీతం మనీ ఆర్డరే వచ్చేది, పల్లెలలోనే బతికేను కదా!. ఆ కాలంలో పెద్ద ఊళ్ళలో ఆఫీసర్లున్న చోట జీతాలివ్వడం, చిన్న ఊళ్ళవాళ్ళకి మనీ ఆర్డర్లు పంపడం చేసేవారు. ఇలా కాకినాడలో పని జేసేటప్పుడో సంగతి జరిగింది, రామారావుగారని ఒక క్లార్క్, జీతాలిస్తూ నాకు ఒక వంద ఎక్కువిచ్చేసేరు, బయటికొచ్చి లెక్కెట్టుకుంటే వంద ఎక్కువొచ్చింది, మళ్ళీ వెళ్ళి ఆయనకి ఆవందా ఇచ్చేసి వచ్చా! అప్పుడన్నారాయన కిందటి నెలా ఇలాగే జరిగిందండి, ఎవరికో పొరపాటుగా ఎక్కువిచ్చేసేను, అతను మళ్ళీ తిరిగివ్వలేదన్నారు, బాధపడ్డా. ఆ రోజుల్లో వందంటే ఎక్కువే!

ఆ తరవాత పే డిస్బర్సింగ్ ఆఫీసర్ గా ఎదిగిన క్రమంలో అక్విటెన్స్ రోల్ ఒక చెక్కూ వచ్చేవి, పంపేవారు పై ఆఫీస్ నుంచి, అదే జిల్లా కేంద్రం నుంచి, లేదూ మనిషిని పంపి వీటిని ముందురోజుకే తెప్పించుకునేవాళ్ళం. ఒకటో తారీకున ఆఫీస్ కేషియరు మరో గుమాస్తా స్టేట్ బేంక్ కి వెళ్ళి కేష్ డ్రా చేసుకొచ్చేవారు, వీరికి ఇద్దరు పోలీస్ లు ఎస్కార్ట్. ఎస్కార్ట్ కి ఉత్తరం రాయడం, ఇవన్నీ రొటీన్ గా జరిగిపోయేవి. నెల కష్టం జేబులో నోట్ల రూపంలో వెచ్చగా ఉంటే, అదో తుత్తి. ఇంటికెళ్ళి జీవితాన్ని, అదేనండి ఇల్లాలిని పిలిచి జీతం చేతికిస్తే, ”ఏం రెండొందలు తగ్గేయి”, లేదా ”జీతంతో పాటు టి.ఎ బిల్లొచ్చిందా? జీతం ఎక్కువొచ్చింది” అనే ఆడిట్టూ ఉండేది 🙂 ”పండగొస్తోంది పిల్లలకి బట్టలు” ఇండెంటూ ఉండేది కూడా! అలాగే అనడమూ మామూలే! నేను పని చేసినంతకాలం జీతం డబ్బు రూపేణా తీసుకున్నదే! ఆ తరవాత కాలంలో ఆకౌంట్ లో జమచేయడం మొదలైంది. జీతం ఎంతొస్తుందో, ఎంత రావాలో బేసిక్ పే ఎంతో తెలియనివారున్నారంటే నేడు 🙂 నాటి రోజుల్లో ”ఏరా! నాకు ఇంక్రిమెంట్ కలిపేడు, నీకు కలిపేడా?” ”జీతం తక్కువొచ్చిందేరా?” ఇలా ప్రశ్నలూ ఉండేవి, సందేహాలకు సమాధానాలూ చెప్పాల్సి వచ్చేది నాయకులుగా ఉన్నపుడు. చిత్రం ఇప్పటికీ నా మిత్రులు కొంతమంది గ్రూప్ ఒన్ ఆఫీసర్లు గా రిటయిర్ ఐనవాళ్ళు కూడా నాకు పెన్షన్ సరిగా వస్తోందా అని అడిగేవాళ్ళున్నారంటే 🙂

పండగలకి బోనస్ లిచ్చేటపుడు పట్టణాలలో వాళ్ళకిచ్చేస్తే పల్లెటూరులో ఉన్నవాళ్ళం మని ఆర్డర్ కోసం ఎదురు చూడాల్సి వచ్చేది, అలా కాకుండా చేయడానికి అక్విటెన్స్ రోల్, సొమ్ము తీసుకుని వేన్ లో బయలుదేరి పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళకి కూడా పండగ ముందుగా సొమ్ములందజేసిన సంఘటనలెన్నో! వేన్ లో జే.యి గారు వస్తున్నారట పేమెంట్ ఇవ్వడానికని, అర్ధ రాత్రి కూడా కనిపెట్టుకుని కూచునేవారు, ఓపికగా! అత్యవసర పరిస్థితులలో ఇలా వేన్ లో బయలుదేరి సిబ్బందికి జీతాలు,బోనస్ లు వగైరాలు చెల్లించిన సంఘటనలెన్నో! నిజంగా నేడు బేంకుల్లో వేస్తే యాంత్రికమైపోయిందేమో అనిపిస్తుంది. అలా అందరికి ఇచ్చుకుంటూ వచ్చి చివరగా తీసుకోడం ఎంత ఆనందాన్నిచేదో చెప్పలేను.

ఇలా జీతాలిచ్చే రోజు గేట్ బయట కాబూల్ బాకీవాళ్ళు నిలబడి ఉండి డబ్బు చేతిలోంచే గుంజుకునేవారు, చాలామంది దగ్గరనుంచి. ఒక్కడూ నోరెత్తేవాడు కాదు. ఇలా జరుగుతున్న సంఘటనలు చూసి ఒక పది మంది కుర్రాళ్ళం ఓ ఆలోచన చేశాం. మన దగ్గర ఎంతో కొంత సొమ్ముంది కనక దాన్ని ఒక చోట చేర్చి ఈ అప్పుల బారినుంచి కొంతమందినైనా విడుదల చేదామనుకున్నాం. పథకమూ రచించాం. ఒక పెద్దాయన, మా తోటివాళ్ళలో పెద్దవాడు, ఇదంతా చూస్తూ ఊరుకున్నాడు, ఇలా మాటాడుకుంటుండగా ఒక మాటన్నాడు, ”ఏరా తిన్నగా ఉండాలనుకోటం లేదా? ఈ పని చేసి మీమెడకి మీరే ఉచ్చు వేసుకుంటారు. ఈ కాబూల్ అప్పులు తీసుకునేవారు, మీ దగ్గర తీసుకున్నా, తక్కువ వడ్డీ కనక తిరిగి ఇవ్వరు, మీరు నష్టపోతారు, అదేగాక కాబూల్ బాకీ లిచ్చేవాళ్ళు మీమీద ఫిర్యాదులూ ఇస్తారు, ఈ ఆలోచన మానెయ్యండి” అంటే వెనక్కి తగ్గాం.

ఆ తరవాత కాలంలో నెలాఖరు రోజు జీతాలివ్వడం మొదలెట్టేరు, నెల ఒకటో తారీకు చిత్రాలెన్ని ఉండేవో 🙂

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s