శర్మ కాలక్షేపంకబుర్లు-……..అనంతకోటి ఉపాయాలు.

……..అనంతకోటి ఉపాయాలు.

’శతకోటి దరిద్రాలకి, అనంతకోటి ఉపాయాలని’ ఒక నానుడి. ఇప్పుడు నల్లధనవంతులు పడుతున్న,పెడుతున్న యాతనలు చూసి ఒకప్పుడు, అంటే అరవై ఏళ్ళకితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది…

పదిహేనో ఏట కోర్టుకి వెళ్ళాల్సివచ్చింది, దాయాదులతో ఆస్థి విషయంలో….అమ్మ ప్రతివాయిదాకి వెళ్ళలేకపోయేది, నేను అద్దెసైకిల్ మీద పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేసి కోర్ట్ కి వెళ్ళేవాణ్ణి. అదేమోగాని నా కేస్ ముందు ప్రతిసారి ఒక విడాకుల కేస్ వచ్చేది. భార్య,భర్త ఇద్దరూ విడాకులకి పెట్టుకున్నారు, సెక్షన్ 13A, కన్సెంట్ పిటిషన్ ( ఇప్పుడు కాదు దీని గురించి, మరోసారి). ఇద్దరూ కలిసి ఒక రిక్షాలో వచ్చి కోర్ట్ దగ్గర దిగేవారు కేస్ పిలవగానే మొదటగా ఆమె బోనెక్కేది,ఆవెనకనే ఆయన నిలబడేవాడు, ఆమె బోనెక్కడానికి సాయపడేవాడు కూడా. జడ్జీగారు ’విడాకులు కావాలా? రాజీపడతారా?’ అడిగేవాడు, ’విడాకులే కావా’లనేది ఆవిడ. ఆవెనక ఆయన బోనెక్కి అవే మాటలూ చెప్పేవాడు. జడ్జీగారు వాయిదా వేసేవారు. నాటిరోజుల్లో ఫేమిలీ కోర్టులు వగైరాలు లేవు, దానికితోడు కొంత విచారణ బహిరంగంగానే జరిగేది కూడా…
వాళ్ళు ఇద్దరూ చెయ్యీ చెయ్యీ పట్టుకుని ఒకటే రిక్షా ఎక్కి వెళిపోయేవారు. నాకైతే ఆశ్చర్యంగానే ఉండేది. తరవాత కేస్ నాదే… లాయర్లిద్దరూ కూడబలుక్కున్నట్టు ’నాట్ రెడీ’ అనేసేవారు… వాయిదా పడిపోయేది…మళ్ళీ వాయిదా తారీకు చెప్పేవారు, నాకు లాయరు, గుర్తు పెట్టుకుని వచ్చేసేవాణ్ణి. సరిగా నాకేస్ కూడా విడాకుల కేస్ రోజుకే వాయిదా పడేది, నేనూ ఆరోజుకే వాయిదా పడాలని దేవుణ్ణి కోరుకునేవాణ్ణి….. 🙂 నాది గుడ్స్ బండి కేస్, ఎన్నేళ్ళేనా పట్టచ్చు, కాని వాళ్ళది ఎక్సుప్రెస్ కేస్ సంవత్సరం తరవాత వాళ్ళకి తీర్పివ్వాలి, తొందరలో. ఒక వాయిదాలో, ఒక చిత్రం జరిగింది, ఆవిడ బోనెక్కింది, ప్రశ్నలేసేలోగా కడుపులో పోట్లొస్తే కూలబడిపోయింది, బోనులోనే. కారణం విచారించారు, పైకే తెలుస్తున్న విషయమే ఆవిడ కడుపుతో ఉంది. ఎవరో చెప్పేరు ’ఆమె కడుపుతో ఉంది, ఆరోనెల, నొప్పులొచ్చా’యని. వాయిదా వేసేరు, ఆవిణ్ణి హాస్పిటల్ కి తీసుకెళ్ళేడు, భర్త. నా కేసూ ఆరోజుకే వాయిదా వేసేరు. నిజంగా ఆ రోజుకి వాయిదా వేసినందుకు సంతోషీంచినవాణ్ణి నేనే 🙂

ఆ రోజు ఇద్దర్నీ బోనులోకి పిలిచారు, ’మీరు సంసారం చేస్తున్నారు, విడాకులేంటీ?’ అని. దానికి వారిద్దరూ ఒకే మాటగా ’విడాకులే కావాలని’ చెప్పేరు. ’సంవత్సరం అయిపోవస్తున్నది గనక, ఆమెకు బిడ్డపుట్టిన తరవాత జడ్జిమెంటిస్తా, ఈలోగా మనోవృతి, అలిమనీ సంగతి తేల్చండి’ అన్నారు లాయర్ తో. దానికి ఆమె మాటాడుతూ ’ఆయన ఆస్థిలో సగం మనోవృతి,అలిమనీగా ఇప్పించమని’ కోరింది, దానికి అతనూ, లాయరూ కూడా ఒప్పుకున్నారు. ఇద్దరికీ ఒకే లాయరు గనక మరో లాయర్ ప్రమేయమూ లేకపోయింది. ’అలాగైతే కేస్ చాలా తేలిగ్గానే తేలిపోయింది గనక, తగిన ఏర్పాట్లు జడ్జిమెంట్ రోజునాటికి తయారు చేయమని’ లాయర్ గారికి చెప్పి వాయిదా వేసేరు, తరవాత నాకేసొచ్చింది.

ఇదేంటో తెలియక నేను జుట్టు పీక్కున్నా! నాలాగే కోర్ట్ కి వచ్చిన, ఆ నాటికి, నేటి నా వయసున్న ఒకాయన్ను పట్టుకుని అడిగితే ’కుర్రాడివి, ఐనా తెలుసుకోవలసిందే అంటూ ఇలా చెప్పేరు. ”ప్రభుత్వం భూపరిమితి చట్టం తేబోతోంది, ఇది బహిరంగ రహస్యం. ఎలా కాదనుకున్నా అతను ఆ చట్టం పరిధిలోకొచ్చి భూమిపోగొట్టుకుంటాడు. దానికి గాను విడాకులు తీసుకుని ఆస్థి చెరి సగం పంచుకుంటున్నారు. నిజానికి వీళ్ళు విడిపోరు, పిల్లలనీ కంటూనే ఉంటారు, సంసారం చేస్తూ, ఇదీ లాయర్ గారి సలహానే. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలూ” అంటూ ముగించాడు.

ఏమైనా మనవాళ్ళు మేధావులండీ!

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s