శర్మ కాలక్షేపంకబుర్లు-పీత్వా!

పీత్వా!

తాగు అనేమాటని నీచార్ధంలోనే వాడాలని అన్నారు, నా అభిమాన రచయిత. తాగు అనేదాన్ని కల్లు,సారాలాటివాటిని తీసుకోడానికి మంచినీళ్ళనుంచి మిగిలినవి ఐతే పుచ్చుకోడం,తీసుకోడం అనాలనీ అన్నారు. నేటికాలంలో వీటి భేదం కనపట్టంలేదు, అన్నీ తాగేవే 🙂

దేవతలు సోమరసాన్ని ఇష్టంగా తాగుతారట, అది మత్తు కలజేస్తుందా? బలం కలగజేస్తుందో తెలీదు..
మానవులకీ సోమరసం తాగాలనే కోరిక ఎక్కువనుకుంటా, మత్తులో ములిగిపోవాలనే అనుకుంటారనుకుంటా. ఈ మత్తు కలగజేసేవి తీసుకోవాలన్నదే ఒక మత్తేమో! ఇదొక సాంక్రమిక రోగం.ఈ రోగం ఉన్నవాడు మరొకరికి దీన్ని అంటించి ఆనందపడుతుంటాడు, తను రోగం నుంచి బయటపాడాలనుకోడు 🙂 ప్రకృతిలో మత్తు కలగజేసే పానీయాలు కొన్ని ఉన్నాయి. అవి చెట్లనుంచి తీసుకుని తాగేవి, మోతాదుగా తాగితే ఆరోగ్యం కలగజేసేవీ. తాటికల్లు,ఇప్పకల్లు, ఈతకల్లు,జీలుగు కల్లు నాకు తెలిసిన కొన్ని. ఇవి సంవత్సరం పొడుగునా దొరకవు, ఒక ఋతువులోనే దొరుకుతాయి, వీటిని ఆకాలంలో తీసుకుంటే పరిమితంగా, ఆకాలంలో వచ్చే వ్యాధులనుంచి తప్పించుకోవచ్చు. ఈతకల్లు తాగితే కుష్టురోగం నివారణ అవుతుందంటారు, తాటికల్లు వడదెబ్బ నుంచి రక్షిస్తుంది, తాటికల్లు నుంచి తయారు చేసేబెల్లాన్నే పాతబెల్లం అంటారు, ఇది పురటాలు సహా అందరికి మందుల్లో వాడేది. తాటికల్లు ఆకలి విపరీతంగా కలగజేస్తుంది. ఈ మత్తు పానీయాలు అవసరాన్ని బట్టి తీసుకుంటే ఆనందమే! మరో సంగతి తేనెను అధికంగా తీసుకుంటే మత్తు కలగజేస్తుంది. నేడు కల్లులన్నిటినీ కల్తీ చేసేస్తున్నారు, దానితో వీటిని తాగి జనం ఛస్తున్నారు (డైజీ ఫాం లాటివాటిని కలిపేస్తున్నారు). దీని తరవాతది సారా! సారాని నల్లబెల్లపు ఊట, మరిన్ని సరుకులు,బేట్రీ అంటారు, ఇది పళ్ళు ముగ్గబెట్టడానికి వాడే మందనుకుంటా, ఇది కలిపి డిస్టిలేషన్ చేసి తయారు చేసి అమ్మేస్తున్నారు. వీటిని తాగి అల్పాదాయపు ప్రజలు రోగాలబారిన పడి హాస్పిటళ్ళ చుట్టూ తిరిగి ప్రాణాలొదిలేస్తున్నారు. వీటిని తయారు చేస్తున్నవారు మాత్రం అధికాదాయ, అధికార వర్గాలే, ఈ వర్గాలు చాలా బలమైనవి. వారే ప్రభుత్వం,ప్రభుతేవారు.

ఇక అధికాదాయ వర్గాలవారు తాగుతారు, వారు తాగేది తక్కువ,వాగేది ఎక్కువా!వీరు తాగడానికి ఒక అవసరం ఉంటుంది,రోజూ ఉంటుంది. ఐతే వీరిలో గ్లాసుపుచ్చుకుని గుటకెయ్యనివారు, గ్లాసులకి గ్లాసులు గుటకేసేవారూ ఉంటారు. రెండోవారు చాలా తొందరగా ఈ పరిధినుండి తొలగిపోతారు, ఎందుకో నేను చెప్పక్కరలేదనుకుంటా 🙂 ఇదంతా వ్యాపారం.

ఇక మధ్య తరగతివారు, ఇదివరలో అప్పుడప్పుడు కొద్దిగా రుచి చూసి ఉన్నవారే 🙂 నేనూ వయసులో ఉన్నపుడు రుచి చూసినవాణ్ణే, అబద్ధం చెప్పుకోడమెందుకూ? ఐతే దీనిని గుర్తెరిగి తొందరగా బయట పడినవారు తక్కువ,నాకు ఇరవైయేళ్ళు పట్టింది 😦 దీనికే అతుక్కుపోయినవారే ఎక్కువ.

మందుకి స్త్రీ పురుష వివక్ష కొద్దిగా ఉండేది. అధికాల్పాదాయ వర్గాలలో స్త్రీలు కూడా దీనికి బానిసలైపోయినవారే ఉన్నారు. సాధారణంగా మధ్య తరగతి స్త్రీలు ఈ మత్తు పానీయాలకి దూరంగానే ఉన్నారు. నేటి కాలానికి మధ్య తరగతి స్త్రీలు కూడా దీనికి అలవాటుపడిపోతున్నారు.

ఇది సాంక్రమిక రోగమనుకున్నాం కదా! ”ఒక సారికి ఒక్క సిప్పుకి ఏం ఐపోదులే రా! తాగు” అని తాగించడమే జరుగుతుంది, మొదటి సారి. ఆ తరవాత ఎవరి అవసరం లేకనే పుచ్చుకునే రోజులెన్నో! తాగడానికి మరో ముద్దుపేరు సోషల్ డ్రింక్, నేటి మధ్య తరగతి స్త్రీల మధ్య సంభాషణలిలా ఉంటున్నాయి. ”ఏంటీ? సోషల్ డ్రింక్ కూడా చెయ్యరూ? బలే చిత్రమండీ! మిమ్మల్నే చూశా సుమండీ!! పదో శతాబ్దంలో ఉన్నారా? పాతరాతి యుగంలో ఉన్నారా? స్త్రీ సమానత్వం రోజులు కదండీ!” అని ఎగతాళీ చేసే స్త్రీలే ఉన్నారు,నేడు. సాధారణ మానవులు ఈ ఎగతాళీని తట్టుకోడం కష్టం,”చలేసి ఛస్తుంటే! కొంచెంతాగండి, మీ పాతివ్రత్యమేం పోదు” అని ఎగసన తోసేవారే ఉన్నారంటే అబద్ధం కాదు. నన్ను తిట్టుకోనివారుండరని నా ఊహ,ఈ విషయంలో.

”మీరెలాగారారుగా! మా పిల్లల్ని చూస్తూ ఉండండి మేం క్లబ్బు కెళుతున్నా”మన్న నారీమణులూ కనపడుతున్నారు. ఏ అర్ధరాత్రి దాటిన తరవాతో ఇంటికొచ్చిన వీరికి పిల్లలెక్కడున్నారో కూడా గుర్తుండటం లేదు. ఇదివరలో మధ్య తరగతి మగాడు తాగి చెడిపోతుంటే భార్య గోల చేసి ఆ అలవాటునుంచి తప్పించేది, ఇప్పుడో నీతోపాటు నేనూ తాగుతా అని బయలుదేరితే ఆ కొంప కొల్లేరే! ఇదే సమానత్వం అనుకుంటున్నవారూ ఉన్నారు. ఇలాటి కుటుంబాలలో పిల్లలు చిన్నపుడే అనాథలుగా బతుకుతున్నారు, చెడు అలవాట్లకూ బలైపోతున్నారు. తాగడం అనేది ప్రారంభమైతే దానితోపాటుగా వచ్చే అలవాట్లూ, అవసరాలూ చాలా ఉన్నాయి. వీటికోసం సొమ్ము విచ్చలవిడిగా ఖర్చు చేయడం, అప్పులపాలవడం, వీధినపడటం, సొమ్ముకోసం తప్పుడు పనులకు పాల్పడటం జరుగుతూనే ఉంది.

పాపం పెద్దవారెవరో ”కల్లుమానండోయ్ బాబూ కళ్ళు తెరవండోయ్” అన్నారట. నేటి ప్రభుత్వాలు ”కల్లుతాగండోయ్ బాబూ కళ్ళుమూయండోయ్” అంటున్నాయి. ప్రభుత్వాలే పోటీ పెట్టి తాగిస్తున్నాయి. పోటీలో పాల్గొందామా? రండి! చుక్కేస్తే మంచి కిక్కు

ఇక కొన్ని పదార్ధాలు ఆరోగ్యానికి వాడేవి మందుగా మత్తుచేస్తాయి,నొప్పి తెలియనివ్వక, వీటిలో కోడిన్ ఒకటి. దీన్ని దగ్గుమందులో కలుపుతారు,దీన్ని కూడా తాగేస్తున్నారు. నల్లమందు,గంజాయి, వీటి ఉత్పత్తులు హెరాయిన్ వగైరా నోటితో పీల్చేవి,ముక్కుతో పీల్చేవి, రక్తంలోకి ఎక్కించుకునేవి,రకరకాలు. యువత స్త్రీ పురుషులు వీటికి దారుణంగా బలైపోతున్నారు. వీరు వీటినితీసుకోడానికి చేసుకునే ఏర్పాటును జాయింట్ అంటారు ముద్దుగా! ప్రభుత్వం మనిషికో పోలీస్ ను నియమించలేదు, వ్యక్తి నిర్మాణం ఉంటే ఇటువంటివాటికి దూరంగా ఉంటారు, గత అరవై ఏళ్ళుగా ప్రభుత్వం వ్యక్తి నిర్మాణానికి పూనుకోనే లేదు. పాతరోజుల్లో బడి తరగతి గదుల్లో అబద్ధము ఆడరాదు,దొంగతనము చేయరాదు,ఆరోగ్యమే మహాభాగ్యము,ఎంత చెట్టుకు అంతగాలి ఇలా రాసి ఉండేవి. చిన్నపిల్లలుగా ఉన్నపుడు వాటిని చదివి అసంకల్పితంగానే వాటితో ప్రభావితమైనవారు తప్పులు తక్కువ చేసేరు. నేడు తరగతి గదుల్లో వీటి ఊసే లేదు…..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s