శర్మ కాలక్షేపంకబుర్లు-జీవిత సమరం తొలిరోజులు

జీవిత సమరం తొలిరోజులు

ఈ మధ్య ఏ టపా మొదలెట్టినా డబ్బు దగ్గరకే లాక్కుపోతూ ఉంది 🙂 జీవిత సమరం తొట్టతొలి రోజులు గుర్తొచ్చాయి. సాధారణంగా బ్లాగ్ రాసేవారు జీవితానుభవాలు ముందురాసి ఆ తరవాత మిగిలినవి రాస్తారు, కాని నా విషయంలో ఇది తారుమారయింది…ఆ కథాక్రమంబెట్టిదంటేని….

పదిహేడవ సంవత్సరం పూర్తికాకనే పల్లెలో ఉన్న హైస్కూల్ విద్య పూర్తీ అయింది, కన్నమ్మ మీ ఇంటికెపుడెళతావనీ అడిగేసింది. నాపని పెళ్ళైన ఆడపిల్ల మొదటిసారి అత్తారింటికెళ్ళుతున్నట్టే అనిపించింది. పెంచుకున్నమ్మ దగ్గరకొచ్చా! ఇక్కడ పరిస్థితీ ఏం బాగోలేదు. పైచదువులకి ఎంతలేదన్నా సంవత్సరానికి మూడు వేలవుతాయి, దగ్గర కాలేజీ, రాజమంద్రి. ఆస్థిమీదొచ్చే రాబడి ఇద్దరికి సంవత్సరానికి గటాగటిగా సరిపోతుంది, ఏం చేయాలి? ఇది సమాధానం లేని ప్రశ్న….పై చదువుకు ప్రయత్నం సున్నా చుట్టేశా, ఎందుకంటే అప్పటికే ఆస్థి తగాదాలకి కోర్టుకు పోవలసివస్తే మూడువేలదాకా అప్పు ఉండిపోయింది, కోర్ట్ తగదా తీరి ఆస్థి చేతికొచ్చింది, అదేపదివేలనిపించింది. అమ్మని ఇంకా కష్టపెట్టడం ఇష్టం లేదు, చదువుకోడానికా రోజుల్లో మరికొన్ని తెలిసిన మార్గాలూ లేవు. ఇంకా అప్పు చేసి చదివితే…ఏమో,ఉద్యోగమేమైనా వస్తుందో, అప్పు మిగులుతుందో తెలీదు. అందుకు సంపాదనా మార్గాలకి అన్వేషణ చేయాల్సివచ్చింది. చూద్దామంటే ఊరంతా రైతన్నలు,నేతన్నలే. ఎవరూ నాకు పని చెప్పగలవారే కనపడలేదు. వ్యసాయపనులకైతే వెళ్ళడానికి నామోషీ లేకపోయినా, వస్తానన్నా, పిలిచినవారు లేకపోయారు. ఇక నేతన్నలకి ఇంటిల్లపాదీ కష్టపడినా రోజు గడవడమే కష్టమయ్యేది.

సంపాదన లేదుగాని, మొదటగా చేసినది ఖర్చు, ఇంగ్లీష్ పేపర్ తెప్పించడం, ఇండియన్ ఎక్సుప్రెస్ ఆరోజులలో నెల చందా ఆరు రూపాయలుగా గుర్తు. ఇదెందుకంటే ఉద్యోగావకాశాలకి చూసుకోడానికి, ఇంగ్లీష్ భాషాభివృద్ధికి. ఈ ఆరు రూపాయలైనా సంపాదించుకోవాలని పట్టుదల, ఊళ్ళో ఇంగ్లీష్ పేపర్ నాకొక్కడికే వచ్చేది, ఈ పేపర్ లో చివరి పేజిలో ఒక కార్టూన్ సీరియల్ వచ్చేది, ఈ బొమ్మలు చూడ్డానికి కొంతమంది పెద్దవాళ్ళు నన్ను పేపర్ అడిగేవారు, వాళ్ళూ ఇంగ్లీష్ చదవగలరునుకునేవాణ్ణి, కొత్తలో 🙂 అదెందుకంత పరిశీలనగా చూసేవారో వాళ్ళు, నాకు తరవాతగాని తెలియలేదు.

ఇలా పేపర్ కోసం వచ్చేవాళ్ళలో దొంతంసెట్టి నాగేశ్వరరావనే అతను, నాకంటే పదేళ్ళు పెద్దవాడు, మంచి నేతన్న, స్నేహితుడయాడు. మాటలలో నా పరిస్థితి తెలిసినవాడూ, నేను అతని దగ్గర కెళ్ళి మగ్గం మీద నేయడం నుంచి నేత పనులన్నీ చూసేవాణ్ణి. అతనితో మగ్గందగ్గర కూచుంటే నేతనేస్తూ పద్యాలు,పాటలు పాడుతుండేవాడు, రాగవరుసన. అతను 120 నంబరు చీరలు నేసేవాడు, చాలా సన్నిని తేలికైన నేత, కాని కష్టం. మగ్గం నేయడం నేర్చుకోవాలన్నదానికో కారణమూ ఉంది. ఒక పడుగు నేస్తే అంటే నాలుగు చీరలు నేస్తే 24 రూపాయలిస్తారు, కాని నలుగురు రెండు రోజులు నేయాలి, రెండు రోజుల ముందు పని తరవాత. అంటే నలుగురు మనుషులు నాలుగురోజులపనికి 24 రూపాయలనమాట, దీన్ని మజూరీ అనేవారు. నేత నేర్పమని నా స్నేహితుణ్ణి చాలా సార్లు ఇబ్బంది పెట్టాను. నా స్నేహితుడు మాత్రం నన్ను నేత నేర్చుకోనివ్వలేదు, మగ్గం గోతిలో దిగనివ్వలేదు, ”వద్దయ్యా! ఇదొక ఊబి, ఇందులో కనపడినదంతా బంగారంకాదు, మరో మార్గం చూసుకో” అని ఖచ్చితంగా చెప్పేశాడు కాని నాకు నేత నేర్పలేదు. ఇప్పటికి నేతకి సంబంధించిన కొన్ని వస్తువుల పేర్లు గుర్తుండిపోయాయి. చిలప, కండి, ఆసు, పడుగు,పేక,పన్ని,ఇలా. సంపాదించాలనే, నా తపన చూసిన స్నేహితుడు, ”ఒక చోట పని ఇప్పిస్తాను,సాయంత్రం ఐదు నుంచి రాత్రి పన్నెండున్నర దాకా, రోజుకు రెండు రూపాయల జీతం ఏమంటావ”న్నాడు, అలాగే అంటే, ఆ రోజే సాయంత్రం నన్ను బ్రేకట్ కంపెనీ దగ్గరకి తీసుకెళ్ళాడు. కంపెనీ యజమానికి చెప్పి నన్ను పనిలో పెట్టుకునేలా చేశాడు, ఉద్యోగం బ్రేకట్ కంపెనీ బుకర్. ఏం చేయాలో చెప్పి యజమాని డెస్క్ ముందు కూచోబెట్టేడు, నన్ను. నాగేశ్వరరావు తనే డబల్ జీరో బ్రేకట్ చెప్పి స్లిప్ రాయించుకుని రూపాయి నా చేతిలో పెట్టి వెళ్ళాడు, అలా నా మొదటి ఉద్యోగం ప్రారంభమయింది. ఈ నాగేశ్వరరావుని తలుచుకుంటే నేటికీ నాకు చేదు తిన్నట్టే ఐపోతుంది, మనసు. మంచిపాటగాడు,అందగాడు, మంచి నటుడు. చాలా కారణాల వల్ల హీరోగా తప్పిపోయి, మగ్గం గోతిలో మిగిలిపోయాడు, ఏమైతేనేం మనకి తెనుగు సినిమాలలో, మా నాగేశ్వరరావు బదులు, మరో నాగేశ్వరరావే హీరో అయ్యాడు.

1950 ప్రాంతంలో మన తెనుగుగడ్డను కురుపులా సలిపి, కూలీనాలీ చేసుకునే ప్రజలను దారుణంగా దోచుకున్న ఆట బ్రాకెట్ అనే మట్కా అనే న్యూయార్క్ కాటన్ మార్కెట్…….

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s