శర్మ కాలక్షేపంకబుర్లు-జీవిత సమరం తొలిరోజులు-ఉద్యోగ ప్రయత్నాలు

జీవిత సమరం తొలిరోజులు-ఉద్యోగ ప్రయత్నాలు

ఇదెప్పటి మాటా? 1950 దశకంలో చివరి సంవత్సరాలలో మాట.

బ్రాకెట్ కంపెనీలో ఉద్యోగానికి చేరడం, రాత్రి తొమ్మిదికి భోజనానికి రావడం, చేయడం, మళ్ళీ వెళ్ళడం, అర్ధరాత్రి రావడం, అర్ధరాత్రి ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి వీధి అరుగు మీద పడుకోడం, అమ్మకి చికాకు కల్పించాయి, గొడవకే కారణమూ అయింది, ఉద్యోగం. బ్రాకెట్ కంపెనీ అనేటప్పటికి ఒళ్ళూ మండింది,’ఉద్యోగం మానెయ్’ అనేసింది, నిజానికి భయం వేరు, పాడైపోతానేమోనని. మా వూళ్ళో నలభైమంది దత్తుళ్ళున్నారు, సంతు తక్కువ మూలంగా. మా దత్తుళ్ళకో సంఘం, సంఘానికి ప్రెసిడెంట్ మా ఊరి పెద్ద, సెక్రెటరీ ఎలమర్తి శ్రీరామమూర్తి అని ఒక షావుకారుగారు. మా వూరు పెదకాపు, మా శ్రీరామమూర్తి దత్తుళ్ళకి చెబుతుండేవారు, “లేని కుటుంబంలో పుట్టేం, అదృష్టం కొద్దీ ఎంతో కొంత కలిగిన కుటుంబానికొచ్చాం, జాగరతతో బతకండి,ఆస్థులు పాడుచేసుకోకండీ, పెంచుకున్నవాళ్ళని ఏడిపించకండీ” అని.

నిజానికి బాగుపడ్డవాళ్ళం మేం ముగ్గురమే! మిగిలినవాళ్ళంతా పాడైపోయారు, ఒక్కసారిగా ధనవంతులు కావడంతో, వ్యసనాలకు లోనై. మా ఊరికి ఒకమైలు ఆరు ఫర్లాంగుల దూరంలోది, మురమండ. ఈ ఊరు భోగస్త్రీలకి ప్రసిద్ధి. మా ఊరి దత్తుళ్ళలో చాలామంది,ఈ వ్యసనం మూలంగానే పాడయ్యారు. అదిగో! అదీ, అమ్మ అసలు భయం. అమ్మకి వివరంగా చెప్పి పాడవాలంటే బ్రాకెట్ కంపెనీలో పని చేస్తేనే పాడవక్కరలేదు,ఏం చేయకుండానూ పాడవచ్చని చెప్పి ఒప్పించాను. అదిగో అది నా మొదటి విజయం. ఆ తరవాతనుంచి చేస్తున్న ప్రతి పని చెబుతూవచ్చాను, నా మీదనాకు నమ్మకం కలిగింది, చేస్తున్నది,చెబుతున్నదానికి తేడా లేకపోవడం చూసి అమ్మకీ నా మీద నమ్మకం పెరిగింది, కాని పెళ్ళి చేసుకోమనే పోరు పెరిగింది.

స్నేహితుడు నేత నేర్పనన్నాడు గనక, ఏం చేయాలీ? పగలంతా ఖాళీ కదా! ఆలోచించి, టైపు నేర్చుకుంటే ఉద్యోగం రావచ్చనిపించి, మండపేటలో టైపు ఇనిస్టిట్యూట్ లోచేరా. ఐదు కిలో మీటర్లు వెళ్ళిరావాలి, స్వంత సైకిల్ లేదు, సైకిల్ తొక్కడం వచ్చు. మా ఊరి మొత్తానికి ఉన్నది ఒకే ఒక అద్దెసైకిల్ షాప్. రోజూ మూడు గంటలు సైకిల్ అద్దెకు తీసుకునేవాడిని.

సైకిల్ అద్దెలిలా ఉండేవి, అన్నట్టు మరచా, సైకిల్ కి పన్నుండేది, సంవత్సరానికి రూపాయిన్నర.
సైకిల్ అద్దె ఇలా ఉండేది.
గంటకి అణా
పగలు పూటకి ఆరణాలు.
పగలు రోజుకి పన్నెండణాలు
రాత్రికి అర్ధ రూపాయి.
రోజుకి పగలు,రాత్రికి, రూపాయి పావలా.
నెలకి ముఫై రూపాయలు.
స్వంతంగా సైకిల్ కొనుక్కోలేనివాళ్ళు,అవసరమున్నవాళ్ళు నెలకి అద్దెకు తీసుకునేవారు, దానికి వెనక గట్టి కేరేజి వేసి ఇచ్చేవాడు యజమాని. దాని మీద 75 కేజిల బస్తా బియ్యాన్ని రెండు మూటలుగా కట్టుకుని సైకిల్ మీద వెనక ముందు వేసుకుని సైకిల్ తొక్కుకుని పోయి బియ్యం రాజమంద్రిలో అమ్ముకుంటే రోజుకి ఇరవై రూపాయల దాకా వచ్చేవి. ఇక్కడ పల్లెలో బస్తా ముఫై రూపాయలుంటే రాజమంద్రిలో ఏభై రూపాయల పైన ఉండేది. బియ్యానికి ఇబ్బంది ఉండేది, ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకి బియ్యం వెళ్ళాలంటే పర్మిట్ కావాలి. ఇలా బియ్యం సైకిల్ మీద పట్టుకుపోయి అమ్మేవారిని పట్టుకునేవారు కాదు. ఈ వ్యాపారాన్ని ‘అద్దె సైకిల్ తొక్కడం’ అనేవారు. రోజూ ఒక బస్తా కట్టుకుపోయి అమ్ముకుంటే ఇరవై రూపాయల లాభం, ఇలా అద్దె సైకిల్ తొక్కితేనో అనే ఆలోచనా వచ్చిందిగాని ఒకప్పుడు, నేనే కాదనుకున్నా! అంత బరువు ఆపలేనని.

మండపేటలో టైపుకి చేరాను, నెలకి ఆరు రూపాయలు ఫీజు. బ్రాకెట్ కంపెనీలో డబ్బులు ఏరోజుకారోజు ఇచ్చేసేవాడు, ఇప్పుడు నా సంపాదన నెలకి అరవైరూపాయలు, ఖర్చు పేపర్ ఆరు రూపాయలు, సైకిల్ అద్దె ఆరు రూపాయలు, టైపుకి ఆరు రూపాయలు, చిల్లర ఖర్చు, ఇవి కాకుండా ఉద్యోగాలకి అప్లికేషన్లు పంపడానికి వగిరా ఖర్చులు…సిగరెట్లు అప్పటికే అలవాటయ్యాయి, బర్కిలీ పెట్టి ఇరవైపైసలు లేదా మూడణాలు, అప్పటికే నయాపైసలొచ్చాయిగాని అణాలు,బేడలూ కూడా ఉండేవి.. పెట్టి ఒకసారి కొనడాన్కి లేదు. అమ్మకి నేను సిగరెట్ కాలుస్తానని తెలుసు కాని నేను కాలస్తూ ఉండగా ఎప్పుడూ చూడలేదు, ఆ తరవాత కాలంలో ఇల్లాలూ అంతే! అదేమో ఇంటి దగ్గరుంటే ఎన్నిరోజులైనా సిగరెట్ కాల్చేవాడినే కాదు, బయటకి వెళితే చాలు..ఇలా ఉండేది, అదేమో చిత్రం. అమ్మగాని ఇల్లాలుగాని నేను సిగరెట్లు కాల్చడం గురించి ప్రశ్నించలేదు, అడగడం వలన ఉపయోగం లేదని….ఇలా రాబడి ఖర్చు ఉంటూ కాలం గడుస్తోండగా……..

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s