శర్మ కాలక్షేపంకబుర్లు-నమ్మితేనే………

నమ్మితేనే………

నమ్మకం అనేది చాలా బలవత్తరమైనది. సృష్టి సర్వమూ నమ్మకం మీదే నడుస్తుంది.  మానవులు సంఘ జీవులు, ఒకరినొకరు నమ్మక జీవితం నడవదు. అంతెందుకు పంచభూతాలూ వాటి హద్దులలో ఉంటాయన్న నమ్మకంతోనే రాత్రి నిద్రిస్తాం, లేకపోతే నిద్ర పడుతుందా? తల్లి పిల్లని,పిల్ల తల్లిని; మిత్రుడు, మరో మిత్రుడిని; భార్య,భర్తని; భర్త,భార్యని; ప్రభుత్వం,ప్రజలని;ప్రజలు, ప్రభుత్వాన్ని నమ్ముతారు, నమ్మకపోతే జీవితం నడవనే నడవదు. ఈ నమ్మకం సడలినపుడు, నమ్మక ద్రోహం అనకూడదనుకుంటా, నమ్మకానికి ద్రోహం జరిగినపుడు…..ఒక పాత కత ఉంది, చెప్పుకుందాం…

అనగనగా ఒక ఊళ్ళో ఒక పేద పండితుడు జరుగుబాటు లేక దేశ పర్యటన చేసి ప్రవచనాలతో సొమ్ము సంపాదించుకుని పెళ్ళాం పిల్లలని పోషించుకోవాలని, బయలు దేరాడు. వెళ్ళేటప్పుడు కూడా ఒక బొంత తీసుకుపోయాడు. బొంతంటే తెలీదు కదూ! ఒకప్పుడు స్త్రీలు నేత చీరలు,పురుషులు నేత పంచెలూ మాత్రమే కట్టుకునేవారు. పాతబడిన చీరలు,పంచెలను ఒక నిర్ణీత పొడుగులో పది పొరల దాకా వేసి ఒకటిగా కుట్టుకునేవారు, దీనినే బొంత అంటారు. ఇది చాలా మెత్తగా ఉంటుంది, చలినిబాగా ఆపుతుంది కూడా, ఎందుకో సయిన్స్ బాగ తెలిసిన మీకే తెలుసు :). ఇలా తీసుకుపోయిన బొంతని రాత్రి పడకగా వేసుకునేవాడు,పగలు కప్పుకునేవాడు. ప్రవచనాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రవచనం జరిగినచోట గ్రామస్థులిచ్చిన సొమ్ము జాగ్రత్త పెట్టుకోడానికి, ఈ బొంతలో వేసి కుట్టుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఈ బొంత అతని శరీరంలో ఒక భాగమే అయిపోయింది, అంతగా ఆ బొంతను పట్టుకు తిరుగుతున్నాడు. ఇలా కాలంగడుస్తుండగా, ప్రవచనాలు పెరిగి, కానుకలు పెరిగి బొంత బరువెక్కడం ప్రారంభించింది, అందులో వేసి కుడుతున్న ధనం మూలంగా. ఆ పండితుడు, బొంతను అలా అస్తారపదంగా, కూడా పట్టుకు తిరగడాన్ని ఆషాఢభూతి అనే ఒక ధూర్తుడు గమనించాడు, ఎలాగైనా ఆ బొంతను,దానిలో సొమ్మును కాజెయ్యాలనుకున్నాడు, కాని ఆ బొంతను పండితుడు వదలిపెట్టటం లేదే!. ఏంచేయాలి? అని ఆలోచించి, పండితునికి పరిచర్యలు చేయడం ప్రారంభించాడు. గురువుగా ఆయనను సంబోధిస్తూ ఒక ఊరునుంచి మరొక ఊరికి కూడా వెళుతూ, సపర్యలు చేస్తూ వచ్చాడు. ఇలా సపర్యలు చేస్తూ గురువుగారి నమ్మకం సంపాదించాడు. బొంత బరువెక్కడంతోనూ, దానిని ఒక ఊరినుంచి మరొక ఊరికి తీసుకుపోవడమూ, అను నిత్యమూ కూడా ఉంచుకోవడమూ, గురువుగారికి బాధాకరంగానే అనిపించి, నమ్మకం సంపాదించుకున్న శిష్యునికి బొంత మోయడానికి ఇచ్చాడు, జీతం బత్తెం అడగని పనివాడు దొరికినందుకు సంతసించాడు. శిష్యుడు నమ్మకంగా బొంత మోస్తున్నాడు, సంపాదన పెరగడంతో బొంత బరువూ పెరిగింది. ఒక రోజు ఒక మకాం నుంచి మరో మకాంకు వెళుతున్న సమయంలో, ఆషాఢభూతి గురువుగారిని ఆపి ”స్వామీ! నన్ను ఏదో కుడుతోందని చెప్పి, పంచ తడుముకుని చూస్తే ఒక చీపురుముల్లు కనపడింది. దానిని చూస్తూ ’గురువుగారు, తమ ప్రవచనాలతో నా మనసు పూర్తిగా మారిపోయింది, పరుల సొమ్ము పూతికపుల్ల కూడా తీసుకుపోకూడదు, అది దొంగతనం కిందకే వస్తుంది,దొంగతనం మహా పాపం, ఈ పూతిక పుల్ల మనం విడిది చేసిన ఇంటివారిది, వారి సొమ్ము వారికి అప్పగించి వస్తా, అనుమతిప్పించమని ” అడిగాడు. దానికి గురువు సంతసించి, తన మాటలను ఒకరైనా నమ్మి ఆచరణలో పెడుతున్నందుకు ఆనంద పడిపోయి, ఆ పూతికపుల్లను స్వంతదారుకు అప్పగించి రమ్మని చెప్పేరు. ఆషాఢభూతి ఆ చీపురుముల్లును అతిభద్రంగా పట్టుకుని గురువు కనపడినంత దూరమూ తీసుకుపోయి, ఆ తరవాత దానినక్కడ పారేసి కొంత సమయం తరవాత తిరిగొచ్చి, ”ధన్యుడను గురుదేవా! ధన్యుడను, తమ ప్రవచనం నన్ను పూర్తిగా మార్చేసింది, నేను ఘోరమైన పాపాన్నుంచి తప్పించుకున్నా, తమరి దయవలన” అని గురువుకు సాష్టాంగ నమస్కారం చేసి,ఆశీర్వచనం పొంది,బొంతతో గురువు వెనక ప్రయాణం సాగించాడు. బొంతబరువెక్కింది, గురువుకు శిష్యుని మీద నమ్మకమూ బరువెక్కింది. ఇక గురువు ఆట్టేకాలం లోక సంచారం చెయ్యడనే నమ్మకమూ ఆషాఢభూతికి కలిగింది. ఒక రోజు ఒక ఊరినుంచి మరొక ఊరికి మకాం మారుస్తున్న సందర్భంగా, ఊరి చెరువు దగ్గరకొచ్చారు. గురువు సాయంసంధ్యా క్రియలు చేసుకొస్తానని చెప్పి శిష్యుని గట్టుపై బొంతతోవదలి, గురువుగారు చెరువులో దిగేరు… కార్యక్రమాలు పూర్తిచేసుకుని గట్టెక్కి చూసిన గురువుగారికి ఆషాఢభూతీ కనపడలేదు,బొంతా కనపడలేదు. ఆషాఢభూతిని అతిగా నమ్మి గురువు మోసపోయారు.

జీవితంలో ఎవరినీ నమ్మక ఉండలేం. ఎంతవరకు నమ్మాలి? ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మచ్చు? ఈ ప్రశ్నలకు సమాధానం అంత తేలికైన విషయమేంకాదు.  తల్లి పిల్లని నమ్మాలా? తప్పదు,ఎంతవరకు అది నిర్ణయం చేసుకోవడమే గొప్ప. ఇలాగే ప్రేయసి ప్రియుణ్ణి నమ్మాలా? పెళ్ళి చేసుకునేదాకా దూరం ఉండగలిగితే, అనే షరతు మీద, అతిగా నమ్మితే మోసం ఖాయం.  అన్ని విషయాలలో హద్దులు నిర్ణయించుకుని నమ్మితే జీవితమే సుఖం, అతిగానమ్మినా ప్రమాదం, నమ్మకున్నా ప్రమాదం.

రెండే రెండు విషయాలలో నమ్మకానికి ద్రోహం జరుగుతుంది, అవి కాంతా,కనకాలు. ఏ గొడవకైనా మూలాలు అందులోనే ఉంటాయి.ధనం దగ్గర మొహమాటానికిపోతే జరిగేది మోసమే. అలాగే స్త్రీ విషయంలోనూ, స్త్రీ విషయంలోనూ అంతే.

ఇంతెందుకండీ అసలు నమ్మితేనే కదా ద్రోహం చెయ్యగలగడం, నమ్మకపోతే ద్రోహం చేయలేరు.

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నమ్మితేనే………

    • చిరంజీవి ?
      జ్ఞాపకాల దొంతరలో ముందు వెనుకలు చూచుకుని రాయాలి 🙂 ఓపిక కొంచం తగ్గింది, రాస్తానూ!. టైప్ చెయ్యాలిగా, మళ్ళీ సంవత్సరమే! కొద్ది ఆలస్యం 🙂

      ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s