శర్మ కాలక్షేపంకబుర్లు-ధృతరాష్ట్ర కౌగిలి.

ధృతరాష్ట్ర కౌగిలి.

ధృతరాష్ట్ర కౌగిలి అంటారు, అంటే వదిలించుకోలేనిదానిని, ఆ కౌగిలిలోకి పోతే నాశనం కాక తప్పని దానిని, ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. దీన్నే సాధారణంగా భల్లూకపు పట్టూ అంటారు, భల్లూకం అంటే ఎలుగు, ఇది గనక దాడిచేసి పట్టుకుంటే వదిలించుకోవడం అసాధ్యం. ధృతరాష్ట్ర కౌగిలి కూడా అటువంటిదేనట, వివరాలకోసం భారతంలోకెళితే……………భారతం. స్త్రీ పర్వం. ఆశ్వాసం-౧ ౧౧౭ నుంచి

భారత యుద్ధం పూర్తయింది, దుర్యోధనుడు గతించాడు. కృష్ణుడు,ద్రౌపది కూడా ఉండగా, ధర్మరాజిలా అన్నాడు,తమ్ములతో ”నూర్వురు పుత్రులను కోల్పోయిన శోకంలో ఉన్న ధృతరాష్ట్రుడు,గాంధారీ సహితంగా పరివారంతో యుద్ధరంగానికొస్తున్న వార్త తెలిసింది, ఆయనను చూడక ఉండక కుదరదు, కదలండి” అన్నాడు. కృష్ణ, భీమార్జున నకుల సహదేవులు,సాత్యకి,ద్రౌపది, బంధు జన స్త్రీ వర్గం కూడా రాగా బయలు దేరాడు, ధర్మరాజు. అంతకు ముందురోజు రాత్రి దుర్యోధనుని పరివారంలోని స్త్రీలను హస్తినాపురికి క్షేమంగా చేర్చి,ధృతరాష్ట్రుని చూడడం కుదరక, మరునాడు ఉదయమే తిరిగివచ్చిన యుయుత్సుడు కూడా బయలు దేరాడు.

వీరు యుద్ధరంగానికి చేరేటప్పటికి ధృతరాష్ట్రుడు కూడా అక్కడకు చేరాడు,పరివారంతో. పరివారంలో ఉన్న స్త్రీలు పాండవులను చూడడంతోనే చేతులెత్తి ఏడుస్తూ, ”ఈ రాజుకి దయ ఎక్కడుంది, ధర్మమెక్కడిది?తండ్రులను,మామలను,కొడుకుల్ని,తోబుట్టువులను, చంపించిన కౄరత తప్పించి” అన్నవారు కొందరు. ”చేతకానివాడా! తాతని,గురువుని చంపే నేర్పు ఎక్కడ సంపాదించా”వని అర్జునుణ్ణి తూలనాడేరు, మరి కొందరు ”ఇంతమందిని చంపేమని గొప్పపోనక్కరలేదు,పొంగిపోనక్కరలేదు, ద్రౌపది కొడుకుల్ని, అభిమన్యుడిని, అంతెందుకయ్యా! చెల్లిలి మగడు సింధురాజుని చంపుకున్నారు” అని మాటలాడేరు, పాండవులు తలవంచుకు వెళుతుండగా. ఇలా పలుకుతున్నవారి మధ్యనుంచి కొడుకుల్ని కోల్పోయిన తండ్రి ధర్మరాజు, కొడుకుల్ని కోల్పోయిన మరో తండ్రి ధృతరాష్ట్రుని చేరి, పక్కనున్నవారు ధృతరాష్ట్రునికి చెబుతుండగా పాదాభివందనం వేశాడు, ధర్మరాజు. మనసులో అప్రియము,కొత్తదనము తోచగా దీనవదనుడై ధర్మరాజును కౌగిట చేర్చి అనునయవాక్యాలు పలికాడు. ఆ తరవాత భీమ,అర్జున,నకుల,సహదేవులూ వచ్చారన్న మాట విని, భీముడనే మాట వినేటప్పటికి పెద్దకోపంతో,రగిలిపోయాడు. ధృతరాష్ట్రుడు అధర్మమైన పనికి తయారవుతున్నాడనుకుని కృష్ణుడు,భీమసేనుని చెయ్యిపట్టినిలిపి, అప్పటికే తాను తయారు చేయించి తెప్పించి ఉంచిన భీమసేనుని ఇనుప ప్రతిమను ధృతరాష్ట్రుని ముందుపెట్టించాడు. ధృతరాష్ట్రుడు ఆ ఇనుప ప్రతిమను భీమునిగా తలచి, రెండు చేతులతో ఆ ప్రతిమను కౌగలించుకుని ముక్కలుగా చేశాడు.

వెయ్యి ఏనుగుల బలం కలిగిన ధృతరాష్ట్రుడు భీముని ప్రతిమను ముక్కలు చేసి మనసులో సంతోషం వెల్లి విరియగా హా!భీమసేనా అంటూ ఏడ్చాడు. తానూహించినట్లే జరిగిన సంఘటనతో కృష్ణుడు చిరునవ్వుతో,ధృతరాష్ట్రునితో ”నీ బలంగురించి నాకు తెలియదా! నీ కౌగిలిలో కి వచ్చినవారి నెవరినైనా చంపగలవు, చావకుండడం వాళ్ళ వశమా! నీవిలా చేస్తావనే ఇనుప ప్రతిమను పెట్టించాను, ఏది ఎలాజరగాలో అలా జరుగుతుందన్న సంగతి మరచిపోయి ఇలా బేలతనానికి గురయ్యావు. మరోమాట చెబుతా విను, ఇప్పుడు నువ్వు భీముణ్ణి చంపినంతలో చచ్చిన నీకొడుకులు తిరిగొస్తారా? నీ కొడుకు చేసిన ఎన్ని దురంతాలకు మేము గురి కాలేదు? జరిగిపోయినదాని గురించి వగచి ఉపయోగం లేదు అన్నారు.

ఇదీ ధృతరాష్ట్ర కౌగిలి కత, చెబితే శానా ఉంది, వింటే ఎంతో ఉంది…ఇక్కడితో ఆపేద్దాం 🙂

ధృతరాష్ట్రుని ముందు ఇనుప ప్రతిమను పెట్టినపుడు, కౌగలించుకున్న వెంటనే అది భీముడు కాదన్న సంగతి తెలియలేదా అనిపిస్తుంది కదా! కోపంలో ఉచుతానుచితాలు మరచిన ధృతరాష్ట్రునికి మతి వశం తప్పింది, అందుకే అదెవరో పోల్చుకోలేకపోయాడు.ఆ తరవాత దొంగ ఏడుపు ఏడవడం కొత్త సంగతేం కాదు, ఇదివరలో ఇలాగే పాండవులు లక్క ఇంటిలో కాలి చనిపోయారన్నపుడూ ఏడ్చాడు.

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ధృతరాష్ట్ర కౌగిలి.

  1. మీకు, మీ కుటుంబానికి 2017 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. కర్ణుని పాత్ర గురించి ఒక వ్యాసం రాయవలసిందిగా అభ్యర్ధన. చాలా మంది కర్ణుని అతిగా పొగుడుతూ ఉండడంతో ఆ దురభిప్రాయాన్ని పోగొట్టటానికి మీ సహాయం కావాలి.

    • శివరామ ప్రసాద్ మీకు మీ కుటుంబ సభ్యులకు ఆంగ్ల నూతన వత్సర శుభకామనలు.

      ఇప్పటికే విన్నకోట నరసింహారావు గారికి, లలిత గారికి టపాలు బాకీ ఉన్నాయి.ముందుగా బాకీలు తీర్చేసుకోవాలండి, ఆ తరవాతే! మాటివ్వటం లేదు సుమా 🙂
      ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s