శర్మ కాలక్షేపంకబుర్లు-జీవిత సమరం తొలిరోజులు-బ్రాకెట్

జీవిత సమరం తొలిరోజులు-బ్రాకెట్

బ్రాకెట్ అంటే ఏంటీ? తెలుసుకోవాలనిపించింది,ఈ ఆట నా పుట్టిన ఊరికి సోకలేదు, అందుచేత నాకప్పటికి దీని గురించి తెలియదు. మా అరుగు మీద ఇంగ్లీష్ పేపర్ చూసే పెద్దలనే అడిగా! సారాంశం ఇలా చెప్పేరు “న్యూయార్క్ అనే ఊళ్ళో 🙂 కాటన్ అమ్మే మార్కెట్ ఉంది. అందులో ఏ రోజు కాటన్ అమ్మే ధర ఆరోజు మార్కెట్ తెరవగానే చెబుతారు, ఆ తరవాత మార్కెట్ మూసేసేటపుడు మళ్ళీ చివరి ధర చెబుతారు. ఈ ధరలు ఒకటినుంచి పది అంకెలలో ఒకటిగా ఉంటుంది. మనకి రాత్రి ఐతే వాళ్ళకి పగలు, మనకి పగలైతే వాళ్ళకి రాత్రి, ఈ అంకె బొంబాయ్ లో ఒక సేట్ కి రోజూ కెబుల్ (విదేశీ టెలిగ్రాం) లో వస్తాయి. అతను వీటిని వచ్చే ముందే, ఏమి వస్తుందన్నది ఊహించి పందెం కాసేవారికి, ఓపెనింగ్ సరిగా కాసిన వారికి రూపాయకు ముఫై రూపాయలిస్తాడు, అలాగే క్లోజింగు కి కూడా. బ్రాకెట్ అంటే రెండంకెలూ సరిగా ఊహించిన వానికి డెభ్భై రెట్లిస్తాడు. రోజూ ఈ వార్త ఫోన్లో బొంబాయి నుంచి చెబుతాడు,దేశం మొత్తంలో, మన తెనుగునాటకి బెజవాడ కి వస్తుంది. అక్కడినుంచి మనందరికి వస్తుంది. మనూరికి ఫోన్ లేదుగనక మన మనిషి ఇక్కడినుంచి చీటి పట్టుకు వెళ్ళిన వాడు కబురు తెస్తాడు. అలాగే మళ్ళీ మండపేట వెళ్ళి రాత్రి ఒంటిగంటకి క్లోజింగ్ తెస్తాడు” ఇలా చెప్పేరు. కొంత అర్ధమయీ,అర్ధంకాక ఉండిపోయా. నిజానికి నేనూ అజ్ఞానినే 🙂

రోజూ ప్రజలనుంచి బ్రాకెట్ గురించి వసూలు చేసిన సొమ్ములో కొంత ఉంచుకుని, అంటే తగలవనుకున్న అంకెలకి సొమ్ముంచుకుని కొంత మదుపుకోసం పై ఊరి పెద్ద కంపెనీకి చేరేస్తే, అలా సొమ్ము పై ఊరి కంపెనీకి చేరేదనమాట. వారానికోసారి సెటిల్మెంటూ ఇలా చాలా లకలుకలున్నాయి. అలా అంచెలుగా బెజవాడ చేరేది, ఆతరవాతేమో తెలీదు.

పల్లెలనుంచి పట్నాలనుంచి ఇలా వసూలు చేసిన సొమ్ము నాటి బెజవాడలో కంపెనీకి చేరేది. స్వాతంత్ర్యం వచ్చిన తరవాత ఎవరెంత ఎలా సంపాదించారన్నది కనక నిష్పాక్షికంగా విచారణ జరిపితే, ఇప్పుడు బాగా సొమ్ములున్న ప్రతివారి వెనక చరిత్రా చీకటిదే! వీరిలా ప్రజలని మోసం చేసి, రక్తం జలగల్లా పీల్చి, సంపాదించినదే ఈ సొమ్ము! విచిత్రం ఏమంటే మేము ప్రజల తరఫు వాళ్ళం అని గొంతులు చించుకుంటున్నవారంతా ఇందులో భాగస్వాములే! ఎంత సొమ్ము కొల్లగొట్టేరో లెక్కేలేదంటే! ప్రభుత్వం చూసి చూడనట్టే ఊరుకుందంటే! మామూళ్ళు ముడుపులు చాలా పబ్లిగ్గా జరిగిపోయేవంటే! అబ్బో! చెప్పడమే కష్టం. ఈ ఆటవల్ల ఎన్ని కుటుంబాలు కూలిపోయాయో చెప్పలేను.

ఇక పేపర్ చూడడం గురించి అడిగితే ఇందులో బ్రాకెట్ అంకె దాగి ఉంటుందనీ, థీరిస్టులు చూసి రాబోయే అంకెలు చెప్పగలరనీ అన్నారు. ఆ రోజు బొమ్మ గురించి చెప్పమంటే ”మొదటి బొమ్మలో కుడి చెయ్యి పైకెత్తి చూపుడు వేలు చాచాడు గనక ఒన్ ఓపెనింగూ, రెండో బొమ్మలో ముడిచిన గొడుగు పైకెత్తి పట్టుకున్నాడు గనక సెవెన్ క్లోజింగూ వస్తాయి” అని థీరీ చెప్పేడు, ఇలా రోజుకో కత చెపుతుండేవారు. ఇలా కాక బొమ్మలని చిత్ర విచిత్రకోణాల్లో పట్టుకు చూసి అంకెలు చెప్పేవారు. వెర్రి వెయ్యి విధాలని అన్నమాట నిజమనిపించేది. ఇదిగాక మరో రకం థీరీ చెప్పేవాళ్ళూ ఉండేవారు. వీళ్ళనీ థీరిస్టులు అనేవారు. బ్రాకెట్ అంకెలు ఏ రోజు ఏమి వచ్చిందీ వేసి ఉన్నది ఉండేది, దీన్ని చార్ట్ అంటారు. ఆ చార్ట్ పట్టుకుని, చాలా పొడుగ్గా ఉండేది, మడత పెట్టి ఉన్నదానిని చాపి, తపస్సు చేసే మహామునుల్లా దానికేసి దీక్షగా చూస్తూ వివరించేవారు , ” మూడు నెలల కితం మొదటి సోమవారం ఒన్ ఓపెనింగొచ్చింది, ఆ తరవాత అది మూడో సోమవారం క్లోజింగయింది, ఆతరవాత ఆరో సోమవారం మళ్ళీ ఓపెనింగయ్యింది, మళ్ళీ తొమ్మిదో సోమవారం క్లోజింగయింది గనక ఇప్పుడు ఓపెనింగ్ వచ్చి తీరుతుంది, గేరంటీ” ఇలా సాగిపోయేది థీరి. ఆ రోజునాటికి నాకు థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ గాని, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ గాని తెలియకపోయినా, ఇప్పటికీ తెలియవనుకోండీ 🙂 ఇదేదో సరిగా లేదని, తేడాగా ఉందని మాత్రం అనిపించేది, వాళ్ళకి చెప్పలేను, అందరూ పెద్దవాళ్ళు, నవ్వుకునేవాడిని వారి అజ్ఞానానికి. అంతకు మించి చేయగలది లేక. ఈ థీరి చెప్పేవాళ్ళలో మేథావులు,చదువుకున్నవారు, టీచర్లు,లెక్చరర్లు ఉండేవారంటే నమ్మడం కష్టం.

ఇంతకీ ఏమీ తెలియని కూలీ నుంచి,రిక్షావాలా నుంచి బాగా చదువుకున్న టీచర్లు,లెక్చరర్లు, లాయర్ల దాకా ఎందుకు బ్రాకెట్ ఆడేవారూ అంటే నాకారోజులలో అనిపించినది “తక్కువ సమయంలో కష్టపడకుండా సొమ్ము సంపాదించేయాలి” ఈ అభిప్రాయం కలిగింది. ఐనా నా పని నేను చెయ్యడం మానలేదు……కొనసాగుతుండగా

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-జీవిత సమరం తొలిరోజులు-బ్రాకెట్

  1. తెలివితక్కువ వాళ్లు ఉన్నంతకాలం మోసగళ్లు వాళ్లని మోసగిస్తూనే వుంటారు.అత్యాశ తో ఎలాటివారైనా బోల్తా పడుతుంటారు.కాటన్ మార్కెట్ కాకపోతేమరొకటి.

    • M.V.Ramanaraoగారు,
      మీరన్న మాట సత్యం. ఒక చోట ఒకరు తెలివైనవాళ్ళు, మరొక చోట మరొకరు, ఇంతే ఇది. The exploiter will continue when the exploited is avilable 🙂
      ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s