శర్మ కాలక్షేపంకబుర్లు-జీవిత సమరం తొలిరోజులు-బ్రాకెట్-డబల్ జీరో

జీవిత సమరం తొలిరోజులు-బ్రాకెట్-డబల్ జీరో

ఒక్కొకరు ఒక్కోలా థీరీ చెప్పేవారన్నా కదూ!
ఒక్కో వూరు థీరిస్టుకి మంచిపేరుండేది. ఒక్కొకప్పుడు ఈ థీరిస్టులని బ్రాకెట్ కంపెనీ తీసుకొచ్చేది, అలా వచ్చిన థీరిస్టులు వారం దాకా ఉండేవారట, ఒక్కో థీరిస్టు వచ్చిన వారంలో బ్రాకెట్ కొట్టించి మరీ వెళతాడనేవారు. వీరికి రాజభోగాలే జరిగేవి, అవే మందు,విందు,పొందు. మా వూరికి పక్కనే మురమండ కనక చెప్పేదే లేదు. ప్రపంచంలో అందరు కొట్టి చంపేస్తారంటారు, మా గో.జి లవాళ్ళు మాత్రం పెట్టి చంపేస్తారన్నది నిజం చేసేవారనమాట.

మనుషుల్ని ఆశ ఎలా ఏడిపిస్తుందో ఆ చిన్న వయసులోనే నాకనుభవం అయింది, మనుషుల్ని, వారి అలవాట్లు భావాలని చాలా దగ్గరగా చూశా. ఒక కలవారి కోడలు, బ్రాకెట్ కంపెనీలో చేరిన మూడో రోజు కంపెనీ కెళుతూంటే పిలిచింది, ఇంట్లోంచి. గుమ్మం దగ్గర నిలబడ్డా, లోపలికి రమ్మని చెయ్యి ఊపింది, తప్పక లోపలికెళ్ళా రాత్రివేళ తొమ్మిది సమయం, ”బ్రాకెట్ కంపెనీలో చేరావటకదూ! కంపెనీ కెళ్ళేప్పుడు కనపడి వెళ్ళూ! రోజూనూ” అంది. నాకు బుర్ర తిరిగి మతిపోయింది. ఈవిడేంటి కలవారి కోడలు బ్రాకెట్ ఆడుతుందా? ఆశ్చర్యపోయా! మాటాడక వచ్చేసి మర్నాడు కనపడ్డా! కాయవలసిన అంకెలు చీటి చేతులో పెట్టింది,డబ్బులతో. అది మొదలు రోజూ ఆడేది, ఎప్పుడూ సొమ్ము రాగా చూడలా 🙂 మరొకరు, పురోహితం వృత్తి, రోజూ నా దగ్గరకొచ్చి తక్కువగా రెండు రూపాయలు బ్రాకెట్ రాసి చీటి నా చేతిలో ఇంటి దగ్గరిచ్చేసిపోయేవాడు, ఈయనకి అప్పుడప్పుడు చిన్న చిన్న మొత్తాలొచ్చేవి, మొత్తానికి లెక్కేస్తే పోయిందే ఎక్కువా. అందరూ, అన్ని అంకెలూ కలిపి రూపాయ తక్కువ కాసేవారు కాదు,అణా,బేడ, పావలాగా. ఆ రోజుల్లో రోజు కూలి రూపాయన్నర. రైతన్నలు బ్రాకెట్ ఆడగా చూడలేదుగాని, రోజుకూలీలు,రిక్షావారు,నేతన్నలు ఇలా చాలామంది ఆడమగ తేడా లేక బ్రాకెట్ ఆడేవారు. పట్నాల్లో చదువుకున్నవారు,టీచర్లు,లెక్చరర్లు, ఉద్యోగస్థులు ఆడ,మగ తేడా లేక బ్రాకెట్ ఆడేవారు. ఈ బ్రాకెట్ ఆట నా చుట్టూ మరో ఇరవై సంవత్సరాలు తిరిగిందిగాని నన్ను లోబరచుకోలేకపోయింది.

ఇలా జరుగుతుండగా ఒక రోజు ఒక థీరిస్టుని రప్పించారు, అతను దీర్ఘంగా ఆలోచించి డబల్ జీరో వస్తుందని చెప్పేడు, పొలో మని కాసేసేరు దానిమీద, చాలా సొమ్ము ఊడ్చుకుపోయిందది. ఈ థీరిస్టులకి కంపెనీలోనే వెనక గదుల్లో బస, అన్ని ఏర్పాట్లూ ఉండేవి. ఆ థీరిస్టుని వదిలించేసుకున్నారు మర్నాడే. ఆ తరవాత కొన్నాళ్ళకి కొత్త థీరిస్టు వచ్చాడు, ఇతనూ డబల్ జీరో బ్రాకెట్ గేరంటీ చెప్పాడు, వేడి పాలకి మూతి కాలిన పిల్లి లాగా అందరూ పారిపోయారు, దీని మీద కాయడానికి. కొంతమంది డబల్ జీరో కాసేరు. మా ఓనర్ దీని మీద ముఫై రూపాయలు కాస్తూ, చీటి రాయమని నాచేత్తో, ”పంతులుగారు, మీకూ ఒక రూపాయి రాసుకోండి, రూపాయి నేనిస్తా, మీరివ్వద్దు” అన్నాడు. నాకు వద్దన్నా వినకుండా అతనే చీటి రాసేశాడు, నాపేరిట; ఆరోజు బ్రాకెట్ నిజంగానే డబల్ జీరో వచ్చింది, అందరూ గగ్గోలు పడిపోయారు, చెప్పినా కట్టనందుకు. యజమాని నాచేతిలో డెబ్బై రూపాయలు పెట్టేడు,బ్రాకెట్ సొమ్ము, మర్నాడు. ఇప్పటి వరకు నిబ్బరంగా ఉన్న నాకు ద్వైదీభావం పట్టుకుంది, ఆశ చిగురించింది, మనసు లాగింది, బుద్ధి హెచ్చరించింది, వద్దని చెప్పి తిరిగిచ్చేశా. నాలో ఆలోచన పెరిగింది, పడిపోడానికి దగ్గర పడుతున్నామేమో అనిపించింది. మొదటి మెట్టు జారేమా? ఇక అంతే సంగతులు, కష్టపడక వచ్చిన డబ్బు చూసి భయమేసింది.

మరుసటి రోజే మరో సంఘటనా జరిగింది. రాత్రి క్లోజింగ్ పని పూర్తి చేస్తున్న సమయం, ఎవరో నా డెస్క్ ఎదురుగా నిలబడ్డారు, అందునా స్త్రీ, తలెత్తి చూశా, ఎదురుగా మురమండ నుంచి వచ్చిన గణిక నిలబడి ఉంది. ఆమె నాకు తెలుసు, పగటి పూట ఊళ్ళోకి రావడం అందరి ఇళ్ళకి వెళ్ళడం, ఇంటిలోని స్త్రీలు పెద్దవారిని అత్తా అని, చిన్నవారిని అక్క,చెల్లి అని సంబోధించడం అలవాటు. కలవారైన మగవాళ్ళని బావ,మరిది, మావ అనడం, లేనివారిని అన్న,తమ్ముడు అనడం వీరికి బాగా అలవాటు. నా ఎదురుగా నిలబడిన గణిక ”తమ్ముడూ ఇక్కడ పని చేస్తున్నావా?” అని లోపలికెళ్ళింది. ఆమెను కితం రోజు డబల్ జీరో బ్రాకెట్ కొట్టించిన థీరిస్ట్ కోసం రప్పించి ఉంటారనుకున్నా! నిజమూ అంతే! అక్రమ సంబంధాల గురించి విన్నదేగాని, ఇలా మరీ పచ్చిగా ….నాకేదో బాధ కలిగింది……..

ఆమె అన్నమాటలు నాకేదోలా వినిపించాయి, ఎన్నో అర్ధాలూ స్ఫురించాయి. తప్పు చేస్తున్నానా అనీ అనిపించాయి, ఏం చేయాలనే మథనం అప్పటికే ప్రారభమయిందేమో, అది పెరిగీ పోయింది. ఆ మర్నాడు జరిగిన మరో సంఘటన మరీ బాధ పెట్టింది, నేను టైప్ నేర్చుకుంటున్న ఇనిస్టిట్యూట్ మూసేశారు, అప్పటికి కొంత స్పీడ్ వచ్చిన అందరం వీధిన పడ్డాం. ఊళ్ళో ఉన్న మరో దాని దగ్గరకి పోయి అడిగితే, ఆయన జేర్చుకుంటాగాని పరీక్షకి పంపనన్నాడు. అలా అది వెనకబడింది. ఆ రోజు నేర్చుకున్న టైపు జీవితంలో ఉపయోగపడలేదుగాని, బ్లాగ్ రాయడం మొదలెట్టేకా చాలా ఉపయోగపడింది. టపా రాయడానికి సరియైన భావనాస్థితిలో ఉన్నపుడు, టైప్ చేయడం పది నిమిషాలు, ఆలోచన, వేళ్ళ నృత్యంతో కంప్యూటర్ మీద ఆవిష్కృతమవుతుంది. సాధారణంగా తప్పులు చాలా తక్కువే ఉంటాయి, అసలుండవని చెప్పనుగాని. విద్య నేర్చుకుంటే జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుందన్నదే ఇందుకు తార్కాణం. ఏం చేయాలో తోచలేదు. ఇక్కడ ఇలా అక్కడలా జరగడంతో బ్రాకెట్ కంపెనీ ఉద్యోగానికి చెల్లు చెప్పెయ్యడమే మంచిదని, చెల్లు చెప్పేశా. యజమాని బాధపడ్డాడు మిగిలినవాళ్ళని తిట్టేడు “ఎదవల్లారా! ఒక్కపది నిమిసాలు, పంతులుగారెల్లిపోయేదాకా, హంసని తీసుకురాకండా ఉండ్లేకపోయార్రా! ఎప్పుడేం చెయ్యాలో తెలవని ఎదవ”లంటూ తిట్టేడు. ఏమైనా పని చేయనని చెప్పి వచ్చేశాను. ఇప్పుడేం చెయ్యాలీ? మళ్ళీ మొదలుకొచ్చింది వ్యవహారం…….

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-జీవిత సమరం తొలిరోజులు-బ్రాకెట్-డబల్ జీరో

 1. సర్,
  ఈ బ్రాకెట్ అట ని మా సైడ్ matka అంటారు. ఇప్పటికి ఇది నడుస్తోనేవుంది. ఎందఱో దెబ్బతిన్నారు. గుంతకల్ లో నేను కూడా టెలిఫోన్ ఆపరేటర్ గ పనిచేస్తున్నప్పుడు ఎందఱో రాత్రి ౯ వరకు ఆ తరువాత రాత్రి ౧౨ వరకు టీలు తగి పచార్లు చేస్తూ చాలామంది మోసపోయారు. ఇక్కడ మాకు బళ్ళారి అక్కడినుంచి ముంబై .. ఇంకా చాల రాయాలి కానీ …………మనస్సు రాలే………………….
  నమస్తే.
  అ.వ. ramana

  • రమణాజీ,
   ఇక్కడా మట్కా అని కూడా అనేవారు. ఇక్కడ ప్రస్థుతకాలంలో లేదు, మరలా పుట్టచ్చు. అమాయకులు,మోసపోయేవారున్నంతకాలంలో మోసం చేసేవారూ ఉంటూనే ఉంటారు.
   ధన్యవాదాలు.

 2. జీవిత సారాన్ని ఇక్కడ కాచి వడ పోస్తున్నారు. మీరు స్త్రితప్రజ్ఞులు. మాలాంటి వారైతే ఎప్పుడో ఆ చెడు అలవాట్లలో మాడి మసి ఐపోయేవారం. ధన్యవాదాలు.

  • శివరామ ప్రసాద్ గారు
   బుద్ధి, ఎవరిమటుకు వారిని హెచ్చరిస్తుంది, ఆ మాట వినకపోతే పడిపోతాం, చెడిపోతాం!
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s