శర్మ కాలక్షేపంకబుర్లు-పదిమందిలో పడ్డ పాము చావదు…

పదిమందిలో పడ్డ పాము చావదు…

పదిమందిలో పడ్డ పాము చావదు, కాళ్ళలో పడ్డపాము కరవక మానదు అని విడివిడిగానూ, కలిపీ కూడా చెబుతుంటారు. లలితమ్మ తల్లి అడిగితే కాదనలేక మొదలెట్టా…..

అనగనగా ఒక పల్లెటూరు, మధ్యలో రావి చెట్టు, దాని చుట్టూ చపటా.  రోజూ ఉదయం, సాయంత్రం పనిలేనివాళ్ళు, అక్కడకొచ్చి కూచుని ఉబుసుపోక కబుర్లు చెప్పుకుంటుంటారు, రచ్చబండ రాజకీయాలూ చెప్పుకుంటుంటారు. ఇలా జరుగుతుండగా ఒక రోజు ఒకడికి ఒక పాము కనపడింది, ఎదురుగా ఉన్న మొక్కలలో, పడగా ఎత్తింది. వాడు కంగారుగా
”ఒరే పామురా!” అన్నాడు.
”ఎక్కడా?” అన్నాడు మరొకడు, చూస్తే కనపడలేదు.
”వీడో పిరికి వెధవ, నల్లికళ్ళ పాము కనపడినా పామే అనుకుంటాడు, రేచీకటి సన్నాసి” అని ఈసడించాడు. వాడికి కోపమొచ్చి
”వెధవా! ఆ పాము నిన్నే పీకుతుంది లేరా” అనేసి పోయాడు, పై పంచె దులుపుకుని, భుజాన వేసుకుని.

మరి కాసేపటికి అక్కడ అలికిడైతే మరొకడు
”నిజంగా పామేరా! అదుగో తాచుపామే! పడగా అదీనీ” అన్నాడు.
అందరూ చూశారు, పడగెత్తి ఆడుతుండడం. ఇద్దరు ముగ్గురు చపటా ఎక్కేసేరు, పాము మీద కొచ్చి కరిచేస్తుందన్నట్టు. అంతలో ఒకడు
”కర్రట్రారా” అని అరిచాడు. ఎవడూ కదల్లేదు! ”ఒరే ఎవడో ఒకడు కర్ర తెండిరా” అని మళ్ళీ అరిచాడు,
”నేనిక్కడుండి, ఇదెటుపోతోందో చూస్తాను, వెళ్ళండీ” అన్నాడు, అసహనంతో. ఒకడప్పుడు తప్పక కదిలాడు. మిగతావాళ్ళు చోద్యం చూస్తున్నారు చపటా ఎక్కి, నిలుచుని. కాసేపటికి కర్రకోసం వెళ్ళిన వాడు చేతులూపుకుంటూ వచ్చాడు.
”కర్రేదిరా?” అంటే “ఏ కర్ర తేవాలో చెప్పలేదు, మా ఇంట్లో పెద్ద వెదురుకర్రుంది తేనా?” అన్నాడు.
”ఓరి సన్నాసి! పాముని కొట్టడానికి ఒక కర్ర పనికిరాదురా! రెండు కర్రలుండాలి, చేపాటి కర్రలు, నే తెస్తానుండు” అని వెళ్ళేడు, ఇంకోడు. కర్రల కోసమెళ్ళినవాడు రెండు కర్రలు ఒకటి పెద్దదీ మరొకటి చిన్నదీ తెచ్చాడు.

ఇప్పటి దాకా పాముకి కాపలా కాసినవాడు,
”ఒరే ఎవరేనా కొట్టండిరా” అన్నాడు.
”పాముని చంపకూడదురా పాపం” అన్నాడొకడు. ”నువ్వే కొట్టు” అని కర్రలు వాడి చేతిలో పెట్టేసేరు.
”నేను కొట్టనని చెప్పేనుగా” అని మరొకడి చేతిలో కర్రలు పెట్టేసేడు, వాడు.
కర్రలుచ్చుకున్నవాడు ”కొట్టగలనుగాని, మా ఆవిడ కడుపుతో ఉందిరా! ఇప్పుడు పాముని కొట్టకూడదట, మా అమ్మమ్మ చెప్పింది”, అని చపటా ఎక్కేసేడు.
”ఒరే అది తాచుపామురా! పడగ విప్పింది చూశాం కదూ, గట్టి దెబ్బ తగలకపోతే చావదు, ’చిన్నపామైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు’ పారిపోతే పగపడుతుందిరోయ్” అని పిరికిమందుపోశాడు, కర్రలుచ్చుకుని పాముని కొట్టడానికి బయలుదేరిన మరొకడిని. ఎలా ఐతేనేం ఒకడు కర్రలుచ్చుకుని ముందుకి అడుగేస్తూ
”మరిచిపోయానురోయ్! నా పేరు సుబ్రహ్మణ్యం, స్వామివారి పేరని మా అమ్మ చెప్పింది, నేను పాముని కొట్టకూడదురా!” అనేసి కర్రలక్కడ పారేసిపోయాడు,వెనుతిరిగి చూడక. ఇక మిగిలినవారిలో మరికొందరు పామంటే భయమని నిర్లజ్జగా చెప్పేసేరు. చివరికెలా ఐతేనేం ఒకడు బయలుదేరాడు, కర్ర పుచ్చుకుని, వెనకనుంచి మరొకడు,
”ఒరే రెండో కర్ర పట్టుకెళ్ళరా” అని అరిచాడు. మొత్తానికి రెండు కర్రలూ పుచ్చుకుని ఒకడు ముందుకి అడుగేశాడు. చూస్తే పాము కనపడలేదు, జరుగుతున్న గందరగోళనికో ఏమో, పక్కనే ఉన్న కలుగులోకి దూరిపోతోంది. కర్రలట్టుకెళ్ళినవాడు
“ఒరే సగం పాము లోపల, సగం బయటా ఉందిరా కొడితే చావదేమో, పగబడుతుంది, ఏ చేయను?” అనేలోగా పాము కాస్తా కలుగులో దూరిపోయింది, అందరూ చూస్తుండగా. ఇప్పుడు పంచాయతీ తీరిస్తే
”కలుగు, పైకి చిన్నదిగా ఉంటుందిగానిరా, లోపల చాలా ఉంటుందిరా! అది మళ్ళీ పైకొస్తేగాని ఏం చెయ్యలేం, నడవండి” అంటే ఎవళ్ళ ఇంటికి వాళ్ళు పోయారు. పదిమందిలో పడ్డపాము చావదు!

పైన చెప్పిన కథ మానవ మనస్తత్త్వం తెలియజేస్తుంది. పాము ఒక ప్రతీక. సంఘంలో అరాచక శక్తుల్ని చూస్తూ కూడా ప్రజలు చేస్తున్నపనే అది. ఎవరి మటుకు వారు, మనకెందుకూ ప్రభుత్వం చూసుకుంటుందనుకుంటారు. చట్టం మన చేతిలోకి తీసుకోకూడదు అనేవాడొకడు, తన్నండెహె! చట్టమా గాడిద గుడ్డా! మరొకరి ఉవాచ. మనదేం పోలేదుగా వదలెయ్యండిరా! ఈ దొంగలూ, అరాచకవాదులూ పోలీసులూ ఒకటే, మనం ఫిర్యాదిచ్చినా జరిగేదేం ఉండదనే నిరాశావాది మరొకరు. అసలు పోలీసులే చేయిస్తున్నారో చేస్తున్నారో అనే నిత్యశంకితుడు మరొకరు. ఇది ఒక దొంగతనాల్లోనే కాదు, ఆడవారిని వేధించేటపుడే కాదు, చాలా సందర్భాలలో దోషి ఎదురుగా తప్పు చేస్తున్నా సంఘం పట్టించుకోదు, చివరకి ఒక గుడ్డముక్క కూడా ఒంటిమీద కప్పదు, ప్రాధేయ పడినా, సాయం చెయ్యమని ఆక్రోశించినా…..

కారణం భయం…భయం…భయం…మనకేంకాలేదనే ధీమా! సంఘం పట్ల చిన్న చూపు, ”కలౌ సంఘే శక్తి” అనేమాటని విస్మరించడం.

దీనంతకీ కారణం వ్యక్తి నిర్మాణం లేకపోవడం……మారదులోకం…మారదు కాలం

కొసమాట:-  కొసరు మాట కాదు. విన్నకోట నరసింహారావుగారికి, లలితగారికి మాట యిచ్చినందుకుగాను టపాలు రాసేశాను, ఎవరికిన్నీ బాకీలు లేను. ఇక శివరామ ప్రసాద్ గారు మహా భారతంలో ”కర్ణుడు”పాత్ర గురించి రాయమన్నారు. రాస్తానని మాటివ్వలేదు.

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పదిమందిలో పడ్డ పాము చావదు…

 1. తాతగారు,
  చాలా రోజులు అయ్యింది మీరు టప పెట్టి. జీవిత సమరం తొలి రోజులు శీర్షిక కధల కోసం చూస్తున్నాను.
  కుశలమేన?

  • చిరంజీవిsirimallelu
   కించిదనారోగ్యం, వయసుతో తప్పదు కదా 🙂
   రాయాలనే కోరికా తగ్గిపోయింది……
   రోజుకో వార్త మనసును పిండుతోందమ్మా.
   పాత టపాలు ఇక్కడ,https://kastephali.wordpress.com/ మళ్ళీ ప్రచురిస్తున్నా.
   ధన్యవాదాలు

 2. బాగా చెప్పారు. మీ టపాకి సరైన పాట పెట్టారు. సమాజంలో స్వార్థం పెరిగింది. కలికాలం అంటే ఇదేనేమో?

  • శివరామ ప్రసాద్ గారు,

   స్వార్ధం సహజమేగాని అది మరీ పెరిగి ఎవరికేం జరిగినా మనకి బాధలేదనే మనస్తత్త్వం పెరిగిపోయిందండి
   ధన్యవాదాలు.

 3. నమస్కారం సార్

  మంచి టపా పెట్టారు. ప్రకృతి లో జంతువుల అవసరాన్ని మానవులకు తెలియజేయడానికె భగవంతుని వాహన రూపంలో కూడా జంతువులను మనకు పరిచయం చేసింది సనాతన ధర్మం. పక్షులు బీజ వ్యాప్తికి ఎంత అవసరమో, జంతువులు అడవుల సంరక్షణకు, ఆహా రానికి ఆంత అవసరం. మంచి టపా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s