శర్మ కాలక్షేపంకబుర్లు-అసూయ,ఆత్మన్యూనత

అసూయ,ఆత్మన్యూనత                       photo0019 కర్ణుడు-1

కర్ణుని తల భారతం అనేదే సామాన్యుల మాట కూడా, అంటే కర్ణుడు లేకపోతే భారత కథే లేదన్నదే దాని భావం. కర్ణుడి గురించి తెలియాలంటే భారతం మొత్తం చూడాల్సిందే… కర్ణుడు మొదటగా ఎక్కడ కనపడ్డాడూ………(ఆంధ్రమహాభారతం పర్వం-1 ఆశ్వాసం-6  27 నుండి 60 వరకు స్వేఛ్ఛానువాదం.)

కురు కుమారుల అస్త్ర విద్యా ప్రదర్శన జరుగుతోంది. భీమ, దుర్యోధనుల గదా యుద్ధం శ్రుతి మించుతోంటే, అశ్వత్థామను పంపి ఆపు చేయించారు, ద్రోణుడు.

ఆ తరవాత అర్జునుడు తన అస్త్ర విద్యా నైపుణ్యం ప్రదర్శించాడు, అదొగో అప్పుడు ఒక యువకుడు రంగ స్థలం ముఖద్వారం దగ్గర నిలిచి జబ్బ చరిచాడు, అతనే కర్ణుడు. కర్ణుడు లోనికి అడుగేసి, చుట్టూ చూసి, గురువులు,కృప,ద్రోణులకు నమస్కరించి, అర్జునునితో ”నీవే మొనగాడిననుకోకు, మేమూ ఈ విద్యలు కొన్ని నేర్చాం, నేనూ చూపగల”నన్నాడు. ఈ మాటలు అర్జునునికి కోపం,సిగ్గు, దుర్యోధనాదులకు సంతసం, చుట్టూ ఉన్న జనులకు ఆశ్చర్యం, కలిగించేయి, ఏకకాలంలో. ద్రోణునిచేత అనుమతించబడిన కర్ణుడు, అర్జునుడు చూపిన విద్యలన్నీ హేలగా చేసి చూపించాడు. అంతే! దుర్యోధనుడు తమ్ములతోవచ్చి కర్ణుని కౌగలించుకుని, ”నాకు స్నేహితునిగా ఉండు,కురు రాజ్యానికి హితం చేయవయ్యా! ’నీవు అర్జునునితో ద్వంద యుద్ధం చేయాలి’ అనీ” అడిగాడు.

అర్జునుడు కర్ణునుద్దేశించి ”పిలవని పేరంటానికి సభలలో ప్రవేశించి తారతమ్యాలు తెలియక మాటాడ కూడదు” అన్నదానికి కర్ణుడు ”చేతకాని మాటలెందుకు? అస్త్ర శస్త్రాలతో తలపడు, ఈ రంగ భూమిలో అస్త్ర శస్త్ర నిపుణులెవెవరైనా చొరబడచ్చు, వీళ్ళు రావచ్చు,వీళ్ళు రాకూడదనే నియమం ఉందా?” అన్నాడు. ఇలా పలికిన కర్ణుడు, దుర్యోధనుని అనుమతితో రంగ స్థల మధ్యకు చేరి నిలబడ్డాడు, అర్జునుడు అచార్యుని ప్రోత్సాహంతో ముందుకురికేడు.

కర్ణుడు పర్జన్యాస్త్రం వేశాడు,అర్జునుడు కనపడకపోయేటప్పటికి కుంతి మూర్ఛపోతే, విదురుడు సపర్యలు చేయించారు. అర్జునుడు అగ్నిబాణం వేసి ఆ పర్జన్యాస్త్రాన్ని చెదరగొట్టి కనపడ్డాడు, కుంతి సంతసించగా. అంతలో కృపాచారులు వారి మధ్యకు వచ్చి అర్జునుని చూపుతూ ”ఇతను రాకుమారుడు, ఇతనితో యుద్ధం చేయాలంటే వివరంగా నీ వంశం,తల్లి తండ్రుల గురించి చెప్పవయ్యా! నీవూ రాకుమారుడవైతే యుద్ధం చేద్దువ”చ్చన్నాడు. దానికి కర్ణుడు సిగ్గుతో తలవాల్చుకోగా, దుర్యోధనుడు కృపునితో; యోధులు,శూరుల జన్మ గురించి విచారించక్కరలేదు, శూరుడైనవాడు, అధిక సేన గలవాడు రాజవుతాడు, ఇతను రాజుకాడు గనుక అర్జునినితో యుద్ధం చేయడానికి తగడంటున్నారు కనక, ఇప్పుడే ఇతనిని అంగ రాజుగా పట్టాభిషేకం చేస్తానని భీష్మ,ధృతరాష్ట్రుల అనుమతితో అంగరాజుగా పట్టాభిషేకం చేశాడు.

పట్టాభిషేకమైన తరవాత సూతుడు కర్ణుని వద్దకురాగా, వినయంతో శిరసువంచితే, కౌగలించుకుని తల ముద్దు పెట్టుకున్నాడు,సూతుడు. ఇది చూసిన భీముడు, కర్ణుడు సూత సుతుడని గ్రహించి కర్ణునితో ”నీ కులానికి తగిన పని చెయ్యి, అలా కాక నృప ధర్మంతో అర్జునుని ఎదుర్కోడం కుదురునా? ఉత్తమ క్షత్రియులు భారం వహించాల్సిన అంగ రాజ్యం నీకు అర్హం కాదనీ, కుక్కకి పురోడాశం పెట్టటం లాటిదనీ” అన్నాడు. కర్ణుడు చేసేది,చేయగలది లేక బుసలు కొట్టేడు. ఇంతలో సూర్యాస్తమయమయింది. విద్యా ప్రదర్శనమూ ముగిసింది.

ఇప్పుడు సంఘటనని పరిశీలిద్దాం. కర్ణుడు మొదటగానే అర్జునిని పై వ్యాంగ్యాస్త్రం సంధించాడు. విద్యలో స్పర్ధ ఉంటుంది, స్పర్ధయా వర్ధతే విద్యా అని నానుడి, కాని కర్ణుని మొదటి మాటే, వ్యక్తిగత స్పర్ధకి సూచనైంది, ఇది అసూయ. ఆ తరవాత అర్జునుడు అన్న ”పిలవని పేరంటానికి” అన్న మాటకి కర్ణుని జవాబూ తగినట్టుగానే ఉంది. ఇలా ఉన్న కర్ణుడు కృపాచార్యులవారడిగిన ప్రశ్నకు తలదించుకోవలసిందేముంది? నాటి ధర్మం ప్రకారం తన కులగోత్య్రాలు చెప్పుకోడానికి సిగ్గెందుకు పడాలి? అదే ఆత్మ న్యూనత. ఆ తరవాత కర్ణునికి సహాయంగా వచ్చిన దుర్యోధనుని మాటలలలో ఔచిత్యం ఉంది, అందులో ఒక మాటేనా కర్ణుడూ అనచ్చు, మాటాడకపోవడానికి కారణం ఆత్మన్యూనతే. ఆ తరవాత కర్ణుడు సూతపుత్రుడని గుర్తించిన భీముడు కుక్కతో పోల్చాడు,హేళన చేస్తూ, అప్పుడూ మాటాడలేకపోయాడు, దీన్ని కర్ణుని గొప్పతనంగానూ అనుకుంటారు, కాని ఇది కర్ణుని ఆత్మన్యూనత, శూరినికి తగనిదీ.అంగరాజ్య పట్టాభిషేకం అంటే అదేం సర్వస్వతంత్ర రాజ్యం కాదు, ఆ పదవి నేటి గవర్నర్ గిరీ లాటిది, ఒక నియామకం.

శ్రీ శివరామప్రసాద్ గారడిగితే మాటివ్వలేదుగాని రాయడం మొదలు పెట్టాను. చాలా కాలం ఆగిపోయి ఉంది, ఇప్పుడు మొదలెట్టా.కర్ణుని గురించిన సంఘటనలు రెండు చొప్పున రాద్దామనుకున్నా, టపా పెద్దదైపోతోంది, అందుకు ఒక్కొక్క సంఘటన ఒకసారి రాస్తున్నా,చిన్న టపాలుగా.

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అసూయ,ఆత్మన్యూనత

  1. ధన్యవాదాలు, ఈ సినిమాలు, సీరియల్స్ కర్ణుని ఆకాశానికి ఎత్తి చూపిస్తుంటే, నిజ నిజాలను మీ లాంటి పెద్దలు నిగ్గు తేల్చాలని ఈ కోరిక.

    • శివరామ ప్రసాద్ శివరామ ప్రసాద్ గారు,
      భారతంలో ఏముందో పరిశీలించి చూచే ఓపిక అవసరం కనపట్టం లేదండి. ఇతిహాసాల్ని సినిమాల్లో చూసి తెలుసుకుఏ స్థితి వచ్చింది, దీనికి విచారిస్తున్నాను. ఏ సంఘటన కి ఆ సంఘటన రాస్తున్నాను. విశ్లేషణ రాయడం ఎక్కువ పనికాదుగాని ఆ ఘట్టాన్ని చూసి తప్పులు లేకుండా రాయడమే పెద్ద పనైపోయిందండి, ఎలాగా మొదలెట్టేను. వారానికి ఒక టపా, అంతకు మించి రాయలేను, కర్ణునిపై
      ధన్యవాదాలు.

  2. నేను ఎప్పుడూ ఈ దృష్టి తో చూడలేదండీ. అంతే. ఆత్మ నూన్యత లోపించినందువల్ల ఆ కోపం అంతా మనసు పెట్టుకుని ద్రౌపది ని అవమానించాడు. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు నోరు విప్పలేదుతరువాత ఎంత తప్పు మాట్లాడకూడదో అంత మాట్లాడాడు. ఇంకో భాగం కోసం చూస్తున్నాను 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s