శర్మ కాలక్షేపంకబుర్లు-ఆత్మ ద్రోహం

                                       ఆత్మ ద్రోహం                                                 photo0028         కర్ణుడు-2

ఆ తరవాత భారతంలో కర్ణుని ప్రస్తావన ద్రౌపది స్వయంవర సమయంలోనే కనపడుతుంది. ఆ ఘట్టం చూదాం.ఆంధ్ర మహాభారతం పర్వం-1 ఆశ్వాసం-7….. 168 నుండి స్వేఛ్ఛానువాదం
.

  ద్రుపదుడు , ద్రోణుని చంపే కొడుకునూ, అర్జునుడుకి భార్యగా కావాలని కూతురినీ, యాగం ద్వారా పొందాడు. ద్రుపదుని కొడుకే దృష్టద్యుమ్నుడు, కూతురే ద్రౌపది. అర్జునుడు అన్నదమ్ములతో సహా లక్క ఇంటిలో మరణించాడని అనుకుంటున్న సమయం. ఇప్పుడు ద్రుపదుడు ఒక మత్స్య యంత్రాన్ని నిర్మించి, విల్లును ఏర్పాటు చేసి, ఆ వింటిని ఎక్కుపెట్టి ఐదు బాణాలతో మత్స్యయంత్రాన్ని తెగవేసినవారిని ద్రౌపది వివాహం చేసుకుంటుందని ప్రకటించి, రాజులందరికి వర్తమానం చేశాడు. దేశ దేశాల రాజులొచ్చారు, వారినుద్దేశించి ద్రౌపది అన్నగారైన దృష్టద్యుమ్నుడు.

”ఇది మత్స్యయంత్రం, ఇక్కడుంచిన వింటిని ఎక్కుపెట్టి  5 బాణాలతో మత్స్య యంత్రాన్ని తెగవేసినవారిని ద్రౌపది వివాహం చేసుకుంటుందని” ప్రకటిస్తూ, అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న ద్రౌపదితో ”ఇలా చూడు! ఇక్కడకు ప్రపంచంలో ఉన్న రాజులందరూ విచ్చేశారు, వచ్చిన వారిలో వీరు దుర్యోధన,దుశ్శాశన,దుర్ముఖులు, వారి సోదరులు మొత్తం నూరు మందీ,కర్ణ,అశ్వత్థామ,సోమదత్త,భూరిశ్రవశ,శ్రుతసేన, శల్య,విరాట,జారాసంధ,గాంధారపతులు. వీరు అకౄర,సారణ,సాత్యకి,సాంబ,సంకర్షణ,ప్రద్యుమ్న,కృష్ణ,కృతవర్మ,అనిరుద్ధ,యుయుధాన,సుమిత్ర,సుకుమార,…వత్సరాజు, వివిధదేశాధిపతులు

ఇక ఈ సభామండపంలో ఉన్న వీరంతా బ్రాహ్మణులు, వీరందరిలో మత్స్య యంత్రాన్ని తెగవేసిన వీరుని వివాహం చేసుకోమని చెప్పేడు.

  ద్రౌపది సౌందర్యాన్ని చూస్తూ తమ బలపరాక్రమాలు తెలియక చాలామందిరాజులు లేచి విల్లు ఎక్కుపెట్టలేక తిరిగిపోయారు. కృష్ణుడు ఉత్సాహం చూపకపోవడంతో యాదవులు వెనక్కి తగ్గారు. శిశుపాల,జరాసంధ,శల్య,కర్ణులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ సందర్భంలో బ్రాహ్మణ సమూహం నుంచి ఒక యువకుడు లేచి విల్లు దగ్గరకి చేరాడు, గురువులకి నమస్కారం చేశాడు, వింటికి ప్రదక్షిణ, నమస్కారాలు చేశాడు, అవలీలగా విల్లెత్తేడు,నారి సారించాడు, మత్స్యయంత్రం తెగేశాడు,చూస్తుండగా. బ్రాహ్మలందరూ లేచి అంగాస్త్రాలు గాలిలో ఎగరేశారు, భోరున అరిచారు. ద్రౌపది అర్జునుని మెడలో పుష్పమాల వేసింది. ఇది చూసిన దుర్యోధనుడు మొదలైన రాజులు, ”బ్రాహ్మడికిచ్చి వివాహం చేసుకోదలచుకుంటే మనల్ని అందరిని రమ్మని పిలవడమెందుకూ? ద్రుపదుణ్ణి పట్టుకోండి” అని బయలుదేరారు. ద్రుపదుడు బ్రాహ్మణుల వెనక దాగాడు. బ్రాహ్మణులంతా లేచి అంగాస్త్రాలు మొలకి చుట్టి దండాలెత్తి బయలుదేరారు, నీకేం భయం లేదని ద్రుపదునితో చెబుతూ. ఇది చూచిన యువకుడు ”మీ దాకా అవసరం లేదు, నేనే చూడగలను, వీళ్ళ సంగతి” అనడంతో వెనక్కి తగ్గారు. ఈ యువకునికి మరొక యువకుడు తోడొచ్చాడు, ఒక చెట్టు పీకి చేత్తో పట్టుకుని అతనుకూడా శత్రువులమీద కురికాడు. ఇది చూచిన కృష్ణుడు, బలరామునితో మత్స్యయంత్రం తెగవేసినవాడు అర్జునుడు, చెట్టు పీకి చేతబట్టి నిలచినవాడు భీముడు అని వివరించాడు. యాదవులు సంతసించారు, లక్క ఇంటిలో, అగ్ని ప్రమాదంలో చనిపోయారనుకుంటున్న పాండవులు బతికి ఉన్నందుకు.

దుర్యోధనుని అనుమతితో కర్ణుడు అర్జునుణ్ణి ఎదుర్కొన్నాడు. ఘోరయుద్ధమే జరిగింది, అర్జునుడువేసే బాణాలని ఆపలేక పోయిన కర్ణుడు, ”నా ఎదురుగా నిలబడి యుద్ధం చేయడానికి భార్గవరాముడు,ఇంద్రుడు, అర్జునునికి మాత్రమే సాధ్యం,ఎవరు నీవు? నీ పరాక్రమానికి మెచ్చేను” అన్నాడు. దానికా యువకుడు, ”నీవనుకుంటున్నవారెవరినీ కాను, శస్త్రాస్త్ర విద్యలు తెలిసినవాడిని, బ్రహ్మ తేజంతో ఉన్నవాడిని, ఈ మాటలు కట్టిపెట్టి శస్త్రాస్త్రాలతో తలపడు” అన్నాడు. దానికి కర్ణుడు ”బ్రాహ్మణ తేజం జయింపరానిదని” అంటూ యుద్ధం చేయడానికి ఇష్టపడక వెనుతిరిగాడు. ఈ యువకునితో వచ్చిన మరొక యువకుడు శల్యుడిని మల్లయుద్ధంలో ఎత్తి కిందపడేస్తే, శల్యుడు చాలించుకున్నాడు. మిగిలినరాజులూ ఉపశమించారు,వీరిని జయించడం కష్టమని. ఇంకా ఉంది ఇక్కడికి ఆపుదాం.

సంఘటన పరిశీలిద్దాం. మిగతా రాజులలాగే తానూ విల్లు ఎక్కుపెట్టి ద్రౌపదిని దక్కించుకునే ప్రయత్నం చేశాడు, కానీ సఫలం కాలేకపోయాడు,తానొక మేటి విలుకాడిననుకునే కర్ణుడు. దానితో కించిత్ ఆత్మన్యూనత పొందాడు. బ్రాహ్మణ సమూహం నుంచి లేచిన యువకుడు ద్రౌపదిని గెల్చుకోడం తో అది అసూయ స్థాయికి పెరిగింది, ఇంత గొప్ప విలుకాడిని నేను మత్స్య యంత్రాన్ని పడగొట్టలేకపోతే ఒక బ్రాహ్మణుడు పడగొట్టి ద్రౌపదిని గెలుచుకోడమా అనే స్థాయికి పెరిగిందది. ఆ తరవాత అర్జునుడని తెలియక యువకునితో తలపడి యుద్ధంలోనూ విఫలమై తన వైఫల్యాన్ని, చేతగాని తనాన్ని బ్రాహ్మణ తేజం జయించరానిదని దాని కింద దాచేశాడు, ఇది ఆత్మ ద్రోహం. ఈ సంఘటనలోనూ దుర్యోధనుని అనుమతితోనే రంగంలోకీ దిగాడు, తను వైఫల్యంపొందుతూ గొప్పలు చెప్పుకోవడం ఒక వింత, ఇదే కిందపడినా, మీదవాడినేననడం. వైఫల్యమూ, వైఫల్యాన్ని పొందుతూ గొప్ప చెప్పుకోడం ఆత్మ ద్రోహమే! ఒకప్పుడు కుమారాస్త్ర విద్యాప్రదర్శనలో కర్ణుడన్న మాటలనే నేడు అర్జునుడూ తిరిగి అతనికే అప్పజెప్పేడు సున్నితంగా ” చేతకాని కబుర్లెందుకు, అస్త్ర శస్త్రాలతో తలపడూ” అని. ఇప్పటికి కర్ణునికున్నవి, ఆత్మన్యూనత,అసూయ, వైఫల్యంలోనూ గొప్ప చెప్పుకోవడం,వైఫల్యాన్ని దాచుకోవడం, అనే ఆత్మ ద్రోహం.

తరవాత భాగం తొందరలో చూదాం.

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఆత్మ ద్రోహం

  1. ధన్యవాదాలు, అసూయ, ఆత్మన్యూనత, ఆత్మద్రోహం, అహంకారం, దుష్ట చతుష్టయం..బాగుంది, కొనసాగించండి. ఒక్కసారైనా పరాక్రమం లో అర్జునుడు కన్నా పై చేయి అని నిరూపించాడా, అదీ విశదీకరించగలరు.

    • శివరామ ప్రసాద్ గారు,
      కర్ణుడి పాత్ర చదువుతున్నా! భారతంలో మరలా, రాయడం కోసమే! అందులో ఏముంటే అదే,నా కల్పనలేం లేవు. అందుకే ముందుగా భారతం ఉన్నది రాయడం ఆ తరవాతే దాన్ని పరిశీలించడం జరుగుతోంది.
      ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s