శర్మ కాలక్షేపంకబుర్లు-వికృత చర్య

dscn0069

కర్ణుడు-3

 ద్రౌపదీ స్వయంవరంలో కర్ణుని భంగపాటు తరవాత జరిగిన సంఘటనల్లో కర్ణుని ప్రమేయం లేదు, కనిపించదు. ధృతరాష్ట్రుడు పాండవులను రప్పించడం, అర్ధరాజ్యమివ్వడం వారో రాజధాని నిర్మించుకోడం, అందులో ఒక సభను మయుడు నిర్మించి ఇవ్వడం, దానిని చూచిన దుర్యోధనుడు విభ్రమచెందడం, అవమాన పడటం, ఇంటికొచ్చి మనోవ్యాధితో చిక్కిపోవడం, ఇది చూచిన మేనమామ శకుని బావగారితో ప్రస్తావించడం, మరొక యాగం చేయడం, ఒక సభాభవనాన్నీ నిర్మింపజేయడం, పాండవులు దాన్ని చూడడానికి వేడుకగా జూదం ఆడడానికి ధృతరాష్ట్రుని ఒప్పించడం, విదురుణ్ణి పంపి పాండవులను పిలిపించడం, పాండవుల రాజ్యం నీకు జూదం ద్వారా గెలిచి ఇస్తానని శకుని మేనల్లునికి చెప్పడం, మొత్తం వ్యూహమంతా శకుని చుట్టూ తిరుగుతుంది గాని కర్ణుని పాత్ర లేనే లేదు. భారతం. సభాపర్వం. ఆశ్వాసం.2…..172 నుండి249

జూదం ప్రారంభమయింది, ధర్మరాజు రాజ్యంతో సహా అన్నీ కోల్పోయాడు, తమ్ములనూ ఓడిపోయాడు, అప్పుడు తనను తాను పణంగా పెట్టి ఓడిపోయాడు. శకుని నీ దగ్గర ఇంకా పందెంవేయడనికి తగినది ఉందని సూచన చేస్తే ద్రౌపదిని పందెంలో ఓడిపోయాడు.

సభలో కలకలం బయలుదేరింది, ధృతరాష్ట్రుడికి ఎవరేమి గెల్చుకున్నారన్నది విదురుడు వివరాలు చెబుతుండగా, వెళ్ళి పాంచాలిని సభకు తీసుకురమ్మంటాడు, దుర్యోధనుడు, విదురుడు కాదంటాడు. అప్పుడు దుర్యోధనుడు ప్రాతికామిని పిలిచి, వెళ్ళి ద్రొపదిని సభకు తీసుకురమ్మంటే, తీసుకురావడానికి వెళ్ళిన ప్రాతికామికి ద్రౌపది ఒక ప్రశ్న వేసింది. నేను ధర్మ విజితనా? అధర్మ విజితనా? ధర్మరాజును అడిగి రమ్మంటుంది, అంటే ధర్మంగా ఓడిపోబడ్డానా? అధర్మంగా ఓడిపోబడ్డానా? తెలుసుకురమ్మంది. ప్రాతికామి వచ్చి విషయం ధర్మరాజుకి చెబితే మాట్లాడడు. అప్పుడు దుర్యోధనుడు సభలోనే విషయం తేల్చుకోవచ్చు తీసుకురమ్మని మళ్ళీ పంపుతాడు. ప్రాతికామి వచ్చి ఈ మాట చెబితే, ప్రాతికామి వెనుకనే బయలుదేరి సభలో కురు వృద్ధ, స్త్రీ జనాలున్న దగ్గరకొచ్చింది, ద్రౌపది. తిరిగొచ్చిన ప్రాతికామిని చూసి సుయోధనుడు దుశ్శాసనునితో ప్రాతికామి భీమునికి భయపడుతున్నాడు,నీవుపోయి ద్రౌపదిని తీసుకురమ్మంటాడు. దుశ్శాసనుడు బయలుదేరుతున్నాడన్న సంగతి తెలిసి ద్రౌపది గాంధారి వద్దకు పరుగెత్తింది. దుశ్శాసనుడు సమీపిస్తుంటే ముట్టకు, నేను రజస్వలను,ఏకవస్త్రనని చెబుతుంది. దానికి దుశ్శాసనుడు నీవు ఏకవస్త్రవైతేనేమి, వివస్త్రవైతేనేమని ద్రౌపది కొప్పుపట్టి సభకు తీసుకువచ్చాడు. సిగ్గు, కోపంతో; చితికి, ఉడికిపోతున్న ద్రౌపదిని చూసిన వికర్ణుడు

ద్రౌపది అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి, చెప్పకపోవడం తప్పన్నాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి, చెప్పకపోవడం తప్పు అని వికర్ణుడు అన్నా ఎవరూ మాటాడలేదు. అప్పుడు వికర్ణుడు నేను ధర్మ నిర్ణయం చేస్తున్నా ఐదుగురికి భార్య ఐన ఆమెను ధర్మరాజొకడూ జూదంలో ఓడిపోవడం మూలంగా ఆమె అధర్మ విజిత అని నిర్ణయం చేశాడు. ఇది విన్న కర్ణుడు చిన్ననోట పెద్దమాట మాటాడుతున్నావు,ఇంత మంది పెద్దలు నిర్ణయం చేయలేదు ….ఒక స్త్రీకి ఒకడు భర్త, ఐదుగురు భర్తలున్న ”ఇది” ’బంధకి’ ”దీన్ని” ఏకవస్త్ర ఐనా, వివస్త్రగానైనా సభకు తీసుకురావచ్చు, తప్పులేదన్నాడు. ఇది విన్న సుయోధనుడు దుశ్శాసనునితో పాండవుల, ద్రౌపది వస్త్రాలు విప్పెయ్యమన్నాడు. దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాలు విప్పేస్తోంటే శ్రీకృష్ణుడు అక్షయ వలువలిచ్చాడు. ద్రౌపది నేను దాసినా! నేను దాసినా!! అని ఆక్రోశించింది. సభలో ఎవరూ మాటాడలేదు, ఇది విన్న భీష్ముడు అమ్మా ఇది ధర్మ సూక్ష్మం నీ ప్రశ్నకు సమాధానం ధర్మరాజే చెప్పాలి, వీరు చేస్తున్న పనులకు ఫలితం అనుభవిస్తారన్నాడు. ఇది విన్న కర్ణుడు ద్రౌపది నుద్దేశించి, జూదంలో నిన్ను పణంగా పెట్టి ఓడిపోయే ఐదుగురి కంటే జూదంలో ఓడిపోని ఒకణ్ణే చూసుకుంటే మంచిదని హేళన చేశాడు. ఈ మాట విన్న సుయోధనుడు ద్రౌపదికి తన ఎడమతొడ చూపించాడు. భీముడు భీషణ ప్రతిజ్ఞ చేశాడు…. ఇంకా ఉందిక్కడికి ఆపుదాం….

(స్వగతం : ఈ భాగాన్ని, దీని ముందు వెనుకలూ పదిరోజులైనా చదివాను,మళ్ళీమళ్ళీ,ఎక్కడేనా చిన్న వివరమైనా తప్పిపోతానేమోనని. సాధారణంగా టపా రాయడానికి పట్టేసమయం ఇరవై నిమిషాలు,పూర్తి స్థాయీభావం (మూడ్) ఉంటే. ఈ టపా రాయడానికి మానసికంగా వ్యధ చెందాను)

ఈ సంఘటనలో కర్ణుని పాత్ర చాలా చిన్నదే కాని కీలకమైనది. ఏ పనికైనా ముగ్గురు ఉంటారు, వారు, కర్త,కారయిత,అనుమోదకులు. ఈ సంఘటనలో కర్త సుయోధనుడు కారయిత కర్ణుడు, అనుమోదకులు సభా సభ్యులు. వికర్ణుని మాటలకు ఇది ’బంధకి’ దీనిని ఏకవస్త్రగానైనా,వివస్త్రగానైనా సభకు తీసుకురావడం తప్పుకాదని చెప్పి సుయోధనునికి ద్రౌపదిని వివస్త్రను చేసి అవమానించమనే సూచన చేసినవాడు, ఆ తరవాత వికర్ణుడు ధర్మ నిర్ణయం చేస్తే ద్రౌపదిని హేళన చేస్తూ జూదంలో ఓడిపోని ఒకణ్ణి చూసుకోమని సూచన చేయడం, సుయోధనుని భర్త చేసుకోమని చెప్పడమే, దానికి పొడిగింపే దుర్యోధనుడు తొడ చూపడం. ఈ రెండింటికి కారయిత కర్ణుడు.

కర్ణునికి అర్జునునిపట్ల ఆత్మ న్యూనతతో కూడిన అసూయ ఉంది, అది అస్త్రవిద్యాప్రదర్శనలో ప్రారంభమై ద్రౌపదీ స్వయంవరంలో గట్టిపడింది, దుర్యోధనునుని చెలిమితో అది కాస్తా శతృత్వంగా మారింది. అర్జునునిపై పైచేయి సాధించాలనే కోరికా ఉందిగాని సాధ్యమే కాలేదు, సావకాశమూ రాలేదు. శతృవు బలమైనవాడయ్యాడు, పై చెయ్యి సాధించి తృప్తి పడడానికి మంచి సావకాశం అన్నట్లు ఈ అవకాశం తోసుకొచ్చింది. తన వ్యక్తిగత శతృత్వం, సుయోధనుని వలన సంక్రమించిన శతృత్వాన్ని తీర్చుకోడానికి ఇది మంచి అవకాశంగా కనపడింది. అర్జునుని ఏమీ చేయలేక అతను బాధపడితే చూసి ఆనందించాలనే వికృత ఆలోచన కలిగింది, అదే అశక్త దుర్జనత్వం, అర్జునుని మానసికంగా వేధించడానికి మార్గం, అతని భార్యను సభలో వివస్త్రను చేసి అవమానిస్తే అతను బాధపడుతుంటే చూసి ఆనందించాలనుకున్నాడు, దానికి తగినట్టు సూచనలు చేశాడు. (భార్యనుకూడా వివస్త్రగా చూడకూడదు,సంభోగ సమయంలో కూడా, సంభోగ సమయంలో కూడా వస్త్రాలు లేకుండా స్త్రీ పురుషులు సంభోగం చేయకూడదు, వస్త్రాలు లేకుండే సమయాలు రెండే ఒకటి పుట్టినపుడు, రెండు చచ్చి చితిమీదబెట్టి కాల్చేటపుడు. చిన్నప్పుడు కూడా స్నానం చేయించేటపుడు తల్లి చిన్న బట్టకట్టి మరీ స్నానం చేయిస్తుంది, ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలియదు.)

 ఒక స్త్రీని నిండు సభలో వివస్త్రను చేసి చూసి ఆమె,ఆమె భర్త బాధపడుతుంటే చూసి ఆనందించాలనే నీచత్వానికి దిగజారిపోయాడు కర్ణుడు, మానవత్వాన్నే మరచిపోయాడు. కర్ణుడికి స్త్రీలంటే ఎంత గౌరవం ఉందో! అంతేగాక ఆమెను మరొకరిని వివాహం చేసుకోమని సూచించడం కూడా వికృత చర్య. ఈ ఆలోచనను నేటివారు శాడిజం అంటారనుకుంటా.

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-వికృత చర్య

 1. చాలా బాగా విశ్లేషిస్తున్నారు, మీకు శ్రమ కలిగించినందుకు క్షంతవ్యుణ్ణి! ఈ వస్త్రాపహరణమనే నీచమైన, నికృష్టమైన, దుర్మార్గమైన, పైశాచిక క్రుత్యానికి మూలకారణం కర్ణుడు. ఇలాంటి నీచబుద్ది, దుష్టబుద్ది కలవాడు రామాయణ, మహాభారతాల్లో ఎక్కడైనా ఉన్నడా? రావణాసురుడు కూడా సీతాదేవిని ఎతుకు వెళ్లి తన ఇంట్లో ఉంచలేదు, అశోకవనంలో ఉంచాడు. ఆమెను తాకను కూడా తాకలేదు.
  ఆ సినిమా పైత్యం ఎక్కువయ్యి నిజమైన పాత్రా లక్షణాలు తెలుసుకోవట్లేదు. పైగా ఈ మధ్య ఒక కోత్తరకం సాహిత్యం, స్వేచ్ఛా సాహిత్యం ట, వారికీ ఏది తోస్తే అదే రాస్తారు. ఖర్మ! వీళ్ళు పురాణాన్లని, ఇతిహాసాలను వక్రీకరించడం ఒక గొప్ప కళ గా చెప్పుకుంటున్నారు.

  • శివరామ ప్రసాద్ గారు,
   నేటి కాలంలో కూడా ఇటువంటి వికృత ఆలోచనలున్నవారుంటారు సుమా అని తెలుసుకోడానికి, మన జాగ్రతలు మనం తీసుకోడానికి.

   కర్ణుని గురించి తెలుసుకోవడమే ప్రధానం,అంతే, మరో ఆలోచనెందుకు? మనకు తోచినది మాటాడుకోడం కాక భారతంలో రాసినదాన్ని అనుసరిస్తే నిజం తెలుస్తుంది కదా!

   ఈ బ్లాగు శోధినిలో మాత్రమే కనపడుతుంది, దానిలో కూడా ఈ బ్లాగు కామెంట్లు కనపడటం లేదు. కాని ఈ బ్లాగును చాలామంది బుక్ మార్క్ చేసుకోవడం వగైరా చేయడంతో, అనుసరిస్తుండటంతో, దీన్ని వదలలేక ఇందులో కూడా ప్రచురిస్తున్నా!

   ఇది కాక మరో బ్లాగు లో కూడా ప్రచురిస్తున్నా. https://sarmabc.wordpress.com//
   పై బ్లాగులో నా టపాలు కామెంట్లు మాలికలో మాత్రం కనపడతాయి. పై బ్లాగులో ఈ టపాలపై చర్చ జరుగుతోంది, చూడగలరు.

   పాత టపాలు https://kastephali.wordpress.com/లో ప్రచురిస్తున్నా మరలా

   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s