వ్యవసాయం
”వ్యాపారం నీవల్లకాదన్నావు, మరి వ్యవసాయమంటే అదీ కాదంటున్నా”వని నీరసంగా అడిగా……..
”నీరసపడిపోకు, ఉన్న విషయం చెబుతున్నా తప్పించి నిన్ను నిరుత్సాహపరచడం నాకు ఇష్టమూ కాదు, ఎందుకు కాదంటున్నానో విను…” అని కొనసాగించింది..
”ఒకప్పుడు బ్రాహ్మలే వ్యవసాయం చేసేవారంటే అతిశయోక్తి కావచ్చేమోగాని, వీరు వేదం చదువుకుని, వ్యవసాయంతో బతికేవారు, చేలో దిగి స్వయంగా అరక దున్నేవారు, కోతకోసేవారు అన్ని పనులూ చేసుకునేవారు. ఆవుల పాలు తీసేవారు, పచ్చగడ్డి కోసి మోపుకట్టుని నెత్తి మీద మోసుకుని ఇంటికి తెచ్చి ఆవులకి వేసుకునేవారు. రెండు వందల సంవత్సరాలుగా,రోజులు మారాయి, నేటిరోజుల్లో వేదమూ వెనకబట్టింది,వ్యవసాయమూ వెనకబట్టింది, స్వతంత్రంగా బతికే అలవాటూ వెనకబట్టి, నెలకూలికి తలమ్ముకునే అలవాటొచ్చింది, ఇప్పుడు కారణాలడక్కు. ఈ చట్రం నుంచి నువ్వు బయటపడే సావకాశం ప్రస్థుతంలో లేదు, అందుకు నువ్వు వ్యవసాయమూ చేయలేవు,నీవల్ల కాదు, నెలకూలికి దారి చూసుకో అని హితబోధ చేసింది. వ్యవసాయం ఎందుకు నీవల్లకాదంటే….
ఇప్పటివరకూ నీ భూమిని మరొక రైతు చేస్తున్నాడు, కొన్ని దశాబ్దాలుగా, దాన్నే నమ్ముకునీ బతుకుతున్నాడు. ఇప్పుడు నువ్వు స్వంత వ్యవసాయమని అతన్ని తప్పిస్తానంటే అతని బతుకేంటీ? నా భూమి నా ఇష్టం అని నువ్వనచ్చు, చట్టం ఏదో చెబుతుంది, కాని ఒక కుటుంబం చస్తూనే బతుకుతోంది దాని మీద, మనతో పాటు. నువ్వు భూమి వదిలేయమనగానే, అతను సరేనంటాడుగాని వదలడు,కాదు వదలలేడు. ఇతను ఈ భూమి వ్యవసాయం చేస్తున్నాడు గనకనే, ఆ బేరగాడు అప్పిస్తున్నాడు, లేకపోతే ఇతనికి అప్పు కూడా ఇవ్వడు, మరెక్కడా పుట్టదు. బేరగానిదగ్గర మన రైతుకి ఎంతో కొంత అప్పు ఉండే ఉంటుంది. నువ్వు పొలం వదిలేయమని రైతును అడగ్గానే బేరగాడు, నా అప్పు తీర్చు అని రైతు పీక మీద కూచుంటాడు. రైతప్పుడు నాకు బేరగాడి దగ్గర పదివేలు అప్పుంది, అది తీర్చండి, పొలం వదిలేస్తానంటాడు. నీ దగ్గర పది పైసలున్నాయా? ఒక వేళ నువ్వు పది వేలూ అప్పు చేసి తెచ్చి ఇచ్చావనుకో! అప్పుడు నువ్వు,రైతు కూడా మెడలికి ఉరి తగిలించుకున్నవారే. నీకు అప్పిచ్చేవాడు భూమి తాకట్టు పెట్టుకునిగాని అప్పివ్వడు, ఇలా నువ్వు ఉరి తగిలించుకుంటే, అక్కడ రైతు పదివేలు కాకపోయినా ఐదువేలేనా అప్పు తీర్చి మిగిలిన సొమ్ముతో కాలక్షేపం చేస్తాడు. చాలాకాలం నుంచి చేస్తున్నవాడిని నువ్వు తప్పిస్తే, తప్పుకున్నందుకు రైతు సొమ్ము పుచ్చుకున్నందుకుగాను మరొకరు అతనికి భూమి ఇవ్వరు. ఇప్పుడు రైతూ గొంతుకు ఉరి తగిలించుకున్నట్టే! నువ్వు వ్యవసాయం మొదలెడితే ఇద్దరూ గొంతుకు ఉరి తగిలించుకున్నట్టవుతుంది, రెండు కుటుంబాలూ వీధిపాలవుతున్నాయి. ఇదంతా విన్న తరవాత కూడా ఇంకా నువ్వు వ్యవసాయం చేస్తానంటావా?”
”ఇక నీకు వ్యవసాయ పనులు ఏం వచ్చు? అరక దున్నగలవా? కలుపు తీయగలవా? ఎరువు వేయగలవా? కాలవలో దిగి బోదికి అడ్డం వేసి నీరు కట్టగలవా? రాత్రి పగలు తేడాలేక చేను చుట్టూ తిరగగలవా? పాలు తీయగలవా? గేది గాని ఆవునుగాని కడగ గలవా? నీకే పనీ చేతకాదు, తెలివైనవాడివి గనక ఎవరిదగ్గరేనా ఒక సంవత్సరం పాలికాపుగా పనిచేస్తే ఇవన్నీ నేర్చుకోగలవు, కాని నిన్ను ఎవరూ పాలికాపుగా కూడా పెట్టుకోరు, నువ్వు అందుకూ పనికిరావు, నిన్ను నిరుత్సాహపరచడం లేదు, ఉన్న నిజం చెబుతున్నా! ”
”నువ్వు ఇవన్నీ నేర్చుకున్నా నీకు ముందు చెప్పినది అలాగే ఉంటుంది, దానిలో మార్పు రాదు. ఈ పనులన్నిటికి మనుషుల్ని పెట్టి చేయించుకుంటానంటావా? సరే బ్రాహ్మణ వ్యవసాయం చేస్తావా? పల్లకీ ఎక్కుతావా? అని అడిగితే బ్రాహ్మణ వ్యవసాయమే చేస్తానంటారు, ఎందుకంటవూ? నీ దగ్గర పాలేరు ఇష్టం ఉన్న రోజు పని చేస్తాడు లేదంటే మానేస్తాడు, సరిగా అవసరమైన రోజుల్లోనే మానేస్తాడు, అతన్ని నువ్వు మానేస్తున్నావేమని అడగలేవు. ఇలా మానేస్తూ ఇబ్బంది పెడుతున్నాడని రైతుల్లో పెడితే ఏమవుతుందో తెలుసా? ఆడంతేనండీ, పనికిరానోణ్ణి పాలేరుగా పెట్టుకున్నారంటారు. నీ దగ్గర పని చేసేవాడెవడైనా పనికిరాని వాడే అంటుంది,లోకం,అదో చిత్రం. అలాగే అంటారు తప్పించి పరిష్కారం చెప్పరు. అదే మరో రైతైతే ఒళ్ళుమండితే, ఒరే వీడికి రేపు జీతం కొలిచెయ్యండి అంటాడు. జీతం కొలిచెయ్యడమంటే ఏంటో తెలుసా? అతనెంత కాలం పని చేశాడన్నదానితో నిమిత్తం లేకనే సంవత్సర జీతం ఇచ్చేసి పంపించెయ్యడం. ఒక రైతు అలా జీతమిచ్చి పంపించేసినవానిని మరేరైతూ పనిలో పెట్టుకోడు, అందుకు అతని దగ్గర భయంతో పని చేస్తాడు, నువ్వు అలా సంవత్సర జీతం కొలవలేవు ఎందుకంటే, ఎంతమందికి కొలవగలవలాగా? ఇలా కూడా నీకు, సంఘం నుంచి మద్దతు ఉండదు. నువ్వు పని చేసుకోలేనివాడవు కనక లోకువ, అవతలి రైతు పాలికాపును మాన్పించి ఆ పనిచేసుకోగలడు. ఇటువంటి తేడాలు సంఘంలో చాలా ఉన్నాయి, ఇదొక చిన్న ఉదాహరణ…ఇంత చెప్పిన తరవాత కూడా ఇప్పుడూ నువ్వు ఇంకా వ్యవసాయం చేస్తాననే అంటావా?”
”మరైతే నా సమస్యకి పరిష్కారం?” అడిగా!
”పెళ్ళి చేసుకో! ఇంట్లో కోడలొస్తుంది, నీ మామగారు పొలమిస్తాడు,నీ పక్క చేను, సొమ్మిస్తాడు, మదుపు…”ఇలా చెప్పుకొచ్చింది…
”అమ్మా నువ్వు చెప్పినవన్నీ ఒప్పుకున్నాగాని ఇది ఒప్పుకోలేననే చెప్పేశా, నా స్వయంకృషితో నా పెళ్ళాం తల్లోకి పూలైనా కొనగలిగిన రోజుగాని పెళ్ళి చేసుకోనని” ఖరాఖండీగా చెప్పేశాను.
”ఆలోచించుకో” అని సమయమిచ్చింది……ఏభైఏళ్ళకితం ఏమీ చదువుకోని లోకం తెలియని అమ్మ నేను చేస్తానన్న పనులు ఎందుకువద్దో విచరించి చెప్పింది, తను చెప్పినది చేస్తే ఎలా ఉంటుందో వివరించి నిర్ణయం నన్ను తీసుకోమంది, దొరికిన సావకాశాలను ఉపయోగించుకుని నేను నాదారిలో నడచాను, విజయమూ పొందాను, అమ్మా ఆశీర్వదించింది, ఒక వేళ నేను నా ప్రయత్నంలో విఫలమైతే అమ్మ చెపినట్టే చేసి ఉండేవాడినేమో! ఇప్పుడు రోజుల్లో మనం మన పిల్లలతో ఇలా మాటాడుతున్నామా? మాటాడగలుగుతున్నామా? మన నిర్ణయాలే వాళ్ళ మీద రుద్దుతున్నామా?
ఇలా చర్చ రోజుల తరబడి నడుస్తుండగా ఒక రోజు బేరగాడు ధాన్యం సొమ్ము తెచ్చాడు, పన్నెండు వందరూపాయల నోట్లు. దోసెడు వెడల్పున్న అన్ని వందరూపాయలనోట్లని ఒక్కసారిగా చూడడం అదే మొదలు,నాకు. నా చేతికిస్తే లెక్కపెట్టి అమ్మకిచ్చా. బేరగాడు వెళ్ళిన తరవాత
”కిరణా కొట్టు శ్రీరామ్మూర్తిని, షావుకారు సుబ్బారావు గారలని రమ్మన్నానని చెప్పు” అంది.
గబుక్కున ”ఏమని చెబుతా”వంది,
”రమ్మన్నావని చెబుతా” అన్నా!
”నేను నీకలా చెప్పేనుగాని నువ్వలా చెప్పకూడదు అక్కడ!
”అమ్మ ఒకసారి మిమ్మల్ని వీలు చూసుకుని కనపడమంది” అని చెప్పాలి, రెండు మాటల ఫలితం ఒకటే గాని ఇలా చెప్పడం గౌరవం” అంది. బుర్రకెక్కింది 🙂
కిరాణా కొట్టు బాకీ 410 రూపాయలకి 400 జమ చేసుకున్నాడు, పది రూపాయలు కాతా నిలవుంచాడు. అలాగే షావుకారుగారికి వడ్డీలు తీర్చగా అసలు కొంత తీరిస్తే మిలినవి వంద రూపాయలు, దీనితో సంవత్సరం నడవాలని తెలిసిందినాకు. అలా షావుకారుగారి బాకీ సందర్భంగా జరిగిన సంభాషణలో ఖాళీగా ఉన్నానంటే ఆయన దగ్గరకి పంపమన్నారు, మరో కొత్త కొలువు ప్రారంభం….
తాతగారు,
చిన్న సందేహం. వీలు చూసుకుని కనపడమన్నారు అని చెప్పమన్నారు కద. అల చెప్తే గౌరవంగా వుంటుంది అన్నారు కద.
ఎవరికి గౌరవంగా వుండాలి? పిలిచె మనక ? పిలిపించుకునె వాళ్ళక? ఇద్దరికీనా? అర్దం అయ్యినట్టె వుంది కాని సరిగ్గ పట్టుకున్నానో లెదో అని అడుగుతున్నాను ?
చి. శిరీష
’రమ్మనారు’ అన్న మాట అధికారం కనపరుస్తుంది, అది ఇద్దరికి అందంగానూ ఉండదు.( లౌకికం మరో మాటా అంటారు, అది చెప్పుకోడానికి అందంగా ఉండదు) అందుకే కనపడమన్నారు అంటారు. ఇది తెలుగు నుడికారం. హిందీలో ”సాబ్ ఆప్నే ముఘే యాద్ కియా’ అంటే నన్ను గుర్తు చేసుకున్నారా అని, అంటే నన్ను పిలిచారా అని.
ధన్యవాదాలు.