శర్మ కాలక్షేపంకబుర్లు-అసమర్ధుడు

అసమర్ధుడు

photo0021

కర్ణుడు-4

 అనుద్యూతం అయిపోయింది.పందెం ప్రకారం వనవాసానికి వెళ్ళిపోయారు, పాండవులు. పాండవులు కామ్యక వనానికి వెళ్ళిపోయారు, అక్కడ కొన్నాళ్ళున్న తరవాత కృష్ణుడు కలిశారు. పాండవులు కామ్యక వనం నుంచి ద్వైతవనానికి బయలుదేరి వెళ్ళేరు. ఈ సందర్భం లో ఒక బ్రాహ్మణుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చినపుడు, “పాండవులెలా ఉన్నారు అరణ్యంలో” అంటే, “చాలా బాధలు పడుతున్నార”ని చెబుతాడు. అందుకు ధృతరాష్ట్రుడు వగచి, వారి గొప్పదనం, వీరత్వం పొగుడుతే, విన్న దుర్యోధనుడు, శకుని, కర్ణులతో “మా తండ్రికి ఎందుకింత భయం వాళ్ళంటే,” అనగా కర్ణుడు, “మన గొప్పతనం వారికి చాటడానికి మంచి సావకాశం, మనసుకి సంతోషం పగవాడు కష్టపడుతున్నప్పుడు చూస్తే కలిగేదే, అసలైన ఆనందం, నార చీరలు కట్టుకుని అడవులలో తిరుగుతున్న వారికి రాజ్య వైభవం చూపినపుడు, వాళ్ళు బాధపడుతుండగా చూడటం, మనకు బాగుంటుంది కదా, మనం కనక ద్వైతవనానికి వెళితే” అంటాడు. “నా ఉద్దేశం కూడా అదే, నీవూ అదే చెప్పేవు, “అని దుర్యోధనుడంటాడు, కాని తండ్రి ద్వైతవనానికి వెళ్ళడానికి ఒప్పుకోడని సందేహిస్తాడు.” విదురుడు మొదలయిన వారు మహరాజుని ఒప్పుకోనివ్వరు”, అని అంటాడు. మహరాజును ఒప్పించేదెలా అని చింతిస్తారు. ఆ రోజుకు ఆలోచన తెగలేదు. మరునాడు ఉదయమే కర్ణుడు, దుర్యోధనుని దగ్గరకెళ్ళి “నాకో ఉపాయం తట్టింది, ద్వైతవనం దగ్గరలో మన గో సంపద ఉంది, దానిని చూసివస్తామంటే మహరాజు మనం వెళ్ళడానికి ఒప్పుకోవచ్చు” అంటాడు. అందుకు శకుని కూడా సమ్మతిస్తాడు. మంచి పధకం కుదిరినందుకు సంతసిస్తారు. గోగణం నుంచి ఒక నమ్మకమైన వాడిని రప్పించి, మహారాజు ముందు ప్రవేశపెడతారు. వచ్చిన వాడిని ధృత రాష్ట్రుడు “గోవులెల్లా ఉన్నాయ”ని అడుగుతాడు. అప్పుడావచ్చిన వాడు, “కౄరమృగాలు గోవులను హింసిస్తున్నాయి దేవరా!” అని చెబుతాడు, దానికి కర్ణుడు,శకుని,ఒకే మాటగా “దుర్యోధనుడిని వేట చేసి ఆ మృగాలను సంహరించమని ఆజ్ఞ ఇవ్వండి మహారాజా” అనిచెబుతారు. దానికి ధృతరాష్ర్ట్రుడు, “వేట అంటే మీరంతా వెళతారు, అక్కడికి దగ్గరలోనే పాండవులుంటున్నారు. మీరు తిన్నగా ఉంటారని అనుకోను, మరొకరిని ఏర్పాటు చేద్దామ”ని అంటాడు. “అక్కడికెళ్ళి వాళ్ళకి మీరు కీడు చేయటం, వాళ్ళు మీకు హాని తలపెట్టడం, రెండూ వద్దం”టాడు. అక్కడికి వెళ్ళి గోవులను రక్షించేందుకు, వేట మాత్రం చేసి వస్తాము కాని, పాండవులను పట్టించుకోమని చెప్పి ఒప్పించి స్త్రీజనాలతో బయలుదేరుతారు. వేటకి, ఎనిమిది వేల రధాలు, ముఫై వేల ఏనుగులు, తొంభై వేల గుర్రాలు, లక్ష మంది కాల్బలంతో, స్త్రీ గణంతో,ఇతర నట, విట గాయక జనంతో బయలుదేరుతారు. గోగణాలను చూస్తారు, వేట చేస్తూ ముందుకు వెళతారు. ముందుకు వెళ్ళగా ద్వైతవనం దగ్గరలో ఒక మంచి సరోవరం కనపడింది. దాని దగ్గరలోనే ధర్మరాజు ’సద్యస్కందం’ అనే యజ్ఞం చేస్తున్నాడు. ఆ సరోవరం దగ్గర చిత్ర గృహాలు నిర్మించడం మొదలు పెడతారు, దుర్యోధనుని ఆజ్ఞ మేరకు. అక్కడ ఉన్న సరోవరపు కావలివారు, “ఇది చిత్ర రధుడు అనే గంధర్వ రాజు విలాసహ్రదం, ఇక్కడినుండి తొలగిపొమ్మ”ని చెబుతారు. దానికి దుర్యోధనుని అనుచరులు, “మా దుర్యోధన మహారాజు ఇక్కడకి వస్తున్నారు, మీరే ఇక్కడినుంచి వెళ్ళిపోండ”ని చెబుతారు. అందుకు గంధర్వులు నవ్వి “మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిద”ని చెబుతారు. ఈ విషయాన్ని భటులు దుర్యోధనుడికి చేరవేస్తారు. సంగతి విన్న దుర్యోధనుడు తమ్ములను, మిగతా వారికి సరోవరాన్ని ఆక్రమించుకోమని ఆజ్ఞ ఇస్తాడు. అందరు బయలుదేరి వెళతారు, అక్కడ గంధర్వులు, ప్రయత్న పూర్వకంగా, “మీకూ మాకూ తగవు వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో”మని చెబుతారు. దానికి యుద్ధానికి వెళ్ళిన వారు ఒప్పుకోక గంధర్వుల మీద అస్త్ర శస్త్రాలు ప్రయోగిస్తే, వారుపోయి చిత్ర సేనునికి నివేదించుకుంటారు. ….
యుద్ధరంగం నుంచి వెళ్ళిన వారు తమ రాజు చిత్రసేనుడికి చెప్పుకోగా, గంధర్వరాజు వేల సంఖ్యలో సైనికులను పంపి కౌరవులను ఎదుర్కున్నాడు. అందరినీ చికాకు పరచేరు, ఒక్క కర్ణుడు మాత్రం నిలబడ్డాడు. ఎక్కడ చూచినా గంధర్వులే కనపడుతున్నారు. శకుని, సోదరులతో దుర్యోధనుడు గంధర్వులను ఎదుర్కోడంతో, వారు వెనకడుగేయాల్సి వచ్చి, చిత్రసేనుడికి చెప్పేరు. రాజు స్వయంగా వచ్చి కౌరవులను ఎదుర్కోగా, గంధర్వులు కొంతమంది కర్ణుడి రధ చక్రాలు, కొంతమంది గుఱ్ఱాలను పట్టుకున్నారు, కొంతమంది రధం ఇరుసు విరిచేశారు, దండి విరిచేశారు. అలా అందరూ కర్ణుడి రధం చుట్టుముట్టి కర్ణుడిని విరధుడిని చేయగా, వికర్ణుని రధమెక్కి యుద్ధ రంగానికి దూరంగా వెళ్ళిపోయాడు. చిత్ర సేనుడు యుద్ధం చేసి దుర్యోధనుడునికూడా కర్ణునిలా విరధుణ్ణి చేసి, పడకొట్టి, జుట్టుపట్టి ఈడ్చి, పెడ రెక్కలు కట్టేసి సింహనాదం చేశాడు. మిగిలిన గంధర్వులు దుర్యోధనుని తమ్ములను, మంత్రులను, స్త్రీ జనాలను,పట్టి బంధిస్తూ ఉండగా, చీకాకు పడిన కౌరవ సైన్యం ధర్మరాజు ఉన్న వైపుకు పారిపోయింది. మిగిలిన కౌరవులు ధర్మరాజు దగ్గరికి పోయి “సుయోధనుడిని బంధించి తీసుకుపోతున్నారు గంధర్వులు, కావవా!రక్షించవా!!” అని వేడుకున్నారు. ఇలా మొరపెట్టుకుంటున్న వారిని చూసి భీమసేనుడు నవ్వుతూ ఇలా అన్నాడు.
“మనకు జులుకనయ్యె మన చేయు పనియ గంధర్వవరులు గూడి తగ నొనర్చి
రింత లెస్స యగునె యేభారమును లేక యూరకుండ మనలనొందదే జయము.
మన పని తేలికయిపోయింది, మనం చేయాల్సిన పని గంధర్వులు బాగా చేసేరు, మనం ఊరుకుంటే జయం మనదేకదా” అని. అలా భీముడన్న మాట ’కాగలపని గంధర్వులే నిర్వహించారు’ అన్నది వాడుకలోకి వచ్చింది. మనకి ఇక్కడ దాకానే చాలు కాని మిగిలినది కూడా చెప్పేసుకుందాం, మంచి రసవత్తరంగా ఉంటుంది కనక.
ధర్మరాజుతో మొరపెట్టుకుంటున్న కౌరవులను చూసి, ధర్మరాజుతో భీముడు ఇలా అన్నాడు. “మా బలేగా అయ్యింది, వీరి పట్ల దయ చూపద్దు” అన్నాడు. దానికి ధర్మరాజు “జ్ఞాతులలో అనేక విభేదాలుండచ్చు, పైవాళ్ళు మనవాళ్ళని బాధపెడుతూంటే, అర్ధించినపుడు కూడా చూసి ఊరుకోవడం మనకీ మంచిదికాదు, మనం చేయగల సాయం తప్పని సరిగా చేయాలి. నీవూ తమ్ములు పోయి మనవాళ్ళని విడిపించుకురండయ్యా” అన్నాడు. “మరో సంగతి, ఇది మనకి చాలా మంచి అవకాశం, నేను యజ్ఞదీక్షలో ఉన్నా, లేకుంటే నేనే వెళ్ళేవాడిని” అని కూడా అన్నాడు. అప్పుడు భీముడు తమ్ములతో బయలుదేరి వెళ్ళి గంధర్వులను ఎదుర్కున్నాడు. పెద్ద యుద్ధం జరిగింది, దుర్యోధనుడిని తీసుకుని ఆకాశ మార్గాన పోవాలని ప్రయత్నించిన గంధర్వులను అడ్డుకున్నాడు, అర్జునుడు. యుద్ధం జరుగుతుండగా గంధర్వరాజు రధం మీద కనపడ్డాడు, పాండవులు అతనిని అర్జునుని మిత్రునిగా గుర్తించారు. రధాల మీద నుంచే కుశల ప్రశ్నలు వేసుకున్నారు, ఇరు పక్షాలవారు. అప్పుడు చిత్రసేనుడుతో అర్జునుడు, “దుర్యోధనుడిని వదిలిపెట్ట”మన్నాడు. దానికి చిత్ర సేనుడు, “వీడు మిమ్మల్ని హింసించాడు, అన్ని విధాలా,భార్య, పిల్లలతో వచ్చి అపహాస్యం చేయదలిచాడు, వీణ్ణి ఇప్పుడు ఇంద్రుని దగ్గరకు తీసుకుపోతున్నా,” అన్నాడు. “నీవు నా మిత్రుడవు కనక నీకూ నాకూ తగువులేదు” అన్నాడు. అప్పుడు అర్జునుడు “సుయోధనుడు మా సహోదరుడు, అతనిని వదలిపెట్టు, ధర్మరాజుకి ఇది ఇష్టమైన పని” అని చెబుతాడు. “నువ్వు వచ్చి ధర్మరాజుకి కనపడి, ధర్మరాజు ఏమి చెబితే అది చెయ్య”మన్నాడు. అందుకు చిత్రసేనుడు ఇష్టపడి, ధర్మరాజు వద్దకు వచ్చి, ధర్మజునిచే పూజింపబడి అతను చెప్పినట్లు దుర్యోధనాదులను వదలి వెళ్ళేడు. అప్పుడు ధర్మరాజు దుర్యోధనుడితో ఇలా అన్నాడు.
“ఎన్నడునిట్టి సాహసములింకనొనర్పకుమయ్య దుర్జనుం
దన్నున సాహస క్రియలయందు గడంగి నశించు గావునం
గ్రన్నన తమ్ములన్ దొరలగైకొని ఇమ్ములబొమ్ము వీటికిన్
సన్నుత దీని కొండొక విషాదము బొందకుమీ మనంబునన్.
ఇలాంటి సాహసాలు ఇక ముందు చెయ్యకు, మంచిదికాదు, తమ్ముళ్ళని తీసుకుని తిన్నగా ఇంటికెళ్ళిపో, ఇక్కడ జరిగినదాని గురించి ఆలోచించి విషాదం పొందకు” అని చెప్పి దుర్యోధనుడిని పంపేసేడు.

ఆ తరవాత సుయోధనుడు గుడారాలెత్తేసి కొంత ముందుకుపోయి అక్కడ డేరాలేసుకుని విశ్రాంతి తీసుకుంటుండగా కర్ణుడొచ్చాడు. ఆహా! ఏమి యుద్ధం చేశారు, గంధర్వులని బాగా గెలిచారు అన్నాడు. విన్న సుయోధనుడు తనకు జరిగినది చెప్పాడు. నా రథం విరిచేశారు,వికర్ణుని రథమెక్కితే అది నన్ను దూరంగా తీసుకుపోయిందన్నాడు,కర్ణుడు. సుయోధనుడు ధర్మరాజుచే విడిపింపబడ్డానని కుమిలిపోతూ దుశ్శాసనుని పిలిచి నీకు పట్టాభిషేకం చేసి నేను ప్రాయోపవేశం చేస్తాను, ఏమొహం పెట్టుకుని నగరానికెళ్తాను, వెళ్ళి భీష్మ,ద్రోణ, విదురులకి పెద్దవాళ్ళకి మొహం చూపించగలను అని భోరున ఏడ్చాడు. జరిగిన అవమానానికి కుమిలిపోయాడు. అప్పుడు కర్ణుడు ఏం జరిగిపోయిందని బాధపడిపోతున్నావు, పాండవులు నీ దేశవాసులు, రాజు కష్టంలో ఉంటే పౌరులు సాయపడాలి, అలాగే చేశారు,వాళ్ళు నీకు బానిసలు, వాళ్ళు సాయంచేసి విడిపించారో అని ఏడుస్తావెందుకూ అన్నాడు. ఆ తరవాత దుర్యోధనుడు ప్రాయోపవేశం చేస్తాడు… తరవాత కత మరోదారి…

ఒకప్పుడు కాగలకార్యం గంధర్వులే చేశారనే సామెత గురించి రెండు టపాలు రాశాను వాటినుంచి భాగాలు తీసుకుని ఈ టపా కర్ణుడి పరంగా చెబుతున్నా!

జరిగిన సంఘటన చూస్తే ఘోషయాత్రకు పథక రచన చేసినవాడు కర్ణుడు, కాని దానిని సమర్ధవంతంగా అమలు చేయలేని అసమర్ధుడు. అంతెందుకూ గంధర్వులు తన రథాన్ని చుట్టుముడితే, తన రథాన్నే కాపాడుకోలేకపోయిన అసమర్థుడు. గొప్ప విలుకాడినని  చెప్పుకున్న కర్ణుడు ఇంత అసమర్థంగా తన పథకాన్ని అమలుచేసి సుయోధనుని పరువు తీశాడు, తాను యుద్ధరంగం నుంచి తొలగిపోయి అవమాన పడ్డాడు.

సుయోధనుడు ఎవరినైతే అవమానించాలనుకున్నాడో వారి చేతనే రక్షింపబడవలసి వచ్చి అవమానం పాలయ్యాడు. ఇది కర్ణుని చేతకానితనానికి పతాక. ఘోషయాత్ర ఉద్దేశం పాండవులముందు గొప్ప ప్రదర్శించుకుని వారిని గేలిచేసిరావడం కాని తద్విరుద్ధంగా గేలిపాలు కావడానికి కారకుడు కర్ణుడు, చెఱపకురా చెడేవు అన్న సామెతను నిజం చేసినవాడు.

ఇంకొంచం ముందుకెళితే యుద్ధరంగం నుంచి వికర్ణుని రథమెక్కి దూరంగా పోయిన కర్ణుడు, ఇక్కడ జరగవలసిన అవమానమంతా సుయోధనుడికి జరిగి, ధర్మరాజు చేత విడిపింపబడి, సుయోధనుడు గుడారాలెత్తేసి కొంత దూరంపోయి అక్కడ మళ్ళీ గుడారాలేసుకుని విశ్రాంతి తీసుకుంటుంటే తిరిగొచ్చాడు. వచ్చిన వాడు నిజంగానే సుయోధనునికి పుండు మీద కారం జల్లేడు, ఆహా! ఏం గొప్ప యుద్ధం జరిగింది, ఎంత గొప్ప పోరాటం చేసి గంధర్వుల్ని జయించావు అంటూ, విన్న సుయోధనుడు సిగ్గు విడిచి జరిగిన సంగతి చెప్పుకున్నాడు. పాపం దుర్యోధనుడు అవమానం జరిగిందే అని అనుకుంటుంటే ఎంత చక్కగా ఓదార్చేడో  కర్ణుడు.వాళ్ళు నీ దేశపౌరులు,రాజు కష్టంలో వాళ్ళు ఆదుకోవాలి, అలాగే చేశారు అన్నాడు ఎంత పౌరుషవంతుడు?  కర్ణుడు.యుద్ధంలో చేతగాక, రథం కూడా రక్షించుకోలేక పారిపోయి, మిత్రుణ్ణి గాలికొదిలేసి, జరగవలసిందంతా జరిగిన తరవాత తీరికగా తిరిగొచ్చి ఆ( ఏం జరిగిందని ఏడుస్తావని అడగడం గొప్ప మిత్ర ధర్మం కదా! కర్ణుడు యుద్ధరంగం నుంచి పారిపోయినా తప్పుపట్టని గొప్పతనం దుర్యోధనునిదే.  ఇది చూస్తే అనిపించేది, అసలు సుయోధనుడిని ఇలా అవమాన పరచాలనే ఉద్దేశం ఉన్నవాడు కర్ణుడేనేమో నని.

టపా చాలా పెద్దయింది,తప్పలేదు మరి.

ప్రకటనలు

One thought on “శర్మ కాలక్షేపంకబుర్లు-అసమర్ధుడు

  1. కర్ణుడిలా ఘోషయాత్రకు దుర్యోధనుని ప్రేరేపించడం వల్ల, చెరపకురా చెడేవు అన్న సామెతను నిజం చేసారు. పాండవులని బాధించాలని వెళ్లి, గంధర్వుల చేతిలో యుద్ధం ఓడిపోయి, ఘోర పరాభవాన్ని పొందారు. ఇక్కడ, కర్ణుడి కన్నా దుర్యోధనుడే కొంచెం పౌరుషం చూపించినట్లున్నాడు, కర్ణుడైతే పారిపోయాడు, కానీ దుర్యోధనుడు ధైర్యంగా వారిని ఎదిరించాడు.

    మిత్రుణ్ణి తప్పుత్రోవ పట్టించి, కర్ణుడు మిత్రద్రోహి కూడా అయ్యాడు. చాల బాగా విష్లేసిస్తున్నారు, ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s