శర్మ కాలక్షేపంకబుర్లు-జీవితసమరం తొలిరోజులు-షావుకారు గుమాస్తా

dscn0044

షావుకారు గుమాస్తా

    షావుకారుగారు అమ్మకి చెప్పడంతో మర్నాడే ఆయన దగ్గరకెళ్ళేను. దీని గురించిన టపా ఒకసారి రాసేను అందుకు విస్తారంగా చెప్పను. నేను ఆయనకి ఏం చేసిపెట్టేనో తెలీదుగాని ఆయన నుంచి కొన్ని నేర్చుకున్నా. వడ్డీ కట్టడం, డోకడాలు (చక్రవడ్డి ఏమో) చెప్పేరుగాని నాకు నచ్చక నేర్చుకోలేదు. మరొకరితో ఎలా పని చేయించుకోవాలో, చేయించుకునేటప్పుడు తీసుకోవలసిన జాగ్రతలు,ఎవరితోనైనా గౌరవంగా మాట్లాడే నేర్పు, కోపంలో కూడా సంయమనం కోల్పోకపోవడం, అవసరాన్ని బట్టి మన్నింపుకోరడం, చేసేపనిలో దీక్ష ఆయన్ని చూసి నేర్చుకున్నమాట నిజం, వారి పేరు శ్రీకాకుళపు సుబ్బారావు గారు. ఇవి నా తరవాతి జీవితంలో చాలా ఉపయోగించాయి కూడా. నేను వారి దగ్గర పనిచేసిన కాలం మూడు నెలలు,అంతే. మొదటి రోజుల్లో చేసిన ప్రతి ఉద్యోగం మూడేసినెలలే, బ్రాకెట్ కంపెనీ మొదలుకొని, ఈ సందర్భాలలో సమాజం, మనుషుల మనస్తత్త్వాలు,స్త్రీ పురుష సంబందాలు, డబ్బు చిక్కులు…అంతెందుకు జీవితం లో ప్రాక్టికల్ ట్రైనింగ్….:)

 మా యజమాని సుబ్బారావు గారి దగ్గరకి పెద్ద పెద్దవారు వచ్చేవారు, దానితో వీరందరితోనూ పరిచయాలు పెరిగాయి. చాలామందితో పరిచయాలయ్యాయిగాని ఒకరు మా పక్క ఊరి కోఆపరేటివ్ రూరల్ బేంక్ ప్రెసిడెంట్ శ్రీ ఈదర కొండలరావు గారి పరిచయం నా జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. ఈ రూరల్ బేంక్ లో అమ్మ సభ్యురాలు, అప్పుకి దరఖాస్తు చేసుకుంది, ఒక రోజు మురమండ వెళ్ళేం, ఓంటెద్దు బండి మీద. ఆ రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒంటెద్దు బండి కిరాయి రెండు రూపాయలు,అవే ఉండేవికావు. ఉదయం పది గంటలకి మురమండ బేంక్ కి చేరేం.సాయంత్రం దాకా కూచున్నాం, పని కాలేదు,తిరిగిపోదామనుకుంటుండగా కొండలరావు గారొచ్చేరు, నమస్కారం పెడితే మా గురించి వాకబు చేసేరు, పని చేసేవారు తక్కువమంది కావడంతో పని కాలేదని తెలిసి విచారించారు, ఈ సందర్భంలో నేను ఉపయోగపడగలనా? అడిగా, సెక్రెటరీ గారు ఉపయోగపడతానన్నారు, రేపటి నుంచి సాయం చేయడానికి వస్తానని చెప్పేను, మరి షావుకారుగారి మాటో అడిగారు కొండలరావుగారు. ఒక పదిరోజులు వారికి చెప్పివస్తా! వారి పని ఇక్కడనుంచి వెళ్ళేకాను,ఉదయమూ చేసి పెడతానంటే ఒప్పుకున్నారు, అమ్మ సంతకాలన్నీ పెట్టించుకుని, మరల అమ్మ రానక్కరలేకుండా, డబ్బు తరవాత తీసుకునేలా అమ్మకి చెప్పి వెళిపోయాం. మర్నాడు సుబ్బారావుగారికి చెప్పి ఒప్పించి, బేంక్ కి చేరి సాయపడటం మొదలు పెట్టేను. ఫారాలన్నీ నింపడం సంతకాలు పెట్టించడం కార్యక్రమం నేను చేపట్టి తొందర తొందరగా చేయడంతో ఊపందుకుని, అప్పులు మంజూరు వేగమయింది. ఇలా పని చేస్తుండగా బేంక్ కొత్త భవనంలోకి మారింది, భవనం వెనుక ఏవో సామాన్లు సద్దిస్తుండగా ”తమ్ముడూ” అన్నమాట వినపడితే తలెత్తి చూశా, ఎదురు వాకిటిలో అక్క కనపడింది……రమ్మని చెయ్యి ఊపితే వెళ్ళాను, ఇక్కడ పని చేస్తున్నావా? కొండలరావుగారు మంచివాడు, ఆయనను వదలకు,నీకు మంచి జరుగుతుందని చెప్పి, స్వీట్ చేతిలో పెట్టి పంపించింది. మర్నాడు ఉదయం బేంక్ కొచ్చేటప్పటికి అంతా చెవులు కొరుక్కుంటున్నారు, వాతావరణం వింతగా అనిపించింది. సెక్రెటరీ గారు “……. ఇంటికెళ్ళేవా?” అడిగారు, అవును అన్నా, నిన్న సాయంత్రం నువ్వెళ్ళిన తరవాత ప్రెసిడెంట్ గారొచ్చారు, నీ గురించి అడిగారంటే, నేను అక్క ఇంటికెళ్ళినందుకు అడిగినట్టుగా ధ్వనిస్తూ, ఇప్పుడే వెళ్ళి కలుస్తా అన్నా! ఆయన ఊళ్ళో లేరు,రేపొస్తారు అంటే నీరసపడ్డాను,నేను అక్క ఇంటికెళ్ళడానికి ప్రెసిడెంట్ గారు అడగడానికి ఏమైనా సంబంధం ఉందా గుంజాటన పడ్డాను, కొంత తరవాత నిబ్బరించాను, తప్పేం చెయ్యలేదు,భయమెందుకని అనుకున్నా!

మర్నాడు ఉదయమే ప్రెసిడెంట్ గారి దగ్గరకెళ్ళాను, ఆయన నవ్వుతూ పలకరిస్తే,నేను అక్క ఇంటి కెళ్ళిన సంగతి అక్క అన్నమాటలు చెప్పి, నేనేం తప్పు చెయ్యలేదన్న భావన వారికి కలగజేసి, నాకు మీరే సహాయం చెయ్యాలి జీవితంలో స్థిరపడేందుకని అడిగాను. నేను బేంక్ లో సహాయం చేసినందుకు కొంత మొత్తం పారితోషకమిచ్చారు. నేను బేంక్ లో ఉద్యోగం ఇవ్వగలనుగాని అది చిన్నది, ఉపయోగపడనిది. మీకు ఇంతకంటే మంచిభవిషత్తుకోసం ఒక మాట చెబుతానని, ఒక అప్లికేషన్ చేతిలో పెట్టి, రాజమంద్రిలో ఉన్న సహకార శిక్షణా సంస్థ వారి దరఖాస్థు ఇది, నిన్నను వెళ్ళి ఈ ఫారం తెచ్చాను. దీనిలో మీకు సీట్ రిసర్వ్ చేసి ఉంచాను, ఈ ట్రైనింగ్ పది నెలలు, ఫారం పూర్తి చేసి పట్టుకొస్తే నేను సంతకం చేసిస్తా, వెళ్ళి ఆ ట్రైనింగ్ అవండి, కోఆపరేటివ్ సూపర్ వైజర్ గా మంచి ఉద్యోగం వస్తుంది, నేను చూసిపెడతానుకదా అని హామీ ఇచ్చారు, ఒక పక్క సంతోషం, మరో పక్క గుండెల్లో రాయి పడింది…. ఇంటికొచ్చి అమ్మకి చెప్పా……

ఇక్కడ పని చేసిన కాలం బహు తక్కువేగాని మనుషుల్ని పరిశీలించడం అలవాటయింది, వృత్తులు, ప్రవృత్తులు తేడాగా ఉంటాయని తెలుసుకున్నా! అక్క గణిక కావచ్చు కాని ఆమె ప్రవృత్తి నన్ను ఆకట్టుకుంది, ఇతరులకు చేయగల ఉపకారం చేయాలనే ఆమె మాట నాకు నాటుకు పోయింది. శ్రీ కొండలరావు గారు నేనెవరో తెలియని సందర్భం, ఆయనకు నా వలన చిన్నమెత్తు ఉపకారం లేకపోయినా నాకు ఉపకారం చేయాలనే వారి ప్రవృత్తి…ఏమని చెప్పను? మెరిసేదంతా బంగారమూ కాదు, మెరవనిది బంగారం కాకాపోదు… అక్క మాటతో నాకు సహకారమిస్తే కొండలరావుగారు చేతతో సహకారమిచ్చారు, నేనెవరో తెలియకపోయినా జీవితంలో వీరు నా పట్ల ఎందుకు అభిమానం చూపారు? అది వారి సహజ స్వభావం…

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s