శర్మ కాలక్షేపం కబుర్లు-చదవేస్తే……

చదవేస్తే……

చదవేస్తే ఉన్నమతి పోయిందని, చదువుకోకముందు కాకరకాయ చదువుకున్న తరవాత కీకర కాయ అన్నట్టు గా ఉంది మన బేంక్ ల పని. ప్రధాని పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన వెంటనే పెద్దలగుమ్మాల్లో కట్టలు అందజేసిన ఘనత కలిగినవి మన బేంకులు. ప్రజలు సొమ్ముకోసం బారులు తీరితే ఏ.టి.ఏమ్ లలో పెట్టవలసిన సొమ్ము నల్ల ధనవంతులకు చేరవేసినవి మన ప్రభుత్వరంగ ప్రైవేట్ బేంకులు, అన్ని శాఖలు అందరూ అలా చేసేరననుగాని ప్రభుత్వ నిర్ణయానికి తూట్లు పొడిచిన ఘనత మన బేంక్ లదే అని చెప్పక తప్పదు. దొరికినవారే దొంగలు దొరకనివారెందరో! బేంక్ లకు తెలియక నల్లడబ్బు నేడు నగదు రూపంగా మరొక చోట లేదు, ఇది కఠోర సత్యం.

సామాన్యుడు వరసలో నిలబడి సొమ్ము తెచ్చుకోడానికి అవస్థ పడినా ప్రభుత్వంతో సహకరించాడు, కాని నేడు బేంక్ లు ఆ సామాన్యుడి నడ్డి విరిచే పనిలో పడ్డాయి, అంటే అతిశయోక్తి కాదు. బేంక్ పేరు చెబితే చాలు పన్నేసేలా ఉన్నాయి. ప్రభుత్వం నల్లధనాన్ని అరికట్టాలనుకుంటుంటే బేంక్ లు సామాన్యుడిని దోచుకోవాలనుకుంటున్నాయి. ప్రజలకి ఇబ్బంది కలగకూడదని ప్రభుత్వం అనుకుంటుంటే బేంక్ లు మాత్రం సామాన్యుడి కాతాలో సొమ్మెస్తే పన్ను,తీస్తే పన్ను, ఉండవలసిన సొమ్ము తగ్గితే పెనాల్టీ, క్రెడిట్ కార్డ్ పన్ను, నాలుగు సార్లకంటే ఎక్కువ సార్లు తీసుకుంటే పన్ను, మరో బేంక్ ఏ.టి.ఎం లో తీసుకుంటే పన్ను, సొమ్ము ఎంతైనా సరే మరొకరికి ట్రాన్స్ఫర్ చేస్తే పన్ను….. పన్ను,పన్ను,పన్ను ఇలా కాల్చుకుతినేస్తున్నట్టే వుంది. చిత్రమైన సంగతి ఒకే ఊళ్ళో ఉన్న మరో బేంక్ కాతాకి సొమ్ము మళ్ళించడానికి చెక్కిస్తే దానిని ఆ కాతాకి చేర్చడానికి బేంక్ లు తీసుకుంటున్న సమయమెంతో తెలుసా? దగ్గరగా పదిహేను నుంచి ఇరవై రోజులు. అంటే ఇలా చెక్కుల్ని నిరాదరణ చేయాలనీ, ఇంటర్ నెట్ ద్వారా సొమ్ము పంపిస్తే సొమ్ము గుంజచ్చనీ బేంక్ ల యోచన.

ఇప్పుడు బేంక్ లో అక్కౌంట్ ప్రతివారికి తప్పదు, ఆఖరికి బేంక్ ముందు రెండు సార్లు తచ్చాడినా అక్కౌంట్ నుంచి సొమ్ము పన్ను రూపంలో వసూలు చేసేలా ఉన్నాయి,బేంక్ లు. దీనికి ప్రభుత్వ ప్రవేట్ బేంక్ లకి తేడా ఉన్నట్టు లేదు. సామాన్యుల సొమ్ము ఇలా పన్ను రూపంలో దోచుకుని బేంక్ లు తమ నష్టాలను పూడ్చుకోవాలనుకుంటున్నాయనుకుంటా. ఇది రిజర్వ్ బేంక్ వారి దృష్టికి రాలేదా? వారు దీనిని సమస్యగా చూడటం లేదా? నల్ల ధనవంతులు ప్రభుత్వానికి, బేంక్ లకు దొరక్కుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోడం కోసం ప్రయత్నిస్తుంటే, బేంక్ లు అదే సావకాశాన్ని చిన్నవారి నడ్డి విరిచేందుకు ఉపయోగిస్తున్నాయి.

నగదు చెల్లింపుకు సామాన్యులు ఇష్టంగానూ లేరు, వారికి బేంక్ తప్పించి మరోదారిలేకుండా చేసి, వారిని పన్ను,సేవ రూపంలో బేంకులు దోపిడి చేయదలచుకున్నాయా? ఏప్రిల్ ఆరవతేదీన బేంకులను వినియోగించుకోవద్దనే స్థాయికి ఈ సమస్య పెరిగిపోయిందన్నది రిజర్వ్ బేంక్, ప్రభుత్వ దృష్టికి రాలేదా? చిన్న విషయంగా తీసుకుని దీనిని గనక అజమాయిషీ చేయడానికి, నియంత్రించడానికి రిజర్వ్ బేంక్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు చాలా ఘోరంగానే ఉండబోతాయి. బేంక్ అక్కౌంట్ నుంచి బేంక్ లు తీసుకుంటున్న సొమ్ము ఎందుకుతీసుకుంటున్నది వివరాలుండవు,అడిగితే చెప్పేనాథుడూ కనపట్టం లేదు, ఇదీ నేటి బేంక్ ల పరిస్థితి. సామాన్యులు నల్లధనవంతుల్ని పట్టుకోడంలో ప్రభుత్వానికిచ్చిన మద్దతుకు విలువలేనట్టే, ఇలా కొనసాగితే. ప్రతి విషయమూ ప్రధాని కలగజేసుకుంటే కాని పని కాదా? ఇది సామాన్యులను దొలుస్తున్న ప్రశ్న…….ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వ అడుగుజాడల్లోనే ప్రయాణిస్తోందా? బేంక్ లను కట్టడి చేయకపోతే జరగబోయేది నేను చెప్పక్కరలేదు,బేంక్ లు ప్రభుత్వం చేస్తున్న ఆర్ధిక సంస్కరణలకు వ్యతిరేకంగా ఉన్నాయి, గుర్తించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి….తస్మాత్ జాగ్రత

Follow on http://www.offprint.in/

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-చదవేస్తే……

 1. ఏప్రిల్ ఆరున బాంక్ వాడటం మానెయ్యొడం కాదు, మార్చి 31నే బాంక్ లో ఉన్న డబ్బంతా తీసి ఇంట్లో పెట్టుకోండి, అందరూ ఇలా చేస్తే ఇయర్ ఎండ్ లెక్కలు చూసుకున్నాక బాంకులే మన కాళ్ళ బేరానికి వస్తాయి.

  • arun31paగారు,
   ఏ పని సాధించుకోడానికైనా నాలుగు ఉపాయాలు. అవి సామ,దాన,భేద,దండో పాయాలన్నారు పెద్దలు. ముందు చెప్పి చూద్దాం, బేంక్ లు, రిజర్వ్ బేంక్, కదులుతాయేమో!

   ఆ తరవాత ప్రభుత్వం ఉంది. వారూ వినరూ! చివరిమాట! తప్పనిదే!

   బేంక్ లు ప్రభుత్వ నిర్ణయాలను ఎదిరించే స్థితికి ఎదిగిపోయినట్టే ఉందండి. రిజర్వ బేంక్ మాట బేంక్ లు వినడం అనేది నేతి బీరకాయలో నెయ్యి ఉన్నంత నిజమనిపిస్తోంది.
   ధన్యవాదాలు.

 2. కొండ నాలుక కి మందు వేస్తె ఉన్న నాలిక కి ఊడినట్లుంది ఈ బ్యాంకు ల వ్యవహారం . ఎక్కువ వడ్డీ రాకపోయినా ,కనీసం అసలుకి మోసం రాదనీ .కావాలనుకున్నప్పుడు డబ్బు తీసుకోవచ్చని ‘సామాన్యులు ‘బ్యాంకు లను నమ్ముకుంటారు .చిన్న చిన్న లావాదేవీలు చేస్తారు .గొర్రె కసాయివాడిని నమ్మినట్లుంది అనుకో వలసి వస్తోంది. “మాన్యవరుల ‘ చెప్పుచేతల్లో నడిచే ప్రభుత్వాలు సామాన్యుల నడ్డి విరవక పొతే ఎలా ?
  బ్యాంకు వైపు చూస్తె చార్జీలు వసూలు చేస్తారేమో అన్నమాటకి నేను మౌల్వీ నసీరుద్దీన్ కథల్లో -షశ్లీకులనే పదార్ధం అమ్మే దుకాణం ముందు నిల్చున్న మౌల్వీ ని ,” వాసన పీల్చేవు డబ్బు కట్టు” అని వర్తకుడు గదమాయించటం అన్నది గుర్తు చేసుకోకుండా ఉండలేక పోతున్నాను.ఎవరైనా దీనారాల గలగల వినిపించి” ఆ వాసన కి ఈ చప్పుడు కీ చెల్లు ” అని చెప్పగలిగే వారు వస్తారా అని ఎదురు చూస్తున్నాము కదా!
  ఎవరో వస్తారని ఎదో చేస్తారని ……డా.ఆర్ .సుమన్ లత

  • డా.ఆర్ .సుమన్ లతగారు,
   నమ్మకంతో బేంక్ లో దాచుకోడం పాతరోజుల్లో మాటండి. నేడు బేంక్ కాతా తప్పనిసరి, ప్రభుత్వ నిర్ణయం వలన. కరన్సీ లేని సమాజం కోసం ప్రభుత్వ ప్రయత్నం. ఇది చాలా అవకరాలకి విరుగుడే,కాదనడం లేదు. కాని దీని ముసుగులో అవసరాన్ని ఆసరాగా తీసుకుని బేంక్ లు మనమీద, మన సొమ్ముతో జులుం చేద్దామనుకోడమే నచ్చని మాట. గొర్రెలలా చూస్తూ ఊరుకోడం పాతరోజుల్లో మాటండి,

   ఎవరోవస్తారని పాతమాటండి, ఎవరూరారు, మనపని మనమే చేయించుకోకతప్పదు, నడుం బిగించాల్సిందే !!
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s