శర్మ కాలక్షేపంకబుర్లు-ద్రోహం

కర్ణుడు-6

ద్రోహం

    కర్ణుడు మొదటి సారిగా అర్జునునితో తలపడినప్పుడు యుద్ధం చెయ్యడానికి సూర్యాస్తమయం అడ్డొచ్చింది. ఆ తరవాత తలపడింది ద్రౌపదీ స్వయంవరంలో, అప్పుడూ బ్రహ్మతేజం తో తలపడటం కష్టమని సాకు వెతుక్కుని తిరిగిపోయాడు. ముచ్చటగా మూడో సారి అర్జునునితో కాదు, చిత్ర రథుడనే గంధర్వునితో కూడా కాదు, అతని సేనతో తలపడి పరాభవంపొంది యుద్ధరంగంనుంచి పారిపోయాడు. ఈ యుద్ధం ముందుగా అనుకున్నది కాకపోయినా బలగం కూడా ఉన్నది. తన రథాన్నే కాపాడుకోలేక పారిపోయిన మొనగాడు. దుర్యోధనునికి తీరని అవమానం మిగిల్చిన ధీరుడు.

ఆ తరవాత కర్ణుడు పాల్గొన్న యుద్ధం ఉత్తరగోగ్రహణం. కారణాలేమైతేనేమి యుద్ధం సిద్ధమైంది. యుద్ధానికి కురుబలంతో తలపడడానికి వచ్చినది ఒక్కడే,అర్జునుడు. అంతకు ముందే కర్ణుడు ద్రోణున్ని తూలనాడటం, ”నేను, వచ్చేవాడు అర్జునుడైనా, ఎవడైనా సరే గుండెలు చీల్చేస్తా”నని చెప్పుకోవడం జరిగిపోయింది. యుద్ధానికి వచ్చిన అర్జునుడుని ముందుగా ఎదుర్కొన్నది కురుకుమారులు. అందులో ఒకడైన శత్రుంతపుడు, ఇతన్ని ఒక్క బాణంతో యమసదనం చేర్చేడు అర్జునుడు. ఆ తరవాత ఎదుర్కొన్నవాడు సంగ్రామజిత్తు, ఇతన్నీ ఒక్క బల్లెంపోటుతో చంపేశాడు, అర్జునుడు. ”ఛా ఇదేంటీ! ఇంతమంది యోధులుండి కుర్రాళ్ళని ముందు పెట్టేరు” అని చింతిస్తాడు, అర్జునుడు. అప్పటికి వీరి వెనకనే ఉన్న కర్ణుడు ముందుకొచ్చి యుద్ధం చెయ్యడం మొదలెట్టి కాసేపు యుద్ధం చేసి ఆ తరవాత నిలువలేక యుద్ధం నుంచి పారిపోయాడు. అర్జునుడు అందరిని గెలిచి సమ్మోహనాస్త్రం వేసి అందరిని నిద్రా వశులనుచేసి వారి తలపాగా కుచ్చులు కోయించుకుని గోవులను తోలుకునిపోయాడు.

ఈ సంఘటనతోనే ఒక నానుడి పుట్టింది, ”ఆవుల్ని మరలించినవాడే అర్జునుడు” అని. గొప్ప చెప్పుకున్న కొద్దిసేపటిలోనే దాన్ని కాదనుకుని యుద్ధం నుంచి పారిపోయిన వీరుడు కర్ణుడు, అంతే కాదు తన సోదరుడు,పెంచిన తల్లి రాధ కొడుకు, సంగ్రామజిత్తును యుద్ధానికి బలి ఇచ్చినవాడు. దగ్గరే ఉండి తమ్ముణ్ణే కాపాడుకోలేకపోయిన మొగాడు. పెంచిన తల్లి కడుపులో చిచ్చు పెట్టిన ఘనుడు. దుర్యోధనునితో అర్జునుడి డొక్క చీలుస్తా,డోలు కట్టేస్తా అని దర్పాలుపోయి, అవమానం మిగిల్చిన ధీరుడు.

దీని తరవాత ముందుకెళితే అసలు కర్ణుడి గురించి ఊహించడం కష్టం. రాజ్యభాగం కోసం శాంతి ప్రయత్నంగా రాయబారాలు జరుతున్నాయి, అలా జరుగుతున్న కాలంలో సంజయుని రాయబారం పంపుతాడు ధృతరాష్ట్రుడు, రాయబారం వెళ్ళి వచ్చినవాడు సభలో వివరాలు చెబుతున్న సమయం…బలాబలాలు,పోలికలు ఇలా చర్చ జరుగుతున్న సమయం, సభలో ఉన్నవారిలో ఎక్కువమంది దుర్యోధనునితో, ”సంధి చేసుకో”మని చెబుతున్న సమయంలో, దుర్యోధనుడు తండ్రితో తన వీర పరాక్రమాలు చెబుతూ, పాండవులేకాదు మేమూ గొప్పవాళ్ళమేనంటుంటుండగా కర్ణుడు కలగజేసుకుని గురువు ”నాకు అవసరసమయాల్లో అస్త్రాలు గుర్తుకురాక పనిచెయ్యవని ఇచ్చిన శాపం మరల్చేరు, ఆ తరవాత, కాని ప్రజలంతా నాకీ శాపం ఉందని తలుస్తారు, భీష్ముడు,ద్రోణుడు మిగిలిన వీరులు చూస్తుండగా గొప్ప యుద్ధం చేసి పాండవులను సంహరిస్తా, రాబోయే యుద్ధంలో” అంటే భీష్ముడు ”యముడు నిన్ను ఇలా మాటాడ్డానికి ప్రేరేపిస్తున్నాడు,నీవీరత్వం తెలియనిదేం కాదు, నీదగ్గరున్న శక్తి ఆయుధం కృష్ణుని ముందు మట్టిగొట్టుకుపోతుంది. నాగాస్త్రం గతీ అంతే” అన్నాడు. ఇది విన్న ధృతరాష్ట్రుడు ”దుర్యోధనా! నేను,బాహ్లికుడు,భీష్ముడు నీకు దగ్గరివారం,నీ క్షేమంకోరేవారం, యుద్ధాలు జరగలేదా? నిన్నగాక మొన్న జరిగిన యుద్ధంలో ఒక్కడే ఒక్కడు అర్జునుడు వచ్చి మిమ్మల్ని అందరినీ జయించి ఆవుల్ని తోలుకుపోలేదా? అప్పుడక్కడ నువ్వూ, కర్ణుడూ లేరా? ఎందుకోయ్! ఈ వీరాలాపాలు, ధర్మరాజుతో సంధి చేసుకో కొడకా” అన్నాడు. ”ఈ కర్ణుడునీ చావు కోరుతున్నాడోయ్! యుద్ధం వద్దు” అన్నాడు. ఇది విన్న కర్ణుడు కోపంతో లేచి ”భీష్ముడు నన్ను లెక్కచేయటం లేదు గనక భీష్మునికి యుద్ధం లో నా తోడ్పాటు లేకుండా ఉండేందుకుగాను, భీష్ముడు యుద్ధంలో పడిపోయేదాకా నేను అస్త్రసన్యాసం చేస్తున్నానని” పలికి కోపంతో సభలోంచి లేచిపోయాడు.

భీష్మునికి తన సాయం అందకుండేందుకు అస్త్రసన్యాసం చేస్తున్నానన్న కర్ణుడు, నిజానికి ఎవరికి సాయం చేశాడు? భీష్ముడు స్వఛ్ఛంద మరణం ఉన్నవాడని తెలిసి ఆయన పడిపోయేదాకా యుద్ధం చెయ్యననడమంటే ఆయన చనిపోవాలనిగాని అస్త్రసన్యాసం చేయాలనికాని కర్ణుని కోరిక కదా! ఇదెవరికి ఉపయోగం? ఇదెవరికి సాయం చేయడం? తను యుద్ధం చేస్తే ఆ సహాయం దుర్యోధనునికా భీష్మునికా?

యుద్ధంలో సేనాని మరణించాలని కోరుకోవడం, యుద్ధం గెలుస్తామన్నమాటా?
తన పక్షంలో ఉన్న గొప్పవిలుకాడు పరశురాముని జయించినవాడైన భీష్ముని చావు కోరడం దుర్యోధనునికి మేలు చేయడమా? దీన్నేమంటారు…ద్రోహం

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s