శర్మ కాలక్షేపంకబుర్లు- వంచన

కర్ణుడు-7

వంచన

మహాభారతం. ఉద్యోగపర్వం. ఆశ్వాసం౪…౧౯ నుండి౭౧ వరకు.

పాండవులు రాజ్యభాగం పొందడానికి సంధి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంజయ రాయబారం తరవాత పాండవులు శ్రీకృషుణ్ణి రాయబారిగా పంపించారు. కృష్ణుడు రాయబారంలో చెప్పవలసినవన్నీ చెప్పారు, దుర్యోధనుడు వాడి సూదిమొన మోపినంత కూడా భూమి పంచి ఇవ్వనని చెప్పేశాడు. 

కృష్ణుడుకి అంతా వీడ్కోలు ఇస్తున్న సమయంలో రథం ఎక్కబోతూ కృష్ణుడు ”నన్ను కొంత దూరం సాగనంపి వత్తువు, రమ్మని” కర్ణుని చేయి పట్టుకుని రథం ఎక్కించుకున్నారు. రథంలో ఉన్న సాత్యకి గుర్రం ఎక్కి వెనకొచ్చాడు. కృష్ణుడు

”కన్నెప్రాయమునందు భాస్కరుని కరుణ
పది నెలలు నినుమోసి కన్న పడతి కుంతి
చేరగాదీసి నిను పెంచినది రాధ,
నీవు రాధేయుండవుగావు నిశ్చయముగా!”

అని చెబుతూ
”కుంతి చేత రవి చేత నిజంబు, నిజంబు, నిజంబని నీకు సాక్ష్యమిప్పించెద” అన్నాడన్నారు తిరుపతి వేంకటకవులు. కవిత్రయము చెప్పినమాట మాత్రం కుంతి కొడుకువనే చెప్పేరు…. ఆ తరవాత ”నువ్వు పాండవుల పక్షానికి రా! నీకు సామ్రాజ్యం పట్టాభిషేకం చేయిస్తా” అని చెప్పేరు. ( కవిత్రయంలో మరోమాటా ఉంది ”నిన్ను ద్రౌపది ఆరవ భర్తగా స్వీకరిస్తుందని”, కాని ఈ మాట వ్యాసభారతంలో లేదట, నిర్ణయంగా చెప్పలేను, మూలం దొరకలేదు గనక.) విన్న కర్ణుడు రహస్యంగా

”నేనూ కర్ణా,కర్ణీగా ఈ విషయం విన్నాను. పెంచిన తల్లి మూత్రపురీషాలెత్తి, నన్ను కళ్ళల్లో వత్తులు వేసుకుపెంచింది, ఇక్కడ తమ్ముళ్ళు చాలామందే ఉన్నారు, ఇప్పుడు నేను కుంతికొడుకునంటే బాగుంటుందా? వీళ్ళందరిని వదిలేసి నేను అటుపోవడం గౌరవం,ధర్మం చెడవా? నువ్వటురా అని నన్ను పిలవడం న్యాయమా? నేను అర్జునుని ఎదుర్కునేవాడనని దుర్యోధనుని నమ్మిక, కుంతి కొడుకునని అటువస్తే అర్జునునికి భయపడి అటువచ్చాననుకుంటారు, జనం నవ్వుతారు. అదీగాక నా మీద దుర్యోధనుడు చాలా ఆశలు పెట్టుకున్నాడు, నేను సూతుడనన్న భావం ఎప్పుడూ కనపడనివ్వలేదు. ఇక ధర్మరాజు నేను అన్నగారినని తెలిస్తే రాజ్యం కావాలనే కోరడు, ధర్మరాజు రాజ్య పరిపాలన చేయాలి, అతను ధర్మాత్ముడు. ధర్మరాజు చేస్తున్న యుద్ధ యజ్ఞంలో తమ్ముళ్ళు ఋత్విజులు,నీవు ఉపద్రష్టవు, దుర్యోధనుడు యజ్ఞపశువు ఇలా కురుక్షేత్ర సంగ్రామం కావాలి, మా లాటివాళ్ళంతా సద్గతి పొందాలి. నేను కుంతీ పుత్రుడనన్న మాట రహస్యంగానే ఉంచు” అన్నాడు.

దానికి కృష్ణుడు ”ఏడెనిమిది రోజుల్లో అమావాస్య వస్తోంది, ఆరోజు యుద్ధమని చెప్పు అక్కడున్నవాళ్ళందరికి” అని చెప్పేరు. కర్ణుడు, ”నాకు దుస్వప్నాలొస్తున్నాయి, దీనంతకీ కారణం నేను,శకుని,దుశ్శాసనుడు, పాండవులు కౌరవులు కలిస్తే నేనటు రావచ్చు” అన్నాడు. కృష్ణుడు కర్ణుడిని రథం దింపి తాను ముందుకెళిపోయారు,సాత్యకిని ఎక్కించుకుని.

ఆ తరవాత కుంతి కర్ణునికి, అతను తన కొడుకని చెప్పడం మంచిదని తలపోసి, కర్ణుడు నదీ తీరంలో ఉన్నాడని తెలుసుకుని, అతను ఉదయ కార్యక్రమాలు పూర్తయేదాకా వేచి ఉంది. కుంతిని చూసిన కర్ణుడు గోత్ర ప్రవరలతో నమస్కారం చేస్తే ”నీవు నాకుమారుడవు, సూర్యునివలన కలిగినవాడివి, నువ్వు పాండవులకు కౌరవులకూ అన్నగారివి, ఈ సామ్రాజ్యం ఏలుకో, ఇలా ఒకరికి ఊడిగం చేయడమేల? సూతుడనని కించపడడమేల? “అంటుంది. అప్పుడు సూర్యుడు కూడా నిజమని చెబుతారు.

ఐనా కర్ణుడు చలించక, ఇప్పుడు నేను కుంతీ పుత్రుడనన్న మాట చెప్పడం బాగుంటుందా? నా జన్మ రహస్యం, ఇప్పుడు వెల్లడించడం మేలా? అర్జునుణ్ణి అంతా మహావీరుడంటుంటే ఇప్పుడు నేను కుంతి కొడుకునని చెబితే ప్రజలు అర్జునుడికి భయపడి కుంతి కొడుకునంటున్నాడని నవ్వరా? ఇన్నాళ్ళు కౌరవుల కూడు కుడిచినవాడిని ఇప్పుడు వదలిపోవడం న్యాయమా? నువ్వేమనుకున్నా, నేను దుర్యోధనుని కొరకు నీ కొడుకులతో పోరుసాగిస్తా! నువ్వెంత చెప్పినా ఇదే నా నిర్ణయం. నీవు ఇదే పని మీద నా దగ్గరకొచ్చావు గనక పాండవులలో అర్జునుడు తప్ప మిగిలినవారెవరు దొరికినా చంపనని వరమిచ్చాడు, అర్జునుణ్ణి మాత్రం వదలనని, అర్జునుని పై కోపం ఉన్నదనీ చెప్పాడు. అర్జునుడి చేతిలో చావూ కీర్తి కలిగించేదే! ఎటైనా నీకు ఐదుగురు కొడుకులే ఆరుగురు కాదు” అని చెప్పి వెళిపోతాడు.

పరిశీలిస్తే, రెండు సంఘటనల్లోనూ వారు చెప్పదలచుకున్నది సూటిగా చెప్పేరు. కర్ణుడు కూడా విషయం సూటిగానే చెప్పేడు, ఎవరేమనుకున్నా తాను పాండవులవైపు రానని. ఇంత ధృడ నిశ్చయం తీసుకోడానికి కారణాలు కర్ణుడు తనంతతాను పాండవుల పట్ల చేసిన,చేయించిన దురాగతాలు, పాంచాలి పట్ల చేసిన వికృత చర్య. నిజంగానే పాండవులవైపు వెళ్ళినా ఎవరు క్షమించినా క్షమించకపోయినా, ఇద్దరు మాత్రం కర్ణుడిని తప్పని సరిగా ఇబ్బంది పెట్టే ఉండేవారు, వారిద్దరు, భీముడు,ద్రౌపది.అందుకే కర్ణుడు అధికార దాహానికి లొంగిపోనట్టు ఉండిపోయాడు. తరవాతది దుర్యోధనునితో సేవా ధర్మం, దీన్ని కర్ణుడు బాగా పోషించాడనే చెప్పాలి.

కర్ణునిలో ఉన్నవి ద్వంద ప్రవృత్తి, కీర్తి కాంక్ష, ఇవే అతని బలహీనతలు. తనలోనిలోని అసలు మాట తననోటితో తనే కృష్ణునితో చెప్పుకున్నాడు కూడా. తాము చేస్తున్నది తప్పు అనేభావం కూడా చెప్పుకున్నట్టే. యుద్ధంలో తాము మరణిస్తామని,గెలవని కూడా చెప్పుకున్న మాటే. ఏం జరగబోతోంది, జరుగుతుందన్నది, జరగాలని తాను కోరుకుంటున్నది, కర్ణుని నోటివెంట వచ్చింది. కుంతి తనకు తానుగా ఏ వరమూ కోరలేదు, కోరకపోయినా అర్జునునితప్ప మిగిలినవారిని చంపనని వరమివ్వడం, అతనిలోని ద్వైదీభావానికి నిదర్శనం. అర్జునుని చంపుతా దొరికితే అన్న మాట మొదటిరోజునుంచి గూడు కట్టుకుని ఉన్న ఆత్మన్యూనత పరిణామం. దుర్యోధనునివద్ద కీలక విషయాలు దాచడం…వంచన.

మరొక్క టపాతో ఈ వారం చివర కర్ణుని ధారావాహిక ముగిస్తున్నా!

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- వంచన

 1. మహాభారతం టి.వి. సీరియల్గా చూసినప్పుడు కర్ణుడి మీద ఒకలాంటి జాలి కలిగేది. కాని అసలు సంగతి వేరే వుందన్న మాట.

  • చి.సౌ. సిరిమల్లెలు
   కర్ణుడు తల్లిచే వదలివేయబడడం ఒక విషాద సంఘటన. ఆ రోజులలో అటువంటి సంతానానికి అనగా కన్నెగా ఉండి విచాహం కాకముందు కలిగిన సంతానాన్ని కూడా సంఘం ఆదరించింది, కుంతి ఎందుకలా చేసింది? చెప్పలేం

   నేటి కాలంలో కర్ణుల సంఖ్య పెరుగుతున్నది,
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s