శర్మ కాలక్షేపంకబుర్లు- కర్ణుడు8-చివరగా

కర్ణుడు. 8

చివరగా

   మహాభారత యుద్ధం ప్రారంభమయింది. పదవరోజు యుద్ధంలో సాయంత్రానికి భీష్ముడు ఒరిగిపోయారు. ఆయనను చూడడానికందరూ వెళ్ళారు. అందరూ వెళ్ళిన తరవాత ఒంటరిగా వచ్చాడు కర్ణుడు, భీష్ముని దగ్గరకి . భీష్మునికి పాదాభివందనం చేసి ”నామీద కోపంతో కాక వాత్సల్యంతో మాటాడవా?” అని అడుగుతాడు. ఈ మాటవిన్న పితామహుడు కర్ణుడిని ఒకచేత్తో దగ్గరకు తీసుకుని ప్రేమగా ”నీవంటే కోపమెప్పుడూ లేదు, నీవు దుర్యోధనాదులను పెడతోవ పట్టిస్తున్నావని, సరిచేయడానికి ప్రయత్నమే తప్పించి, అది కోపంకాదని” చెప్పి, దగ్గరలో ఉన్నవారందరిని దూరంగా పంపి, ”కర్ణా! నీవు కుంతీ కుమారుడవు,పాండవులతో కలసి సుఖంగా బతుకు” అన్నారు. దానికి కర్ణుడు” ఈ మాట పెద్దల ద్వారా నేనూ విన్నాను. పాండవులు బలవంతులు,వారికి హరి ప్రాపుంది, వాళ్ళని జయించలేమనీ తెలుసు. దుర్యోధనుడు చూపుతున్న మన్నన కాదని అటుపోగలనా? అది వీర ధర్మమా? ఇదేగాక చాలా మాటలన్నాను,పాండవులను చాలా సార్లు పరాభవించాను కూడా సభలలో, వాళ్ళకి చేటు కోరేను,వీరికి వారికి వైరం పెంచాను. ఇప్పుడు యుద్దమే శరణ్యం.సర్వం దైవాధీనం, మన చేతుల్లో ఏమీ లేదు, నువ్వు మరో మాటాడక నన్ను శత్రువులమీదకి పంపు, నా సేవా ధర్మం నెరవేరుస్తా” అన్నాడు. దానికి పితామహుడు ”నువ్వంతటివాడవని ఎరుగుదును, సుయోధనుడు నీ భుజబలం మీదకదా ఆధారపడ్డది, అతనికి ప్రియమైనది చేపట్టమ”న్నారు.

    ఈ సంఘటన మొదటిలో కర్ణుడు చిన్నపిల్లవాడిలా ప్రవర్తించాడు, ఐనవారి ఆప్యాయతకు దూరమైనవాని మనస్తత్వమే ప్రదర్శించాడు. ఆ సమయంలో కూడా తాతా అనిపిలవలేకపోయాడు, కాని భీష్ముడు అలా ఉన్నా మనవడిని ఒంటి చేత్తో కౌగలించుకున్నాడు. ఈ సంఘటన చదివితేనే గుండె పట్టేస్తుంది. ఇప్పుడు తన మనసులోని మాట భీష్మునికి చెప్పుకున్నాడు, నిజానికి తప్పూ తెలుసుకున్నాడు, సభలో వారిని పరాభవించినది గుర్తుచేసుకున్నాడు. శత్రుత్వాన్ని పెంచి పోషించాననీ చెప్పుకున్నాడు, దీనంతకీ కారణం అర్జునుని,ద్రౌపది పట్ల అసూయ. కాని దిద్దుకోడానికి సావకాశమే రాలేదు.

  తాను స్వయంగాను, దుర్యోధనుని మెప్పుకై పాండవులపట్ల చేయరాని అపరాధాలే చేశాడు కర్ణుడు, వాటికి కారణాలూ చెప్పుకున్నాం. కాని దుర్యోధనుని పట్ల కూడా కర్ణుడు తెలిసి చేసిన ఘోరమైన అపరాధాలు

1. తాను కుంతీ కుమారుణ్ణని పూర్తిగా తెలిసిన తరవాత కూడా నిజం, దుర్యోధనునికి చెప్పకపోవడం.
2. కుంతికి అర్జునుని తప్ప మిగిలినవారు దొరికినా చంపనని వరమిచ్చిన మాట, దుర్యోధనునికి చెప్పకపోవడం.
3. గురు శాపంతో అవసరానికి అస్త్రాలు పని చేయకపోవడం నిజమన్న సంగతి దుర్యోధనునునికి తెలియనివ్వకపోవడం.
4. యుద్ధంలో ఏం జరగబోతోందన్నది తనకు తెలిసి కూడా మిత్ర ధర్మంగా నైనా దుర్యోధనునికి చెప్పకపోవడం.

కర్ణుడలా ఎందుకు చేసేడు? ఆత్మన్యూనత,అసూయ,ఈర్ష్యగామారి, ఆపై, ద్వేషమై, అశక్త దుర్జనత్వంగా మారి, పాండవులను వేధించాడు. విధి లిఖితం…

కర్ణుని పట్ల లోకం మాట

నరు చేతను నా చేతను
వరమడిగిన కుంతి చేత పారుని చేతన్
ధరచే భార్గవు చేతను
నరయంగా కర్ణుడీల్గె నార్వురి చేతన్.

ఇదేగాక తిరుపతి వేంకట కవులు తమ పాండవాశ్వమేధం నాటకంలో నారదుని పాత్రతో ఇలా అనిపిస్తారు.

గోవధమ్మునకు సంకోచించి వేడిన
తఱిని విప్రుడు దాపడేని
బ్రహ్మాస్త్రమును గొనుపట్టున భార్గవు
డెరిగి చెచ్చెర శపియింపడేని
పార్థునందలి పక్షపాత బుద్ధిని నింద్రు
డరిగి తన్నునుబిచ్చమడగడేని
యర్ధరథుని జేసి యవమానపఱచి భీ
ష్ముండసూయ వొకింత జూపడేని

కుంతి”వర”మని పలుమాఱు గోరదేని
శల్యసారధ్యమను ముప్పెసంగదేని
కృష్ణుడన్యాయపథము సాగింపడేని
గర్ణునోడించువారు జగానగలరె

ఈ తరవాతంతా యుద్ధమే. యుద్ధమంటే చావడమో చంపడమో! అక్కడ ధర్మాధర్మాల విచక్షణ కు తావులేదు. అందుచేత కర్ణుడిని ప్రత్యేకంగా చూడడం సరికాదనే నా అభిప్రాయం. అందుచేత దీనిని ముగిస్తున్నా.

కర్ణుడి పాత్ర మీకెలా కనపడిందో దాన్ని బట్టి మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవచ్చు.

కర్ణుడి పాత్ర ఏమి? మీరే నిర్ణయించుకోండి…..

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- కర్ణుడు8-చివరగా

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s