కంటికి నిద్ర వచ్చునే?
పాండవులకు రాజ్యభాగం ఇచ్చిన తరవాత వారొకపట్టణం కట్టుకున్నారు, మయుడనేవాడు ఒక సభాభవనాన్నీ నిర్మించి ఇచ్చాడు. ఆ భవనాన్ని చూడ్డానికని రాజసూయం ఐపోయిన తరవాత దుర్యోధనుడు,శకుని ఉండిపోయారు.
” అట దుర్యోధనుండు శకునియుం దానును సభాభవనంబు జూచు వేడుక నందుగొన్ని దినంబులుండి యొక్కనాడు………………………..విమల మణిస్థలంబు జలాశయంబుగా వగచి పరిధానంబెగ ద్రోచికుని స్పటిక దీప్తి జాలపరివృతంబైన జలాశయంబు స్థలంబుగా జూచి కట్టిన పుట్టంబు దడియం జొచ్చి క్రమ్మఱిన వానింజూచి పాంచాలియు బాండు కుమారులు నగిరంత” సభా ప.ఆశా.2…86
సాధారణ నేలను జలాశయంగా అనుకుని పంచ ఎగ్గట్టి, జలాశయాన్ని మామూలు నేల అనుకుని అడుగేస్తే పంచె తడిసింది దీన్ని చూసి పాండవులు పాంచాలి నవ్వేరు.
ఇది తెలిసి ధర్మరాజు భీముని చేత పొడిబట్టలు దుర్యోధనునికి అందజేశాడన్నారు.ఇది కవిత్రయం మాట.
కాని సుయోధనుడు ఏం జరొగిందో వివరంగా తండ్రికి ఇలా చెప్పుకున్నాడు. ”నిర్మల స్ఫటిక శిలా నిర్మితంబై……………………….జలబుద్ధింజేసి బరిధానోత్కరణంబు సేసి విమలశిలాతలబుద్ధి నుదకపూర్ణంబున వాపి సొచ్చి కట్టిన పుట్టంబు దడియం ద్రెళ్ళిన నన్నుంజూచి వృకోదరుండు నగియె. దానినంతయు నెఱింగి ధర్మరాజచోదితులైన కింకరులు నాకు పరిధానంబు దెచ్చి యిచ్చిరి మఱియు……..యనేక సహస్ర విలాసినీపరివృతయయి యున్న ద్రౌపది నగియె నంత నకుల సహదేవులు పఱతెంచి యిదె వాకిలి ఇట వచ్చునది యని నన్నుం దోడ్కొనిపోయిరట్టి సభాప్రలంభంబు నాకు హృదయశల్యంబయి యున్నయది.” సభా ప.ఆశా2….140
స్పటిశిలామయమైన ప్రదేశంలో నీరుందనుకుని పంచె ఎగగట్టేను, మరోచోట మామూలు ప్రదేశమని కాలేస్తే నీటితో పంచె తడిసింది, అది చూచి భీముడు నవ్వేడు. అంతా తెలిసిన ధర్మరాజు సేవకులతో పొడిబట్టలు పంపేడు. ఆ తరవాత అనేకవేల చెలికత్తెలతో ఉన్న ద్రౌపది నవ్వింది అని చెప్పుకున్నాడు.
ముందు వ్యాసుడు చెప్పినదానికి దీనికి కొంత తేడా ఉంది గమనించారా? వ్యాసుడు పాండవులు,ద్రౌపది నవ్వేరన్నారు,దుర్యోధనుడు భీముడు నవ్వేడు, ఆతరవాత ద్రౌపది చెలికత్తెలతో ఉన్నది నవ్వింది,నకులసహదేవులు దారి చూపించారు. అన్నాడు. ఇందులో ఏది నిజం? రెండూ నిజమే ఎలాగంటే ఇద్దరు చెప్పినదానిలోనూ ధర్మరాజు లేడు. దుర్యోధనుడు చెప్పినదానిలో నకులసహదేవులు దారి చూపారన్నాడు. మిగిలినవారు ఇద్దరు వాళ్ళు భీముడు,అర్జునుడు. ద్రౌపది నవ్విందని ఇద్దరిమాటా. అసలు దుర్యోధనునికి బాధ కలిగించినది భీముని నవ్వేగాని ద్రౌపది నవ్వు కాదు 🙂
ఎందుకంటే
కంటికి నిద్రవచ్చునే సుఖంబగునే రతికేళి జిహ్వకున్
వంటకమిందునే, ఇతర వైభవముల్ పదివేలు మానసం
బంటునె, మానుషంబుగలయట్టి మనుష్యున కెంతవానికిన్
గంటకుడైన శాత్రవు డొకండు తనంతటివాడు గల్గినన్ (కాశీఖండం.)
కంటి మీద కునుకొస్తుందా? రతికేళి సుఖంగా ఉంటుందా? రుచికరమైన వంటకం జిహ్వకు రుచిగా తోస్తుందా? అంతెందుకు పదివేల వైభవాలు మనసుకి పడతాయా? పౌరుషం కలిగినవారికి, తనంతవాడైన శత్రువు కనపడితే?
అంతటి శత్రువు కలిగితే పైవన్నీ కనపడవని తాత్పర్యం. 🙂
అందుకే బలవంతుడైన శత్రువు, భీముని నవ్వు దుర్యోధనుని అంతగా బాధించింది.
కంటికి నిద్ర వచ్చునే…… 🙂