శర్మ కాలక్షేపంకబుర్లు-జీవితసమరం తొలిరోజులు-ఎందెందు వెదకి చూచిన అందందే గలడు…

జీవితసమరం తొలిరోజులు-ఎందెందు వెదకి చూచిన అందందే గలడు…

గుండు గుండు
గుమ్మం కాడుండు
అన్నవరం గుండు
అందంగా ఉండు
తిరపతిగుండు
తిన్నంగా ఉండు
మళ్ళీ వస్తానుండు
మాట చెబుతానుండు

   ఇలా పాడుకోడమేగాని ఏనాడూ తిరుపతిగాని, అన్నవరంగాని వెళ్ళిన పాపానపోలేదు, సావాకాశం లేదంతే. బతుకే కష్టమైతే పుణ్యక్షేత్రాలా? ఊళ్ళో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడి, కలియుగ వైకుంఠం మాకు, నిత్య దర్శనం, సంవత్సరానికి నాలుగైదు సార్లు దగ్గరలో ఉన్న పట్టిసీమ వీరభద్రస్వామి దర్శనం, అంతే. దేవుడున్నాడా? ఉన్నాడు,ఎక్కడా? ఎక్కడా ఉన్నాడు, అక్కడే ఉన్నాడనుకోకు, ఇదీ జీవితంలో నేర్చుకున్న మొదటి పాఠం.

ఇందు గల డందు లేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెదు వెదకి చూచిన
అందందే గలడు దానవాగ్రణి వింటే!

దానవేంద్రా! వినవయ్యా!! ఇక్కడున్నాడు, అక్కడలేడు అనే సందేహం అక్కరలేదు, హరిని ఎక్కడెక్కడ వెదకి చూస్తే అక్కడక్కడా కనపడతాడయ్యా! వెదకి చూసుకోలేకపోవడం నీ తప్పే కాని ఆయనది కాదు సుమా! అన్న మాట పూర్తిగా వంటపట్టినదే,చిన్నప్పటి నుంచీ…. అదిగో అలా వెతకడం అలవాటయింది… 🙂 నిజమే జీవితం ప్రతి మలుపులోనూ, కష్టంలోనూ హరి కనపడ్డాడు.

మొదటి నెల జీతం తీసుకున్న తరవాత శనివారం సాయంత్రం బయలుదేరా, అన్నవరం. రాత్రికి చేరి కొండెక్కి గుడి ముందు ఆరుబయట పడుకున్నా,వేసవి చొరబడుతున్న కాలం, అక్కడ ఒక పెళ్ళికి ఏర్పాటు జరుగుతోంది, గుర్తుండిపోయిన పెళ్ళి. ఎప్పటి మాటా, దగ్గరగా అరవై ఏళ్ళ కితం మాట కదూ! ఇప్పుడు కాదుగాని, మరోసారి చెబుతానా పెళ్ళి గురించి. పెళ్ళయింది, తెల్లారింది, కళ్యాణ కట్టలో తలనీలాలిచ్చి, దర్శనం చేసుకుని కిందకొచ్చి బస్సెక్కేశా. అదే గొప్ప, ఆ వయసుకి చూసినవి రాజమంద్రి,కాకినాడ పట్టణాలు, ఆ తరవాత దూర ప్రయాణం అన్నవరమే!

కాలం గడుస్తోందిగాని ఏదో బాగో లేదు…గది దొరకలేదు, దొరికితే ఇద్దరం ఉంటే అద్దె తగ్గుతుందని ఆశ. ఎక్కడికెళ్ళి గది అద్దె కోసమడిగినా మొదటి మాట పెళ్ళయిందా అన్నదే! కొంతమంది ఏం లేవనేసేవారు, కొందరు బ్రహ్మచారులకివ్వం అనేవారు, మీరెవరు? ఇదో ప్రశ్న, చెబితే మీకైతే గది అసలివ్వం అన్నవారూ కనపడ్డారు. ఒక రోజు తాతగారికి చెప్పుకున్నా నా బాధ, ఇల్లు ఆఫీస్ ఒకేచోట చికాగ్గా ఉందని. తాతగారు ”అలాగైతే రేపు గది చూద్దా”మనేశారు. ఇంకేం వరమిచ్చినట్టే అనుకున్నాం. మర్నాడెవరితోనో ఫోన్ లో మాటాడేరు, సాయంత్రం వెళ్ళేం,తాతగారు నేను. గది చూపించారు అసలు గది దొరుకుతోంది అదే సంతోషం, అదో ప్లీడర్ గారింటి ఔట్ హవుస్ లోది, అల్లరిచిల్లరి పనులు చేస్తే ఊరుకోనని చెప్పేరు, ”కుర్రాళ్ళు బుద్ధిమంతులు గొడవలేం ఉండవని” తాతగారు హామీ ఇస్తే ఇరవై రూపాయల అద్దె, కరంట్ తో కలిపి, ఫేన్ సంగతడగద్దు 🙂 గది అద్దెకు దొరికింది. గదిలో చేరేం. అల్లరి చెయ్యకుండా రోజులు గడుపుతున్నా, భయం,భయంగా. భయం ఎందుకంటే పక్కనే ఇంటివాళ్ళ అమ్మాయిలు, కాలేజిలో చదువుకునేవాళ్ళ చదువుకునే గది. మా సోవన్న అప్పుడప్పుడు, గొంతు విప్పేవాడు, తానో ఘంటసాలని అనుకునేవాడు, మా వాడో బాత్ రూం భాగవతార్. వీడిక్కడ గొంతు విప్పితే వాళ్ళక్కడనుంచి వహ్ వా! అనేవారు, నాకు చచ్చే భయం, వీణ్ణి అదుపు చేసేటప్పటికి నాకు తల ప్రాణం తోకకొచ్చేది 🙂

మా సోవన్న ఏమాత్రం సమయం దొరికినా ”మావా! నువ్వు అదృష్టవంతుడివిరా! ఈ ఉద్యోగంలో ఉండవు! పైకి పోతావు, నీ జాతకం మంచిది, నువ్వు పట్టింది బంగారం” అంటూ ఉండేవాడు. తను నిరాశలో కూరుకుపోయేవాడు, ”నీకేంరా నువ్వూ బాగుంటావు డిగ్రీ పూర్తి చెయ్యి” అన్నా, వినిపించుకోలేదు, ఇలా కాదని పట్టుబట్టి వాడిచేత పుస్తకాలు తెప్పించి డిగ్రీకి ప్రైవేట్ గా చదివించడం మొదలెట్టేను,వాడితో నేనూ చదివేవాణ్ణి. నేనైతే ఇంటర్ కూడా చదవాలి కదా! వాడు బుద్ధిగా చదువుకుంటే వారానికో సినిమాకి తీసుకుపోయేవాణ్ణి. నిస్పృహ తగ్గింది వాడిలో, ఏదో చెయ్యాలనే తాపత్రయం ఉండిపోయింది నాలో!

 ఉద్యోగంలో చేరి ఐదు  నెలలు దాటిందేమో! ఒక రోజు మా రైతు కొన్ని కాగితాలుచ్చుకుని వచ్చి ”మీకీ కాగితాలు విశాఖపట్నం నించొచ్చాయట, అమ్మ పంపించారు. అర్జంటని చిట్టి పంతులుగారు (పోస్ట్ మాస్టారు) చూసి చెబితే పట్టుకొచ్చా” అన్నాడు, కాగితాలు చేతికిస్తూ. చూస్తే అవి టెలిఫోన్ ఆపరేటర్ గా నిన్ను సెలెక్ట్ చేసుకుంటాం, సర్టిఫికట్ల అసలు, ఇద్దరు గజిటెడ్ ఆఫీసర్లు, తమకు నీవు తెలిసినట్టు సర్టిఫికట్లు,పట్టుకుని వస్తే ఇంటర్వ్యూ లో సెలెక్ట్ ఐతే, వైద్య పరిక్షలో నెగ్గితే పదిరోజులలోగా హైదరాబాద్ లోని ట్రైనింగ్ కు వెళ్ళేందుకు సిద్ధంగా రమ్మని లేఖ సారాంశం. కంగారొచ్చింది,ఏం చేయాలో తోచలేదు. తాతగారి దగ్గరకు చేరి విన్నవించా! ఏం చెయ్యనూ అడిగేశా.

తాతగారు చూసి ”సెలెక్ట్ అయితే మంచిదే, ఇంత వివరంగా ఇచ్చారంటే నువ్వు సెలక్ట్ అయినట్టే” అన్నారు. ”శలవు పెట్టి వెళ్ళు, ఇంటర్వ్యూ చెయ్యి, తరవాత చూదాం” దారి చూపారు. గజిటెడ్ ఆఫిసర్లు తెలిసినట్టు సంతకం ఎవరు చేస్తారు? నాకెవరు తెలుసు? మళ్ళీ తాతగారినే బతిమాలా, ”నడు” అని ఎర్రటి ఎండలో నడిచి, రిక్షా ఎక్కుదామన్నా వినక, తాలూకా ఆఫీస్ కి తీసుకెళ్ళేరు. తిన్నగా తాసిల్దార్ దగ్గరకే తీసుకెళ్ళిపోయి, వివరం చెప్పి ”సంతకం పెట్టవయ్యా” అనేటప్పటికి తాసిల్దారుగారు మాటాడాక సంతకం పెట్టేసేడు. అలాగే మరొకరి దగ్గరా చెయ్యి పట్టుకుని సంతకం పెట్టించినట్టుగా సంతకం పెట్టించేశారు. నిజానికి అదొక పెద్ద ఘనకార్యం, నా వల్ల ఎన్ని జన్మలెత్తినా కానిది, ఎలా అయింది? అసాధ్యాలు సుసాధ్యం చేయడమే హరిలీల.

విశాఖపట్నం వెళ్ళడం అదే మొదటిసారి, తాతగారితో మంతనాలు చూసిన మిత్రుడు కేషియర్ ”ఏంటీ” అడిగేడు, వివరం చెప్పా! ”అదృష్టవంతుడిరా తమ్ముడూ! నీకు తిరుగులేదు,సామర్లకోట వెళ్ళి వైజాగ్ వెళ్ళే బండెక్కెయ్యి” అనేశాడు. రైల్ ప్రయాణమంటే సరదా, కోరిక తీరలేదు. కాకినాడనుంచే బండెక్కాలని స్టేషనుకి పోయి విశాఖపట్నం టిక్కట్టన్నా, డబ్బులుచ్చుకుని వాల్తేరు కి టిక్కట్టు చేతిలో పెట్టేడు. నన్ను మోసం చేస్తున్నాడనుకుని నాకు విశాఖపట్నానికి టిక్కట్టంటే వాల్తేరుకి ఇచ్చేరన్నా! బుకింగ్ క్లార్క్ నాకేసి చూసి నవ్వుతూ విశాఖపట్నంలో వాల్తేరు స్టేషన్ పేరయ్యా! వెళ్ళు బండెక్కు అనడంతో అనుమానం తీరక బయటికొచ్చి మరొకర్ని అడిగి సంశయం తీర్చుకున్నా!

ఇంటర్ వ్యూ కి నాతోపాటు వచ్చినవారు మరో ఇరవై మంది ఉన్నారు. కొంతమందికి వేరు రకంగా ఉత్తరాలొచ్చాయి. నాలా వివరంగా ఉత్తరాలొచ్చినవాళ్ళు పదిలోపు. ఏదో తేడా ఉందని గ్రహించా,ఎవరికి చెప్పలేదు, ఊరుకున్నా. ఇంటర్వ్యూ లో నేను ఆరోవాణ్ణి, ఫోన్ లో మాటాడించి విన్నారు, ఏవో ప్రశ్నలడిగేరు ”అన్నీ సరిపోయాయి సెలెక్ట్ అయినట్టు టిక్ పెడదామా?” అని ఒకరంటే మరో ఆఫీసరు ”ఎత్తు తక్కువున్నాడు, పనికిరాడ”న్నారు. నా గుండెల్లో రైళ్ళే పరిగెట్టేయా క్షణంలో. ”ఎత్తు సరిపోయిందండీ” అన్నారు మరో ఆఫీసరు, సెలెక్షన్ బోర్డ్ ముగ్గురిలో మరో మెంబరు. ”మనం నాలుగడుగుల పదకొండంగుళాలు ఎత్తు కావాలన్నాం, ఇతను నాలుగడుగుల ఎనిమిదంగుళాలే ఉన్నాడు కదా” అన్నారు. తాడి చెట్టంత పొడుగున్న నేను నాలుగడుగుల ఎనిమిదంగుళాలేంటీ? మతిపోయింది ఒక క్షణం. మరో ఆఫీసరు ”ఇతను ఐదడుగుల ఎనిమిదంగుళాలు ఉన్నాడు” అనడంతో కొంచం ధైర్యం వచ్చింది. ఎత్తు మళ్ళీ చూడమన్నారు, చూస్తే ఐదడుగుల ఎనిమిదంగుళాలే ఉన్నాడనటంతో టిక్ పెట్టేరు. బతుకు జీవుడా అని బయటపడితే ఒంటిగంటకి నాతో పాటు పది పేర్లు పిలిచి ”వీళ్ళంతా, మేమిచ్చే ఉత్తరాలు తీసుకుని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో సివిల్ సర్జన్ దగ్గర కెళితే, చెక్ చేసి సర్టిఫికట్ ఇస్తారు, తెచ్చుకుని ఆఫీస్ లో ఇవ్వండి, వారికి పదహారు రూపాయలు చెల్లించండి, ఒక్కొకరూ, రసీదిస్తారు పట్టుకొచ్చి ఆఫీస్ లో ఇవ్వండి, ఈ డబ్బులు తరవాత కాలంలో మీకు తిరిగి ఇవ్వబడతాయి” అని వివరంగా చెప్పేరు.

మిగిలినవారికి మధ్యాహ్నం ఇంటర్వ్యూ కొనసాగుతుందనీ వీరిని తరవాత బేచ్ లో శిక్షణకి పంపుతారని వివరం చెప్పడంతో, నాకొచ్చిన ఉత్తరం తేడా గ్రహించేను. ఇలా నాతో పంపబడిన వారిలో ఒకడి దగ్గర సివిల్ సర్జన్ కి ఇవ్వడానికి డబ్బులు లేవు, దిగాలుపడి ఏం చెయ్యాలో తోచక దిక్కులు చూస్తున్నాడు, అది గమనించి ”ఏంటి సంగత”న్నా డాక్టర్ కి ఇవ్వడానికి డబ్బులు లేవు, ఇంటికెళ్ళి తెచ్చుకోడానికి టైమ్ లేదు” చెప్పేడు, ”డబ్బులు నేనిస్తాలే, నడు” అనేశా! ఏనుగెక్కినంత సంబరం చూశానతని కళ్ళలో! ”ట్రైనింగ్ కి సికింద్రాబాద్ కి వస్తాను కదా అక్కడిచ్చేస్తానూ” అని పదే పది సార్లు చెప్పేడు, ఆ తరవాత డబ్బులిచ్చేసేడు కూడా! సివిల్ సర్జన్ దగ్గర పని పూర్తి చేసుకుని కాగితాలుచ్చుకుని వచ్చి ఆఫీస్ లో ఇచ్చేస్తే, ’నీవు నిర్ణయించిన తారీకున సికిందరాబాద్ లో ఇవ్వబడిన అడ్రస్ లో ఉన్న ట్రైనింగ్ సెంటర్లో హాజరు కమ్మని’ ఉత్తరమిచ్చి పంపేసేరు. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందన్న ఆనందమే కలిగింంది, సమయం వారమే ఉంది. ముందు ఇంకా ఇబ్బందులున్నాయన్న సంగతి తెలియక…

చిన్నమాట: వాల్తేరుకి విశాఖపట్నానికి తేడా తెలియనందుకు నవ్వుకోవద్దు 🙂 రాయడం మొదలెడితే టపా నాచెయ్యి దాటిపోయింది, ఎంత కుదించినా మరో టపాకి పెరిగింది.

ప్రకటనలు

5 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-జీవితసమరం తొలిరోజులు-ఎందెందు వెదకి చూచిన అందందే గలడు…

 1. ఇంతకి టెలిఫొన్ ఆపరేటర్ పొస్ట్ కి అర్జీ ఎవరు పెట్టారు ఎప్పుడు పెట్టారు? మీరు చెప్పారేమొ కాని నేను ఎక్కడొ మిస్ అయ్యాను అనుకుంట.

  • అమ్మాయ్ శిరీష,
   కోఆపరేటివ్ సూపర్ వైజర్ గా ట్రయినింగ్ కి వెళ్ళక ముందే దరఖాస్థులు పెట్టేను. ఇదొకటి,రిసర్వ్ బేంక్ ఒకటి ఇలా కొన్ని ఎస్.ఎస్.ఎల్.సి విద్యార్హతకొచ్చే ఉద్యోగాలకి. దగ్గరగా అరవై ఏళ్ళ కితం జ్ఞాపకాలు కదా, ముందు వెనుకలు కలిపోయి ఉంటాయి కొన్ని…
   ధన్యవాదాలు.

 2. బాగుందండి

  కుదించ మాకండి ; వివరంగా నే రాయాలి మీ లాంటి వారు

  (ఆల్రెడీ శ్రీ పాద వారి వూరి వారాయే )

  ఆ తరువాతే మైంది ?

  అన్నవరం తరువాత తిరపతి గుండు కూడా వెళ్ళారా ? ఆపరేటర్ అయ్యాక ?

  • అనామకం గారు,
   వేంకన్న బాబు అక్కడే కాదండి, మా దగ్గరే ఉన్నాడు. అంతెందుకూ మాఇంటిలో ప్రతివారి పేరులోనూ ఉన్నాడు. ఆతరవాత ఏడేళ్ళకి గాని వేంకన్న బాబుని చూడలేదు.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s