శర్మ కాలక్షేపంకబుర్లు-కర్ణుని జన్మ రహస్యం

కర్ణుని జన్మ రహస్యం

    కర్ణుడు కుంతి కన్యగా ఉన్నపుడే జన్మించాడన్న రహస్యం ఎవరికి తెలుసు?

ఈ రహస్యం తెలిసినవారు
1.కుంతి
2.సూర్యుడు
3.శ్రీ కృష్ణుడు
4.వ్యాసుడు
5.భీష్ముడు
6.నారదుడు.

యుద్ధం పదవరోజు తరవాత ధృతరాష్ట్రుడు, సంజయుడికి మాత్రమే తెలుసు.

వీరికి తెలుసని మనకెలా తెలుసు? చూదాం.

కుంతి:- దుర్వాసో ముని ఇచ్చిన వరం పరీక్షించాలనుకుని కదా సూర్యుణ్ణి కోరింది,చాపల్యంతో. సూర్యుడు బిడ్డనిచ్చి వెళిపోయాడు, కన్యకు, పెళ్ళికానిదానికి బిడ్డ ఏమి? అని లోకం నిందిస్తుందని భయపడి, కుంతి కర్ణుని నీటిలో వదిలేసింది, పెట్టెలో పెట్టి. రాధచే పెంచబడి పెద్దవాడైన కర్ణుని, మరలా కుమారాస్త్ర విద్యా ప్రదర్శన దగ్గర సహజ కవచకుండలాలతో వెలిగిపోతున్న కర్ణుని చూసి గుర్తుపట్టింది. కుంతి మాత్రం కర్ణుని జన్మ రహస్యం కర్ణునికే చెప్పింది కాని పాండవులకు చెప్పలేదు, చెప్పలేకపోయిందనుకోవచ్చు,సిగ్గుతో…

సూర్యుడు:- సంగ్రామం సిద్ధమవుతున్న వేళ సూర్యుడు కర్ణుని వద్దకొచ్చి ’నీ సహజ కవచ కుండలాలు అర్ధించడానికి ఇంద్రుడు రాబోతున్నాడు, ప్రేమతో చెబుతున్నాను, వాటిని దానంగా ఇవ్వవద్దని’ చెబుతాడు. దేవ రహస్యం తరవాత తెలుస్తుంది,నీకే అంటాడు. కర్ణుడు తన దగ్గర చేయిచాచిన వానికి లేదని చెప్పను అంటే, శక్తి అనే ఆయుధాన్ని తీసుకోమని చెబుతాడు. తానుగా ఎవరికి కర్ణుని జన్మ రహస్యం చెప్పలేదు, సూర్యుడు.

శ్రీకృష్ణుడు:- కుంతి శ్రీకృష్ణునికి మేనత్త. అంతఃపుర రహస్యం శ్రీకృష్ణునికి తెలియడంలో వింతలేదు. ఈయన రాయబారానికి వచ్చినపుడు కర్ణుని వీడ్కోలిద్దువు రమ్మని చెయ్యిపట్టి రథమెక్కించుకుని తీసుకువెళ్ళి జన్మ రహస్యం చెబుతారు, కర్ణునికి.ఈ సందర్భంలో శ్రీకృష్ణునికి కర్ణుని జన్మ రహస్యం తెలుసని తెలుస్తుంది. ఇది పూర్తి స్థాయి రాజకీయం,భేదో పాయం కూడా. శ్రీకృష్ణుడు కర్ణుని జన్మ రహస్యం కర్ణునికే చెప్పేరు తప్ప పాండవులకుగాని, దుర్యోధనునికిగాని చెప్పలేదు.

వ్యాసుడు:- ఈయన వంశ కర్త. భారతంలో అవసరమైన ప్రతి మలుపులోనూ కనపడతారు, వీరివల్ల కథ నడుస్తున్నట్టు అనిపించదు. వీరికి తెలియక వంశం లో జరిగినవిలేవు. దుర్యోధనునికి చాలా సార్లు చాలా విషయాలు చెప్పేరుగాని ఎప్పుడూ కర్ణుడు విషయం చెప్పలేదు, అలాగే పాండవులకూ చాలా సార్లు చాలా విషయాలు చెప్పేరు కాని పాండవులకూ కర్ణుని జన్మ రహస్యం చెప్పలేదు, కారణం ఊహించడం కష్టం.

భీష్ముడు:- భీష్ముడికి కర్ణుని జన్మ రహస్యం తెలుసునన్న సంగతి, చివరికి అంపశయ్యమీద ఉండగా కర్ణుడు చూడడానికొస్తే చెప్పడంతో మనకు తెలుస్తుంది. భీష్ముడు కర్ణుని జన్మ రహస్యం కర్ణునికే చెప్పేరు తప్ప దుర్యోధనునికిగాని పాండవులకుగాని చెప్పలేదు. దుర్యోధనుడు మొండివాడు, అందుకతనికి చెప్పి ఉండకపోవచ్చు. పాండవులకు చెబితే రాజ్యమే అడగరేమో! వారికి అన్యాయం జరుగుతుందనుకున్నారా? ఊహించడం కష్టం.

నారదుడు: వీరికి కర్ణుని జన్మ రహస్యం తెలియడంలో విశేషం లేదు, వీరికి కలహభోజనుడని పేరు కాని, ఏ విషయమైనా ఎవరికి చెప్పకూడదో వారికి చేరవేయడమే వీరి ప్రత్యేకత కూడా, కాని ఈ సందర్భంలో, ఎవరికి అనగా పాండవులకు గాని,దుర్యోధనునికి కాని చెప్పకపోవడమే విశేషం.

విదురుడు:- ఈయన కూడా వంశంలోనివాడే! వీరికి తెలియని విషయం లేదు,కర్ణుని జన్మ రహస్యం తెలుసో లేదో తెలియదు.

కర్ణుని జన్మ రహస్యం తెలిసిన వీరు ఆరుగురూ, ఈ రహస్యాన్ని పాండవులకు చెప్పలేదు. అలాగే వీరు దీనిని దుర్యోధనునికీ చెప్పలేదు.

కుంతి,సూర్యుడు ఈ విషయాన్ని దుర్యోధనునికి చెప్పే సావకాశం లేదు. శ్రీ కృష్ణునికి సావాకాశం ఉన్నా చెప్పలేదు. వ్యాసుడు,భీష్ముడు,విదురుడు దుర్యోధనునికి చాలా విషయాలు చెప్పేరుగాని ఈ రహస్యం మాత్రం చెప్పలేదు.

కర్ణుని జన్మ రహస్యం పాండవులకు తెలిస్తే యుద్ధమే జరిగేది కాదు. దుర్యోధనునికి తెలిస్తే ఏం జరిగేది ఊహించలేను.

చివరగా భీష్ముడు పడిపోయిన తరవాత కర్ణునికి జన్మ రహస్యం భీష్ముడు చెప్పినట్టుగా సంజయుడు,ధృతరాష్రునికి చెప్పేరు. అప్పుడైనా ధృతరాష్ట్రుడు యుద్ధం ఆపుచేసి ఉండవలసిందా? ఈయనకు కొడుకుమీద అమిత అభిమానం,కర్ణుని మీద ఒకింత కోపం ఉంది.

ఇందుకే కర్ణుని తల భారతం.

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కర్ణుని జన్మ రహస్యం

  1. మిగిలిన నలుగురికి తెలియటంతో ఆశ్చర్యం లేదు. కానీ భీష్ముడికి, విదురుడి ఈ రహస్యం ఎలా తెలిసిందో?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s