శర్మ కాలక్షేపంకబుర్లు-మేనత్త కొడుకా?

మేనత్త కొడుకా?

”ఆయనెందుకు ఉపకారం చేస్తాడయ్యా! నేనేమైనా మేనత్త కొడుకునా?” అంటూ ఉంటారు. ఇదే కాక మీరు అధికార దుర్వినియోగంతో అవతలివారికి ఉపకారం జరిగేలా చేశారంటే, ”ఆయన నాకు మేనత్తకొడుకేం కాదులేవయ్యా” అంటుంటారు. ఇంకా వివరించాలనుకునేవారు ”ఆయన నాకు మేనత్త కొడుకూ కాదు,నేనాయన మేనమామ కొడుకునీ కాదు” అంటుంటారు. మనకు కావలసినన్ని వరసలున్నాయి కదా తల్లి,చెల్లి,బావ,మరది, అన్న,తమ్ముడు ఇలా….మరి ఈ మేనత్తకొడుకు అనే ఎందుకంటారు? 🙂

అర్జునుడు, అతనొక్కడే ఏంలెండి, పాండవులు అందరూ శ్రీకృష్ణునికి మేనత్త కొడుకులే. అందునా అర్జునుడు బావకూడా కదా! అదే సుభద్ర భర్త కూడా. మేనత్తకొడుకే బావైతే ఆ మజాయే వేరు 🙂 ఒరే బావా అనచ్చు,అదే పైవాడైతే బావగారూ అనాల్సిందే కదా! ఇక మేనమామ కూతురే ఇల్లాలైతే,పైకి చెప్పుకుంటే బావోదులెండి 🙂 ఆ చనువే వేరు ”మా అన్నయ్య చెప్పినదాంటో తప్పేముందీ” అని సాగదీయడానికీ బాగుంటుంది 🙂 డొక్కలో పొడిచి.

అసలు మేనత్త కొడుకుగా శ్రీకృష్ణుడు పాండవులకు చేసిన ఉపకారమేంటని కదా! చెప్పుకుంటూపోతే మొత్తం భారతమే!! ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడాడు, చివరిదేగాని చివరిమాటకాదు, అర్జునునికి సారథిగా ఉన్నాడు. అదేం సారథ్యం అంత గొప్పపనా అనకండి. నిజంగా సారథ్యం అంటే చెప్పుల కాళ్ళతో తన్నులు తినడం. అదేంటని కదా తమ అనుమానం అవధరించండి 🙂

రథంలో సారథి గుర్రాల కళ్ళేలు పట్టుకుని ’నొగలు’లో కూచుని ఉంటాడు, దీనినే బండిలో ’తొట్టి’ అంటారు.
రథికుడు అంటే యుద్ధం చేయవలసినవాడు, రథంలో ఆయుధాలుంచుకుంటాడు, రథంకి ఇరువైపులా చక్ర రక్షకులుంటారు,చక్రాలని కాపాడుతూ. రథికుడు యుద్దం నిలబడి యుద్ధం చేస్తున్నవాడు, తనని తాను రక్షించుకోవాలి,సారథిని రక్షించాలి, చక్ర రక్షకులని రక్షించుకోవాలి. నిజానికి అక్కడ యుద్ధంలో ఆత్మరక్షణకి కూడా ఆయుధం లేనివాడు సారథి మాత్రమే!

రథికుడు తనను తాను రక్షించుకుంటూ, సారథిని, రథాన్ని, చక్ర రక్షకుల్ని రక్షించుకుంటూ శత్రువు పైన అస్త్ర, శస్త్రాలేసి చంపాలి, ఇన్ని పనుల్లోనూ సారథికి సూచనలివ్వాలి. రథం ఎటువెళ్ళాలి,ఎటు తిరగాలి, ఎక్కడాగాలి, ఎక్కడ ముందుకు నడిపించాలి, ఎంత వేగంగా కదలాలి, అన్నది. సూచనలివ్వడం ఎలా? ఇంత హడావుడిలోనూ? నోటితో కుదరదు,వినపడదేమో కూడా, ఆ రణగుణద్వనిలో. అందుకు, ఎడమ, కుడి కాళ్ళతో, సారథి డొక్కలో ఎడమవైపు, కుడివైపు తన్నుతూ, సూచనలిస్తాడు. రథికుడు కాళ్ళకి ”ముచ్చెలు” అంటే బూట్లలాంటివి వేసుకుని ఉంటాడు, వాటితో సారథి డొక్కల్లో తన్నుతుంటాడు. అంటే సారథి ఎంతవాడైనా రథికుని కాలి తాపులు తినక తప్పదు. శ్రీకృష్ణుడు ఆర్జునుని చెప్పులకాలి తన్నులు తిన్నాడు, సారథ్యం చేసి.

శ్రీకృష్ణుని పెద్దలు చెఱబోయారా కాలితాపులు తిని అర్జునునికి సారథ్యం చేయడానికి? సామాన్యులనుకునే మాట మేనత్త కొడుకు కనక కాలితన్నులైనా తిని సారథ్యంచేసి యుద్ధం గెలిపించాడు,అంటారు. అదండి అలా మేనత్తకొడుకా ఉపకారం చెయ్యడానికన్నది జన సామాన్యానికి చేరింది, భారతం నుంచే.

సారథ్యం గురించిన విషయ సేకరణ: శ్రీ చాగంటివారి ప్రవచనంలో విన్న గుర్తు.

స్వగతం: తెల్లవారుగట్ల కూడా కంప్యూటర్ దగ్గర ఎక్కువ కాలం కూచోడమే కష్టమవుతూ ఉంది.

ప్రకటనలు

శర్మ కాలక్షేపంకబుర్లు-రాలుగాయి.

రాలుగాయి.

ఎండ మండిపోతోంది, మొన్న ఇరవైయ్యో తారీకు పగలు ఎండ విరగ్గాసింది, పెరటిలో కొత్తపల్లికొబ్బరి మామిడి చెట్టూ విరగ్గాసిందీ సంవత్సరం. సాయంత్రానికి ఒక్కసారిగా చల్లబడిపోయి గాలి బాగా వేసి, వర్షం చితక్కొట్టింది. చూస్తుండగా చెట్టునుంచి మామిడి కాయలు టపటపా రాలేయి. చెట్టు సగం రోడ్డు మీదకి ఉండటంతో, అంత వర్షంలోనూ,అంత రాత్రిలోనూ,చీకటిలో బయట రాలిన కాయ ఒక్కటి కూడా మాకు దొరక్కుండా ఏరుకుపోయారు 🙂 లోపల రాలినకాయ లెక్కపేట్టుకుంటే ఏడుపే వచ్చింది. బయట లోపల మొత్తంగా మూడు వందల కాయ రాలిపోయి ఉంటుంది. ఇంతకాయ రాలిపోయిందే అంటే ఇల్లాలు ”మన దొడ్డిలో ఉన్న ఒక చెట్టుకే ఇలా బాధపడితే తోటలున్న రైతెలా ఉంటాడు?” అంది ”రాలుగాయలేం చేస్తావని” ఇల్లాలినడిగా! ఆవిడ చెప్పిన మాట. ”రాలుగాయలు మూడు రకాలు, గట్టిగా ఉన్నవి, పగిలినవి, పండు పడినవి. ఇవి ఏవీ పనికిరావు. గట్టిగా ఉన్నకాయలతో ఊరగాయి పెడితే నిలవుండదు,పాడవుతుంది, మాగాయకి పెట్టుకుందామంటే ఊట ఉండదు, ’దమ్మిడీ ముండకి ఏగాని క్షవర’మని సామెతలాగా కొత్తగా మరో కాయలు కొని ఊట తెచ్చుకోవాలి. పగిలిన కాయలూ అంతే! ఇక పండు పడిన కాయలంటే చెట్టున ముగ్గిన పండు, ముగ్గేసిన దానిలా ఉండదు. ఇది కొద్దిగా పులుపు,తీపి ఉంటుంది,మెత్తగా ఉండదు, నిలవుంచితే కుళ్ళిపోతుంది. నేటివాళ్ళు ఇలా ఇచ్చిన పళ్ళు తినలేరు సరికదా పడిపోయిన కాయలిచ్చేరని పేర్లూ పద్దులూ పెడతారు, అందుకు ఇవీ పనికిరావు” అని ఆగింది, ఇంతచెప్పినా మళ్ళీ ”ఏం చేస్తా”వన్నా! ”రాలుగాయి కొడుకులూ/కూతుళ్ళూ ఉంటే ఏం చేస్తాం? వాళ్ళు ఎందుకు పనికొస్తారో, ఈ రాలుగాయిలూ అంతే ఉపయోగ”మని అంటూ లోపలికెళిపోయింది, రాలుగాయి పదం మీద శ్లేష చేస్తూ. రాలుగాయి కొడుకులూ/కూతుళ్ళా అనుకుంటూ ఊయలలో కూచుంటే భారతంలో ఒక ఘట్టం గుర్తొచ్చింది, అవధరించండి.

పాండవ రాజసూయానికెళ్ళొచ్చి తను పడినపాట్లు తండ్రితో చెప్పుకుని, ఎవరితోనూ మాటాడక ఉండిపోయాడు,దుర్యోధనుడు. ఇది గమనించిన మామ శకుని, అల్లుని చేరి ’అల్లుడూ! ఎందుకిలా ఉన్నావు ఏమయిందని’ అడిగితే ’ఏం చెప్పను, రాజసూయంలో జరిగినదంతా నువ్వూ కళ్ళారా చూశావు కదా! ఏంటి ఆవైభవం, ఆ సంపద..నాకు చాలా బాధగా ఉంద’న్నాడు. విన్న శకుని మేనల్లుని తీసుకుని ధృతరాష్ట్రుని వద్దకు చేరి ’రాజా! నా మేనల్లుడు,నీకొడుకు చిక్కిపోతున్నాడు,బాధపడుతున్నాడ’ని చెప్పేడు. గుడ్డిరాజు కొడుకుని తడవి ’నాయనా! ఎందుకయ్యా ఈ బాధ’ అంటే ’తండ్రీ! రాజసూయంలో ధర్మరాజు వైభవం ఏమని చెప్పను, రాజులంతా వంగి వంగి, పడి పడీ దణ్ణాలెట్టేరు. ఒకడు వేల ఏనుగులిస్తే, మరొకడు వేల మేలుజాతి గుర్రాలిచ్చాడు, మరొకడు మణులు,మాణిక్యాలిచ్చాడు. ఇలా వచ్చిన కానుకలకి లెక్కేలేదు. ఆ వైభవం, సిరి చూస్తే నాకు సహించటం లేదు, వాటినెలాగైనా హరించాలి. మరో సంగతి కూడా, రాజసూయానికొచ్చిన పేద సాదలందరిని పాంచాలి పలకరించి,భోజనాలు పెట్టించి బహుమతులిచ్చి పంపుతూ ఎప్పుడో అర్ధరాత్రి రెండు మెతుకులు తిని పడుకుంటోందయ్యా! అందరూ పాండవుల వైభవాన్ని, దాతృత్వాన్ని పొగుడుతుంటే, వెఱ్ఱి మొహాలేసుకుని చూస్తున్న మమ్మల్ని చూసి పాండవులు,ద్రౌపది,శ్రీకృష్ణుడు నవ్వేరు, ఇదంతా చూసిన నాకు కడుపు రవిలిపోతోంద’న్నాడు. ఇది విన్న శకుని, ’ఓస్! ఇంతేనా దీనికే ఇంత బాధా! నువ్వు ధర్మరాజుతో జూదమాడు, ఆ సిరిసంపదలన్నిటినీ నీకాళ్ళ దగ్గరపెట్టిస్తాను, ధర్మరాజుకి జూదమంటే ఇష్టం,కాని నిపుణుడు కాదు! నేనందులో ఆరితేరినవాడిని, ధర్మరాజును సులువుగా గెలుస్తాను, వాటన్నిటిని జూదంలో గెలిచి, నీపాలు చేస్తా’నన్నాడు.

ఇది విన్న ధృతరాష్ట్రుడు, ’జూదంవద్దు, విదురుడు ఇరుపక్కలా కావలసినవాడు,నీతి కోవిదుడు. పరిపాలనంతా విదురుని ధీ శక్తి,భీష్ముని భుజ శక్తి మీద నడుస్తోంది, అందుకు విదురుణ్ణి అడగా’లన్నాడు. విన్న దుర్యోధనుడు, ’విదురుడా! పాండవ పక్షపాతి, జూదానికి ఎందుకు ఒప్పుకుంటాడూ? తండ్రీ! నీవుగనక శకుని చెప్పినట్టు జూదానికి ఒప్పుకోకపోతే….

దీని కొడబడు మొడబడవేని నేడ,ఈ క్షణమ సర్వభక్షకుచే భక్షితుండ
నగుదు దెల్లమేనట్లైనదగవుదక్కి,విదురుడును నీవు నుండుడు ముదముతోడ…..సభా.ప,,,ఆశా..౨…౧౨౭

శకుని మాట ఒప్పుకో! ఒప్పుకోకపోయావో ఈ రోజే, కాదు ఇప్పుడే ఈ క్షణంలోనే ఒంటికి నిప్పంటించుకుని కాలిపోతాను,తెలిసిందా? గొడవలేం లేక నువ్వూ,విదురుడూ ఆనందంగా ఉండండి, అని బెదిరించాడు.

తరవాతేం జరిగిందీ, తమందరికి తెలిసినమాటే!

ధృతరాష్ట్రుడు ఉన్న నిజం చెప్పేశాడు,కొడుకుతో,విదురుని బుద్ధిబలం,భీష్ముని భుజబలంతో రాజ్యపాలన జరుగుతోందని.. రాజ్యపాలన విదురుని మంత్రాంగం మీద,భీష్ముని భుజబలం మీద నడవడం దుర్యోధనునికి ఇష్టమైన మాటకాదు. ఇది దుర్యోధనునికి కంటగింపుగా ఉంది, కాని బహిరంగంగా ఈ మాట చెప్పలేడు. తమరాజ్యంలో, తమ ఆలోచన మరొకరితో పంచుకోవడం,అనుమతి పొందడం, ఇదసలు ఇష్టంలేదు, దుర్యోధనునికి. కాని అదే జరుగుతున్నది, తనకు తెలిసినప్పటినుంచీ. దీనిని ధిక్కరించి, విదుర,భీష్ములకు ఇష్టంలేని పనిచేసి, తనకి ఇష్టమైన పని ’పాండవుల సంపదను హరించడం చేసి’, తన స్వాతంత్ర్యం, ప్రత్యేకత,గొప్పదనం నిలబెట్టుకోవాలి. విదురుడు మొదలైనవారెలాగా ఇటువంటి పని వద్దంటారు, ఇట్టి పరిస్థితులలో తన మాట చెల్లించుకోడానికి శకుని తంత్రం బాగా నచ్చింది,దుర్యోధనునికి. తనమాట నెగ్గించుకోడానికి తండ్రిని ఏమని బెదిరించాడో చూశారా! నిప్పుల్లో దూకి చస్తా, పాండవులతో జూదమాడి వారి సంపద హరిస్తానని శకుని చెప్పిన మాట ఒప్పుకోకపోతే అన్నాడు, రాలుగాయి కొడుకు దుర్యోధనుడు.

ఇటువంటి పనులు చేయడానికి సిద్ధపడే రాలుగాయి కొడుకు/కూతురు ఒక్కళ్ళుంటే చాలదూ, ముదిమిలో పరాయిపంచల్లోపడి, దయనీయమైన జీవితాలు గడపడానికి….

మరి రాలుగాయలెందుకు పనికొస్తాయి?

శర్మ కాలక్షేపంకబుర్లు-అవ్వపేరే ముసలమ్మ

అవ్వపేరే ముసలమ్మ

‘అవ్వపేరే ముసలమ్మ’ అంటారు. అంటే అవ్వ అనగా అమ్మమ్మ లేదా మామ్మ లేదా వృద్ధురాలైన స్త్రీ అని అర్ధాలిస్తోంది నిఘంటువు. అవ్వ అంటే ముసలమ్మ అని వేరుగా చెప్పనక్కరలేదన్నదే, రెండూ ఒకటేనన్నదే దీని భావమూ! ఏంటో అంతా తిరకాసుగా ఉందంటారా? ఐతే వినండి…

పాండవులు అజ్ఞాతవాసం ముగించుకుని ధృతరాష్ట్రుని వద్దకు విరాటరాజు పురోహితుని ద్వారా తమ తండ్రి పాలైన అర్ధ రాజ్యం ఇమ్మని కబురు పంపారు. దూతగా వెళ్ళినవాడు రాజపురోహితుడు, విషయం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేడు, వారు వినేసేరు. దీని మీద కౌరవులలో కదలిక వచ్చింది, ఏం చేయాలని ఆలోచించి సంజయుని రాయబారిగా పంపించారు. సంజయునునికి ఏమని చెప్పమని చెప్పి పంపేరు? ఇది అసలు విషయం. పాండవులతో ఇలా చెప్పవయ్యా అన్నారు ” మీరు ధర్మాత్ములు,మీరు చాలా కష్టాలు పడ్డారు, కష్టాలు పడడం మీకు కొత్తకాదు అందుచేత శాంతి వహించడం మంచిది” అని చెప్పు, ఏం చెబుతావో కాని వాళ్ళని యుద్ధం నుంచి మరల్చు అన్నాడు, ధృతరాష్ట్రుడు, ఇదీ సారాంశం. వచ్చిన సంజయుడు దీనినే తిప్పితిప్పి చెప్పేడు. విన్న పాండవులూ, చెప్పిన విషయాన్నే తిప్పితిప్పీ చెప్పేరు. చివరగా ధర్మరాజు ఒక మాట చెప్పేడు. ” వాళ్లు మేము అన్నదమ్ములం, వైరం అనవసరం, మా పాలు మాకిస్తే మా రాజ్యం మేము పాలించుకుంటాం, కాదు కూడదంటే, సగభాగం ఇవ్వలేనంటే, ఐదూళ్ళిమ్మనవయ్యా! ఇది కూడా ఎందుకో తెలుసా అంతేవాసుల గ్రాసోవాస దైన్యం లేకుండేందుకే! ఇదిగిదిగో చూడూ! కుశస్థలి, వృకస్థలి, వాసంతి, వారణావతం,ఈ నాలుగూళ్ళు ఇమ్మను, ఐదో ఊరు ఏదైనా సరే వాళ్ళనే చూసి చెప్పమను,అది నాకు చాలు, సంధి ఖాయం” అన్నాడు.

రాయబారానికొచ్చిన సంజయుని మాటేంటీ? శుష్కప్రియం,శూన్య హస్తమూనూ. మరి పాండవులమాటేంటీ తిప్పి తిప్పి చెప్పినా అది అర్ధరాజ్యం. ప్రజలలోకి వెళ్ళిన మాటేంటీ? ”ధర్మరాజు అర్ధరాజ్యం అడిగాడట పెద తండ్రిని, అలా ఇవ్వడానికి ఇష్టపడకపోతే ఐదూళ్ళేనా ఇమ్మన్నాడట, ఎందుకని? కూడా ఉన్నవారి తిండీ, గుడ్డా కోసంట. ఏం? ధృతరాష్ట్రుడు, ఐదూళ్ళేనా ఇవ్వలేడా?” ఇదీ ప్రజలమాట. నాటి కాలం నాటికి ఈ ఐదూళ్ళూ కలిపితే అర్ధరాజ్యమేను(ట) 🙂

అదండి ధర్మరాజు తెలివి.

అందుకే నేటుకీ ముడి పడని కార్యానికి,తిప్పి తిప్పి చెప్పడానికి,చేతులూపుకుంటూ వెళ్ళిరావడానికి సంజయ రాయబారం అంటారు 🙂

అర్ధరాజ్యం కాదంటే ఐదూళ్ళు, ఐదూళ్ళే అర్ధరాజ్యం
అవ్వపేరే ముసలమ్మ అంటే ఇదే కదూ

శర్మ కాలక్షేపంకబుర్లు-దుర్యోధనుని అంతరంగం

దుర్యోధనుని అంతరంగం

కౌరవులు రాజధానీ నగరంలో పుట్టిన రాకుమారులు,కష్టం తెలియనివారు, గౌరవ మర్యాదలు పుట్టినప్పటినుంచి అనుభవించినవారు, సేవలందుకున్నవారు. దీనికి వ్యతిరేకంగా పాండవులు అడవులలో,కొండలలో పుట్టి,పెరిగినవారు, సేవించడం తెలిసినవారు, గౌరవ మర్యాదలు, ఇచ్చి పుచ్చుకునే అలవాటున్నవారు. కౌరవులు బలవంతులేగాని పాండవులతో పోలిస్తే, లొక్కే. ఇవి మౌలికమైన తేడాలు.

పాండురాజు మరణం తరవాత, మునులు కుంతిని పాండవులను తీసుకువచ్చి సభలో ధృతరాష్ట్రునునికి అప్పగించి వెళ్ళారు. ఇది మొదలుగా పాండవులు కూడా రాజపుత్రులుగా, కౌరవులు పొందుతున్న గౌరవ మర్యాదలు, అభిమానాలు పొందడం జరుగుతూ వచ్చింది. పాండవులు కౌరవులకంటే కొద్ది హెచ్చుగానే గౌరవ మర్యాదలు పొందుతూ వచ్చారేమో కూడా, అది వారి నడవడి,బలం,తండ్రిలేని పిల్లలనే ఆదరణతోనూ. వీటికి మిక్కిలిగా ధర్మరాజు కాబోయే యువరాజు, మహరాజన్నదీ కూడా తక్కువ మాట కాదు.

ఇదిగో ఈ కారణాలు కౌరవులలో ముఖ్యంగా దుర్యోధనునిలో అసూయను పెంచాయి, చిన్ననాట. ఈ అసూయ ఏ స్థాయికి పెరిగిందంటే జలక్రీడలలో అలసిన భీముని తాళ్ళతో కట్టించి,గంగలో తోయించడం, నిద్రిస్తున్నవాడిని విషనాగులతో కరిపించడం, విషాన్నం పెడితే, దానిలో విషం ఉందని యుయుత్సుడు చెప్పినా తిని హరీ మనక హరించుకున్న వరకు. భీముని చూస్తే,అసూయ,భయం పెరిగిపోయాయి, దుర్యోధనునిలో. ఈ విషయాలు కుంతి దాకానే తప్పించి పెద్దల దృష్టికి రాకపోయీ ఉండచ్చు, కారణాలనేకం.

ఇలా ఉండగా ధర్మరాజు యువరాజయ్యాడు అంటే రాజ్య నిత్య వ్యవహారాలన్నీ ధర్మరాజు నిర్వహిస్తున్నాడు, ఇది దుర్యోధనుని కోపాన్నీ, అసూయనూ పెంచాయి, దాని ఫలితమే లక్క ఇల్లు.

దుర్యోధనునిలో రెండు భావాలు మొదలయ్యాయి, నా తండ్రి రాజు,ఆయన పెద్ద కొడుకునైన నేను యువరాజు కావాలిగాని, ఎక్కడో పుట్టి పెరిగినవాడు యువరాజు,రాజు ఎలా అవుతాడు? పోనీ అనుకున్నా ఇతను నా పిన తండ్రికి పుట్టినవాడా? కాదే? మరి ఇతనికి యువరాజ్యం, రాజ్యం ఎలా సమకూరుతాయనేదే ఆ మాట. ఒకప్పుడు ఈ భావాన్ని దుర్యోధ్యనుడు తండ్రి దగ్గర కూడా వెలిబుచ్చాడు. ”తండ్రీ తమ్ముడి కొడుకులు,తమ్ముడు కొడుకులు అని గింజుకుంటున్నావే, కుంతికి యమునివలన ధర్మరాజు,వాయువు వలన భీముడు, ఇంద్రునివలన అర్జునుడు, మాద్రికి అశ్వనీ దేవతలవల్ల నకుల,సహదేవులూ జన్మించారు కదా! వీరిలో యముడా,వాయువా….ఎవరయ్యా నీ తమ్ముడూ” అని నిలదీశాడు కూడా.

https://kastephale.wordpress.com/2013/12/07/

నాటి కాలానికి ధర్మ సంతానంగా పన్నెండు రకాల పుత్రులను సమాజం ఒప్పుకుంది, దీనిని దిర్యోధనుడు నిరసించాడు.

చివరిమాటేగాని కొసరు మాట కాదు సుమా:- కర్ణుడు కుంతి కుమారుడని తెలిసినా కర్ణుని కూడా రాజుగా ఒప్పుకునేవాడే కాదు దుర్యోధనుడు, ఇతను కానీనుడు కదా! మరో మాట నాటికాలంలో పురుషాధిక్యత సమాజంలో ఉన్నా, కుటుంబంలో మాత్రం స్త్రీ ఆధిక్యత కొనసాగింది, దీనినీ దుర్యోధనుడు నిరసించాడు. నాటి సమాజ కట్టుబాట్లు కాదన్నాడు, దీనిని పెద్దలెవరూ ఒప్పుకోలేదు, అదీ అసలు సంగతి……….ఇదీ దుర్యోధనుని అంతరంగం.

శర్మ కాలక్షేపంకబుర్లు-ఎదురు మేనరికం.

ఎదురు మేనరికం.

మేనరికం అంటే అన్న/తమ్ముడి కూతుర్ని అక్క/చెల్లి కొడుక్కి వివాహం చేయడాన్ని మేనరికం అంటారు. కుటుంబ వ్యవస్థలో, వివాహ వ్యవస్థలో భారతీయులు చేసినన్ని ప్రయోగాలు మరే దేశంలోనూ జరిగి ఉండవు. ఈ మేనరికం చాలా కాలమే ఆచరణలో ఉంది, ఇప్పటికీ అమలు లోనే ఉంది, కొన్ని చోట్ల ఇది నిషిద్ధం, దానికి తార్కాణం ”మేనమాకూతురు మొనసి పెండ్లామాయె, అరవలందు చెల్లెలాయెనదియు” అంటాడు తాత, వేమన. ఐతే నేటి కాలంలో ఇలాటి మేనరిక వివాహాలు సైన్స్ పరంగా వద్దని అంగవికలులైన సంతానం కలుగుతుందని చెబుతున్నారు, అది నిజం కూడా, కాని ఇంకా పెద్ద కుటుంబాలలో ఇది అమలులోనే ఉంది. ఎదురు మేనరికమని మొదలెట్టి మేనరికం గురించి చెబుతారేం అనకండి..వస్తున్నా.

మేనరికం అన్నది అన్న/తమ్ముని కూతురుని అప్ప/చెల్లెలు కొడుక్కి వివాహం చేయడం కదా! ఈ ఎదురు మేనరికంలో అప్ప/చెల్లెలి కూతురిని అన్న/తమ్ముడు కొడుక్కి వివాహం చేయడం. ఇందులోనూ కొన్ని ఆంక్షలున్నాయి. అన్న/తమ్ముడు, అక్క/చెల్లి లలో ఎవరో ఒకరు చెల్లిపోతే మాత్రమే ఈ వివాహాలు చేసే అలవాటూ ఉంది, అంటే చనిపోయిన వారితో పాటు, ఆ ఇంటివారితో సంబంధ బాంధవ్యాలు చెరిగిపోకూడదనే ఈ ఏర్పాటనిపిస్తుంది. ఈ రకం వివాహాలు కూడా అనుసరణీయం కాదనే సైన్స్ మాట. ఇక మరో చిత్రమైన వివాహం ఉంది, చాలామందికి తెలియదేమోనని కూడా అనిపిస్తుంది, అదే కుండమార్పు పెళ్ళిళ్ళు..ఇదేంటి? చెబుతా…

ఒక ఇంటిలో అక్క/తమ్ములు లేదా అన్నా/చెల్లెలు మరొక ఇంటి అక్క/తమ్ముడు లేదా అన్న/చెల్లెలిని వివాహం చేసుకోవడం, ఇదే కుండ మార్పు పెళ్ళి అంటే. వివరంగా చెప్పుకోవాలంటే ఇక్కడ ఈ ఇంటిలో తిని పెరుగుతున్న అమ్మాయి అక్కడ ఇంటిలో తిని కాపరం చెయ్యడం, అక్కడి అమ్మాయి ఇక్కడికి రావడం. అంటే ఈ ఇంటి ఆడబడుచు ఆ ఇంటికి కోడలుగానూ ఆ ఇంటి ఆడపడుచు ఈ ఇంటికి కోడలుగానూ వస్తారనమాట. నిజానికి రెండు సమాన శక్తులని సంతులనం చేయడమే అనిపిస్తుంది. సైన్స్ లో మెకానిక్స్ లో కపుల్ ఉంది చూడండి. రెండు శక్తులు సమానదూరంలో ఉండి రెండు కుటుంబాల మీద తమ ప్రభావం చూపుతాయనమాట. ఇక్కడ గిల్లితే అక్కడ ఏడుపొస్తుంది, అక్కడ గిల్లితే ఇక్కడ ఏడుపొస్తుందనమాట. 🙂

https://en.wikipedia.org/wiki/Couple_(mechanics)

Simple couple
Definition
A couple is a pair of forces, equal in magnitude, oppositely directed, and displaced by perpendicular distance or moment.

The simplest kind of couple consists of two equal and opposite forces whose lines of action do not coincide. This is called a “simple couple”.[1] The forces have a turning effect or moment called a torque about an axis which is normal (perpendicular) to the plane of the forces. The SI unit for the torque of the couple is newton metre.

If the two forces are F and −F, then the magnitude of the torque is given by the following formula:

{\displaystyle \tau =Fd\,} \tau =Fd\,
where

{\displaystyle \tau } \tau is the torque
F is the magnitude of one of the forces
d is the perpendicular distance between the forces, sometimes called the arm of the couple
The magnitude of the torque is always equal to F d, with the direction of the torque given by the unit vector {\displaystyle {\hat {e}}} {\hat {e}}, which is perpendicular to the plane containing the two forces. When d is taken as a vector between the points of action of the forces, then the couple is the cross product of d and F,
T= [d X F]

శర్మ కాలక్షేపంకబుర్లు-శల్యుడు.

శల్యుడు.

శల్యుడు అనగానే జ్ఞాపకమొచ్చేది శల్య సారధ్యం గురించే కదా! అది చూసే ముందు అసలు శల్యుడెవరూ?

శల్యుడు మద్ర దేశపు రాజు, పాండు రాజు రెండవ భార్య మాద్రికి సోదరుడు,అంటే నకుల,సహదేవులకి మేనమామ, మిగిలినపాండవులకు మేనమామ వరుసవాడు, మరి మేనల్లుళ్ళకి సాయం చేయక శల్యుడు దుర్యోధనుని వైపు ఎందుకు చేరాడూ?

మహాభారతం ఉద్యోగ పర్వం,ఆశ్వాసం-౧…..౯౧ నుండి౧౦౩ వరకు

ధర్మరాజు శ్రీకృష్ణుని వద్దకు సహాయం కోరుతూ అర్జునుని పంపించాడు, అక్కడికి దుర్యోధనుడొచ్చి తనకి కావలసిన సాయం తీసుకున్నాడు. శ్రీకృష్ణుని దగ్గరకు అర్జునుని పంపినట్టుగానే కొంతమంది దూతలను శల్యుని వద్దకూ పంపాడు,యుద్ధానికి సహాయం కోరుతూ. శల్యుడు సేనతో బయలుదేరాడు ధర్మరాజు దగ్గరికి.

దారిలో శల్యునికి, సేనకు కావలసిన సకల సౌకర్యాలు అనగా సేనకు కావలసిన ఆహారం, కూరలు, మంచినీళ్ళు, ఇతర అవసరాలు,ఏనుగులు,గుర్రాలకు కావలసిన మేత ఇలా అన్నిటిని కొంతమంది సమకూరుస్తూ వచ్చారు. ఈ పరిచర్య ఎంతగా జరిగిందంటే శల్యుడు తన మంత్రులతో ”ఈ ఏర్పాట్లు చేస్తున్న ధర్మరాజు మంత్రులను సన్మానించాల్సిందే, ఏంకావాలన్నా ఇవ్వాల్సిందే! వారిని ప్రవేశపెట్ట”మన్నవరకూ. ఏర్పాట్లన్నీ, ప్రఛ్ఛన్నంగా ఉండి, స్వయంగా చేస్తున్న దుర్యోధనుడు ఈ మాటలు విని, శల్యుని వద్దకొచ్చి నమస్కారం చేసి, తనను తాను పరిచయం చేసుకున్నాడు. శల్యుడు ఆనందంతో దుర్యోధనుని కౌగలించుకుని ఆసనం మీద కూచోబెట్టి ”నీకేంకావాలో కోరుకో”మన్నాడు. సమయం చిక్కిన దుర్యోధనుడు, ”నీవన్నట్టుగా మాట నిలబెట్టుకో, నీకు పాండవులు మేము ఒకలాటివాళ్ళమే! నా సేనలో చేరి సారధ్యం చెయ్య”మని కోరుతున్నా అన్నాడు. దానికి శల్యుడు నాకు ”వారూ,మీరూ ఒకలాటివారే! నీకోరిక చెల్లిస్తానని” మాటిచ్చాడు.

శల్యుడా తరవాత ధర్మరాజు దగ్గరకుపోయి జరిగిందంతా చెప్పాడు. ”జరగవలసినది జరిగిపోయింది, నువ్వు తప్పక దుర్యోధనునికి సాయం చేయ్యాలి, అన్నమాట ప్రకారం, కాని నీకో విన్నపం, ఇటువైపు అర్జునునికి సారధ్యానికి కృష్ణుడున్నాడు, అటు కర్ణునికి సారధ్యానికి తగిన మగాడు కనపడడు, అందుచేత నువ్వు కర్ణుడికి సారధ్యం చేస్తూ అతని మనసు వికలపడేలా చెయ్యి, ఈ ఉపకారం చేసిపెట్టు, అర్జునుడిని రక్షించు” అని కోరేడు. ”నువ్వు కోరిన ప్రకారమే చేస్తాను, కాని సారధ్యం చెయ్యమని దుర్యోధనుడడిగితే తప్పక చేస్తానని” మాటిచ్చి వెళ్ళాడు.

శల్యుడిలాటివాళ్ళు నేటికీ కనపడుతున్నారు,సమాజంలో. దుర్యోధనుడంతవాడు తన సాయం కోరుతూ తనకు సపర్యలు చేయడంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు, యుద్ధానికి నీ వైపే ఉంటానని మాటిచ్చాడు. ఇది దుర్యోధనుని రాజకీయ ఎత్తుగడ, ఇది తెలుసుకోలేకపోయాడు శల్యుడు. తాను బయలుదేరినది ధర్మరాజు దగ్గరికి కనక శల్యుడు ధర్మరాజుకి జరిగింది చెప్పుకున్నాడు. ధర్మరాజు దుర్యోధనుని ఎత్తుగడ గ్రహించి దానిని కొనసాగిస్తూనే తెలివిగా తిప్పికొట్టాడు, ఇదీ ధర్మరాజు రాజకీయ చతురత. ఇటువంటిదే మరొకఘట్టమూ ఉంది జ్ఞాపకమొస్తే చెప్పండి 🙂

శల్య సారధ్యం గురించి అవసరమనుకుంటే మరోసారి చూద్దాం 🙂

ఇటువంటి ఎత్తుగడలు మన జీవితంలోనూ ఎదురవుతుంటాయి, తెలుసుకోవడం అవసరమే కదూ!

శర్మ కాలక్షేపంకబుర్లు-కళ్ళుపోతాయిరా!

కళ్ళుపోతాయిరా!

పాతరోజుల్లో పెద్దాళ్ళు చూడకూడనివి చూస్తే కళ్ళు పోతాయిరా అనేవారు, నిజమా! చాలా చూశాం, ఏం మా కళ్ళుపోలేదేం, పత్తికాయల్లా బాగానే ఉన్నాయి, మీ అంధ విస్వాసాలని,మూఢ విశ్వాసాలని, మా మీద రుద్దకండని అబ్బో! రెచ్చిపోయాం. పాపం పెద్దాళ్ళు ”నీకర్మకి నేను కర్తనుకాదురా! రోజొస్తుంది, కళ్ళుపోతాయి,అప్పుడేడుద్దువులే” అని ఆశీర్వదించారు. నిజంగానే ఆ రోజులొచ్చినట్టే ఉన్నాయి. అదేదో యూనివర్సిటీవాళ్ళు పరిశోధన చేసి చెప్పేరట చూడకూడనివి చూస్తే పాక్షిక అంధత్వం కలుగుతుందీ, అలా అలవాటుగా చూస్తే పూర్తి అంధత్వం కలుగుతుందీ అని. గాడిద గుడ్డేం కాదూ, ఎవరిమాటా వినం,చూస్తాం, కళ్ళున్నంతవరకూ చూస్తాం, పోతే ఏడుస్తాం.. 🙂

వేసంకాలం పరుగేట్టుకొచ్చేసింది, ఎప్పుడూ? శివరాత్రి రోజునే! వేడిమి నలభై కిదగ్గరగానే ఉంటోంది పగలు, రాత్రికి కూడా ఇదేం తగ్గటం లేదు, కారణం చుట్టూ ఉన్న సిమెంట్ భవంతులు, పగలంతా వేడిని గ్రహించి,రాత్రి వేడిని వదలిపెడుతున్నాయి. ఎవరింటా పచ్చని చెట్టే లేదు,మాకు తప్పించి, కాని ఉపయోగం లేదు,ఒంటికాయ సొంటి కొమ్ముతో.

రాత్రి వేడిమి కూడా గదిలో ముఫై దాటి ఉంటోంది, ఎప్పుడూ ఏ.సి వేసుకుని తప్పించి ఉండడం కష్టం లాగానే ఉంది, కావలసినంత కరంటో అంటారు, ముఖ్యమంత్రిగారు, నిజమే కావచ్చు కాని, అదేమో సరిగా మద్యాహ్నం ఒంటిగంట,రాత్రి నిద్ర పట్టే సమయం ఇలా మంచి సమయంలో ఒకటి రెండు గంటలు కరంట్ పీకేస్తేగాని, కరంట్ వారికి కళ్లు చల్లగా ఉండవు, ఇదేమో తెలియనిది.

డెస్క్ టాప్ ముందుగదిలో ఉంటుంది, పగలు,రాత్రి అక్కడ కూచోడమే కష్టం, ఎటొచ్చి తెల్లవారుగట్ల రెండు గంటలు నాలుగునుంచి, అంతే. మిగిలిన సమయం ఏ.సిలోనే. మొదట్లో ఒక పంపురాయి నా జేబులో పడేసి సెల్ ఫోన్ అలవాటు చేశారు,ఇంట్లోవాళ్ళు,వద్దంటున్నా వినక. అందులో వినపడేదికాదు. అలా ఉంటే దాన్ని మార్చేసి మరొకటి సాంసంగ్ E-350 మోడలుట ఇది చాలా పల్చగా ఉంది, ఐదంగుళాలలోపు పొడుగు రెండున్నరంగుళాల లోపు వెడల్పు. దీనిలో తెర రెండుంపాతిక, వెడల్పు రెండంగుళాల లోపు. దీనికి స్పీకరు,ఎన్ని హంగులో. స్పీకర్ పెట్టుకున్నా చెవులు వినపడాలిగా 🙂 అది నా దగ్గరలేనిదేనని కొంతమంది మిత్రులకి కూడా స్వానుభవం, రామాయణం అంతా విని రాముడికి సీతేమవుతుందని ప్రశ్నించినట్టు, అంతా వినేసి ఏమన్నారూ అంటుంటే. పగలు డెస్క్ టాప్ దగ్గర కూచోడమే అసాధ్యం, నెట్ లోకి రాకుండా ఉండలేని రోగం, మరెలా? దీనికి చికిత్స చేసేరు, అదే ’జియో’ట. కొత్తలో కార్డ్ తీసెయ్యమన్నా! తప్పదుగా అదే మళ్ళీ వేయించుకున్నా, కొత్తలో కష్టంగా ఉండేది, దాన్ని దారిలోకి తెచ్చా. ఇంత చిన్న ఫోన్ లో ’జియో’ కార్డ్ మీద నెట్, ఓపెరా మిని బ్రవుజర్ లో 4G టకటకా లోడ్ అయిపోతోంది. అక్షరాలు అలుక్కుపోయినట్టుంటుంటే, జూం చేస్తే, బెదురుచీమ (చాలా చిన్నదైన నల్ల చీమ) తలకాయల్లా అక్షరాలు కనపడుతున్నాయి, చదువుతుంటే నిజమే ’కళ్ళుపోతాయిరోయ్’ అన్న ఆశీర్వచనం నిజమేననిపించిందండీ!