శర్మ కాలక్షేపంకబుర్లు-జీవితసమరం తొలిరోజులు-ఎందరో …….వందనములు

జీవితసమరం తొలిరోజులు-ఎందరో …….వందనములు

   ఇంటర్వ్యూ సోమవారం జరిగింది, మంగళవారం క్లాస్ ప్రారంభం,సికిందరాబాద్ లో నాలుగు రోజుల్లో జాయినవ్వాలి. రాత్రికి కాకినాడ చేరి, సోవన్నకి చెప్పా! ఎత్తుకుని ఊరేగించేడు కాసేపు, మహదానందపడిపోయి. ఉదయమే పోర్ట్ స్టేషన్ కెళ్ళి సికిందరాబాద్ కి  మర్నాటికి రిజర్వేషన్ చేయించుకున్నా! గోదావరి ప్రారంభమైన కొత్త, కాకినాడ నుంచి బయలుదేరేది. మర్నాటికి టిక్కట్ దొరికింది, ఒక పనైందనుకున్నా! నాకు కంగారైతే, టైమ్ కంగారుగా పరిగెట్టదు కదా! చచ్చి పదయింది. తాతగారు రాగానే జరిగింది చెప్పేశా, ఉత్తరం చేతిలో పెట్టా. నీకు తిరుగులేదన్న, అన్న కేషియరు, మిగిలినవారు అభినందించారు. ఉద్యోగానికి రాజీనామా రాసి తాతగారికి చూపా! బుర్రూపారు,టైప్ చేసి రెడీగా కూచున్నా! మేనేజర్ గారు రాగానే ఇచ్చెయ్యడానికి.

   మేనేజర్ గారు రావడం ఏదో హడావుడి తో సమయం గడచిపోతోంది, నాకు సావకాశం దొరకలేదు. చివరికి పన్నెండుకి దొరికింది, మేనేజర్ గారి గదిలో దూరి వివరం చెప్పుకున్నా! రాజీనామా చేస్తానని. దాని కాయన ” ఆడపిల్లలు చేసే ఉద్యోగానికి పోతానంటావేం? అక్కడిచ్చే జీతం మొత్తం తొంభై రూపాయలు,ఇక్కడ నూట ఇరవై, తాతగారు తొందరలో రిటయిర్ అవుతారు, నిన్ను అక్కౌంటెంట్ చెయ్యాలనే ఆయనకి అసిస్టెంట్ గా వేశాను, అక్కౌంటెంట్ ఐతే దగ్గరగా గజిటెడ్ ఆఫీసర్ జీతమొస్తుంది, వద్దు, నిన్ను రిలీవ్ చెయ్యను” అనేశారు. ”గవర్నమెంట్ ఉద్యోగం” నసిగా, కాని ఆయన మాటాడలేదు. అప్పటిదాకా రాజీనామా ఇచ్చి వెళిపోవచ్చనుకున్నాగాని ఇలా ఒప్పుకోవాలన్న సంగతి, రిలీవ్ చెయ్యాలన్న సంగతి తెలీదు.

ఆయన చెప్పిందీ బానే ఉందేమో అనిపించింది. తొందరలో అక్కౌంటెంట్ ప్రమోషన్ వగైరా! ద్వైదీ భావం పట్టుకుంది. గర్నమెంట్ ఉద్యోగం మంచిదని తెలుసు, కాని ఎలా మంచిది చెప్పలేని అసహాయత, ఏది మంచిదో తేల్చుకోలేనితనం. మానేస్తే! ఇప్పటివరకు ఐన ఖర్చులు, డిపాసిట్ కట్టేను ఒక వంద అదీ పోతాయి, అంతేగా అనుకున్నా. బయటికొచ్చి తాతగారికి చెప్పుకున్నా! సమయం చూసి, భోజనానికెళ్ళొద్దామని లేచారు, ఒంటిగంట కావడంతో.

టీ సమయం, తాతగారు లేచి మేనేజరుగారి గదిలో కెళుతూ, ’కొద్ది సేపు తరవాత లోపలికి రా” అని నెమ్మదిగా చెప్పి లోపలికెళ్ళేరు. కొద్దిసేపటిలో, వెనకనే లోపలికెళ్ళా ఫైల్ పుచ్చుకుని. ఏమన్నట్టు చూస్తే, మళ్ళీ చెప్పుకున్నా, ఆయనా వారి మాట చెబుతూ ”వెళ్ళిపొతానంటాడేంటండీ” అన్నారు తాతగారితో. అదిగో అలా తాతగారికి చేరింది సమస్య. అప్పుడాయన ”మీ ఆలోచన బాగుంది, ఇతనికి మరో ఆరు నెలల్లో ప్రమోషను, దగ్గరగా గజిటెడ్ ఆఫీసర్ జీతం, కాని ఒక్క మాట ఇతను ఎల్లకాలానికి ఇలా అక్కౌంటెంట్ గానే ఉండిపోతాడు, కనీసం మేనేజర్ కాలేడు, ఎందుకంటే మీరంతా డిపార్ట్మెంట్ నుంచి వస్తారు గనక. తెలివైన కుర్రాడు, ఏమో ఆఫీసర్ కావచ్చుగా! వదిలేద్దాం” అన్నారు. అంతే ఫైల్ కోసం మేనేజరుగారు చెయ్యిచాచడం, ఫైల్ ఇవ్వడం అందులో ఒప్పుదలరాసి సంతకం పెట్టి, ఫైల్ తాతగారికి తోయడం, ఆయనందులో ఆ రోజువరకు జీతం, నేను కట్టిన డిపాసిట్ డబ్బులు ఇచ్చేయమని రాసి సంతకం పెట్టి మేనేజరుగారికివ్వడం, ఆయనో చిట్టి సంతకం పొడిచెయ్యడంతో, రాసినంత సేపు పట్టలేదు, రాజీనామాకి. ఫైల్ పుచ్చుకొచ్చి కేషియర్ కిస్తే గబగబా లెక్కలు కట్టేసి డబ్బులు చేతిలోపెట్టేసేడు,సంతకమెట్టించుకుని. అక్కడితో రాజీనామా పూర్తయింది, చిన్న మీటింగ్ పెట్టేరు, అందరూ ఆశీర్వదించారు, అప్పుడు తాతగారికి సాస్టాంగ నమస్కారం చేశా! నాటి తాతగారి ఆశీర్వచనం నేటికి కొనసాగుతూనే ఉంది. చక్కబెట్టుకోవలసిన పనులున్నాయని పరుగే పెట్టా, అందరిదగ్గరా శలవు తీసుకుని!

ముందు సోవన్నని కలిసి విషయం చెప్పి ఇంటికెళ్ళొస్తానని బస్ పట్టుకుని ఇంటికి చేరేటప్పటికి రాత్రయింది. అమ్మకి విషయం చెప్పి, ఉదయమే తెల్లవారుతూనే కొండలరావు గారి దగ్గరకి పరుగెట్టి, విషయం చెప్పి నమస్కరిస్తే సంతసించారు, ఆశీర్వదించారు, బయలుదేరి అక్కకి చెప్పి, వస్తూ పోస్ట్ మాస్టారు చిట్టిపంతులుగారికి చెప్పి, కార్డులు పుచ్చుకుని, ఆయనతో కబుర్లు చెబుతూ నా అడ్రస్ కార్డుల మీద రాసి, ఇంటికొచ్చి అమ్మకిచ్చి, ఆమ్మ పెట్టిన బువ్వ తిని, అమ్మ చెప్పిన జాగ్రత్తలు విని, బయలుదేరి జట్కామీద కడియం చేరి, బస్ పట్టుకుని కాకినాడ చేరేటప్పటికి రెండు దాటిపోయింది.

తిన్నగా రూం కి పోయి హోల్డాలు, పెట్టె సద్దుకుని, ఇంటివారికి ఆ నెల అద్దె మొత్తం ఇచ్చేసి, నా విషయం చెప్పి రిక్షా మీద బయలుదేరి ఆఫీస్ కొచ్చి అందరిదగ్గరా వీడ్కోలు తీసుకుని, సోవన్నని కలిసి వివరం చెప్పి బుద్ధిగా చదువుకోమని, పోర్ట్ స్టేషనుకి చేరే సరికి ఆరు దాటింది. కొద్ది సేపటిలో నాతో పాటు సెలక్ట్ అయిన మరొకరూ రావడంతో జతకలిసింది.

తెల్లారేటప్పటికి సికిందరాబాద్ చేరేం, రాత్రంతా రైల్ ప్రయాణం,నిజానికి ఇబ్బందే పెట్టింది, నిద్ర పట్టక. :)అంతా గందరగోళం, ఉర్దూ తెలుగు. స్టేషన్ బయటికొస్తే కొత్త ప్రపంచం చూసినట్టే అనిపించింది,విశాలమైన రోడ్లు, మధ్యలో వృక్షాలు, పల్చపల్చగా జనం, డబల్ డెక్కర్ బస్సులు, పొట్టి రిక్షాలు. పాట్నీ సెంటర్ దగ్గరున్న నిజాంకాలపు టెలిఫోన్ ఎక్స్ఛేంజికి చేరడానికి ఆరణాలిచ్చాం, రిక్షాకి. దగ్గరలోని కింగ్స్ వేలో రూం,భోజనానికి అరవై రూపాయలు, ఇచ్చే స్టయిఫండు ఏభై. ట్రైనింగ్ మొదలయింది. నెల లోపే ఒక సమస్య, పుణ్య తిథికి ఆబ్దీకం పెట్టాల్సి వచ్చింది, ఇక్కడ ఎలా కుదురుతుంది? వెళ్ళి రావాలంటే శలవో? రెండు నెలల ట్రయినింగులో కుదరదు. హోటల్ మేనేజరుతో అన్నా మాటవరసకి, అతను ”సాయంత్రం పురోహితుల్ని రప్పిస్తా మీకు కావలసినట్టు పుణ్య తిథి జరిపిస్తార”న్నాడు.

ఇది జరిగేది కాదులే అనుకున్నా. సాయంత్రానికి ఒక పురోహితులొచ్చారు, వివరం చెప్పాను. ”ఋగ్వేద పూర్వక పాణిహోమంతో ఆబ్దీకం సశాస్త్రీయంగా చేయిస్తా”న్నారు. ”మా గోజిలలోనే కుదరటం లేదు, ఇక్కడా?” అన్నట్టు మాటాడా! ”మంత్రం చెప్పనా?” అంటూ ”నేను గోజివాణ్ణి, అందునా కోనసీమవాడిని” అన్నారు, ఆనందం చెప్పలేను, ”మరి భోక్తలకి” అన్నా! ”అదంతా నేను చూచుకుంటా, మీరు తిథిరోజు ఉదయం ఎనిమిదికి రెడీగా ఉండ”మని,ఏర్పాటుకి సొమ్ము తీసుకువెళ్ళేరు, ఎంతా మొత్తానికి ఇరవై రూపాయలు. సవ్యంగా జరుగుతుందా? అనుమానం పీడించింది. తిథిరోజు ఉదయమే ఎనిమిదికి వచ్చి నన్ను తీసుకెళ్ళేరు. అదొక పెంకుటింటి వసారా! దొడ్డితో,నూతితో ఉన్నది. వెళ్ళేటప్పటికొకరు వంట చేస్తున్నారు, మళ్ళీ స్నానం చేసి ఆభ్దీకం మంత్రంతో కొనసాగిస్తే, ఈలోగా వంట పూర్తి చేశారు, గారెలు పరమాన్నం తో సహా. వడ్డన చేసుకున్నారు, హస్తోదకమిచ్చాను, భోక్తలు లేచిన తరవాత నేను పితృ శేషం ప్రసాదం తీసుకున్నా! (భోజనం చేశా), ఆనందానికి అవధే లేదు, అంత చక్కగా జరిగింది అబ్దీక విధి. ఘనంగానే సత్కరించా తాంబూలంతో, జరగదనుకున్నది,ఘనంగా అక్కడ నెరవేర్చినందుకు.

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలెన్నో తరుముతున్నాయి,కొన్నిటితో ముగిస్తాను. డబల్ డెక్కర్ బస్సులు ప్రత్యేకాకర్షణ. 5,8,8A బస్సుల్లో ప్రయాణం అదో ఆనందం. ఆ తరవాత చార్మినార్, గోల్కొండ ఇలా చూడవలసిన ప్రదేశాలు తిరగడం, కాలం గడచిపోయింది. ట్రైనింగ్ చివరకొస్తుండగా, ఒకడో పుకారు లేవదీశాడు, ”అందరికి పోస్టింగ్ ఇవ్వరటా” అని. చాలా మంది గుండెల్లో రాయి పడింది, ఉన్న ఉద్యోగం వదులుకున్నాం, కొత్తది రాకపోతే? ఉభయ భ్రష్టత్వం అవుతామేమో,భయం. ఆలోచించా! అదేం జరగదు, మనల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరో చేస్తున్న పని, అని అందరిని ఊరడించా, ఏవో కారణాలూ చూపించా! చివరిరోజొచ్చింది. అందరికి గుబులే ఏం జరుగుతుందోనని. పుకారు నిజంకాదని తేలిపోయింది, ఎక్కడెక్కడో పోస్టింగులూ ఇచ్చారు. నాకు మరొకరికి మండపేట ఇచ్చారు, అందరూ మమ్మల్ని ఓదార్చారు మండపేట పోస్టింగ్ కి, ఆ వూరు భయంకరంట, కొడతారట… ఎన్నో ఎన్నో చెప్పేరు ఓదారుస్తూ, విన్నా, నాతో పాటు పోస్టింగ్ వచ్చినతను భయపడుతున్నాడు. ”భయపడకు, నేనుండగా నీకేం భయం లేద”న్నా! అతనికి అర్ధం కాలేదు. చాలా సేపు విన్న తరవాత చెప్పాను, ”అది నా స్వంత ఊరు” అని, నెమ్మదిగా. ఇప్పటిదాకా మమ్మల్ని ఓదార్చినవారంతా అభినందనలు చెప్పడం మొదలెట్టేరు,చిత్రంగా…లోకం….. ఎంతలో ఎంతమార్పు?

నేనొస్తానన్న రోజు ఉదయం నుంచే అమ్మ వీధిలో నాకోసం ఎదురు చూసిందంటే……

ఆ తరవాత జాయనవడం కలవవలసినవారందరిని కలవడం జరిగిపోయింది.ఇన్నిటిలోనూ కావలసినవారెవరొచ్చారు  తోడు?  తోడు నిలిచారెందరో, ఎందరో మహానుభావులు అందరికి వందనములు.

ఇంతకీ

ఏమీ తెలియని ఒక పల్లెటూరి కుర్రాడు, లోకం తెలియనివాడు, చదువు పెద్దగా లేనివాడు, రైల్ ఎక్కి ప్రయాణమే చేయడం తెలియనివాడు, ఇంతమంది అభిమానం ఎలా సంపాదించుకున్నాడు?

పరోపకారాయ ఫలంతి వృక్షాః
పరోపకారయ వహంతి నద్యః
పరోపకారాయ దుహంతి గావః
పరోపకారార్ధ మిదం శరీరం

పరోపకారం కోసం వృక్షాలు ఫలిస్తాయి,నదులు ప్రవహిస్తాయి,గోవులు పాలిస్తాయి. అలాగే పరోపకారం కోసం జీవించాలి….

ఇంతమంది దగ్గర దాన్ని సంపాదించుకోగలిగిన ఆ కుర్రాడిదే కదా అదృష్టం, ఇంతమంది అభిమానం ఎలా సంపాదించాడు, మీతో సహా….
అదే జీవిత రహస్యం

కొసమాట: జీవితంలో అన్నీ ఆనందాలేనా? ఎప్పుడూ కాదు. కష్టాలని దాటి వచ్చినదే జీవితం. అందరూ మంచివారే ఎదురయ్యారా? చాలా కౄరమైనవారూ ఎదురయ్యారు, నమ్మక ద్రోహులూ తారసపడ్డారు, కష్టాల్ని పదే పదే తలుచుకోక సుఖాలనే తలుచుకుని జీవితం సాగించడమే…పదే పదే పడిపోయా! ఓడిపోయా! పడిపోయిన ప్రతిసారీ కసిగా లేచా…మళ్ళీ పరుగే పెట్టా…ఇదే జీవనసమరం తొలిఘట్టం ఇంతతో బాకీలన్నీ తీరినట్టే!

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-జీవితసమరం తొలిరోజులు-ఎందరో …….వందనములు

 1. మీ జీవిత సమరం చదువుతుంటే ఆనాటి యువత కి ఈనాటి యువత కి ఎంత తేడానా అన్పిస్తోంది. ఇపుడు తల్లితండ్రులం పిల్లాడి నోట్లోంచి మాట రావటం ఆలస్యం అడిగినవన్నీ అమర్చేస్తున్నాము.

  • Chandrikaగారు,
   కాలాన్ని బట్టి మనుషుల ఆలోచనలూ మారాయి. నాడు స్వయం కృషితో పైకి రావాలన్నది మాట. నేడు తల్లి తండ్రులే అందలం మీద కూచోబెట్టాలనే తహతహ..ఇంతే తేడా..
   ధన్యవాదాలు.

 2. సర్ !మీ జీవిత సమర విశేషాలని దాదాపు నవల మాదిరి చదివేనంటే అతిశయోక్తి కాదు .ఇలాటి ఎన్నెన్నో అనుభవాల సమాహారం ప్రతివారి జీవితం లో ఉండక మానవు .అయితే మీలాటివారు వాటిని చెప్పవలసిన రీతి లో చెప్పటం వలన గొప్పదనం చేకూరింది . నేర్చుకున్న వారికి నేర్చుకున్నంత !”ఆచార్యాత్ ఆదత్తే పాదం ,పాదం శిష్య సమేధయ ,పాదం సంబ్రహ్మాచారిభ్య ,పాదం కాలక్రమేణచ “!!! అన్నారుకదా !! మీ లాగే మా మేనమామ శ్రీ సుసర్ల నారాయణ మూర్తి గారూ టెలిఫోన్స్ లో నే చెసి రిటైర యేరు .విశాఖ లో చక్కటి జీవితాన్ని గడుపుతున్నారు .ఆయనకు త్రివేండ్రం లో వచ్చిందని గుర్తు .ఊగిస లాడుతూ ఉంటే మా నాన్నగారు వెళ్ళమని ప్రోత్సహిచేరు .అమలాపురం ,ఏలూరు .బందరు లాటి ఊళ్లలో చేసేరు .మీరు మరిన్ని విషయాలు రాయాలని ఎందరితో బాటు నేనూ కోరుకుంటున్నాను . డా సుమన్ లత

  • Dr. RudravajhalaSuman lataగారు,

   చిరంజీవిని శిరీష కోరికపై రాశాను. జీవితంలో చెప్పుకోదగినవేం లేవుగాని, సాధించుకున్నవి వదులుకోలేదు,పడిపోయినా ప్రయత్నం మానలేదండి. మీ మామయ్యగారిని గారిని ఎరుగుదుననుకుంటున్నా! వీరు కాకినాడలో కూడా పని చేసిన గుర్తు
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s