శర్మ కాలక్షేపంకబుర్లు-అవ్వపేరే ముసలమ్మ

అవ్వపేరే ముసలమ్మ

‘అవ్వపేరే ముసలమ్మ’ అంటారు. అంటే అవ్వ అనగా అమ్మమ్మ లేదా మామ్మ లేదా వృద్ధురాలైన స్త్రీ అని అర్ధాలిస్తోంది నిఘంటువు. అవ్వ అంటే ముసలమ్మ అని వేరుగా చెప్పనక్కరలేదన్నదే, రెండూ ఒకటేనన్నదే దీని భావమూ! ఏంటో అంతా తిరకాసుగా ఉందంటారా? ఐతే వినండి…

పాండవులు అజ్ఞాతవాసం ముగించుకుని ధృతరాష్ట్రుని వద్దకు విరాటరాజు పురోహితుని ద్వారా తమ తండ్రి పాలైన అర్ధ రాజ్యం ఇమ్మని కబురు పంపారు. దూతగా వెళ్ళినవాడు రాజపురోహితుడు, విషయం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేడు, వారు వినేసేరు. దీని మీద కౌరవులలో కదలిక వచ్చింది, ఏం చేయాలని ఆలోచించి సంజయుని రాయబారిగా పంపించారు. సంజయునునికి ఏమని చెప్పమని చెప్పి పంపేరు? ఇది అసలు విషయం. పాండవులతో ఇలా చెప్పవయ్యా అన్నారు ” మీరు ధర్మాత్ములు,మీరు చాలా కష్టాలు పడ్డారు, కష్టాలు పడడం మీకు కొత్తకాదు అందుచేత శాంతి వహించడం మంచిది” అని చెప్పు, ఏం చెబుతావో కాని వాళ్ళని యుద్ధం నుంచి మరల్చు అన్నాడు, ధృతరాష్ట్రుడు, ఇదీ సారాంశం. వచ్చిన సంజయుడు దీనినే తిప్పితిప్పి చెప్పేడు. విన్న పాండవులూ, చెప్పిన విషయాన్నే తిప్పితిప్పీ చెప్పేరు. చివరగా ధర్మరాజు ఒక మాట చెప్పేడు. ” వాళ్లు మేము అన్నదమ్ములం, వైరం అనవసరం, మా పాలు మాకిస్తే మా రాజ్యం మేము పాలించుకుంటాం, కాదు కూడదంటే, సగభాగం ఇవ్వలేనంటే, ఐదూళ్ళిమ్మనవయ్యా! ఇది కూడా ఎందుకో తెలుసా అంతేవాసుల గ్రాసోవాస దైన్యం లేకుండేందుకే! ఇదిగిదిగో చూడూ! కుశస్థలి, వృకస్థలి, వాసంతి, వారణావతం,ఈ నాలుగూళ్ళు ఇమ్మను, ఐదో ఊరు ఏదైనా సరే వాళ్ళనే చూసి చెప్పమను,అది నాకు చాలు, సంధి ఖాయం” అన్నాడు.

రాయబారానికొచ్చిన సంజయుని మాటేంటీ? శుష్కప్రియం,శూన్య హస్తమూనూ. మరి పాండవులమాటేంటీ తిప్పి తిప్పి చెప్పినా అది అర్ధరాజ్యం. ప్రజలలోకి వెళ్ళిన మాటేంటీ? ”ధర్మరాజు అర్ధరాజ్యం అడిగాడట పెద తండ్రిని, అలా ఇవ్వడానికి ఇష్టపడకపోతే ఐదూళ్ళేనా ఇమ్మన్నాడట, ఎందుకని? కూడా ఉన్నవారి తిండీ, గుడ్డా కోసంట. ఏం? ధృతరాష్ట్రుడు, ఐదూళ్ళేనా ఇవ్వలేడా?” ఇదీ ప్రజలమాట. నాటి కాలం నాటికి ఈ ఐదూళ్ళూ కలిపితే అర్ధరాజ్యమేను(ట) 🙂

అదండి ధర్మరాజు తెలివి.

అందుకే నేటుకీ ముడి పడని కార్యానికి,తిప్పి తిప్పి చెప్పడానికి,చేతులూపుకుంటూ వెళ్ళిరావడానికి సంజయ రాయబారం అంటారు 🙂

అర్ధరాజ్యం కాదంటే ఐదూళ్ళు, ఐదూళ్ళే అర్ధరాజ్యం
అవ్వపేరే ముసలమ్మ అంటే ఇదే కదూ

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అవ్వపేరే ముసలమ్మ

  1. అసలు కౌరవ సామ్రాజ్యం ఎక్కడనుంచి ఎక్కడ వరకు విస్తరించి ఉండేది? పాండవులు అడిగిన ఐదువూళ్ళు ఆధునిక అట్లాస్ లో ఎక్కడ వుంటాయో చెప్పనిదీ ఒక నిర్ధారణకు రాలేము.

    • మిత్రులు M.V.Ramanarao గారు,
      ధృతరాష్ట్రుడు,పాండు రాజు రాజ్యానికి వచ్చేటప్పటికున్నవి కురు,జాంగల ప్రదేశాలని భారతమే చెబుతోంది. ఆ తరవాత పాండు రాజు సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు,ఎక్కడినుంచి ఎక్కడికి చెప్పడం కష్టమే!

      ఈ ఐదూళ్ళన్నవి ఆ రోజునాటికే పెద్దపట్టణాలనీ,సామ్రాజ్యంకి నాలుగు పక్కలా ఉండేవనీ, మిగిలినప్రదేశమంతా పల్లెపట్టులేననీ,సంపద రీత్యా ఇవే సగభాగమనీ,జన శ్రుతి

      ధన్యవాదాలు.

    • డాక్టర్ సుమన్ లత గారు,
      సంజయుడు ధర్మరాజును ఇలా వర్ణిస్తాడు.
      ”ధర్మారాజు మెత్తని పులి,తప్పు తనమీదకి రానిచ్చుకోడ”ని.
      ధర్మరాజు గురించి ఇంతటి,చక్కటి,నిజమైన,పక్షపాత రహితమైన వ్యాఖ్య మరెవరూ చేయలేదు. నాకు భారతం మొత్తం మీద కనపడలేదండి.
      ధన్యవాదాలు.

వ్యాఖ్యానించండి