శర్మ కాలక్షేపంకబుర్లు-రాలుగాయి.

రాలుగాయి.

ఎండ మండిపోతోంది, మొన్న ఇరవైయ్యో తారీకు పగలు ఎండ విరగ్గాసింది, పెరటిలో కొత్తపల్లికొబ్బరి మామిడి చెట్టూ విరగ్గాసిందీ సంవత్సరం. సాయంత్రానికి ఒక్కసారిగా చల్లబడిపోయి గాలి బాగా వేసి, వర్షం చితక్కొట్టింది. చూస్తుండగా చెట్టునుంచి మామిడి కాయలు టపటపా రాలేయి. చెట్టు సగం రోడ్డు మీదకి ఉండటంతో, అంత వర్షంలోనూ,అంత రాత్రిలోనూ,చీకటిలో బయట రాలిన కాయ ఒక్కటి కూడా మాకు దొరక్కుండా ఏరుకుపోయారు 🙂 లోపల రాలినకాయ లెక్కపేట్టుకుంటే ఏడుపే వచ్చింది. బయట లోపల మొత్తంగా మూడు వందల కాయ రాలిపోయి ఉంటుంది. ఇంతకాయ రాలిపోయిందే అంటే ఇల్లాలు ”మన దొడ్డిలో ఉన్న ఒక చెట్టుకే ఇలా బాధపడితే తోటలున్న రైతెలా ఉంటాడు?” అంది ”రాలుగాయలేం చేస్తావని” ఇల్లాలినడిగా! ఆవిడ చెప్పిన మాట. ”రాలుగాయలు మూడు రకాలు, గట్టిగా ఉన్నవి, పగిలినవి, పండు పడినవి. ఇవి ఏవీ పనికిరావు. గట్టిగా ఉన్నకాయలతో ఊరగాయి పెడితే నిలవుండదు,పాడవుతుంది, మాగాయకి పెట్టుకుందామంటే ఊట ఉండదు, ’దమ్మిడీ ముండకి ఏగాని క్షవర’మని సామెతలాగా కొత్తగా మరో కాయలు కొని ఊట తెచ్చుకోవాలి. పగిలిన కాయలూ అంతే! ఇక పండు పడిన కాయలంటే చెట్టున ముగ్గిన పండు, ముగ్గేసిన దానిలా ఉండదు. ఇది కొద్దిగా పులుపు,తీపి ఉంటుంది,మెత్తగా ఉండదు, నిలవుంచితే కుళ్ళిపోతుంది. నేటివాళ్ళు ఇలా ఇచ్చిన పళ్ళు తినలేరు సరికదా పడిపోయిన కాయలిచ్చేరని పేర్లూ పద్దులూ పెడతారు, అందుకు ఇవీ పనికిరావు” అని ఆగింది, ఇంతచెప్పినా మళ్ళీ ”ఏం చేస్తా”వన్నా! ”రాలుగాయి కొడుకులూ/కూతుళ్ళూ ఉంటే ఏం చేస్తాం? వాళ్ళు ఎందుకు పనికొస్తారో, ఈ రాలుగాయిలూ అంతే ఉపయోగ”మని అంటూ లోపలికెళిపోయింది, రాలుగాయి పదం మీద శ్లేష చేస్తూ. రాలుగాయి కొడుకులూ/కూతుళ్ళా అనుకుంటూ ఊయలలో కూచుంటే భారతంలో ఒక ఘట్టం గుర్తొచ్చింది, అవధరించండి.

పాండవ రాజసూయానికెళ్ళొచ్చి తను పడినపాట్లు తండ్రితో చెప్పుకుని, ఎవరితోనూ మాటాడక ఉండిపోయాడు,దుర్యోధనుడు. ఇది గమనించిన మామ శకుని, అల్లుని చేరి ’అల్లుడూ! ఎందుకిలా ఉన్నావు ఏమయిందని’ అడిగితే ’ఏం చెప్పను, రాజసూయంలో జరిగినదంతా నువ్వూ కళ్ళారా చూశావు కదా! ఏంటి ఆవైభవం, ఆ సంపద..నాకు చాలా బాధగా ఉంద’న్నాడు. విన్న శకుని మేనల్లుని తీసుకుని ధృతరాష్ట్రుని వద్దకు చేరి ’రాజా! నా మేనల్లుడు,నీకొడుకు చిక్కిపోతున్నాడు,బాధపడుతున్నాడ’ని చెప్పేడు. గుడ్డిరాజు కొడుకుని తడవి ’నాయనా! ఎందుకయ్యా ఈ బాధ’ అంటే ’తండ్రీ! రాజసూయంలో ధర్మరాజు వైభవం ఏమని చెప్పను, రాజులంతా వంగి వంగి, పడి పడీ దణ్ణాలెట్టేరు. ఒకడు వేల ఏనుగులిస్తే, మరొకడు వేల మేలుజాతి గుర్రాలిచ్చాడు, మరొకడు మణులు,మాణిక్యాలిచ్చాడు. ఇలా వచ్చిన కానుకలకి లెక్కేలేదు. ఆ వైభవం, సిరి చూస్తే నాకు సహించటం లేదు, వాటినెలాగైనా హరించాలి. మరో సంగతి కూడా, రాజసూయానికొచ్చిన పేద సాదలందరిని పాంచాలి పలకరించి,భోజనాలు పెట్టించి బహుమతులిచ్చి పంపుతూ ఎప్పుడో అర్ధరాత్రి రెండు మెతుకులు తిని పడుకుంటోందయ్యా! అందరూ పాండవుల వైభవాన్ని, దాతృత్వాన్ని పొగుడుతుంటే, వెఱ్ఱి మొహాలేసుకుని చూస్తున్న మమ్మల్ని చూసి పాండవులు,ద్రౌపది,శ్రీకృష్ణుడు నవ్వేరు, ఇదంతా చూసిన నాకు కడుపు రవిలిపోతోంద’న్నాడు. ఇది విన్న శకుని, ’ఓస్! ఇంతేనా దీనికే ఇంత బాధా! నువ్వు ధర్మరాజుతో జూదమాడు, ఆ సిరిసంపదలన్నిటినీ నీకాళ్ళ దగ్గరపెట్టిస్తాను, ధర్మరాజుకి జూదమంటే ఇష్టం,కాని నిపుణుడు కాదు! నేనందులో ఆరితేరినవాడిని, ధర్మరాజును సులువుగా గెలుస్తాను, వాటన్నిటిని జూదంలో గెలిచి, నీపాలు చేస్తా’నన్నాడు.

ఇది విన్న ధృతరాష్ట్రుడు, ’జూదంవద్దు, విదురుడు ఇరుపక్కలా కావలసినవాడు,నీతి కోవిదుడు. పరిపాలనంతా విదురుని ధీ శక్తి,భీష్ముని భుజ శక్తి మీద నడుస్తోంది, అందుకు విదురుణ్ణి అడగా’లన్నాడు. విన్న దుర్యోధనుడు, ’విదురుడా! పాండవ పక్షపాతి, జూదానికి ఎందుకు ఒప్పుకుంటాడూ? తండ్రీ! నీవుగనక శకుని చెప్పినట్టు జూదానికి ఒప్పుకోకపోతే….

దీని కొడబడు మొడబడవేని నేడ,ఈ క్షణమ సర్వభక్షకుచే భక్షితుండ
నగుదు దెల్లమేనట్లైనదగవుదక్కి,విదురుడును నీవు నుండుడు ముదముతోడ…..సభా.ప,,,ఆశా..౨…౧౨౭

శకుని మాట ఒప్పుకో! ఒప్పుకోకపోయావో ఈ రోజే, కాదు ఇప్పుడే ఈ క్షణంలోనే ఒంటికి నిప్పంటించుకుని కాలిపోతాను,తెలిసిందా? గొడవలేం లేక నువ్వూ,విదురుడూ ఆనందంగా ఉండండి, అని బెదిరించాడు.

తరవాతేం జరిగిందీ, తమందరికి తెలిసినమాటే!

ధృతరాష్ట్రుడు ఉన్న నిజం చెప్పేశాడు,కొడుకుతో,విదురుని బుద్ధిబలం,భీష్ముని భుజబలంతో రాజ్యపాలన జరుగుతోందని.. రాజ్యపాలన విదురుని మంత్రాంగం మీద,భీష్ముని భుజబలం మీద నడవడం దుర్యోధనునికి ఇష్టమైన మాటకాదు. ఇది దుర్యోధనునికి కంటగింపుగా ఉంది, కాని బహిరంగంగా ఈ మాట చెప్పలేడు. తమరాజ్యంలో, తమ ఆలోచన మరొకరితో పంచుకోవడం,అనుమతి పొందడం, ఇదసలు ఇష్టంలేదు, దుర్యోధనునికి. కాని అదే జరుగుతున్నది, తనకు తెలిసినప్పటినుంచీ. దీనిని ధిక్కరించి, విదుర,భీష్ములకు ఇష్టంలేని పనిచేసి, తనకి ఇష్టమైన పని ’పాండవుల సంపదను హరించడం చేసి’, తన స్వాతంత్ర్యం, ప్రత్యేకత,గొప్పదనం నిలబెట్టుకోవాలి. విదురుడు మొదలైనవారెలాగా ఇటువంటి పని వద్దంటారు, ఇట్టి పరిస్థితులలో తన మాట చెల్లించుకోడానికి శకుని తంత్రం బాగా నచ్చింది,దుర్యోధనునికి. తనమాట నెగ్గించుకోడానికి తండ్రిని ఏమని బెదిరించాడో చూశారా! నిప్పుల్లో దూకి చస్తా, పాండవులతో జూదమాడి వారి సంపద హరిస్తానని శకుని చెప్పిన మాట ఒప్పుకోకపోతే అన్నాడు, రాలుగాయి కొడుకు దుర్యోధనుడు.

ఇటువంటి పనులు చేయడానికి సిద్ధపడే రాలుగాయి కొడుకు/కూతురు ఒక్కళ్ళుంటే చాలదూ, ముదిమిలో పరాయిపంచల్లోపడి, దయనీయమైన జీవితాలు గడపడానికి….

మరి రాలుగాయలెందుకు పనికొస్తాయి?

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-రాలుగాయి.

 1. తాతయ్య గారు,
  ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగానే ఉంది కదా?
  చాలా రోజుల నుంచి ఒక్క టపా కూడా లేదు

  • Sireesha
   మాకిక్కడ చల్లబడలేదు,గట్టి వర్షమూ లేదు,వేడి తగ్గలేదు. రెండురోజుల్నించి కొద్దిగా చినుకులే,బట్టకూడా తడవదు, ఆపైన బద్ధకం పెరిగింది,మూడు నెలలుగా కీ బోర్డ్ ముట్టుకోలేదుగా, అంతా కొత్తగా ఉంది 🙂
   ధన్యవాదాలు.

 2. మా చిన్నప్పుడు మా పెద్దమ్మగారు దెబ్బ తగిలిన మామిడి కాయలని పండించి మామిడి తాండ్ర తయారు చేసేవారు. చేసే విదానం నాకు తెలియదు కాని అంత రుచి వున్న తాండ్ర మళ్ళీ నేను ఎక్కడ తినలెదు. ఈసారి మళ్ళీ చెయ్యమని అడగలి. మరి రాలుగాయలు దానికి పనికివస్తాయొ లెదొ.

  • అమ్మాయ్ సిరిమల్లెలు,
   పచ్చి కాయలు,పగిలిన కాయలు తరిగి ఉప్పులో పోస్తారు, ఏండబెట్టిన ముక్కలు కొంతమంది కావాలని పట్టుకెళతారు, ఉపయోగించుకుంటారు. ఆమ్ చూర్ అని తయారు చేస్తారు గాని మనపక్క ఆ అలవాటు లేదు.
   పరువుక్పొచ్చిన కాయలు నువ్వన్నట్టేనమ్మా, తాండ్రకే, ఓపిక తగ్గి చాకిరీ చెయ్యలేక ఇల్లాలి బాధ …..
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s