శర్మ కాలక్షేపంకబుర్లు- పట్టుబడి-కొలగారం

పట్టుబడి-కొలగారం

         గోనె సంచులలో ధాన్యం, అపరాలు వగైరాలను నింపడాన్ని పట్టుబడి అంటారు, ఇలా ఆహార పదార్ధాలను నిలవ చేసి ఉంచడాన్ని ”బస్తాబందీ” అని కూడా అంటారు. ఒక చోట వరుసలలో వేయడాన్ని ”నెట్టు” కట్టడం అంటారు. ఇక కొలగారం అంటే ”ఏంటీ కారాగారంలాగా” అనకండి. ఒకప్పటి రోజులలో అన్నిటినీ కొలిచేవారు,ద్రవాలతో సహా! గిద్ద,అరసోల,సోల,తవ్వ,మానిక లేక శేరు,అడ్డ, కుంచం ఇవి పరిమాణాలు. దీని గురించిన పాత టపాకూడా ఒకటున్నట్టు గుర్తు. ఇక పళ్ళు,కాయల్ని లెక్కించేవారు, ఆ లెక్క అరపరక అంటే ఏడు,పరక అంటే పదమూడు,పాతిక అంటే ఇరవై ఆరు, ఏభై అంటే ఏబది రెండు, వంద అంటే నూటైదు. అసలుకు మించి ఉన్నవాటిని ’శలగ’ అనేవారు, ఈ శలగ గురించి కూడా టపా ఉన్నట్టే గుర్తు. ఆహారధాన్యాలు కొలతపైనే కొనడం అమ్మడం జరిగేది. ఇరవైనాలుగు కుంచాలు ఒక బస్తా. ఇది నేటి కాలపు వంద కేజీలు కి సమానం.

ఎక్కువ పరిమాణంలో ఉన్న ఆహారధాన్యాలు ఆరోజులలో కొలవడానికి ఒక వ్యవస్థ ఉండేది, పల్లెలలో. ఇది మధ్యస్థ వ్యవస్థ, అనగా కొనేవారికి,అమ్మేవారికి మధ్య మోసం లేక కొలిచి ఇచ్చేది, దీనికిగాను ఆరోజుల్లో బస్తాకి ఒక రూపాయ వసూలు చేసేవారు. ఇది గ్రామం కోసం ఖర్చుపెట్టేవారు. ఇలాటి వ్యవస్థకి పాట ఉండేది. పాట అంటే ఆ ఊరి ఆయకట్టు,పంట అంచనా వేసుకుని బస్తాకి రూపాయిలెక్కన ఊహించుకుని, అలా ఆపని నిష్పాక్షికంగా నిర్వహిస్తూ ఊరికోసం ఇచ్చేసొమ్మే పాట సొమ్ము,ఆ కాలంలోనే ఇది వేలలో ఉండేది, తరవాత కాలంలో ఇది పెద్దల భోక్తవ్యానికి నెలవుగా మారిపోయిందనుకోండి.

పెద్ద పెద్ద పరిణామాలలో కొలత ఎలా? దీనికి ఒక పద్ధతి ఉండేది. కొలత కుంచంతో మొదలెడుతూ లాభం, లాభం అని పాటలా అంటూ పెద్ద రాశి నుంచి ఒక కుంచెడు కొలిచి పక్కనపోస్తూ ఒకటి అని, మళ్ళీ కొలుస్తూ లాభం ఒకటి అనే పాట పాడుతూ రెండవ కుంచెడు కొలిచి పోసి ఒకటి రెండు, ఆ తరవాత కుంచం కొలిచిపోసినపుడు రెండు,మూడు ఇలా పాట సాగి ఇరవైనాలుగు కుంచాలూ కొలిచిన తరవాత ఒక కుంచెడు కొలిచి వేరుగాపోసేవారు. ఇలా ఇరవైనాలుగు బస్తాలు కొలిస్తే ఇరవైనాలుగు కుంచాలు ఒక పక్కగాపోసేవారు. ఇప్పుడు కొలిచిన పెద్దకుప్ప ఇరవైనాలుగు బస్తాలు, మరో చిన్నకుప్పగాపోసినది ఒకబస్తా, ఇరవైనాలుగు కుంచాలూ, మొత్తంగా ఇరవై ఐదు బస్తాలనమాట. ఒకవేళ కొలిచిన బస్తాలలో లెక్క తేడా వస్తే అన్నీ మళ్ళీ కొలవక్కరలేక చిన్నకుప్పని కొలుచుకుంటే ఎన్ని బస్తాల ధాన్యం కొలిచినది తెలిసిపోయేది. ఈ పని చేయడానికా రోజులలో అరడజను మంది మనుషులుండేవారు. ఈ కొలత సరిగా జరుతున్నది లేనిది చూడడానికో పర్యవేక్షకుడు ఉండేవారు, కొలత సరిపోతే ఆ చిన్నకుప్పని పెద్ద కుప్పలో కలిపేస్తే అక్కడికా ప్రతి ఇరవై ఐదు బస్తాలు. ఇలా కొలత ఇంకా కొనసాగితే పాతిక బస్తాలకిగాను ఒక గుర్తు ఇచ్చేవారు,దీనిని ’కాయ’ అంటారు. ఈ ప్రాతిపదికపై తప్పులేకుండా కొలిచేవారు, ఇది మధ్యస్థ వ్యవస్థ. నిన్న మొన్నటి వరకు ధాన్యాలన్నిటిని తూకం వేయడాన్ని కూడా కొలగారం అనే అనేవారు.

నేటి కాలంలో లారీ మీద పోసేసి పట్టుకెళ్ళి కాటా వేయిస్తున్నారు, దీనిని ’సొరపోత’ అంటారు, నేడు దీనిలోనూ మోసం ఉంటోంది. ఖాళీ లారీని తూకం వేయించి తెచ్చి, ధాన్యం అందులో పోసి. తీసుకెళ్ళి తూకం వేయించి వర్తకునికి అప్పజెబితే ఈ తూకాల మధ్య తేడా సరుకుగా నిర్ణయింపబడాలి. మరి మోసమెక్కడా? లారీ వర్తకునిదే ఐ ఉంటుంది, అతనే పంపుతాడు, కనక లారీ మనుషులు అతనివాళ్ళే. ఖాళీ లారీ తూకానికి వెళ్ళేటపుడు కొన్ని బండరాళ్ళు దగ్గరగా ఒక క్వింటాలు బరువు ఉన్నవి లారీలో పడేసి, తూకమేయిస్తాడు, రైతుదగ్గరకొచ్చేసరికి రాళ్ళు తీసేస్తాడు, సరుకు ఎక్కించిన తరవాత అంతా మామూలుగా నడచిపోతుంది. ఇదీ తూకంలో మోసంలా కనపడుతుంది, కాని వ్యాపారి చేసే మోసం.

పాతరోజుల్లో కూడా ఎండు ద్రాక్షలాటివాటిని తూచేవారు, మరీ బంగారంలా తూస్తున్నావే అనే మాట సర్వ సహజంగానే వినపడేది. దీనికి పూస ఎత్తు(అదే గురివింద పూస) కాణీ,అర్ధణా,అణా,బేడ,పావలా, కాసు, తులం ఇలా లెక్కుండేది. అతి చిన్న తూకం పూసెత్తు. నేడు మిల్లీగ్రాం అనుకోవచ్చు. నేడన్నీ గ్రాములు మిల్లీగ్రాములే. ఇదిగో ఈ బంగారం తూచడానికి కూడా మధ్యస్థ తూకం ఉంది, మరిప్పుడేం చేస్తున్నారో పెద్ద పెద్ద వాళ్ళు తెలియదుగాని, పల్లెలలో,పట్టణ్లలో ఇంకా మధ్యస్థ తూకం కొనసాగుతోనే ఉంది. నిజానికిది నిస్పాక్షికమైనదే! ఇవే నాటి వ్యవస్థలు.

నేటి కాలంలో కొలతలు తూకాలు అన్నిటిలోనూ మోసమే! పెట్రోల్ బంకుల్లో జరుతున్నది దారుణమే!

నాదగ్గరున్న లెక్కల పుస్తకం సంవత్సరాలకితం ప్రచురింపబడింది. దాని నుంచి కొన్ని మానాలు.

ప్రకటనలు

శర్మ కాలక్షేపంకబుర్లు-కారప్పొడి.

కారప్పొడి.

దీనినే కరివేపాకు కారప్పొడి,ధనియాలపొడి లేదా కారప్పొడి అంటారు. నేటి కాలంలో దీన్ని పేకట్లలో అమ్ముతున్నారట, ఇందులోకి కావలసిన సరుకులు.

ధనియాలు.
శనగపప్పు.బాలెంతకోసం చేసే కారప్పొడిలో శనగపప్పు వెయ్యరు
మినపపప్పు.
జీలకర్ర.
ఎండు మిర్చి.
కరివేపాకు.
చింతపండు ఉట్లు లేనిది
ఉప్పు
పసుపు
వెల్లుల్లి రేకలు ఇష్టమైనవారు వేసుకోవచ్చు, పోపులోనే వేసి వేయించుకోవచ్చు. కారప్పొడ్డి వేడి చేస్తుంది. వెల్లుల్లి మరికాస్త వేడి చేస్తుంది.

మూకుడు కాలేసి సరుకుల్ని చెప్పిన పద్ధతిలో వేయించండి.

మూకుట్లో తగిన నూనివేసి కాగిన తరవాత శనగపప్పు,మినపపప్పు దోరగా వేయించండి.ఆ తరవాత ధనియాలు వేయండి వేగుతుండగా జీలకర్ర వేసి వేయించండి.ఆ తరవాత ఎండు మిర్చి వేయండి. కమ్మని వాసనొచ్చిన తరవాత కరివేపాకు వేసి వేయించండి. కరివేపాకు పచ్చిగా ఉండిపోతే బాగోదు. దించిన పోపుకి కొద్ది పసుపు చేర్చండి, తగిన ఉప్పు చేర్చండి. చింత పండు ముద్దను చిదిపెయ్యండి. వీటన్నిటిని మిక్సీలో వేసి తిప్పండి, మరీ మెత్తగా అక్కరలేదు, బరకగా ఉన్నా బాగానే ఉంటుంది. రుచి చూడండి,ఎక్కువ తక్కువలు సరి చేయండి. దీనిని ఒక స్టీల్ డబ్బాలో గాలి చొరని దానిలో నిలవ చేయండి.

ఆకలిలేకపోవడం, రుచు లేకపోవడాన్ని అరికడుతుంది. బాలెంతలు కూడా వాడచ్చు. జ్వరపడి పత్యం తీసుకునేవారు ముఖ్యంగా తీసుకోవాలి. ఒక స్పూన్ పొడి రెండు ముద్దల వేడి అన్నంలో కరిగిన నేతితో తీసుకుంటే బాగుంటుంది. ఉదయం ఇడ్లీ టిఫిన్ లోకీ నేతితో బాగుంటుంది.

ఇందులోని ధనియాలు హృదయానికి,రక్తప్రసారానికి మంచి మందు. జీలకర్ర గురించి చెప్పెదేమి? ఎండు మిర్చి కేన్సర్ కారకాల్ని అణిచేస్తుంది. వెల్లుల్లి గురించీ చెప్పక్కరలేదు. ఇందులో ఉన్నవన్నీ మందులే, రుచికరమైన మందులు.

శర్మ కాలక్షేపంకబుర్లు-రెండూ లేని తగువు

చివరివరకు వీరోచితంగా పోరాడిన టీమిoడియా క్రికెట్ స్త్రీల జట్టు మిథాలీ సేనకు పేరు పేరున అభినందనలు.

రెండూ లేని తగువు

“జగడమెందుకొస్తుంది జంగమయ్యా!” అంటే “బిచ్చంతేవే బొచ్చు ముండా” అన్నాడట. అంటే      తగువెందుకొస్తుందో చెప్పక్కరలేదుగా వేరుగా 🙂  తగువనేది ఎవరి మధ్యనైనా ఎప్పుడేనా రావచ్చు. ఒక్కొక్కపుడు దీనికి కారణాలే ఉండక్కరలేదు, గొఱ్ఱెపిల్ల తోడేలు కతైనా చెప్పి తగువు సాధించవచ్చు, ”ఇటువంటి వారినే తివిరి ఇసుమున…..తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు…….” అన్నారు, లక్ష్మణ కవి. ఏం పూర్తి చెయ్యలేదంటారా! రెండూ లేని తగువెందుకు తెచ్చుకోడమని 🙂

తీరికూచుని, రెండూ లేని తగువు తెచ్చుకున్న పిచుక కత చెప్పుకుందామా? ఒక వృక్షం చిటారు కొమ్మన ఒక పిచుక గూడు కట్టుకుని వాసం చేస్తోంది. ఒక కోతీ ఆ కొమ్మన ఉంటోంది. ఒక రోజు పెద్ద గాలీవానా వస్తే పిచుక గూట్లో వెచ్చగా పడుకుంది, కొమ్మ ఊగిందేగాని గూటికేంకాలేదు, ఊయ్యాల ఊపుతున్నట్టుగా ఉంటే పిచుక చక్కహా నిద్రపోయింది, అంతగాలీ,వానలో కూడా. కోతి మాత్రం వానకి తడిసి,చలికి వణుకుతూ కొమ్మన కూచునిపోయింది. ఉదయమే లేచిన పిచుక చలికి వణుకుతున్న కోతిని చూసి కోతిబావా! కోతిబావా!! నువ్వు చాలా పెద్దవాడివి,బలవంతుడివి కూడాను. చక్కహా నాలుగు కొమ్మలు విరుచుకుని ఆ కొమ్మనో ఇల్లు కట్టుకోరాదా అని ఉచిత సలహా పారేసింది. అసలే చలికి వణుకుతున్న కోతికీ మాటలు కారం రాసుకున్నంత సుఖంగా అనిపించాయి. ఈ మాటలు విన్న కోతికి కోపం నసాళానికి ఎక్కిపోయింది. ఔరా!ఔరా!! ఔరౌరా!!! పిడికెడు లేని పిట్ట ఇంత పెద్దైన నాకు సలహాలిస్తుందా? నేను తెలివి లేనివాణ్ణంటుందా? ఇల్లు కట్టుకోలేని చేతకానివాడినని గేలి చేస్తుందా! ఎంత పొగరు దీనికి అనుకుంది. అసలే కోతి, కల్లుతాగింది,నిప్పు తొక్కింది, పిచ్చెక్కింది, దయ్యం పట్టిందన్నట్టు లేచి, పిచుక గూటి మీదకి దండయాత్రకి బయలుదేరింది. అయ్యో!రామా!! నేరకపోయి మంచిమాట చెప్పి చిక్కుల్లో పడ్డానే! అని విచారించిన పిచుక ఎగిరిపోయింది. కోతి పిచుక గూటిని పీకేసి నేలకేసి కొట్టి తన కసి, కోపం తీర్చుకుంది. మంచి మాట చెప్పి రెండూ లేని తగువు తెచ్చుకుంది పిచుక. అంచేత బలవంతులకు, ”మంద” భాగ్యులకు ( ఈ మాట నాది కాదు, ఇలా మాటను విరిచి మరో అర్ధం సాదించినవారికి వందనాలు) ఉపకారమే ఐనా సలహా చెప్పకూడదు,చెప్పి కొంపమీదకి తెచ్చుకోకూడదు.

నీతో నాకేంటోయ్ ఈ ’రెండూ లేని తగువూ’ అంటూంటారు. అసలీ రెండూ లేనివేంటి బాబూ! మంచి,చెడ్డ; ఉచ్చం,నీచం;మర్యాద,మన్నన;గుణము,దోషమూ; సిగ్గు, లజ్జ ( రెండూ ఒకటికావో) మొదలైనవేవీ ఉండవుట, తగవు మొదలయ్యాకా. దీనికో ముతక సామెతా ఉంది,చెబితే బాగోదని మానేశా. తగవు ప్రారంభమైన తరవాత ఉచ్చ,నీచాలూ,( అనదగిన అనకూడని మాటలు )మంచి,చెడ్డలూ అన్నీ ఏట్లో కలిసిపోతాయి, మిగిలేది వితండవాదం, నేనాడేదే మాట, అదే చెల్లాలి,అని, అహం అడ్డు పడి నిజాన్ని కూడా చూడలేని హ్రస్వ దృష్టి చేరుతుంది. ఇలా ఆరెండూ పోతాయి. మరేం చెయ్యాలీ? అందుకే పెద్దలేమన్నారంటే గుణం తక్కువవాడితోనూ, కుఱ్ఱాడితోనూ  తగువు పడకు, నీకే అపకీర్తి అన్నారు. గుణం తక్కువవాడే మాటైనా అనేస్తాడు, వాణ్ణి మనం తిట్టినా బాధ ఉండదు, అది వాడికి అలవాటే ఐ ఉంటుంది గనక. చూసేవాళ్ళు కూడా వాడిని తిట్టినా ఏమనుకోరు, కాని వాడు మనని తిడితే మాత్రం అది పెద్ద వార్తగా దేశమంతా చెబుతారు,నాలిక భుజాన వేసుకుని ప్రచారం చేస్తారు. కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కని కరిస్తే వార్తే కదూ 🙂 అందుకే ఊరుకున్నంత ఉత్తమం,బోడి గుండంత సుఖం లేదన్నారు. మౌనేన కలహోనాస్తి,నాస్తి జాగరతో భయం 🙂

నిజానికి తగువులో లేని రెండూ ఏంటండి? సత్యమూ,ధర్మమూ. తగువు అంటే న్యాయమని అర్ధమండి. ఇప్పటికీ పల్లెలలో తగువు చెప్పండి అంటుంటారు, ఇదేంటీ అనుకున్నాగాని ప్రయోగం సమంజసమే! సత్యము,ధర్మమూ లేని మాట చెబుతున్నావని అనటమండి. ఇది చాలా పెద్ద మాటండి, సామాన్యంగా వాడేస్తున్నామండి. ఆయ్! అదండి సంగతి.

శర్మ కాలక్షేపంకబుర్లు-రాక్షసవివాహం

రాక్షసవివాహం

రాక్షసవివాహం అంటే నేనన్నమాట ఇదీ.

“సనాతన ధర్మంలో కన్య ఇష్టం లేక వివాహం లేదు, అది రాక్షసమైనా సరే!”

కాని నిఘంటువులిలా అంటున్నాయన్నారు.

సూర్యరాయాంధ్ర నిఘంటువు – కన్యక యొక్క బంధువుల జయించి బలాత్కారమునఁ గన్య నపహరించికొని వచ్చి చేసికొనెడి వివాహము (ఎనిమిది విధములగు వివాహములలో నొకటి)

బ్రౌన్ నిఘంటువు – A form of marriage in which the bride is carried away by force.

శంకర నారాయణ నిఘంటువు – one of the eight forms of marriage, the violent seizure and rape of a girl after the defeat or destruction of her relatives.

సాహిత్య అకాడెమీ నిఘంటువు – బలాత్కారమున కన్య నపహరించుకొనివచ్చి చేసికొనెడి పెండ్లి.

పై రెండు వ్యాఖ్యానాలలో కూడా కన్య ఇష్టం గురించి చెప్పబడలేదు,బంధువులను హింసించి బలాత్కారంగా కన్యను తీసుకుపోయి వివాహం చేసుకోవడం మాత్రమే ఉంది. ఇప్పుడు అసలు రాక్షసవివాహం అంటే చూద్దాం.

సనాతనధర్మం ఆమోదించిన వివాహాలలో ఇదీ ఒకటి. దీని గురించి ఎంత చెప్పినా విషయాన్ని వివరించడం కష్టం కనక ఉదాహరణలు చూపుతాను.

రుక్మిణీ  కృష్ణుల వివాహం రాక్షసం అంటోంది భాగవతం. రుక్మిణీ దేవి చెబుతోందీ మాట. రుక్మిణి కృష్ణునికి సందేశం పంపుతూ చెప్పినమాటిదని సంస్కృత భాగవతం మాట.

శ్వోభావిని త్వమజితోద్వహనే విదర్భాన్
గుప్తస్సమేత్య పృతనాభిః పరీతః
నిర్మథ్య చైద్యమగధేంద్రబలం ప్రహస్య
మాం రాక్షసేన విధినోద్వహ వీర్యశుల్కామ్

ఓ కృష్ణా! నీకు పరాజయము లేదు. నా పెళ్ళికి ముహూర్తము రేపు. సేనాధ్యక్షులు చుట్టువారిరాగా నీవు రహస్యముగా విదర్భకు రమ్ము. చేదిరాజగు శిశుపాలుని,మగధరాజగు జరాసంధుని, వారి సైన్యములను పరాభవింపుము. పరాక్రమమే నాకు కట్నము. నన్ను బలాత్కారముగా తీసుకుపోయి రాక్షసవిధి (పెద్దల అభిమతమును త్రోసిపుచ్చి బల ప్రదర్శనతో చేసుకునే పెళ్ళి) చే వివాహమాడుము.
(స్వామి తత్త్వవిదానంద సరస్వతివారి అనువాదం యధాథంగా ) టిటిడి ప్రచురణ, భాగవతం.ఎనిమిదవసంపుటం. దశమ స్కందం-ఉత్తరార్ధం అధ్యాయం ౫౨-౪౧శ్లో

ఇక మన తెనుగులో పోతన మహాశయుడు ఇలా అన్నారు.

అంకిలి సెప్ప లేదు చతురంగ బలంబులదోడ నెల్లి యో
పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా
వంకకువచ్చి రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్య మే
యంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము వచ్చెదన్

దీనికి అర్ధం చెప్పక్కరలేదనుకుంటా! ఇంకా నేనెక్కడో కోట లోపలుంటాను, అక్కడికొచ్చేటప్పుడూ, తీసుకుపోయేటప్పుడూ కావలివారు, కావలసినవారు అడ్డగిస్తే సంహరించవలసిరావచ్చు, అది నీకు ఇచ్చగించకపోవచ్చు. అందుకో ఉపాయం చెబుతున్నా! నన్ను మా కులాచారం ప్రకారం వివాహానికి ముందు కులదేవతకు మొక్కడానికి కోట బయటకు పంపుతారు! అప్పుడు తీసుకెళ్ళిపో అని కూడా కబురు పంపింది.

ఇందులో కన్యకు వివాహానికి ఇష్టం ఉన్నట్టే కదా! ఈ సందర్భంలో రుక్మిణి రాక్షస వివాహం అంటే ఏంటో చెప్పింది, తమది రాక్షస వివాహమనీ చెప్పింది. ఇక్కడ కన్య ఇష్టం ఉన్నదే!.

అనుకున్నట్టే కృష్ణుడు రావడం రుక్మిణిని ఎత్తుకెళ్ళడం జరిగింది. శిశుపాలుడు,జరాసంధుడు,రుక్మి రుక్మిణీ,కృష్ణుల వెనక వెనకబడ్డారు. యుద్ధంలో రుక్మిని ఓడించి తలయు మీసము రేవులువారగా గొరిగి పంపించాడు కృష్ణుడు. అదిగో అలా కన్య తాలూకువారిని బాధించడమనే వాలాయతీ కూడా తీరిపోయింది, రాక్షసవివాహ సందర్భంగా.

ఇక రెండవ ఉదాహరణ చూద్దాం, ఇది భారతం నుంచీ.

కాశీరాజుకు ముగ్గురు కుమార్తెలు అంబ,అంబిక,అంబాలిక, స్వయంవరం ప్రకటించాడు. అంబిక,అంబాలికలతో పాటు, అంబకు కూడా పెళ్ళికూతురు అలంకారం చేశారు. స్వయంవరానికి నానాదేశ రాజులూ వచ్చారు. భీష్ముడు తమ్ముడైన విచిత్రవీర్యునికి వివాహం చెయ్యడానికని కాశీ రాజ్యానికి ఒంటరిగా పోయి, కాశీరాజును, అక్కడకు స్వయంవరానికొచ్చిన వారిని జయించి, అంబ,అంబిక,అంబాలికలను ఎత్తుకొచ్చాడు. తీసుకొచ్చిన తరవాత అంబ చెప్పింది, నాకీ వివాహం ఇష్టం లేదు, నేను,సాళ్వుడు ప్రేమించుకున్నామని. భీష్ముడు అంబను సాళ్వుని దగ్గరకు పంపి అంబిక,అంబాలికలను విచిత్ర వీర్యునితో వివాహం జరిపించాడు.

ఇది నికార్సయిన రాక్షస వివాహం. ఇక్కడ అంబకు ఇష్టం లేదనగానే వివాహం ఆగిపోయింది. అంబిక,అంబాలికలకు వివాహం జరిగింది, ఇష్టపడబట్టి. ఈ సంఘటనతో కన్య ఇష్టపడినప్పుడే రాక్షస వివాహమైనా జరుగేదని తేలిపోయింది. కన్య ఇష్టంతో నిమిత్తం లేనట్టిదైతే భీష్ముడు అంబను కూడా విచిత్ర వీర్యునికి కట్టబెట్టి ఉండేవాడు. దీనిని బట్టి రాక్షస వివాహంలో కూడా కన్య ఇష్టంతోనే వివాహం జరుగుతుందన్నదే నిజం, ఏ వివాహ వ్యవస్థలోనూ కన్య ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం జరగలేదు.

తెనుగుపదాలన్నిటికి అర్ధాలు, తాత్పర్యాలు మారిపోతున్నాయో, లేక అర్ధం చేసుకోవడం మారిపోతోందో తెలియదు.