శర్మ కాలక్షేపంకబుర్లు-రాక్షసవివాహం

రాక్షసవివాహం

రాక్షసవివాహం అంటే నేనన్నమాట ఇదీ.

“సనాతన ధర్మంలో కన్య ఇష్టం లేక వివాహం లేదు, అది రాక్షసమైనా సరే!”

కాని నిఘంటువులిలా అంటున్నాయన్నారు.

సూర్యరాయాంధ్ర నిఘంటువు – కన్యక యొక్క బంధువుల జయించి బలాత్కారమునఁ గన్య నపహరించికొని వచ్చి చేసికొనెడి వివాహము (ఎనిమిది విధములగు వివాహములలో నొకటి)

బ్రౌన్ నిఘంటువు – A form of marriage in which the bride is carried away by force.

శంకర నారాయణ నిఘంటువు – one of the eight forms of marriage, the violent seizure and rape of a girl after the defeat or destruction of her relatives.

సాహిత్య అకాడెమీ నిఘంటువు – బలాత్కారమున కన్య నపహరించుకొనివచ్చి చేసికొనెడి పెండ్లి.

పై రెండు వ్యాఖ్యానాలలో కూడా కన్య ఇష్టం గురించి చెప్పబడలేదు,బంధువులను హింసించి బలాత్కారంగా కన్యను తీసుకుపోయి వివాహం చేసుకోవడం మాత్రమే ఉంది. ఇప్పుడు అసలు రాక్షసవివాహం అంటే చూద్దాం.

సనాతనధర్మం ఆమోదించిన వివాహాలలో ఇదీ ఒకటి. దీని గురించి ఎంత చెప్పినా విషయాన్ని వివరించడం కష్టం కనక ఉదాహరణలు చూపుతాను.

రుక్మిణీ  కృష్ణుల వివాహం రాక్షసం అంటోంది భాగవతం. రుక్మిణీ దేవి చెబుతోందీ మాట. రుక్మిణి కృష్ణునికి సందేశం పంపుతూ చెప్పినమాటిదని సంస్కృత భాగవతం మాట.

శ్వోభావిని త్వమజితోద్వహనే విదర్భాన్
గుప్తస్సమేత్య పృతనాభిః పరీతః
నిర్మథ్య చైద్యమగధేంద్రబలం ప్రహస్య
మాం రాక్షసేన విధినోద్వహ వీర్యశుల్కామ్

ఓ కృష్ణా! నీకు పరాజయము లేదు. నా పెళ్ళికి ముహూర్తము రేపు. సేనాధ్యక్షులు చుట్టువారిరాగా నీవు రహస్యముగా విదర్భకు రమ్ము. చేదిరాజగు శిశుపాలుని,మగధరాజగు జరాసంధుని, వారి సైన్యములను పరాభవింపుము. పరాక్రమమే నాకు కట్నము. నన్ను బలాత్కారముగా తీసుకుపోయి రాక్షసవిధి (పెద్దల అభిమతమును త్రోసిపుచ్చి బల ప్రదర్శనతో చేసుకునే పెళ్ళి) చే వివాహమాడుము.
(స్వామి తత్త్వవిదానంద సరస్వతివారి అనువాదం యధాథంగా ) టిటిడి ప్రచురణ, భాగవతం.ఎనిమిదవసంపుటం. దశమ స్కందం-ఉత్తరార్ధం అధ్యాయం ౫౨-౪౧శ్లో

ఇక మన తెనుగులో పోతన మహాశయుడు ఇలా అన్నారు.

అంకిలి సెప్ప లేదు చతురంగ బలంబులదోడ నెల్లి యో
పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా
వంకకువచ్చి రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్య మే
యంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము వచ్చెదన్

దీనికి అర్ధం చెప్పక్కరలేదనుకుంటా! ఇంకా నేనెక్కడో కోట లోపలుంటాను, అక్కడికొచ్చేటప్పుడూ, తీసుకుపోయేటప్పుడూ కావలివారు, కావలసినవారు అడ్డగిస్తే సంహరించవలసిరావచ్చు, అది నీకు ఇచ్చగించకపోవచ్చు. అందుకో ఉపాయం చెబుతున్నా! నన్ను మా కులాచారం ప్రకారం వివాహానికి ముందు కులదేవతకు మొక్కడానికి కోట బయటకు పంపుతారు! అప్పుడు తీసుకెళ్ళిపో అని కూడా కబురు పంపింది.

ఇందులో కన్యకు వివాహానికి ఇష్టం ఉన్నట్టే కదా! ఈ సందర్భంలో రుక్మిణి రాక్షస వివాహం అంటే ఏంటో చెప్పింది, తమది రాక్షస వివాహమనీ చెప్పింది. ఇక్కడ కన్య ఇష్టం ఉన్నదే!.

అనుకున్నట్టే కృష్ణుడు రావడం రుక్మిణిని ఎత్తుకెళ్ళడం జరిగింది. శిశుపాలుడు,జరాసంధుడు,రుక్మి రుక్మిణీ,కృష్ణుల వెనక వెనకబడ్డారు. యుద్ధంలో రుక్మిని ఓడించి తలయు మీసము రేవులువారగా గొరిగి పంపించాడు కృష్ణుడు. అదిగో అలా కన్య తాలూకువారిని బాధించడమనే వాలాయతీ కూడా తీరిపోయింది, రాక్షసవివాహ సందర్భంగా.

ఇక రెండవ ఉదాహరణ చూద్దాం, ఇది భారతం నుంచీ.

కాశీరాజుకు ముగ్గురు కుమార్తెలు అంబ,అంబిక,అంబాలిక, స్వయంవరం ప్రకటించాడు. అంబిక,అంబాలికలతో పాటు, అంబకు కూడా పెళ్ళికూతురు అలంకారం చేశారు. స్వయంవరానికి నానాదేశ రాజులూ వచ్చారు. భీష్ముడు తమ్ముడైన విచిత్రవీర్యునికి వివాహం చెయ్యడానికని కాశీ రాజ్యానికి ఒంటరిగా పోయి, కాశీరాజును, అక్కడకు స్వయంవరానికొచ్చిన వారిని జయించి, అంబ,అంబిక,అంబాలికలను ఎత్తుకొచ్చాడు. తీసుకొచ్చిన తరవాత అంబ చెప్పింది, నాకీ వివాహం ఇష్టం లేదు, నేను,సాళ్వుడు ప్రేమించుకున్నామని. భీష్ముడు అంబను సాళ్వుని దగ్గరకు పంపి అంబిక,అంబాలికలను విచిత్ర వీర్యునితో వివాహం జరిపించాడు.

ఇది నికార్సయిన రాక్షస వివాహం. ఇక్కడ అంబకు ఇష్టం లేదనగానే వివాహం ఆగిపోయింది. అంబిక,అంబాలికలకు వివాహం జరిగింది, ఇష్టపడబట్టి. ఈ సంఘటనతో కన్య ఇష్టపడినప్పుడే రాక్షస వివాహమైనా జరుగేదని తేలిపోయింది. కన్య ఇష్టంతో నిమిత్తం లేనట్టిదైతే భీష్ముడు అంబను కూడా విచిత్ర వీర్యునికి కట్టబెట్టి ఉండేవాడు. దీనిని బట్టి రాక్షస వివాహంలో కూడా కన్య ఇష్టంతోనే వివాహం జరుగుతుందన్నదే నిజం, ఏ వివాహ వ్యవస్థలోనూ కన్య ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం జరగలేదు.

తెనుగుపదాలన్నిటికి అర్ధాలు, తాత్పర్యాలు మారిపోతున్నాయో, లేక అర్ధం చేసుకోవడం మారిపోతోందో తెలియదు.

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-రాక్షసవివాహం

  • చంద్రిక గారు,
   కొత్త టపా రాయడానికి …కొన్ని ఇబ్బందులు, వేడి మొదటిది. పాత టపాలు వేస్తున్నాంగా అన్నది ఒక సాకు..అలా నడిచిపోయిందండి.
   ఎత్తుకుపోయి కన్నె ఇష్టానికి వ్యతిరేకంగా చేసుకునేదే రాక్షసం అని చూసి ఉండలేక ఇది గిలాకాల్సివచ్చిందండి.
   ధన్యవాదాలు.

 1. రాక్షసవివాహానికి మీరిచ్చిన ఉదాహరణలు బాగున్నాయి. అయితే అంబ విషయంలో తనకీ పెళ్ళి ఇష్టం లేదన్నప్పుడు ఆమెను సాళ్వుడి వద్దకు పంపించెయ్యడం భీష్ముడి సంస్కారాన్ని చూపిస్తుందని నా అభిప్రాయం. ఠాట్ వీల్లేదంటూ బలవంతంగా విచిత్రవీర్యుడితో పెళ్ళి జరిపించినా అంబ చెయ్యగలిగేదేమీ ఉండేది కాదేమో?
  రాక్షసవివాహానికి అవకాశం ఉండిన మరో ఉదంతం శంతనుడు సత్యవతీల ప్రహసనం. ఎలాగూ ఆ పెళ్ళి జరగడం సత్యవతికిష్టమే కాబట్టీ, తన గొంతెమ్మ కోరికలతో ఆమె తండ్రి బిగుసుకుని కూర్చున్నాడు కాబట్టీ శంతనుడు సత్యవతిని తీసుకెళ్లిపోయి వివాహం చేసేసుకుంటే సరిపోయేది. పాపం కొడుకు దేవవ్రతుడు అంత భీష్మప్రతిజ్ఞ చెయ్యవలసిన అవసరం వచ్చేది కాదు (ప్రతిజ్ఞ విషయంలో తండ్రి తప్పేమీ లేదులెండి, అతనికి చెప్పకుండా కొడుకు తన శపథం చేసాడుగా), మహాభారత కథ వేరే మలుపు తిరిగుండేది, ప్చ్.

  • విన్నకోట నరసింహారావుగారు,

   అది భీష్ముని సంస్కారమే గాక నాటికున్న ధర్మం. రాక్షస వివాహం లో పెద్దలని ఎదిరించి బలవంతంగా కన్యను ఎత్తుకుపోయి వివాహం చేసుకోడమేగాని,ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా మాత్రంకాదు.

   శంతనునిది మరో రకం కదండి! ఒక కన్ను కన్నుగాదు ఒక కొడుకు కొడుకు కాదని ముసుహుదన్ని పడుకుంటే పాపం దేవవ్రతుడు జీవితంలో పెళ్ళి చేసుకోనని భీష్మ ప్రతిజ్ఞచేసి భీష్ముడయ్యాడు. భారతం ఇలా జరగాల్సి ఉంటే అలా ఎందుకు జరుగుతుందండి. 🙂
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s