శర్మ కాలక్షేపంకబుర్లు-రెండూ లేని తగువు

చివరివరకు వీరోచితంగా పోరాడిన టీమిoడియా క్రికెట్ స్త్రీల జట్టు మిథాలీ సేనకు పేరు పేరున అభినందనలు.

రెండూ లేని తగువు

“జగడమెందుకొస్తుంది జంగమయ్యా!” అంటే “బిచ్చంతేవే బొచ్చు ముండా” అన్నాడట. అంటే      తగువెందుకొస్తుందో చెప్పక్కరలేదుగా వేరుగా 🙂  తగువనేది ఎవరి మధ్యనైనా ఎప్పుడేనా రావచ్చు. ఒక్కొక్కపుడు దీనికి కారణాలే ఉండక్కరలేదు, గొఱ్ఱెపిల్ల తోడేలు కతైనా చెప్పి తగువు సాధించవచ్చు, ”ఇటువంటి వారినే తివిరి ఇసుమున…..తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు…….” అన్నారు, లక్ష్మణ కవి. ఏం పూర్తి చెయ్యలేదంటారా! రెండూ లేని తగువెందుకు తెచ్చుకోడమని 🙂

తీరికూచుని, రెండూ లేని తగువు తెచ్చుకున్న పిచుక కత చెప్పుకుందామా? ఒక వృక్షం చిటారు కొమ్మన ఒక పిచుక గూడు కట్టుకుని వాసం చేస్తోంది. ఒక కోతీ ఆ కొమ్మన ఉంటోంది. ఒక రోజు పెద్ద గాలీవానా వస్తే పిచుక గూట్లో వెచ్చగా పడుకుంది, కొమ్మ ఊగిందేగాని గూటికేంకాలేదు, ఊయ్యాల ఊపుతున్నట్టుగా ఉంటే పిచుక చక్కహా నిద్రపోయింది, అంతగాలీ,వానలో కూడా. కోతి మాత్రం వానకి తడిసి,చలికి వణుకుతూ కొమ్మన కూచునిపోయింది. ఉదయమే లేచిన పిచుక చలికి వణుకుతున్న కోతిని చూసి కోతిబావా! కోతిబావా!! నువ్వు చాలా పెద్దవాడివి,బలవంతుడివి కూడాను. చక్కహా నాలుగు కొమ్మలు విరుచుకుని ఆ కొమ్మనో ఇల్లు కట్టుకోరాదా అని ఉచిత సలహా పారేసింది. అసలే చలికి వణుకుతున్న కోతికీ మాటలు కారం రాసుకున్నంత సుఖంగా అనిపించాయి. ఈ మాటలు విన్న కోతికి కోపం నసాళానికి ఎక్కిపోయింది. ఔరా!ఔరా!! ఔరౌరా!!! పిడికెడు లేని పిట్ట ఇంత పెద్దైన నాకు సలహాలిస్తుందా? నేను తెలివి లేనివాణ్ణంటుందా? ఇల్లు కట్టుకోలేని చేతకానివాడినని గేలి చేస్తుందా! ఎంత పొగరు దీనికి అనుకుంది. అసలే కోతి, కల్లుతాగింది,నిప్పు తొక్కింది, పిచ్చెక్కింది, దయ్యం పట్టిందన్నట్టు లేచి, పిచుక గూటి మీదకి దండయాత్రకి బయలుదేరింది. అయ్యో!రామా!! నేరకపోయి మంచిమాట చెప్పి చిక్కుల్లో పడ్డానే! అని విచారించిన పిచుక ఎగిరిపోయింది. కోతి పిచుక గూటిని పీకేసి నేలకేసి కొట్టి తన కసి, కోపం తీర్చుకుంది. మంచి మాట చెప్పి రెండూ లేని తగువు తెచ్చుకుంది పిచుక. అంచేత బలవంతులకు, ”మంద” భాగ్యులకు ( ఈ మాట నాది కాదు, ఇలా మాటను విరిచి మరో అర్ధం సాదించినవారికి వందనాలు) ఉపకారమే ఐనా సలహా చెప్పకూడదు,చెప్పి కొంపమీదకి తెచ్చుకోకూడదు.

నీతో నాకేంటోయ్ ఈ ’రెండూ లేని తగువూ’ అంటూంటారు. అసలీ రెండూ లేనివేంటి బాబూ! మంచి,చెడ్డ; ఉచ్చం,నీచం;మర్యాద,మన్నన;గుణము,దోషమూ; సిగ్గు, లజ్జ ( రెండూ ఒకటికావో) మొదలైనవేవీ ఉండవుట, తగవు మొదలయ్యాకా. దీనికో ముతక సామెతా ఉంది,చెబితే బాగోదని మానేశా. తగవు ప్రారంభమైన తరవాత ఉచ్చ,నీచాలూ,( అనదగిన అనకూడని మాటలు )మంచి,చెడ్డలూ అన్నీ ఏట్లో కలిసిపోతాయి, మిగిలేది వితండవాదం, నేనాడేదే మాట, అదే చెల్లాలి,అని, అహం అడ్డు పడి నిజాన్ని కూడా చూడలేని హ్రస్వ దృష్టి చేరుతుంది. ఇలా ఆరెండూ పోతాయి. మరేం చెయ్యాలీ? అందుకే పెద్దలేమన్నారంటే గుణం తక్కువవాడితోనూ, కుఱ్ఱాడితోనూ  తగువు పడకు, నీకే అపకీర్తి అన్నారు. గుణం తక్కువవాడే మాటైనా అనేస్తాడు, వాణ్ణి మనం తిట్టినా బాధ ఉండదు, అది వాడికి అలవాటే ఐ ఉంటుంది గనక. చూసేవాళ్ళు కూడా వాడిని తిట్టినా ఏమనుకోరు, కాని వాడు మనని తిడితే మాత్రం అది పెద్ద వార్తగా దేశమంతా చెబుతారు,నాలిక భుజాన వేసుకుని ప్రచారం చేస్తారు. కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కని కరిస్తే వార్తే కదూ 🙂 అందుకే ఊరుకున్నంత ఉత్తమం,బోడి గుండంత సుఖం లేదన్నారు. మౌనేన కలహోనాస్తి,నాస్తి జాగరతో భయం 🙂

నిజానికి తగువులో లేని రెండూ ఏంటండి? సత్యమూ,ధర్మమూ. తగువు అంటే న్యాయమని అర్ధమండి. ఇప్పటికీ పల్లెలలో తగువు చెప్పండి అంటుంటారు, ఇదేంటీ అనుకున్నాగాని ప్రయోగం సమంజసమే! సత్యము,ధర్మమూ లేని మాట చెబుతున్నావని అనటమండి. ఇది చాలా పెద్ద మాటండి, సామాన్యంగా వాడేస్తున్నామండి. ఆయ్! అదండి సంగతి.

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-రెండూ లేని తగువు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s