శర్మ కాలక్షేపంకబుర్లు- పట్టుబడి-కొలగారం

పట్టుబడి-కొలగారం

         గోనె సంచులలో ధాన్యం, అపరాలు వగైరాలను నింపడాన్ని పట్టుబడి అంటారు, ఇలా ఆహార పదార్ధాలను నిలవ చేసి ఉంచడాన్ని ”బస్తాబందీ” అని కూడా అంటారు. ఒక చోట వరుసలలో వేయడాన్ని ”నెట్టు” కట్టడం అంటారు. ఇక కొలగారం అంటే ”ఏంటీ కారాగారంలాగా” అనకండి. ఒకప్పటి రోజులలో అన్నిటినీ కొలిచేవారు,ద్రవాలతో సహా! గిద్ద,అరసోల,సోల,తవ్వ,మానిక లేక శేరు,అడ్డ, కుంచం ఇవి పరిమాణాలు. దీని గురించిన పాత టపాకూడా ఒకటున్నట్టు గుర్తు. ఇక పళ్ళు,కాయల్ని లెక్కించేవారు, ఆ లెక్క అరపరక అంటే ఏడు,పరక అంటే పదమూడు,పాతిక అంటే ఇరవై ఆరు, ఏభై అంటే ఏబది రెండు, వంద అంటే నూటైదు. అసలుకు మించి ఉన్నవాటిని ’శలగ’ అనేవారు, ఈ శలగ గురించి కూడా టపా ఉన్నట్టే గుర్తు. ఆహారధాన్యాలు కొలతపైనే కొనడం అమ్మడం జరిగేది. ఇరవైనాలుగు కుంచాలు ఒక బస్తా. ఇది నేటి కాలపు వంద కేజీలు కి సమానం.

ఎక్కువ పరిమాణంలో ఉన్న ఆహారధాన్యాలు ఆరోజులలో కొలవడానికి ఒక వ్యవస్థ ఉండేది, పల్లెలలో. ఇది మధ్యస్థ వ్యవస్థ, అనగా కొనేవారికి,అమ్మేవారికి మధ్య మోసం లేక కొలిచి ఇచ్చేది, దీనికిగాను ఆరోజుల్లో బస్తాకి ఒక రూపాయ వసూలు చేసేవారు. ఇది గ్రామం కోసం ఖర్చుపెట్టేవారు. ఇలాటి వ్యవస్థకి పాట ఉండేది. పాట అంటే ఆ ఊరి ఆయకట్టు,పంట అంచనా వేసుకుని బస్తాకి రూపాయిలెక్కన ఊహించుకుని, అలా ఆపని నిష్పాక్షికంగా నిర్వహిస్తూ ఊరికోసం ఇచ్చేసొమ్మే పాట సొమ్ము,ఆ కాలంలోనే ఇది వేలలో ఉండేది, తరవాత కాలంలో ఇది పెద్దల భోక్తవ్యానికి నెలవుగా మారిపోయిందనుకోండి.

పెద్ద పెద్ద పరిణామాలలో కొలత ఎలా? దీనికి ఒక పద్ధతి ఉండేది. కొలత కుంచంతో మొదలెడుతూ లాభం, లాభం అని పాటలా అంటూ పెద్ద రాశి నుంచి ఒక కుంచెడు కొలిచి పక్కనపోస్తూ ఒకటి అని, మళ్ళీ కొలుస్తూ లాభం ఒకటి అనే పాట పాడుతూ రెండవ కుంచెడు కొలిచి పోసి ఒకటి రెండు, ఆ తరవాత కుంచం కొలిచిపోసినపుడు రెండు,మూడు ఇలా పాట సాగి ఇరవైనాలుగు కుంచాలూ కొలిచిన తరవాత ఒక కుంచెడు కొలిచి వేరుగాపోసేవారు. ఇలా ఇరవైనాలుగు బస్తాలు కొలిస్తే ఇరవైనాలుగు కుంచాలు ఒక పక్కగాపోసేవారు. ఇప్పుడు కొలిచిన పెద్దకుప్ప ఇరవైనాలుగు బస్తాలు, మరో చిన్నకుప్పగాపోసినది ఒకబస్తా, ఇరవైనాలుగు కుంచాలూ, మొత్తంగా ఇరవై ఐదు బస్తాలనమాట. ఒకవేళ కొలిచిన బస్తాలలో లెక్క తేడా వస్తే అన్నీ మళ్ళీ కొలవక్కరలేక చిన్నకుప్పని కొలుచుకుంటే ఎన్ని బస్తాల ధాన్యం కొలిచినది తెలిసిపోయేది. ఈ పని చేయడానికా రోజులలో అరడజను మంది మనుషులుండేవారు. ఈ కొలత సరిగా జరుతున్నది లేనిది చూడడానికో పర్యవేక్షకుడు ఉండేవారు, కొలత సరిపోతే ఆ చిన్నకుప్పని పెద్ద కుప్పలో కలిపేస్తే అక్కడికా ప్రతి ఇరవై ఐదు బస్తాలు. ఇలా కొలత ఇంకా కొనసాగితే పాతిక బస్తాలకిగాను ఒక గుర్తు ఇచ్చేవారు,దీనిని ’కాయ’ అంటారు. ఈ ప్రాతిపదికపై తప్పులేకుండా కొలిచేవారు, ఇది మధ్యస్థ వ్యవస్థ. నిన్న మొన్నటి వరకు ధాన్యాలన్నిటిని తూకం వేయడాన్ని కూడా కొలగారం అనే అనేవారు.

నేటి కాలంలో లారీ మీద పోసేసి పట్టుకెళ్ళి కాటా వేయిస్తున్నారు, దీనిని ’సొరపోత’ అంటారు, నేడు దీనిలోనూ మోసం ఉంటోంది. ఖాళీ లారీని తూకం వేయించి తెచ్చి, ధాన్యం అందులో పోసి. తీసుకెళ్ళి తూకం వేయించి వర్తకునికి అప్పజెబితే ఈ తూకాల మధ్య తేడా సరుకుగా నిర్ణయింపబడాలి. మరి మోసమెక్కడా? లారీ వర్తకునిదే ఐ ఉంటుంది, అతనే పంపుతాడు, కనక లారీ మనుషులు అతనివాళ్ళే. ఖాళీ లారీ తూకానికి వెళ్ళేటపుడు కొన్ని బండరాళ్ళు దగ్గరగా ఒక క్వింటాలు బరువు ఉన్నవి లారీలో పడేసి, తూకమేయిస్తాడు, రైతుదగ్గరకొచ్చేసరికి రాళ్ళు తీసేస్తాడు, సరుకు ఎక్కించిన తరవాత అంతా మామూలుగా నడచిపోతుంది. ఇదీ తూకంలో మోసంలా కనపడుతుంది, కాని వ్యాపారి చేసే మోసం.

పాతరోజుల్లో కూడా ఎండు ద్రాక్షలాటివాటిని తూచేవారు, మరీ బంగారంలా తూస్తున్నావే అనే మాట సర్వ సహజంగానే వినపడేది. దీనికి పూస ఎత్తు(అదే గురివింద పూస) కాణీ,అర్ధణా,అణా,బేడ,పావలా, కాసు, తులం ఇలా లెక్కుండేది. అతి చిన్న తూకం పూసెత్తు. నేడు మిల్లీగ్రాం అనుకోవచ్చు. నేడన్నీ గ్రాములు మిల్లీగ్రాములే. ఇదిగో ఈ బంగారం తూచడానికి కూడా మధ్యస్థ తూకం ఉంది, మరిప్పుడేం చేస్తున్నారో పెద్ద పెద్ద వాళ్ళు తెలియదుగాని, పల్లెలలో,పట్టణ్లలో ఇంకా మధ్యస్థ తూకం కొనసాగుతోనే ఉంది. నిజానికిది నిస్పాక్షికమైనదే! ఇవే నాటి వ్యవస్థలు.

నేటి కాలంలో కొలతలు తూకాలు అన్నిటిలోనూ మోసమే! పెట్రోల్ బంకుల్లో జరుతున్నది దారుణమే!

నాదగ్గరున్న లెక్కల పుస్తకం సంవత్సరాలకితం ప్రచురింపబడింది. దాని నుంచి కొన్ని మానాలు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s