శర్మ కాలక్షేపంకబుర్లు-వకారపంచకం

వకారపంచకం

తెనుగులో వకారపంచకం అనే నానుడి ఉంది. ’వ’కారంతో మొదలయ్యే ఐదుగురినే వకార పంచకం అంటారు. వీరు, వర్తకుడు, వైద్యుడు,వేశ్య,వడ్రంగి,వకీలు. వీరు ఐదుగురితోనూ పనిబడగూడదుగాని, ఒక వేళ వీరితో అవసరం కలిగిందా అంత తొందరగా మాత్రం పనవదు, సరిగదా వీళ్ళ చుట్టూ తిరక్క తప్పదు, ఖర్చూ తప్పదు.. కాదుగాని వీరు అంత తొందరగా వదలిపెట్టరనేదే పిండితార్ధం 🙂

వర్తకుడు:- ఇతను వ్యక్తుల్ని ఆకట్టుకోడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక సారి ఒక కొట్టులో సరుకులు కొనడం అలవాటు చేసుకుంటే మరో కొట్టుకుపోనివ్వడు, కాదు పోలేము. అలా మనల్ని మాటలతో కట్టిపడేసి ఉంచుతాడు. ’మొన్న మీరన్నారని తెప్పించానీ వస్తువని’, ఫోన్ చేసి ఇంటికి పంపేస్తాడు. ’సొమ్ములేదయ్యా!’ అంటే ’కాతాలో రాసుకుంటాలెండి, మీరెక్కడికిపోతారు, నేనెక్కడికిపోతాను, మీదగ్గర సొమ్మెక్కడికిపోతుందండీ, గళ్ళాపెట్టెలో ఉన్నట్టే’ అంటాడు, మరి ఆ తరవాత బజారులో ఆ సరుకు ఖరీదెంతో కూడా తెలుసుకోడం మరిచిపోతాం. ఇలా వర్తకుణ్ణి వదిలించుకోడం తేలిక కాదు.మన జియో సిమ్ములాగా, మీకోసం అపరిమిత డాటా 43 రూపాయలే,28 రోజులు. అపరిమిత కాల్స్ 3 జిబి డాటా 28 రోజులు 152 రూపాయలే ఇలా.

వైద్యుడు:- పాతకాలంలో పరహితం కోసం వైద్యం చేసేవారు, నేడు స్వహితం కోసం, శవానికి కూడా వైద్యం చేసి డబ్బులు సంపాదించేవారూ ఉన్నారు. వైద్యుణ్ణి వదలలేకపోవడానికి మనకూ చాలా బాధ్యతే ఉంది. తలనొప్పి వస్తోందంటాం కాని దానికి కారణం ఐన కాల విరేచనం కావటం లేదని చెప్పం. టెస్ట్ లు రాస్తారు,చేయించుకుంటాం, ఏం లేదు ఈ మాత్రలేసుకోండని రాసిస్తారు, నాలుగు రోజులదే అణిచిపెడుతుంది, మళ్ళీ మామూలే.. పునరపి వైద్య దర్శనం… వైద్యుణ్ణి చూడక ఉండాలేని బలహీనత…. ఇంతకంటే చెప్పలేని బలహీనత నాలుగు రోజుల్నించి జ్వరం, ఇంట్లో వాళ్ళంతా మంచాలు నేస్తున్నారు 🙂 రోజుకి రెండు సార్లు వైద్యరాజ దర్శనం.. ఈ సమయంలో…..

వేశ్య:-పాత రోజుల్లో వేశ్యవాడ వేరుగా ఉండేది,వేశ్యలెవరో తెలిసేది. నేటి కాలంలో ఆ విభజన తెలియటం లేదు. వీరు కనక తగులుకుంటే చింతామణి నాటకమే!

వడ్రంగి:- వడ్రంగితో పని చేయించుకోవాలంటే మనకి ఓపిక ఉండాలి. పని చెయ్యడానికి వడ్రంగిని పిలిస్తే సామానులు పుచ్చుకుని ఒక సహాయకుణ్ణి కూడా తీసుకుని వస్తాడు. అక్కణ్ణించి ప్రారంభమవుతాయి మనకి తిప్పలు. నూరు రాయి,బాడిస,ఉలి తీస్తాడు. ’ఒరే అమ్మగార్ని కొబ్బరి నూని చుక్క అడుగు’ అనడంతో ప్రారంభం, ’ఒరే! కమ్మిలు ఎక్కడున్నాయో అమ్మగారినడుగు’ అని పురమాయిస్తే సహాయకుడు ’కమ్మిలంటాండి’ అని మొదలెడ్తాడు. ఇతను నూరు రాయి మీద ఉలికి పదును పెడుతుంటాడు, కొబ్బరినూనెతో. అది ఎంతకీ తెమలదు. ఉలికి సాన పెట్టి పెట్టి అది సగానికి అరిగిపోయిందేమో అన్నప్పుడు, బాడిసకి పదును పెట్టడం మొదలెడతాడు, ఇలా కమ్మెలు వెతకడం, ఉలికి,బాడిసకి పదును పెట్టడంతో, సగం రోజు చెల్లిపోతుంది,భోజనానికెళ్ళిపోతాడు. మధ్యాహ్నం, తీసిన కమ్మెలు పరిశీలిస్తాడు. కొన్నిటిని పక్కన పెడతాడు. ’అమ్మగారిని మేకులడగరా’ అంటే ’ఇంట్లో మేకులు లేవు బజారుకెళ్ళి తెచ్చుకో’ అని ఆమె డబ్బులిస్తే కుర్రాణ్ణి బజారుకి పంపి. కమ్మెలు పొడుగు వెడల్పులు కొలుస్తూ కాలక్షేపం చేస్తాడు. ’అమ్మా పెన్సిల్ ముక్కుందా? తెచ్చుకోడం మరిచిపోయాను’, ఇలా కాలం గడిస్తే మేకులొచ్చేటప్పటికి గంట పడుతుంది, ’రెండంగుళాలు సన్నాలు తెమ్మన్నాను, నువ్వు లావులు తెచ్చేసేవు’,ఎదవ ఎందుకూ పనికిరావని’ అని తిట్టి ’సరే తే’ అని, ఒక చిన్న కర్రముక్కని తీసుకుని ఒక బల్లకి దిగేస్తాడు. అంతతో టీ టైమ్. టీ తాగేకా దమ్ము టైమ్. ఒక కమ్మి తీసి చిత్రిక పట్టడం మొదలెడతాడు. చిత్రిక గుల్ల నడవటం లేదు, చిన్న గుల్ల పట్టుకురా అని కుర్రాణ్ణి పంపుతాడు. గుల్లలో ఉన్న బ్లేడ్ తీసి నూరటం మొదలెడతాడు, సాయంత్రమవుతుంది, కుర్రాడు గుల్ల తెస్తాడు. ’అమ్మా! సామాన్లు ఇక్కడ సద్దేను పొద్దుటొస్తా’ అని వెళతాడు. రోజు గడిచి పోయింది. ’ఇదేంటయ్యా?’ అని అడగలేం, రోజులు గడుస్తూనే ఉంటాయి, పని పూర్తి కాదు… సగంలో పొమ్మనలేం, చూస్తుంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది, ఇదింతే…..

వకీలు:- వకీలు అవసరం జీవితంలో రాకుండా ఉండడమే మంచిది. హత్య చేశానని వచ్చి చెప్పిన నిందితుణ్ణి ’నీకెందుకూ! నేను చూసుకుంటా గాని సొమ్మేం తెచ్చేవు? తియ్యి కట్టలు, పోలీసోళ్ళ దగ్గరనుంచి ఎంతమందికి మేపాలి. సరే పో! పోయి దాకో నేను నీకు బెయిల్ రప్పిస్తాగా!’ అనే వకీళ్ళు కూడా ఉన్నారు. అందరూ అలా ఉన్నారనను. రావిశాస్త్రి చెప్పినట్టు ఆవుల ప్లీడర్లూ ఉన్నారు. నడుస్తున్న కత

కేజ్రీవాల్ గారు జైట్లీ గారిని పరువు నష్టం మాటేదో అన్నారట, దానిమీద పదికోట్ల కి పరువువు నష్టం దావా వేసేరు జైట్లీగారు. కేజ్రీవాల్ గారు రాం జిత్మలానీ ని వకీలుగా పెట్టుకున్నారు. కోర్ట్ లో జైట్లీ గారిని ప్రశ్నిస్తూ రాం జిత్మలానీ ఒక మాటన్నారు. ’ఈ మాట మీరు ఉపయీగించారా? మీ క్లైయింట్ వాడమన్నారా’ అని జైట్లీ గారడిగితే ’రామరామ నేనెందుకంటానండీ, ఈ మాట నా క్లయింటు అనమంటేనే అన్నాను’ అన్నారు. దానితో జైట్లీ గారు మరో పదికోట్ల పరువు నష్టానికి దావా వేసేరు. ఈ లోగా కేజ్రీవాల్ గారిని ’ఈ మాట మీరనమన్నారా? అని ప్రమాణం చేసి చెప్పమని’ కోర్ట్ అడిగితే ’రామరామ నేననమనలేదండీ’ అన్నారు, కేజ్రీవాల్ గారు. దాని మీద జిత్మలానీ గారు కేజ్రీవాల్ గారికో ఉత్తరం రాస్తూ, ’మీ కేస్ నుంచి తప్పుకుంటున్నాను, నా ఫీస్ రెండు కోట్ల రూపాయలూ పంపండి’ అన్నారు. ’మీరు ఫీస్ ఎగ్గొట్టినా ఏమనుకోను, ఇలా కేస్ లు వాదింపజేసుకుని ఫీస్ లు ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో మీరొకరూ, అదీగాక మీరు నేను కోర్ట్ లో అన్నమాటకంటే అనేక అవమానకరమాటలు జైట్లీ గారి గురించి మాటాడేరు, నా దగ్గర రికార్డ్ ఉంద’న్నారు. ఇదంతా పబ్లిక్ ఇకముందు జరగబోయేది చూడాలి 🙂 మనం ఊహించకూడదు కదా! వకీలుతో గేమ్స్ (ఆటలు) పనికిరావు, అందునా 93 ఏళ్ళ కురువృద్దుడు రాంజిత్మలానీ గారి దగ్గరా!

అంచేత వకారపంచకంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని……

ఇదెవరిని హేళన చేయాలని కాని కించపరచాలనిగాని ఉద్దేశింపబడలేదు.

3 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-వకారపంచకం

 1. 🙂 బావుంది మాస్టారూ .. ఎక్కడా కాదనడానికి వీల్లేని అనుభవాలు ఇవి. అందరి అనుభవాలు.
  ఎలా ఉన్నారు ? ఇప్పుడు ఆరోగ్యం బావుందా ?

  • వనజ గారు,
   కుశలమా తల్లీ! జీవితానుభవాలింతేగదా!! కొన్ని చెప్పుకోలేనివి 🙂 సన్నగా గొణుక్కోడం తప్పించి 🙂

   ఆరోగ్యం: జ్వరానికి నా మీద అమిత ప్రేమ అందుకే వదలిపెట్టిపోనంటోంది 🙂 అంత వదలలేనివాళ్ళని బలవంతంగా వదలించుకోడమెందుకని…. 🙂 ఇంట్లోవాళ్ళం ప్రజల్లో పడ్డానికోవారందాకా పట్టచ్చండి. ఇల్లాలికైతే మరికొంత కాలం తప్పదేమో ’సర్పి’ట వైద్యం జరుగుతోంది, మంట భరించలేకపోతోంది,
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s