శర్మ కాలక్షేపంకబుర్లు-తుని తగువు

తుని తగువు

కాంతాకనకాలే కలహ కారణాలు,నేటికిన్నీ! కాదు ఎప్పటికిన్నీ!! కలహానికి కారణాలు వెతుకుతూ పోతే మూలం కాంతాకనకాలలో ఒకటిగా తేలుతుంది లేదూ జమిలిగానూ ఉండచ్చు.

తుని పట్టణం తాండవ నదికి కుడిగట్టున తూగోజిలో ఉన్నది. నది ఎడమగట్టున ఉన్నదే పాయకరావుపేట. ఇది కూడా ఒకప్పుడు తుని పట్టణంలో భాగమే, కాలంలో విశాఖ జిల్లా ఏర్పడినప్పుడు ఆ జిల్లాలో చేర్చబడింది. ఈ ప్రాంతాన్ని శ్రీ వత్సవాయి వారి వంశం పరిపాలన చేసినది. నాటి కాలంలో న్యాయంకూడా ప్రభువు బాధ్యతగానే ఉండేది. ప్రతి విషయమూ ప్రభువే చూడకపోయినా కొంతమంది అధికారులు ….న్యాయవ్యవస్థ, జాప్యం…. ఇదంతా సహజమే…నాటికాలానికే సత్వరన్యాయం అన్నది జరగనిమాటే…

తుని ప్రాంతం ఆ రోజులనాటికే పాడి,పంట, వ్యర్తకం,వ్యాపారం,చేతి వృత్తులతో తులతూగేది. ”కలిమిలేనన్నాళ్ళు కలిసి మెలిసుంటారు, కలిమి కలిగిన నాడు కాట్లాడుకుంటా”రన్నారో సినీ కవి. ఇది నిజం కదా! ఇక్కడ తగవులూ ఎక్కువగానే ఉండేవి. న్యాయం జరగడానికి సమయమూ పట్టేది. అదుగో ఆ అవసరంలో పుట్టుకొచ్చినదే తుని తగువు, అదే ప్రత్యామ్నాయ న్యాయవ్యవస్థ. ఇందులో ముగ్గురు గాని ఐదుగురుగాని సభ్యులు, వారంతా ఆ ప్రాంతంలోని సంఘంలో సత్ప్రవర్తన కలిగినవారని ధర్మాత్ములని పేరు పడ్డవారే ఉండేవారు. వీరినెవరూ నియమించరు, జీతభత్యాలూ ఉండవు, పరోపకారమూ, సత్వర న్యాయం జరగడమూ వీరి ధ్యేయం. ఒక ముగ్గురే కాకపోవచ్చు, వర్తకులందరికి ఒక వ్యవస్థ. వృత్తి పనివారలకు మరొకటి, ఇలా అవసరాలను బట్టి, ఒక న్యాయ వ్యవస్థ ఏర్పడేది. ఈ వ్యవస్థనే ”తుని తగువు” అన్నారు,(తుని తగువు=తుని తరహా న్యాయం) . వీరిచ్చే తీర్పులు కూడా వాది,ప్రతివాదులిద్దరికి సమ్మతమైనవే, న్యాయం బలవంతంగా రుద్దబడింది కాదు. విషయం చెప్పాలంటే నేటి ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థ దీనినుంచి పుట్టుకొచ్చినదే!

ఒకిద్దరి మధ్య తగవు వస్తే అది వీరి దగ్గరకొచ్చినపుడు వాది ప్రతివాదులనుండి విషయం విని, సభ్యులు సంప్రదించుకుని వాది,ప్రతివాదులను వేరు వేరుగా కలసి, వారివారి వాదనలో న్యాయమూ,లోపమూ చెప్పడంతో మొదలౌతుంది తగవుకు పరిష్కారం. వాది ప్రతివాదులిద్దరికి చెప్పి న్యాయంగా తీర్పును విడివిడిగా వినిపించి, ఇద్దరి ఇష్టం మీద, ఇద్దరిని ఒకచో చేర్చి తీర్పు వివరించడం,తీర్పు అమలుచేయడమే తుని తగువు.

ఐతే కాలంలో తుని తగువు అంటే తగవులోని ఆస్థి,డబ్బును చెరిసగం చేసి ఇచ్చెయ్యడమేగా మిగిలిపోయింది. నేనుగా అరవై సంవత్సరాల కితం ఈ తుని తగువులో ఆస్థి పొందినవాడిని. కేస్ వివరం టూకీగా చెబుతా, ఎందుకంటే కేస్ చాలా పెద్దది, విసుగు పుట్టిస్తుంది కనక…

నాకు,దాయాదులకు మధ్య ఒక ఆస్థిగురించిన తగువొచ్చింది. ఆస్థిని ప్రతివాదులు స్వాధీనం చేసుకున్నారు. నేనా మైనర్ని. నా స్థానీయులు కోర్ట్ కిపోయారు. కాలం గడుస్తోందిగాని తీర్పురాలా,ఏళ్ళు గడిచాయి, ఇరు పక్షాలకీ కాళ్ళూ లాగాయి. ప్రతి పక్షానికి న్యాయంలేదుగాని బలం ఉంది,పెద్ద వయసూ వచ్చేసింది. ఇది గెల్చుకున్నా అనుభవించేవారెవరూ లేరు. ఈ సందర్భంగా విషయం తుని తగవుకు చేరింది. సంప్రదింపులైన తరవాత న్యాయం చెప్పేవారు ఆస్థిని ఐదు భాగాలు చేసి నాలుగు భాగాలు నాకిచ్చి ఒక భాగం వారికిస్తూ తీర్పు చెప్పేరు. ఆ తీర్పును ఇద్దరం రాజీగా కోర్ట్ లో సమర్పించుకుని బయట పడ్డాం. ఇది అసలు తుని తగువంటే, ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థ.

శ్రీ.జె.వి.రావు గారి కోరిక పై ఈటపా రాశాను. ఇంకెవరికి బాకీ లేను 🙂

ఇంటిలో అనారోగ్యాల మూలంగా బ్లాగుకు కొంతకాలం శలవు. చెప్పకుండాపోతే నాకోసం వెతుకుతున్నారు, నేనే వీలు చూసుకు తిరిగొస్తా.

_____/\_____

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-తుని తగువు

  1. ధన్యవాదములు.
    బాకీ తీర్చేశానని సంతోష పది పోకండి. మీరు ఇలా బాకీ వుంటూ ఉండడమే మాకు సంతోషం. అప్పుడప్పుడూ ఇలా వడ్డీ వసూలు చెడుకుంటూ ఉంటాము. అసలు పదిలం గా ఉండాలి అని పుర జనుల కోరిక.కాస్త ఇబ్బంది పెట్టి అయినా మీ క లం విదిలిస్తూఉంటే మాకు ఆనందం.

  2. ఇంటిలో అనారోగ్యాల మూలంగా బ్లాగుకు కొంతకాలం శలవు. …. త్వరగా ఆరోగ్యంతో, శుభవార్తలతో తిరిగి వస్తారని ఆశిస్తున్నాం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s