బతికి చెడడం,చెడి బతకడం అంటుంటారు,వీటికి అర్ధం జయంతికి వర్ధంతికి ఉన్నంత తేడా ఉంది 🙂
ఇది ఏభై ఏళ్ళకితం జరిగిన సంఘటన.
ఉద్యోగం రావడంతో స్వంత ఊరునుంచి మకాం ఎత్తేసిన తరవాత పొలం వెళ్ళాలంటే అడ్డదోవన వెళ్ళి వచ్చేయడం జరుగుతోంది, ఊళ్ళో కి వెళ్ళకపోవడం తో సంగతులూ తెలియడం తగ్గింది. మా వూరు మీంచి కొత్తగా బస్సు వేశారంటే బస్సు మీద బయలుదేరా. బస్సు ఊరి సెంటర్ లో దిగుతుంటే ఒకతను పలకరించాడు, ”బావగారు బాగున్నావా” అంటూ, ముద్ద మాటతో. చూస్తిని కదా ఆ పలకరించిన వ్యక్తి తల గూళ్ళబుట్టలాగా,గెడ్డం పిచిక గూడులాగా బాగా పెరిగి, చిరిగిన చొక్కా,ఒక తువ్వాలు గోచీతో, కుడిచెయ్యి,కాలు ఈడుస్తూ నడుస్తున్నట్టుంటే, ఎడమచేతిలో కర్ర, చేతిలో సంచితో, అడుక్కునేవాడిలాగా అనిపించాడు. గుర్తు పట్టలేకపోయా! ”నేను బావా కాఫీ హొటల్ వెంకట్రావుని” అనడం తో గుర్తుపట్టి,ఆశ్చర్యపోతూ, ”ఏంటి ఇలా అయ్యావు” అన్నా! అలా రెండడుగులు నెమ్మదిగా వేసి పక్కనే ఉన్న సీను కిల్లీ కొట్టు,చిట్టిపంతులుగారి సైకిల్ షాపు, సూర్నారాయణ బియ్యంకొట్టు ఉన్న అరుగు దగ్గరకి చేరాను. వెంకట్రావు కూడా వచ్చి మెట్ల మీద కూలబడ్డాడు. అతనేదో చెబుతున్నాడుగాని నాకర్ధం కాలేదు.
ఇది చూసిన బియ్యం కొట్టు సూర్నారాయణ కలగజేసుకుని, ”మీరు ఊర్నుంచెళ్ళేకా చాలానే జరిగేయి. ఇతనికి ఆ అలవాటుందని కదా, ఇతని పొలం నాలుగెకరాలూ, ఇల్లూ పెళ్ళాం పేరున రాయించారు. హోటల్ నడుపుతుండేవాడు, లాభాల్లోనే నడిచింది,ఇతని కున్న అలవాటుతో కడుపులో నొప్పికి ఆపరేషన్ చెయ్యలిసొచ్చింది. చేసేవాళ్ళు లేక హోటల్ మూతబడింది, కొన్నాళ్ళు ఇతని భార్య కొడుకు నడిపినా, కుదరలేదు, వాళ్ళవల్ల కాలేదు. ఉన్న డబ్బు అయిపోయింది, ఇంతలో కొడుక్కి పెళ్ళి చేసేరు, ఇతని వైద్యానికి సొమ్ము కావలిసొచ్చింది. పులి మీద పుట్రలా ఇతనికి పక్షవాతం వచ్చి కుడికాలు చెయ్యి పడిపోయాయి, మాటా పడిపోయింది. ఆ తరవాత కొద్దిగా మార్పొచ్చి ఇలా ముద్దగా మాటాడతాడు. ఇంట్లో ఏదో గొడవ జరిగింది, ఇతని భార్య,కొడుకు,కోడలు ఇతన్ని ఇంట్లోంచి గెంటేసి ఇల్లమ్మేసి,డబ్బుచ్చుకుని మరో ఊరు దూరంగా పోయారు,చెయ్యి కాలు పూర్తిగా స్వాధీనంలో కి రాలేదు. ఇతన్ని చూసేవాళ్ళూ లేరు. ఊరంతా ఇతనికి కావలసిన వాళ్ళే కాని ఒక పూట ముద్ద పెట్టేవాళ్ళు లేరు”,అన్నాడు.
వెంకట్రావు సంచిలో లావుపాటి అరఠావు మడత పెట్టి కుట్టిన తోక పుస్తకం కనపడింది. అది పద్దు పుస్తకం,చాలా కాలం నేను వారానికోసారి అందరి కాతాలూ కూడి, బాకీలు తేల్చిన పుస్తకం, అతనికి సాయంగా. ఆ రోజుల్లో అందరికి ఇతని హొటల్లో కాతా ఉండేది, రోజువారీ టిఫిన్ చేసినవాళ్ళు కాతా పుస్తకంలో రాసిపోయేవారు. వారానికోసారి ఇచ్చేవాళ్ళు,నెలకోసారి ఇచ్చేవాళ్ళు, వీలుని బట్టి ఇచ్చేవాళ్ళు, సంవత్సరానికోసారి బాకీ తీర్చేవాళ్ళూ ఉండేవారు.
వెంకటరావు ఆ పుస్తకం తీసిన తరవాత సూర్నారాయణ అందుకుని ”ఈ కాతా పుస్తకం ఆస్తిగా బయట పడ్డాడు. నాకు ఈ పుస్తకమిచ్చి పద్దులు చూడమంటే ఇచ్చేసిన పద్దులు సున్నా చుడుతూ, మిగిలినవాటిని సరి చూసి ఇచ్చా! దీన్ని పుచ్చుకుని తిరిగుతింటాడు,బాకీల కోసం, చాలా బాకేలే ఉన్నాయి. బాకీ చెల్లేసిన వాడు లేడు. ఇతనికి ఎవరేనా ఒక ముద్ద పెడితే కలదు,లేకపోతే లేదు. ఈ సంచితో అలాగే ఎక్కడో ఒక అరుగుమీద పడుకుంటాడు” అని చెప్పి ముగించాడు.
నాకైతే కడుపులో దేవినట్టే అయింది, ఎలా బతికినవాడు, ఎలా అయిపోయాడని. పుస్తకం చేతిలోకి తీసుకుని పేజీలు తిరగేస్తున్నా! బాకీ చెల్లు వేసిన కాతాలు సున్నాలు చుట్టి ఉన్నాయి. రావలసిన కాతాల్లో సొమ్ము రావలసిందీ కనపడుతోంది. అలా చూస్తుండగా నా కాతా పేజి కనపడింది. అది సున్నా చుట్టి ఉంది. ఒక సారి కూడిక మళ్ళీ చేశా! ఐదు రూపాయలు తీసి వెంకట్రావు చేతిలో పెట్టి నా కాతాలో కూడిక తప్పు,నీకు ఐదు బాకీ ఉన్నా అని అతని చేతిలో డబ్బులు పెట్టి,వెను తిరిగి చూడక పరుగులాటి నడకతో వెళిపోయా!