శర్మ కాలక్షేపంకబుర్లు-మెరుగు బంగారంబు మ్రింగబోడు

సీII తల్లి గర్భమునుండి ధనము దేడెవ్వడు,
వెళ్ళి పోయెడినాడు వెంటరాదు;
లక్షాధికారైన లవణ మన్నమెకాని,
మెరుగు బంగారంబు మ్రింగబోడు;
విత్తమార్జనజేసి విర్రవీగుటె కాని,
కూడబెట్టిన సొమ్ము గుడువబోడు;
పొందుగా మరుగైన భూమిలోపల బెట్టి,
దానధర్మము లేక దాచి దాచి;
తేII తుదకు దొంగల కిత్తురో ? దొరల కవునొ ?
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు ?
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !

      తల్లి గర్భం నుంచి బయట పడేటప్పుడు డబ్బు మూట కూడా తేడు, పోయేటపుడు నూలుపోగు కూడా తీసుకుపోడు. ఎంత ధనవంతుడైనా అన్నమే తింటాడు తప్పించి బంగారపు కణికలు మింగడు. సొమ్ము సంపాదించి, కూడబెట్టి ఇతరుల మీద సవారీ చేయడం తప్పించి, చచ్చిన తరవాత ఒంటి మీద బట్టకూడా లేకుండానే కాల్చి పారేస్తారు, అప్పటివరకు అయ్యగారని వంగి నమస్కారం పెట్టినవాడే, కర్రతో పొడిచి పొడిచి కాల్చి పారేస్తాడు, చితి మీద. కూడా ఏం రాదు. సొమ్ము సంపాదించి భూమిలో గొయ్యితీసి పాతేస్తారు, తాము అనుభవించరు, మరొకరికి దానమూ చెయ్యరు. పాత కాలపు దాపరికాలెలా ఉండేవంటే, పడుకునే మంచం తలదిక్కున మంచానికే ఉన్న పెట్టెలో దొంగ అరలో దాచేవారు. మరికొందరు, మంచం దిగే దగ్గర కాళ్ళ వైపు గొయ్యితీసి అందులో పాతేసి, పైన అలికేవారు, మిగతా నేలతో సహా! పడుకునే మంచం నాలుగు కోళ్ళ కిందా గొయ్యి తీసి పాతేసేవారు, మంచం కదిలించేవారు కాదు. గోడలో పాతేసేవారు. దేవుని మందిరం కింద గోతిలో కప్పెట్టేవారు. ఇలా పోగేసిన సొమ్ము దొంగలు బలవంతంగా గుంజుకుపోవచ్చు, లేదా ప్రభుత్వమే కొల్లగొట్టేయచ్చు. తేనెటీగలు ఎంతో కష్టపడి తేనెను సంగ్రహించి నిలవచేసి మానవులకిస్తాయి, వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలుసా? కింద మంట పెట్టి ఈగలను పట్టునుంచి తరిమేసి తేనె పిండుకుంటారు, అలా కుదరకపోతే కాల్చేస్తారు.. ఇలా ఎందుకు మానవులు సొమ్ము పోగుచేయడానికి కష్టపడతారో అంటారు, శేషప్ప కవి.

ఈ మధ్య కొంతమంది సొమ్ము ఖర్చు పెడుతున్నారు,ఎందుకు? పేరు కోసం పెట్టుబడి, మరింత సంపాదనకే. ఇక పెళ్ళిలో ఆడంబరాలకి భోజనాలకి ఖర్చు చేస్తున్నారు. అమ్మో! వారింట పెళ్ళిలో 64 రకాలు చేసారంటే, మనింట్లో మరో పదెక్కువ అన్నట్టు వంటలు చేయించి వడ్డించడం మొదలెట్టేరు. ఎవరు తిన్నా అజానెడు కడుపుకే. ఒక సారి నిండుగా తింటే ఇక వద్దు అంటాడు. వద్దనిపించగలది అన్నదానమొక్కటే, మరొకటి లేదు. మానవులు ఎంత తింటారు? పప్పు, రెండు కూరలు, రెండు పచ్చళ్ళు, ఒక తీపి, ఒక కారా. అబ్బో ఇది తినడమే చాలా ఎక్కువ, మరి అరవైనాలుగు తయారు చేయడం? గోతి పాల్జేయడానికా?

ఈ మధ్య ఇలా ఎక్కువ వెరైటీలు చేయడం మానేశారు, ఏం జేస్తున్నారూ? బంగారపు రేకులు వడ్డిస్తున్నారు. నిజమే చెబుతున్నా! ఇలా బంగారాన్ని ఆహారంతో తీసుకోవడం కొత్త మాటేం కాదు. చాలా పాత కాలం నుంచే బంగారపు రేకుల్ని ఆహారంతో తీసుకోవడం భారతీయులకు అలవాటే. ఇదెందుకు? బంగారం కూడా ఔషధంగా గుర్తించారు,భారతీయులు. బంగారాన్ని ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు, అలాగే హోమియోలో బంగారం ఒక మందుగా వినియోగిస్తారు. కలిగినవారు ఇలా బంగారపు రేకులు తినడం అలవాటే! దాన్నే ఇప్పుడు కలిగినవారు గొప్ప కోసం బంతి మీద వడ్డిస్తున్నారు. ఎలా తింటారని కదా! వేడి వేడి అన్నం మీద ఈ బంగారం రేకు వేస్తే అది కరిగిపోతుంది, దానిలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక ఆధరువుతో తినెయ్యచ్చు. ఇది నేటి గొప్పవారి బంగారం మింగడం కత.

కొసమాట:- కొసరు మాట కాదూ! 25 బంగారపు రేకులు ఖరీదు దగ్గరగా ఐదువేలు, బజారులో దొరుకుతున్నాయి.ఈ పరిశ్రమ మన దేశంలో చాలా కాలంగానే ఉన్నది. ప్రయత్నించండి,మీదే ఆలస్యం 🙂

ప్రకటనలు

9 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మెరుగు బంగారంబు మ్రింగబోడు

  1. శర్మ గారు,

    జవ్వాది అనే సుగంద ద్రవ్యాన్ని ఎందుకు ఎలా ఉపయోగిస్తారో వివరంగా
    తెలుపగలరు.

    వీలుంటే ఒక టపా(కస్తూరి,జవ్వాది పై) మా,ఈ తరం వాల్లకు తెలియ చేయగలరు

  2. “….. మ్రింగబోడు” అను “పలుకే బంగారమాయెగా” 🙁.

    అంతటా అతి ఎక్కువైపోయింది. ఎదుటివాడి కంటే నేను నాలుగాకులెక్కువ (ఇప్పుడు నాలుగు “రేకులు” అనాలేమో) అనీ, నేను చేసినది “ఘనంగా” ఉందనీ నలుగురూ చెప్పుకోవాలని ఆరాటం. దానికితోడు సినిమాల్లో చూపించే ఆడంబరపు పెళ్ళి కార్యక్రమాలు. ఓ హిట్ సినిమాలో అమ్మాయి తండ్రి …. తను చేసిన పెళ్ళంటే అందరికీ …. “మినిమమ్ పదేళ్ళు” ….. గుర్తుండిపోవాలంటాడు. ఇటువంటి వాటి ప్రభావం కొంతైనా జనాల మీద పడి వాళ్ళ ఎగురుబాటూ అలాగే తయారయింది, అవతలివారిని డిమాండ్ చేయడమూ పెరిగింది. దురదృష్టకరమైన పరిణామం ఏమిటంటే …. కలిగినవారి ఈ గొప్పల్ని చూసి వాత పెట్టుకుంటున్న జనాలు ఎక్కువవుతున్నారు …. స్తోమత లేకపోయినప్పటికీ. 500 మందికి (ఈ రోజుల్లో పెళ్ళిళ్ళల్లో అదేమీ పెద్ద సంఖ్య కాదు) బంగారు రేకులతో భోజనం పెట్టాలంటే … పైన మీరు సూచించిన మార్కెట్ రేట్ ప్రకారం … లక్షరూపాయల అదనపు ఖర్చన్నమాట (రేకులు మారు వడ్డించకపోతే 😀). ఏతావాతా బావుకునేది వ్యాపారులు, నష్టపోయేది మధ్యతరగతి కుటుంబాలూనూ.

    నా ”కొసమాట”:- ఈ బంగారు రేకుల వడ్డన ఆనవాయితీగా తయారయిందంటే … కల్తీ రేకుల ప్రమాదం కూడా మొదలవుతుందని నా భయం 😳. మన ఆరోగ్యం గురించిన చింత అమ్మేవాడికేమీ ఉండదు కదా.

    • విన్నకోటవారు,
      మ్రింగబోడనే పలుకే బంగారమాయె 🙂 నిజం మాట. గల్పింగ్,గ్లోటింగ్ అంటున్నట్టే ఉంది 😦

      ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s