https://kastephale.wordpress.com/2018/07/26/
తరువాయి భాగం.
సలహా.
అంబ, తపస్సు చేసి భీష్ముని సాధిస్తానని తపస్సు చేసుకునేవారి దగ్గరకుపోతే వారీమె వివరాలడిగితే తన గోడు వెళ్ళబోసుకుంది.
అదంతా విన్న వారు ”అమ్మాయి! నీవా సుకుమారివి, తపస్సు అంటే కష్టమైనది, కుదురుతుందా? తపస్సు చేయలేవు. నీవు తిన్నగా నీ తండ్రి దగ్గరకు పోయి విషయం చెప్పుకోమని” సలహా ఇచ్చారు. విన్న అంబ ”ఎవరికి తెలియకుండా ఇక్కడ తపస్సు చేసుకోవాలనే నిర్ణయించుకున్నా” అని ప్రకటించింది. ఈలోగా అక్కడికి హోత్రవాహనుడు అనే రాజర్షి దయచేశారు. వారికి తాపసులు స్వాగత సత్కారాలు నడిపి కుశల ప్రశ్నలానంతరం, అంబను చూసిన హోత్రవాహనుడు ”ఈమె ఎవరు అలా దీనంగా ఉండటానికి కారణమేమని” అడిగితే, అంబ గురించిన విషయం తాపసులు హోత్ర వాహనుడికి చెప్పేరు.
విషయం విన్న హోత్రవాహనుడు అంబను తన మనుమరాలు ( కూతురు కూతురు) గా గుర్తించి ఆమెను చేరదీసి విషయం ఆమె నోటి వెంట మరోసారి విని,శోకించి, ”దీనికి తపస్సెందుకమ్మా! విషయం నేను చక్కబెడతాకదా!! పరశురామునికి చెప్పి సరిజేయిస్తా” అని ఊరడించారు. దానికి అంబ ”ఎక్కడ పరశురాముడు! ఆయన్ని కలవడం ఎక్కడ, ఆయన దయసేయడం ఎక్కడ? జరిగేనా?” అని శంకించింది. దానికి హోత్రవాహనుడు ”పరశురాముడుకి నేనంటే చాలా గౌరవం నువ్వు నా మనవరాలివని చెబితే నిన్ను రక్షిస్తాడు, ఆయన దగ్గరకు వెళ్ళమని” సలహా ఇచ్చారు. ఈ లోగా పరశురాముని మిత్రుడైన అకృతవ్రణుడు అనే తాపసి రావడంతో వారికి సపర్యలు చేశారు,తాపసులు.
వచ్చిన అకృతవ్రణుని చూసి ”పరశురాముడు ఎక్కడున్నారని” వాకబు చేశారు, హోత్రవాహనుడు. దానికాయన ”పరశురాముడు హోత్రవాహనుడు నా ప్రియ మిత్రుడని మునిలోకానికి చెబుతుంటారు, రేపే ఆయన ఇక్కడికే వస్తున్నారు” అని చెప్పేరు.
మరునాడు పరశురాముడు విచ్చేశారు, స్వాగత సత్కారాలనంతరం హోత్రవాహనుడు పరశురామునితో సరససల్లాపాలు నడిపి అంబను చూపించి,”ఇది నా దౌహిత్రి, దీని విషయం వినమని” కోరాడు. అంబ పరశురాముని పాదాభివందనం చేసింది. పరశురాముడు ”నీకు హోత్రవాహనుడెంతో నేనూ అంతే! నీకు రక్ష ఇస్తా”నని జరిందేమిటో చెప్పమన్నారు. అంబ విషయం చెప్పి నాకు జరిగిన పరాభవంతీర్చి నన్ను రక్షించమని కోరింది. దానికి పరశురాముడు, ”నీకు పరాభవం రెండు రకాలుగా జరిగింది, సాళ్వుణ్ణి శిక్షించమంటావా? భీష్ముడిని శిక్షించమంటావా? నీకేది ఇష్టమో చెప్పు” అన్నారు.
అంతట అంబ ”సాళ్వుడు ఇంక నన్ను పెళ్ళి చేసుకోడు, అంచేత ఆ విషయం చాలించుకున్నా! భీష్ముని మీదనే నా కు కోపం ఉంది, అతడిని వధించడానికే తపస్సు చేయాలనుకున్నాను, ఇక్కడికొచ్చాను,తమ శరణు జొచ్చాను” అని చెప్పింది.
నేను చెప్పినట్టు భీష్ముడు చేస్తాడు, చేయకపోతే, బాణాలతో అణిచేస్తా! నువ్వు తపస్సు చెయ్యక్కరలేదని భరోసా ఇచ్చారు.
పరశురాముడు అంబతో కలసి వెళ్ళి సరస్వతీ నదీ తీరంలో విడిది చేసి భీష్మునికి కబురంపేరు.
అంబకి తాపసులు చెప్పిన సలహా, పుట్టినింటికి వెళ్ళమన్నది నచ్చలేదు. ఎవరికి తెలియకుండా తపస్సు చేసుకోవాలనుకుంటున్నానని అంటే, పుట్టినింటికీ వార్త తెలియ కూడదనేగా! అంబ సాళ్వుని వద్దకు వెళ్ళేవరకూ భీష్మునిపై సద్భావమే ఉంది. సాళ్వుడు తిరస్కరించి, అవమానించి,పరాభవించినందుకు శోకం కలిగింది. ఈ శోకం కోపంగా మారింది. ఆ పై అది అశక్త దుర్జనత్వంగా పరిణమించింది. తన అసహాయతపై కోపమొచ్చింది. సహజంగా సాళ్వునిపైన కోపం కలగాలి కాని అంబ ఈ కోపాన్ని భీష్ముని వైపు తిప్పింది, ఈ ముప్పుకి కారణం భీష్ముడేనని. సాళ్వుడు పరాభవించినా అతనిపై కోపం కలగలేదంటే……కాని భీష్ముడు తీసుకు రావడానికి కారణమైన తన స్వయంవరంరాలంకారం గురించి మాత్రం విస్మరించింది. ఆ తరవాత పరశురామునికి, సాళ్వుడు తిరస్కరించిన మాట చెప్పింది తప్పించి, తాను భీష్ముని తప్పేం లేదని సాళ్వునితో వాదించినది చెప్పలేదు. భీష్ముని పై అకారణ క్రోధం పెంచుకుని అతని మరణాన్ని కోరింది. పరశురాముడు ధర్మ సూక్ష్మం గ్రహించి కూడా ఆడపిల్ల మాట వైపు మొగ్గు చూపి, ఎవరిని శిక్షించమన్నావని అడిగారు తప్పించి సాళ్వునితో వివాహం పొత్తు పరచడానికి ప్రయత్నించలేదు, హోత్ర వాహనుడూ ప్రయత్నించలేదు, ప్రేమికుల్ని కలిపే ప్రయత్నం చెయ్యలేదు. అంబ భీష్ముని శిక్షించమని, సాళ్వునితో తన వివాహ ప్రస్తావన చాలించుకున్నాననడంతో సాళ్వుడు చేసిన ద్రోహం,మోసం, అవమానం,పరాభవం అన్నీ మరుగున పడిపోయాయి.
అంబతో సహా, ఏ ఒక్కరూ సాళ్వుడు చేసిన ద్రోహాన్ని మాట వరసకు ప్రస్తావించలేదు. సాళ్వుడు చేసిన పరాభవం,మోసం, అలా మరుగున పడిపోయాయి.
సెలవల్లో ఉండి మీ టపాలు చదవటం కుదరలేదు. ఈ రోజు అన్నీ చదవగలిగాను. శిఖండి గురించి బాగా వ్రాసారు. నిజమే. మనం సాళ్వుడు పురుషాహంకారాన్ని చూపించాడు అన్న సంగతి ఆలోచించము.
చంద్రిక గారు,
సాళ్వుని పురుషాంకారం గుర్తించం కారణం….చెబితే చాలా ఉందండి. శిఖండి అసలు కత ముందే ఉందండి, ఎవరికి రుచించినట్టు కనపడక…
ధన్యవాదాలు.