శర్మ కాలక్షేపంకబుర్లు-సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా!

సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా!

”సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా! ఆ పతకమునకు బట్టె పది వేల వరహాలు రామచంద్రా” అంటూ ఖర్చు లెక్కలు చెప్పేడు రామదాసు అనే గోపన్నగారు. పుచ్చుకున్నాయన మాటాడలేదు, ఏం నేనడిగేనా? నువ్విచ్చావు నేను పుచ్చుకున్నానన్నట్టు, అనుకున్నాడేమో! ఇక్కడేమో తానీషా భటులు విడతల మీద టైమ్ టేబుల్ ప్రకారం తన్నుతూంటే, వీపు చిట్లగొట్టి బుర్ర రామకీర్తన పాడిస్తుంటే, రామచంద్రప్రభువుని తిట్టేడు, అబ్బే ఉలుకు పలుకు లేకపోతే ”ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లీ” అని పైరవీ మొదలెట్టేడు, ఎంతవారలైన కాంతదాసులే అనికదా నానుడి, అప్పుడిక రామచంద్రుడు కదలక తప్పలేదు. లక్ష్మణునితో బయలుదేరి తానీషాని అర్ధరాత్రి లేపి లెక్కచూసి వరహాలు చెల్లించి రసీదు పుచ్చుకుని, ( మొన్న సుప్రీం కోర్టు అర్ధరాత్రి విచారణ జరిపించినట్టు) రామదాసు విడుదల పత్రం మీద తానీషా ముద్ర వేయించి తెచ్చి జైలు అధికారులకిచ్చి అంతర్ధానమైపోయారు. ఈయనది ఇదొక లీల, మానవుణ్ణంటూనే. విడుదల తరవాత రామదాసు ఏడ్చాడు అయ్యో! తానీషాకి కోరక దర్శనం ఇచ్చావు, నీ కోసం ఇన్ని చేసి, నీ దర్శనం కోరిన నాకు దర్శనం ఇవ్వలేదే అని. చిత్రమైన విషయం కదూ!

ఈ చింతాకు పతకమూ, కలికి తురాయి, ఇలా రాముని కుటుంబానికి రామదాసు చేయించిన వస్తువులన్నీ దగ్గరగా అరవై ఏళ్ళకితం స్వయంగా చూశా! గుళ్ళోనే ఒక విభాగంలో టిక్కట్టు పెట్టి ప్రదర్శించారు. ఆ తరవాత కాలంలో పరిస్థితులు మారాయి. గుళ్ళోనుంచి నగలు తీసేసి భద్రతకోసం 🙂 ధర్మకర్తల స్వాధీనం చేశారు, కొన్ని చోట్ల బేంక్ లాకర్లలో పెట్టేరు. అక్కడినుంచి ప్రారంభమయ్యాయి దేవుని తిప్పలు. స్వాతంత్ర్యానికి ముందు రోజూ ధరింపచేసే నగలు స్వాతంత్ర్యం వచ్చిన తరవాత ఉత్సవ సమయం లో మాత్రమే అలంకరించే అలవాటుకొచ్చింది. సంవత్సరానికోసారి వస్తువులు తెచ్చేవారు బయటికి, అలంకారం చేసేవారు. ఎన్ని తెచ్చేరో మళ్ళీ లోపల ఎన్ని పెట్టేరో పరమాత్మకీ తెలీదు. అసలు లోపలున్నవి అసలీయా నకిలీయా అదీ తెలీని వాడీయన. పరమాత్మది మరో లీల ఇది. ఇక నేటికాలానికీ నగలున్నాయా? అసలున్నాయా? అసలువే ఉన్నాయా? అని ఆయనే పాడుకునే రోజులొచ్చేసినట్టున్నాయి! పాపం రామచంద్రుడు.

మరొకాయన ప్రజలంతా ముద్దుగా సింహాద్రి అప్పన్న అంటారు, కాని ఈయన ఆపన్న శరణ్యుడు, ఇంత మాటనలేక,  ప్రజల నోట ఆపన్నుడన్న మాట అప్పన్నగా మారిందేమో నని నా సందేహం. అసలు పేరు శ్రీవరాహ లక్ష్మీ నృసింహుడు. ఈయన లీలలు చెప్పుకోవలసినవే!

పద్దెనిమిదో శతాబ్దంలో అనుకుంటా ఈ గుడిమీదకి ముసల్మాన్లు దండయాత్ర చేసేరు. ఆలయ అర్చకులు ప్రతిఘటించారు. వారి వల్ల కాని సమయం వచ్చేసింది, ఆ సమయంలో ప్రధానార్చకుడు స్వామిని స్తుతిస్తూ నృసింహ కరావలంబ స్తోత్రం పఠించి ”స్వామీ! ఉన్నాడు, ఉన్నాడు,ఉన్నాడని నమ్మి చెప్పిన ప్రహ్లాదుని మాట నిజం చేయడానికి, తమరు హిరణ్య కశిపుడు ఎక్కడ వేలు చూపుతాడో అక్కడనుంచి దర్శనమివ్వడాని సిద్ధంగా ఉన్న, తమరీ రోజు ఉన్నట్టు ఋజువు చేసుకోక తప్పని సమయం, తమ ఉనికిని తమరే ప్రకటించుకుని మీ ఇంటిని రక్షించుకోండి” అని వేడేడు. అంతే జుయ్ జుయ్ మనే శబ్దం వినపడింది, తురుష్క సైనికులు కాలికి బుద్ధి చెప్పాల్సివచ్చింది. ఎక్కడదాకా కొండ దిగిపోయేదాకా! ఏమయింది? తేనెటీగల గుంపు ఆ తురుష్కుల మీద పడి కుట్టిన చోట కుట్టకుండా కుట్టి కుట్టి కొండ మీదనుంచి పారద్రోలాయి. ఇది స్వామి లీల, చరిత్రలో చదువుకున్నది, ఎవరు చూడొచ్చారు? కట్టు కథ, నిజంజరిగిందా? మనకంతా అనుమానమే. మనదైనదేదీ మనకి నచ్చదు కదా! మరో సంఘటన

గజ్జెల ప్రసాద్ గుర్తున్నాడా? మన పేరే మనకి గుర్తుండని రోజులాయె! చిట్టి పేర్లు,పొట్టి పేర్లు తప్పించి. ఈ గజ్జెల ప్రసాదు మరో ఇద్దరితో కలసి సింహాచలం దేవస్థానం లో దొంగతనం చేశాడు. దోచుకున్న సొత్తుతో వస్తూ కొండ మీదనే కూడా పట్టుకెళ్ళిన నాటు బాంబు పేలి ఒకరు పోయారు, మరొకరి చెయ్యి తెగిపోతే హాస్పిటల్ లో చేర్చారు, అతనూ పోయాడు. ఈ ప్రసాద్ దొరికిపోయాడు, కొంత చోరీ సొత్తుతో. ఆ తరవాత ఇతనూ చనిపోయినట్టుంది,వివరాలు తెలియవు. అసలు గ్రంధ కర్తలు బయట పడలేదు.

ఇంతకీ దోచుకున్నదెంత?” ఎనిమిది కేజీల ఆరువందల గ్రాముల బంగారం”, ”పదకొండు కేజిల వెండి.” పోలీసులకి దొరికిందెంత? ”మూడు కేజిల ఏడువందల గ్రాముల బంగారం దగ్గరగా పది కేజిల వెండి”. మిగిలిందేమయింది అడగద్దు. చోరి నవంబరు పది పందొమ్మిది వందల డెబ్బై ఎనిమిది. దొరికిన సొత్తు మరల దేవునికి చేరిన రోజు ఫిబ్రవరి పదొమ్మివందల ఎనభై ఐదు. ఈ గజ్జెల ప్రసాదు, మరో ఇద్దరు దొంగలే కావచ్చుగాని దేవస్థానం లో దోచుకునేటంతవారు కాదని నా నమ్మకం. ఎవరో పెద్దల తలలో మెదిలిన పురుగుకి వీరు బలైపోయారంతే. చోరీ కాబడిందంతా పూర్తి బంగారమే కాదు. ఈ ఆభరణాలలో ఉన్న వజ్రాలు,పచ్చలు వగైరా విలువైన రాళ్ళు తో సహా! ఇందులో పచ్చల పతకం బాగా విలువైనది. ఇది పూర్తి రూపుతో కాక భిన్నమై దొరికింది.

సింహాద్రి అప్పన్న నేరానికి శిక్ష విధించేశాడు, అమలూ చేసేశాడు. వెనక ఉండి దొంగతనానికి ఉసిగొల్పిన వారికేం శిక్ష వేశాడో మాత్రం తెలియదు. ఇంతకీ ఈ నగలిప్పుడేక్కడున్నయని కదా! ప్రభుత్వ ట్రజరీలో! ఆ తరవాత ఉన్నాయో లేదో తెలియదు, ఉన్నాయా? అసలువే ఉన్నాయా? అని పాడుకోవడమే మిగిలింది శ్రీవారికి.

ఇది శ్రీ వరాహ లక్ష్మీ నృసింహుని లీల.

టపా పెద్దదైపోయింది, మరికొన్ని తరవాత

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా!

 1. “ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా” అని నిష్టూరమాడాడు కూడా పాపం రామదాసు గారు.

  // “…. భద్రతకోసం 🙂 ధర్మకర్తల స్వాధీనం చేశారు, “ // . భలేగా ఉందండీ 😀😀. ధర్మకర్తల భాగోతాలు ఎన్ని వినలేదు?

  సింహాచలం గుడి నగల దొంగతనం (1978) ఆ రోజులలో చాలా సంచనలం సృష్టించిన సంఘటన. ప్రధాన దొంగ పేరు ఛోటా ప్రసాద్ అని గుర్తు. దొంగలకు ఆలవాలమైన స్టువర్ట్ పురానికి చెందినవాడని అన్నారు. తరవాత కాలంలో చనిపోయాడనే పేపర్లలో చదివినట్లు గుర్తు.

  మొత్తానికి ఆసక్తికరమైన టపా.

  • విన్నకోట నరసింహారావుగారు,

   నిష్టురం ఆడమేంటండి బాబూ, అబ్బ తిట్టితినని ఆయాస పడబోకు రామచంద్రా అనే చెప్పేసేడు మొహం మీదే! 🙂

   స్టూవర్ట్ పురం వాళ్ళు దొంగలుగానే ఉండాలన్నది పెద్దల దురాశకి నిదర్శనం. పోయిన ఐదుకేజీల పైచిలుకు బంగారంలో ఈ ప్రసాదుకి దక్కినది బహుతక్కువే అయి ఉంటుందండి. మిగిలింది పెద్దలు మింగేసి…… ఏదీ సమాజం నిలదీయలేదెవరినీ, మిగిలిన బంగారం ఏమయిందని…
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s