శర్మ కాలక్షేపంకబుర్లు-చిత్రమైన అనుభవం

చిత్రమైన అనుభవం

టెలిపోన్ ఆపరేటర్ ఉద్యోగం అంటే నేటివారికి తెలీదు, నిజానికి నాటివారికీ తెలీదు. అదుగో అటువంటి ఉద్యోగం వచ్చిందినాకు, ఎప్పటిమాటిదీ దగ్గరగా అరవై ఏళ్ళకితం మాట.

ఓ పల్లె పట్నం కాని ఊళ్ళో ఉద్యోగమిచ్చామన్నారు ప్రభుత్వంవారు, అమ్మో! ఆఊళ్ళొ ఉద్యోగమా! ఊరంతా మోతుబరులే! కొడతారు తేడా వస్తే! అని సానుభూతి చూపితే అది నా స్వంత ఊరని బోర విరుచుకుని వచ్చిన కాలం. ఉద్యోగంలో చేరిన కొత్త రోజులు, లోకం తెలియనితనం, కుడుము చేతికిస్తే పండగనుకునే వయసు,రోజులు.

ఆ రోజుల్లో వారానికి నలభై ఎనిమిదిగంటలు ఉద్యోగం, ఒక రోజు శలవు. నా అదృష్టం కనీసం ఐదుగురుండాల్సిన చోట నలుగురమే ఉన్నాము, అందుకు వారాంతపు శలవూ లేదు. ఆరోజు పని చేసినందుకు రోజుకు ఏడు రూపాయలిచ్చేవారు, అంటే గంటకి ఒక రూపాయి కూలి. ఏడున్నగంటల ఉద్యోగం కదా ఏడు రూపాయలే ఇవ్వడమేమని అనుమానం కదా! పూర్తిగా గంటా పని చేస్తేనే అది ఓవర్ టైమ్ కి కలుస్తుంది, అది ఆనాటి రూలూ.

రోజుకి మధ్యలో అరగంట భోజన సమయం, అంటే నలభై ఐదు గంటలు పని, మధ్యలో కాఫీ టీ లకి తిరిగేందుకు వెసులుబాటు లేనిది, ఏమంటే పలుపుతాడులాటిది స్విచ్ బోర్డ్ కి మాకు కలిపి ఉండేది, వదలిపెట్టిపోడానికి లేదు. ఆ తరవాత కాలంలో పది నిమిషాలు ఒకటి రెండు సార్లు, మధ్యలో షార్ట్ రిలీఫ్ అన్నారు. ఇది ఒక సారే ఇచ్చేవారు, అదేమంటే ఒకటి రెండు సార్లన్నారుగాని రెండు సార్లనలేదుగా లా పాయింట్ లాగేరు అధికారులు. ఉదయం ఏడు గంటలకి వచ్చి తలకో కిరీటం, మెడలో బూరాలాటిది వేలాడ దీసుకుని పలుపుతాడు గుంజకి కట్టేసినట్టు ఒక వైర్ల తాడు బోర్డుతో అనుసంధానించుకుని, కొన్ని దీపాలు వెలుగుతుంటే ఏదో ఒక పుల్లలాటిదో చిల్లులో పెట్టి మరేదో నొక్కి మాటాడి దీపాలార్పెయ్యడం ,అమరికొన్ని దీపాలు వెలిగించడం, కనపడనివారితో మాటాడటం, కళ్ళతో చూడ్డం, చెవులతో వినడం ,నోటితో మాటాడటం, చేత్తో రాయడం, మరేదో తిప్పడం ఇలా చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ పని చేసేదే టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగం. ఎవరికే మాత్రం ఆలస్యమైన తిట్లకి లంకించుకునేవారు, ఇది నిత్యం,సత్యం. ఈ ఫోన్ లు ఉన్నవారంతా కొంచం ఒళ్ళు బలిసినవారే ఐ ఉండేవారు, సామాన్యులకి ఫోన్ అవసరం తక్కువే! కాదు లేదు, అదీనాటి కాలం. ఉదయం ఏడు గంటలకి కిరీటం (హెడ్ సెట్) తగిలించుకుంటే మధ్యాహ్నం పన్నెండుకి మరొకరొచ్చి వదిలించేదాకా ఇంతే సంగతులు, మధ్యలో కాఫీ టిఫిన్లకి ఇచ్చే, ఆ తరవాతొచ్చిన పది నిమిషాల సమయం కూడా పల్లెల్లో పని చేసేవారికివ్వడానికి కుదరనిదే! అది కాగితం మీద ఉండిపోయిన ఆదర్శమే, మా పట్ల. ఆ తరవాత కాలం లో పని గంటలు నలభై నాలుక్కి తగ్గించారు, అంతర్జాతీయ ఒడంబడిక కోసం, భోజన సమయం కాకనే సుమా! ఒక్కొకప్పుడనిపించేది వెట్టి చాకిరీ అంటే ఇదేనేమో అని! ఛా! ఈ ఉద్యోగం వదిలేసి కూలి పని చేసుకుంటే మేలనిపించేది, ఏమీ చేయలేని తనానికి ఏడుపూ వచ్చేది, కాని కాలే కడుపు, నాపై ఆధారపడినవారిని గుర్తు తెచ్చుకుంటే, ఇది కూడా లేనివారికంటే నేను మేలు కదూ అని నన్ను నేను ఓదార్చుకునేవాడిని.

సదరు హద్దుల మధ్యస్థమైన ఇటువంటి పని పరిస్థితులలో, అంటే వెట్టి, బానిసత్వానికి భిన్నంకాని పని పరిస్థితులలో, పల్లెలో పని చేస్తున్న నేను ఒక రోజు ఉదయమే ఏడు గంటలకి కిరీట ధారణ చేసేను. తుఫాను ముందు నిశ్చలతలా ఉంది. కిరీటధారణ చేయడంతోనే ఒక ట్రంకాల్ వచ్చిందొకరికి,ఇచ్చేను, అదిగో అది మొదలు తుఫాను ప్రారంభమయింది. వార్తేంటీ ”ద్వారపూడిలో రేకొచ్చించి” వార్త తెలుసుకున్న మిల్లు వారు మరొకరికి మరొకరికి, వారు మరొకరికి అందించేసేరు. ఇలా ఎగుమతి చేసేవన్నీ ఉప్పుడు బియ్యం కేరళాకి.

రేకేంటీ? తెలియనివారికోసమే! రైల్వే వేగన్లు రెండు రకాలు,బాక్స్ వేగన్లు,ఓపెన్ వేగన్లు. బాక్స్ వేగన్ లో ముఫై టన్నులు, ఓపెన్ వేగన్ లో అరవై టన్నులు ఆ పై అనుకుంటా,లోడ్ చేయచ్చు,సరుకు. ఇటువంటి వేగన్లు ఒక అరవై ఉన్న గుడ్స్ రైల్ బండిని రేక్ అంటారు. దగ్గరగా ఇరవై వేల క్వింటాళ్ళ బియ్యం ఎగుమతికి సిద్ధం కావాలి, ఒకటి రెండు రోజుల్లో. లోడింగ్ ఆలస్యమైతే డెమరేజీలు కట్టుకోవాలి, అదన మాట సంగతి. అన్ని రైస్ మిల్లులకి హడవుడే! ఆ ఊళ్ళో నాటికున్న ఏభై ఫోన్లలో సగంపైగా రైసుమిల్లుల వారికి సంబంధించినవే! అందరికి లారీలు కావాలి సరుకు స్టేషనికి తోలడానికి. ఆ రోజుల్లో ఆ వూళ్ళో ఒకటే లారీ బ్రోకరాఫీస్ ఉండేది, మా ఆఫీస్ ఎదురుగానే. అక్కడ మిల్లర్ల తాలూకు లారీలు, మిల్లర్ల బంధువుల లారీలు ఉండేవి. ఊరిలో పెద్దవారంతా ఏదో సమయంలో అక్కడకొచ్చి వెళ్ళేవారే,రోజూ! దానికి తోడు అక్కడ చతుర్ముఖ పారాయణా జరిగేది. లారీలకోసం బ్రోకరాఫిసువాళ్ళు, రైస్ మిల్లర్లు ఎక్కడెక్కడికో కాల్స్ బుక్ చేసేవారు. అదీగాక లోకల్ గా కూడా, సరుకు తక్కువున్నవారు మరొకరి దగ్గర సరుకు కోసం ప్రయత్నాలు, ఇలా చాలా విషయాలకి ఫోన్ అవసరపడేది. అందుకారోజు తుఫానొచ్చినట్టే అయింది నా పని.

ఉదయం ఏడు మొదలుకుని అలా పని చేస్తున్నవాడిని పదిగంటల ప్రాంతంలో మా ఆఫీస్ కు నాలుగు కిలో మీటర్ల దూరాన ఉన్న ఒక మిల్లునుంచి ఓనర్ ఫోన్ ఎత్తి, మాట్లాడటం మొదలెట్టి, విషయం సాగదీసి దాన్ని చర్చకి పెట్టేసేరు. నాకా ఖాళీ లేదు, ఆయానా చెప్పినది వినటం లేదు, ఫోన్ పెట్టటం లేదు. ఆయనకి సమాధానాలిస్తూ మిగిలినపనీ చేస్తూ వచ్చాను. తగువు చిలికి చిలికి గాలివానే అయింది, ఆయనకీ విసుగొచ్చినట్టుంది,పట్టరాని కోపమూ వచ్చేసింది ”వస్తున్నా! నీ సంగతి చూస్తా!! నీ పేరేంటీ?” అన్నారు. ఇది సాధారణంగా ఆ రోజుల్లో టెలిఫోన్ ఆపరేటర్లని అడిగే అతి సామాన్య ప్రశ్న. మాకా పేరు చెప్పకూడదనే ఒక నిబంధన,ప్రభుత్వంవారి ఫర్మానా! నేనైతే ఆయనకి ”మా పేరు చెప్పకూడదని రూలు, అయినా నా పేరు చెబుతున్నాను. నా పేరు శర్మ, తెల్లగా సన్నగా పొడుగ్గా ఉంటాను, ఇప్పుడు ఒక్కడినే ఉన్నాను, ఎప్పుడూ ఒకళ్ళమే ఉంటాం, మా ఆఫీసు మీకు తెలిసే ఉంటుంది, మీ లారీ ఆగే బ్రోకర్ ఆఫీస్ ఎదురుగానే! రండి” అన్నా! సమయం పదకొండు దాటింది. ఆయన ఫోన్ పెట్టేసేడు.

మా ప్రాంతంలో నీ సంగతి చూస్తా అంటే ’చితక్కొడతా’ అని అర్ధం. రండి అనేసేనుగాని ఒక్కసారి ఒళ్ళు ఝల్లుమంది, విషయం తల్చుకుంటే! పోలీస్ కి చెబితే! సరే సంబరం,జరిగేదేమో తెలియదా అంది బుద్ధి. ఎదురుగా ఉన్న బ్రోకర్ ఆఫీస్ వాళ్ళకి చెబితే! అక్కడున్నవాళ్ళంతా ఈ కొడతానన్న ఆయనకి కావలసినవాళ్ళే! ఇక లారీ బ్రోకర్,డ్రైవర్లు,క్లీనర్లు అంతా వాళ్ళ కిందవాళ్ళే. ఉపయోగం లేదు. ఏం చెయ్యాలి, కానున్నది కాకమానదు,రోటిలో తలదూర్చి రోకటిపోటునకు వెరువ నేర్చునా? అన్నది గుర్తుకు తెచ్చుకుని ఊరుకున్నా. సమయం పావుతక్కువ పన్నెండు కావస్తూంది, ఇంతలో ఆఫీస్ ముందో లారీ ఆగిన చప్పుడు బిలబిలా జనం దిగుతున్న చప్పుడు వినపడింది. ఒకాయన ముందురాగా కర్రలు పుచ్చుకుని జనం లోపలికొచ్చేసేరు. వచ్చినాయన్ని పలకరించే సమయం లేదు,బిజీగా ఉన్నాను, కూచో మనడానికి మరో కుర్చీ లేదు, ఒక టేబుల్ ఉంటే దాని మీద కూచోమని సైగ చేశాను. స్విచ్ బోర్డ్ చుట్టూ గదినిండా ఖాళీ లేకుండా కర్రలుచ్చుకుని జట్టు కూలీలు నిలబడి ఉన్నారు, గుసగుసలాడుకుంటున్నారు. నిమిషాలు నడుస్తున్నాయి. అందరూ వింతగా నేను చేస్తున్న పని చూస్తున్నారు. పన్నెండయింది, జనాన్ని చీల్చుకుని నన్ను భోజనానికి పంపవలసిన నా కొలీగ్ వచ్చాడు.

అతనికి బోర్డ్ మీద జరుగుతున్నది చెప్పి, బోర్డ్ అప్పజెప్పి, మనుషుల్ని తప్పించుకుని కొట్టడానికి వచ్చినతని దగ్గరకెళ్ళి ఎదురుగా నిలబడి ”నేనేనండి శర్మ” అన్నా, చుట్టూ ఒక సారి చూశా, కళ్ళు మూసుకున్నా, పడబోయే దెబ్బకోసం ఎదురు చూస్తూ. ఆపదవేళల అలపైన వేళల ఓపినంత హరినామమే దిక్కు మరి లేదన్న అన్నమయ్య మాట గుర్తు చేసుకుంటూ. క్షణాలు గడుస్తున్నాయి, నిశ్శబ్దంగా ఉంది, మా కొలీగ్ మాటలు తప్పించి అంతమంది ఉన్నా మరో మాట లేదు. ఏమయింది తెలియదు రెండు చేతులు నన్ను బలంగా తన కౌగిట్లో బంధించాయి.కళ్ళు తెరిచాను కొట్టడానికి వచ్చినాయన కౌగిలిలో ఉన్నాను ”శర్మగారు రండి” అంటూ కూడా ఉన్నవాళ్ళతో టీ తాగిరండని చెబుతూ మా ఇద్దరికి టిఫిన్ పట్రండి అని కూడా ఉన్న గుమాస్తాకి చెబుతూ, నన్ను కౌగిట్లోనే నడిపించుకునో, ఎత్తుకునో చెప్పలేను, తీసుకుని ఎదురుగా ఉన్న బ్రోకర్ ఆఫీసుకి తీసుకెళితే అక్కడివాళ్ళంతా పెద్దగొడవవుతుందనుకున్నది, నన్నలా కౌగిలిలో తీసుకురావడం చూసి ఆశ్చర్యపోయారు, ఏమయిందో తెలియక తెల్లమోహాలేసేరు. ఆఫీస్ నుంచి బ్రోకర్ ఆఫీస్ కి వచ్చేదాకా ఆయనేమన్నారో నేనేం చెప్పేనోగాని ఒక్క అరగంటలో భోజనం చేసి మళ్ళీ ఉద్యోగానికెళ్ళలన్నది మాత్రం చెప్పిన గుర్తుంది. ఈలోగా టిఫిన్ తేవడం ఇద్దరం కూచుని కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చెయ్యడం అయింది. అరగంటా అయింది, నన్ను మళ్ళీ తీసుకెళ్ళి ఆఫీస్ లో వదిలేసి వెళ్ళిపోయాడాయన జనంతో సహా లారీ మీద.

ఆ తరవాత అతనో ముఖ్య స్నేహితుడూ అయిపోయాడు. నిజానికి నేటికీ నాకర్ధం కానిది, ఉరుములు మెరుపులు,జోరుగాలి వీచిన సందర్భంలో జడివాన కురుస్తుంది, కాని ఈ సందర్భంలో పిల్లగాలి మలయమారుతంలా వీచి మనసుకు హాయి కలిగించింది. అసలు కొడదామని వచ్చినతను ఇలా ఎందుకు చేశాడో నాకీ రోజుకీ అర్ధం కాలేదు. ఇదో చిత్రమైన అనుభవం.

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-చిత్రమైన అనుభవం

 1. ఈ రోజుల్లో అసలు టెలిఫోన్ ఈ విధంగా ట్రంక్ కాల్ బుక్ చేసి మాట్లాడేవారం అంటే ఈ పిల్లలు నమ్ముతారా అనిపిస్తుంది. మరీ పదేళ్లలో స్మార్ట్ ఫోన్ తో ఎంత వేగవంతమైన మార్పో !!

  • చంద్రిక గారు,

   నేను పని చేసిన మేన్యుయల్ ఎక్ఛేంజిలను నేనే నా చేతులతో మూసేశాను. ఎత్తేశాను, ఆ సమయంలో బాధ పడ్డానుకూడా! కాని మార్పు పురోగతి కోసంకదా, సద్దుకున్నాను. అదో అనుభవం. పిల్లలికి మార్పు తెలియదు, తెలియాలనే నా ప్రయత్నం. మొత్తం మార్పు ఒక్క పదేనేళ్ళలో సాధ్యమయిందండి. ఇలాగే అన్ని రంగాల్లోనూ చేస్తే…..దేశం పట్ల ఆశ

   ధన్యవాదాలు.

 2. మీరక్కడ రణరంగంలో అభిమన్యుడిలాగా ఒంటరిగా అనేక టెలిఫోను కాల్సుని దునుమాడడము చూసి మెచ్చుకోలేకండా ఉండలేకపోయాడేమో!

 3. శర్మ గారు ఆనాటి సంఘటలను ఎంత బాగా వివరించారండి. నాకు గుంతకల్ లో అదే
  ఉద్యోగం. కాస్త లేట్ గా ఆన్సర్ చేసినందుకు ఆలూరు దగ్గర ఒక పోస్ట్ మాస్టర్
  నన్ను పీకి పాకం పెట్టేసాదండి. అవన్నీ గుర్తుకొస్తున్న అండీ. పాత సంగతులు
  నెమరు వేసు కోవడమే రిటైర్ ప్రాణుల తీపి గురుతులు. నమస్కారం. రమణ.

  • రమణాజీ,
   రకరకాల పీడ ముఖాలు.
   సాధారణ ఓ.టి గంటకి అర్ధ రూపాయి, ఆఫ్ ఓ.టి గంటకి రూపాయి కదా!
   మాకో నల్లదొర ఆఫీసర్ గా వచ్చేడు. అప్పటిదాకా వారాంతపు శలవుకి ఆఫ్ ఓ.టి ఇచ్చేవారు. నల్లదొర ఆఫ్ ఓ.టి ఎత్తేశేడు. దాని బదులుగా ఆఫ్ ఇచ్చేసి మిగిలినవారికి మూడు గంటల చొప్పున ఓ.టి వేసేడు. ఖర్చు తగ్గించేసేడనమాట. ఫలితం మూటగట్టుకుపోయాడనుకోండి’

   ఈ సంఘటన తరవాత నేనో చిన్న సైజ్ లీడరైపోయాను. తగువులన్నీ నా దగ్గర కొచ్చేవి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు చేసిన ఓ పోస్ట్ మాస్టర్కి అందరం కలిసి తలంటేసేం. తలుచుకుంటే ఎన్నో తీపి చేదు గుర్తులు కదా
   ధన్యవాదాలు.

 4. వచ్చి, పేరు చెప్పి ఎదురుగా నిలిచిన మీ ధైర్యానికి నివ్వెరపోయుంటాడు. మిమ్మల్ని చూసి ఇంత చిన్న వయసు వాడికి ఇంత ధైర్యమా అని ముచ్చటపడుంటాడు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s