శర్మ కాలక్షేపంకబుర్లు-విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

స్వగృహే పూజ్యతే మూర్ఖస్స్వ గ్రామే పూజ్యతే ప్రభుః
స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే

స్వంత ఇంటిలో మూర్ఖుడు గౌరవింపబడతాడు. అధికారి స్వగ్రామంలో గౌరవింపబడతాడు, రాజు తన దేశంలో గౌరవింపబడతాడు, కాని విద్వాంసుడు అంతటా గౌరవింపబడతాడు.

మూర్ఖుడు తనింటిలో మాత్రమే గౌరవింపబడతాడు, ఇంటిలో వాళ్ళకి తప్పదు కనక గౌరవిస్తారు. అసలు మూర్ఖులెవరు?

”తెలిసియు తెలియని నరుదెల్ప బ్రహ్మదేవుని వశమే” అన్నారు భర్తృహరి మాటకి లక్ష్మణ కవి తెనిగింపుగా! వారెవరో తెలిసిందిగా  🙂  తెలిసి తెలియనివారితో వివాదం కంటే ఊరుకోడం ఉత్తమం కదా! అశుద్ధం మీద రాయేస్తే మొహాన చిందుతుందని నానుడి కదా! వారితో వివాద పడక ఊరుకుంటే అదే గౌరవం అనుకుంటారు వారు,శుభం, నా పాండిత్యానికి భయపడి జారుకున్నారు చూడూ అనుకుంటారు 🙂 . ఊరుకున్నంత ఉత్తమం బోడి గుండంత సుఖం లేదన్నదీ నానుడే, ఇటువంటివారు ఇల్లు దాటితే అందరూ పక్కకి తప్పుకుంటుంటే అదే గొప్పనుకుంటారు వారు, నిజానికి ఎవరూ గౌరవించటం లేదని గుర్తించలేరు వీరు.

కొంతమందితో మాటాడటం తప్పు
కొంతమందితో మాటాడకపోవడం తప్పు
ఎవరితో ఎంతవరకు మాటాడాలో తెలుసుకో లేకపోవడం పెద్ద తప్పు.

అధికారిని వారి అధికార పరిధిలో గౌరవిస్తారు, తప్పదు కనక, అధికారి గనుక, వారితో అవసరపడచ్చుననే ఉద్దేశంతో. వీరెదురు పడితే వంక దణ్ణాలెడ్తారు, దాటిపోయిన తరవాత ”ఛీ! దుర్మార్గులు” అని ఉమ్ముతారు. వీరు పరిధిదాటి బయటకు వెళితే గౌరవించేవారే కనపడరు. పలకరించేవారే ఉండరు. అధికారాంతమునందైతే ఇక చెప్పేదే లేదు. ”అధికారాంతమునందు చూడవలె కదా ఆ అయ్య సౌభాగ్యముల్” అన్నారుగా! ఎదురు పడితే చూసి కూడా చూడనట్టే ముందుకు సాగిపోతారు, అప్పటివరకు పిలిచి మరీ నమస్కారాలు చేసినవారు.

రాజును స్వదేశంలోనే గౌరవిస్తారు. విదేశంలో ఎవరికి లెక్క. స్వదేశం వారు కూడా ఇచ్చే గౌరవం భక్తితో ఇచ్చేది కాదు,భయంతో ఇచ్చే గౌరవమే!

ఇక విద్వాన్ అంటే చదువుకున్నవాడు, చదువుకున్నంతలో సరిపోయిందిటండీ! పది మందికి మంచి జరగాలనే ఆలోచన ఉన్నవాడవాలి, ఆచరించేవాడవాలి. ఉన్నంతలో పంచుకునేవాడవాలి,కష్టంలో ఆదుకుని మంచి సలహా చెప్పేవాడవాలి. సాధారణంగా వీరంతా నిర్ధనులే! వీరికి లోకం గౌరవం ఇవ్వలేదు, కాదు ఇవ్వదు. విద్వాంసునికి భయంతో గౌరవం ఇవ్వరు, చిత్రంగా ఉంది కదూ! విద్వాంసుడంటే అందరికి గౌరవమే, కాని దానిని వ్యక్త పరచరు, ఎందుకనీ? బలవంతంగా గౌరవం పొందేవారితో సమానంగానో, ఎక్కువగానో విద్వాంసునికి ప్రజలు గౌరవం ఇచ్చేస్తే, తమ గౌరవం తగ్గిపోతుందని, పైవారిద్దరూ ప్రజల్ని భయపెడతారు, అందుకు విద్వాంసుడంటే గౌరవం ఉన్నా ప్రజలు వ్యక్తపరచరు. అదే మరో చోటైతే……..మన దగ్గరనుంచి ఇటువంటివారు,ఇలా రకరకాల కారణాలతో వీరిని వేధిస్తే వీరంతా రెక్కలు కట్టుకుని విదేశాలకు ఎగిరిపోయారు. అక్కడివారు తెలివి తక్కువ వారా! వీరో రూపాయి తక్కువకి పని చేస్తారు, నమ్మకంగా చేస్తారు, నమ్మించి మోసం చెయ్యరని పనిలో పెట్టుకున్నారు. ఆ తరవాత కాలంలో మీరిక్కడే ఉండిపొండనీ అంటున్నారు. మరి మనమేం చేస్తున్నాం? ఇటువంటివారి దగ్గరికిపోయి, ”నువ్వు చిన్నప్పుడు తిరిగిన ఊరు, పల్లె, అప్పటినుంచి ఇప్పటికీ అలాగే ఉంది, మేం బాగుచేసుకో లేదు,మావల్లకాదు, దీన్ని నీ చెయ్యేసి పైకి తీసుకురా అని బతిమాలుతున్నాం కదూ”…వాళ్ళెవరు? ఒకప్పుడు మనం కాదని, మనచే తరిమి వేయబడ్డవారు, మనం పి.కూలు, పై.కూలు వారి గురించి కూయలేదూ! వారే వీరు కాదూ… వీరెక్కడేనా బతక గలరు, విద్వాన్ సర్వత్ర పూజ్యతే..

ఇక్కడే చిన్నదైన ఒక జరిగిన కథ చెప్పుకుందాం! ఒక వార్త ను చదివానెప్పుడో, గుర్తుండిపోయింది, చెప్పడంలో పొరపాట్లూ ఉండచ్చు.

కేరళ నుంచి ఒక మిత్ర బృందం అస్సాం అందాలు చూడాలని బయలుదేరి వెళ్ళారు. చాలాచోట్ల తిరిగారు. ఒక కొత్త ప్రదేశం చూడాలని అక్కడివారి సాయంతో జీప్ లో బయలుదేరి వెళ్ళారు, చూడవలసినవి చూసి వస్తున్నారు ఘాట్ రోడ్ లో. హటాత్తుగా ఏనుగుల గుంపు కనిపించింది, ఏం చేయడానికి తోచక జీప్ ఆపుకుని కూచున్నారు. కొందరు జీపు దిగారు. ఒక పక్క లోయ, మరో పక్క ఎత్తైన కొండ. లోయ పక్క దట్టమైన చెట్లు. ఒక ఏనుగు జీపుని లోయలోకి తోసేసింది. ఎవరికి తోచింది వారు చేశారు, జీప్ నుంచి దూకినవారు, పరుగెట్టి వెనక్కిపారిపోయినవారు, ఇలా చెట్టుకొకరు పుట్టకొకరు ఐపోయారు. ఒకతను జీప్ లో ఉండిపోయాడు, జీప్ ని తోయడంలో బయటపడి లోయలో పడిపోయాడు, చివరికి జారి లోయ కిందికి చేరిపోయాడు.స్పృహ తప్పిపోయాడు జీపు చెట్లలో చిక్కుకుపోయింది. .

 రాత్రి పడింది, పైవాళ్ళు ఏనుగులు వెళ్ళిన తరవాత ఒక్కొకరూ చేరేరొకచోటికి, అందరూ చేరారు కాని ఈ లోయలో పడినవాడు కనపడలేదు, వెతికినా! లోయలో పడిపోయి ఉంటాడనుకున్నారు, కేకలేశారు, కిందవాడికా కేక అందలేదు,స్పృహ తప్పిపోయాడు. ఉదయం చూద్దామని ముందుకెళ్ళిపోయింది మిత్ర బృందం చాలా సేపు వెతికి వేసారి.  మర్నాడు ప్రమాదం జరిగిన చోట వెతికారు,ప్రయోజనం లేకపోయింది, జీప్ ను పైకి లాక్కుని వెళిపోయారు.. పోలీస్ కి ఫిర్యాదిచ్చి వెనక్కి పోయారు, ఆచూకీ దొరకలేదని.

లోయలో పడినవాడికి కొంతకాలానికి తెలివొచ్చింది. కేకలేశాడు, పైకి ఎక్కడానికి ప్రయత్నమూ చేశాడు, విఫలమయ్యాడు. ఆ దారి ఉపయోగించేవారు తక్కువ కావడంతో ప్రయోజనం లేకపోయింది. ఏంచెయ్యాలి? కడుపులో కాలుతోంది, మరికొంత దూరం కాలు సారిస్తే కొన్ని పళ్ళు దొరికాయి,తిన్నాడు, సెలయేరు కనపడితే నీరుతాగాడు. ఆకలి దప్పికలు తీరాయి, తరవాతకీ భయం లేకపోవడంతో పైకి చేరుకునే మార్గం గురించి ఆలోచన మొదలు పెట్టేడు. ఏం చేయాలో తోచలేదు. అలా తిరుగుతుండగా వెదురుపొద కనపడింది. వెదురు కర్రని సాధ్యం చేసి, ఉన్న రాళ్ళ తో ఒక వేణువును తయారు చేశాడు. ఒకప్పుడు సరదాగా నేర్చుకున్న వేణువును పలికించడం ప్రారంభించాడు. అదే ఒక తపస్సు అయి వేణువును పలికించడమే పరమావధిగా చేసుకున్నాడు.

ఇలా జరుగుతుండగా ఒక రోజు ఒక సైనికాధికారి ఆ రోడ్ న పోతూ వేణుగానాన్ని విన్నాడు, జీప్ ఆపించి పరిశీలించమన్నాడు. ఎవరూ కనపడలేదు, కేకలకి ప్రతి స్పందించలేదు.  అధికారి లాభం లేదనుకుని మరలిపోయాడు. మరునాడు మళ్ళీ వేణుగానం విన్నాడు, ఆచోటిలోనే. ఇదేంటో తెలుసుకోవాలనే కుతూహలం బయలుదేరి, కొంతమంది సైనికులతో, తాళ్ళు తదితర సామగ్రితో వచ్చి లోయలోకి దిగి వేణుగానం వైపుసాగారు. అక్కడ ఇతను కనపడ్డాడు. లోయలో ఉన్నావాని భాష సైనికులకురాదు, సైనికుల భాష లోయలోనివానికి తెలియదు. మొత్తానికి అతన్ని తీసుకుని పైకొచ్చారు. అధికారిదీ అదే వ్యధ, లోయలో పడినవానికి మరో భాష రాదు. విదేశీయుడా? గూఢచారా? అనేక అనుమానాల మధ్య అతన్ని సైనిక కేంద్రానికి తీసుకొస్తే అతను మాటాడుతున్న భాష మలయాలం అని తెలిసి, సైనికులలో మలయాలం తెలిసినవారితో మాటాడించి అతని చరిత్ర తెలుసుకున్నారు.

లోయలో పడినవాని మురళీ వాయిద్యానికి అధికారి ముగ్ధుడయాడు. ఒక సభ చేసి ఇతనిచే వేణుగానం చేయించి విన్నారు. అందరూ ఆనంద పరవశులయ్యారు. ఎవరిమటుకువారు అతనికి కొంత సొమ్మిచ్చారు, అప్పటికప్పుడు, అక్కడికక్కడ. అధికారి ఇతని క్షేమసమాచారం అతని ఇంటికి చేరేశారు, తొందరలో తిరిగొస్తున్నట్టూ టెలిగ్రాం లిచ్చారు. ఇతని చేత మరికొన్ని కచేరీలు చేయించి ఇతోధికంగా సత్కరించి, రైలెక్కించి, తడికళ్ళతో వీడ్కోలు పలికారు. కథ శుభాంతం అయింది.

ఇదెలా సాధ్యం? ఆ వ్యక్తి సరదాగా నేర్చుకున్న వేణువు అతన్ని రక్షించింది, పూజార్హుణ్ణి చేసింది.

విద్యానామ నరస్య రూపమధికం ప్రఛ్ఛన్నగుప్తం ధనం
విద్యాభోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురుః
విద్యాబన్ధుజనో విదేశగమనే విద్యా పరాదేవతా
విద్యా రాజసుపూజ్యతే నహిధనం విద్యావిహీన పశుః…….భర్తృహరి.

విద్య నిఘూఢగుప్త మగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్
విద్య విశిష్టదైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్
విద్య నృపాలపూజితము విద్య నెఱుంగనివాడు మర్త్యుడే?……..లక్ష్మణకవి.

విద్య గూఢంగా దాచబడిన ధనం, విద్య రూపం,విద్య కీర్తి తెస్తుంది, భోగాలనూ అనుభవింపచేస్తుంది, విద్య గురువు, మార్గదర్శనం చేస్తుంది,విదేశంలో కూడా ఏమీ లేకపోయినా బతకడానికి బంధువులా ఆదుకుంటుంది, అసలు విద్య ఒక విశిష్టమైన దైవం, విద్యలాటి ధనం లేదు, మామూలు ధనమైతే దొంగలెత్తుకుపోవచ్చు, విద్యా ధనం ఎత్తుకుపోలేరు. విద్యలాటి ధనం భూమీ మీద మరొకటి లేదు.విద్యను పరిపాలకులు గుర్తిస్తారు, విద్య తెలియనివాడు మనిషా? అన్నారు లక్ష్మణ కవి, కొద్దిగా మొహమాట పడ్డారు, కాని భర్తృహరి మాత్రం ‘విద్యావిహీన పశుః’, అంటే విద్యలేనివాడు పశువు అని నిర్ద్వందంగా చెప్పేరు.

విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం
పాత్రత్వా ద్ధన మాప్నోతి ధనా ద్ధర్మం తత స్సుఖం

విద్య యొసగును వినయంబు వినయమునను
బడయు పాత్రత పాత్రత వలన ధనము
ధనము వలనను ధర్మంబు దాని వలన
నైహికాముష్మిక సుఖంబు లందు నరుడు

కవిగారేమంటారూ! విద్య నేర్చుకుంటే వినయాన్నిస్తుంది, విద్య, వినయం తో పాత్రత అర్హత (ఎలిజిబిలిటీ,కేపబిలిటీ)వస్తుంది, దానివల్ల ధనం వస్తుంది దానివలన ధర్మం చేయాలి దానితో మానవుడు ఇహ పర సుఖాలు పొంది తరించాలి.

విద్యతో వివేకంకావాలి.

విద్వాన్ సర్వత్ర పూజ్యతే!

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s